జాతీయ వార్తలు

అమెరికాను కుదిపేసిన హరికేన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/వాషింగ్టన్, ఆగస్టు 28: హార్వే హరికేన్ అమెరికాను వరదలతో ముంచెత్తింది. హోస్టన్ యూనివర్సిటీ క్యాంపస్‌లో దాదాపు 200మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సోమవారం తెలిపారు. షాలిని, నిఖిల్ భాటియా అనే ఇద్దరు భారతీయ విద్యార్థులు అనారోగ్యం పాలు కావటంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించారని ఆమె పేర్కొన్నారు. స్థానిక భారత దౌత్య కార్యాలయం విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తోందని ఆమె తెలిపారు. క్యాంపస్ చుట్టూ భారీగా నీరు నిలిచి ఉందని, నీళ్ల మధ్యలో యూనివర్సిటీ దీవిలా మారిపోయిందన్నారు. గత 13 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా హరికేన్ అమెరికాను అతలాకుతలం చేస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. హోస్టన్‌లో భారతీయులు ఎక్కువగా ఉంటారు. అటు టెక్సాస్‌లో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటి వరకు అయిదుగురు చనిపోయినట్లు టెక్సాస్ ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 50 అంగుళాలమేర వర్షాలు కురిసినట్లు అమెరికా జాతీయ వాతావరణ సంస్థ ప్రకటించింది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొంది. 2004లో ఫ్లోరిడాలో వచ్చిన వరదల కంటే కూడా హార్వే బీభత్సాన్ని సృష్టిస్తోందని టెక్సాస్ అధికారి ఒకరు వివరించారు. ఇప్పటివరకు వెయ్యి మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు పేర్కొన్నారు. హోస్టన్ షిప్ చానల్‌తోసహా దేశంలోని ప్రధాన చమురు కంపెనీలు తమ ఉత్పత్తిని నిలిపివేశాయి. విలియమ్ పి హాబీ విమానాశ్రయాన్ని మరో వారం రోజులపాటు మూసివేశారు. నగరమంతా నీళ్లలో మునిగిపోయిందని, ప్రజలు భయాందోళనలో ఉన్నారని అధికారులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం టెక్సాస్ పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తారని వైట్ హౌస్ సెక్రటరీ సారా శాండర్స్ తెలిపారు. హార్వే హరికేన్ నేపథ్యంలో ట్రంప్ రెండోసారి కేబినెట్‌ను సమావేశపరచి చర్చించారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

చిత్రం..హరికేన్‌తో విలవిల్లాడిన హోస్టన్ నగరంలో బాధితులకోసం ఏర్పాటు చేసిన మరబోట్లు