కళాంజలి

సుగాత్రి గాయత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాలో ఎంతోమంది తెలుగు వెలుగులు, మన కళలు వ్యాప్తిచేస్తూ, అక్కడి నుండే మన కళామతల్లికి సేవ చేస్తున్నారు. భారతీయ సంప్రదాయ కళలను అక్కడి పిల్లలకు నేర్పిస్తూ, లలిత కళలకు జీవం పోస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. అక్కడ పుట్టి పెరిగిన పిల్లలకు మన కట్టూబొట్టూ, భాష, పండుగలూ పబ్బాలూ, పిండివంటలు, ఆచార వ్యవహారాలు కరువవుతాయి. అన్నింటికీ అమ్మ ఉందిగా! అమ్మ గట్టిగా పూనుకుంటే, ఆ ఇంట్లో కళలు, సంపదలు, చదువు అన్నీ స్థిరపడతాయి. మన హైదరాబాద్‌లో పుట్టి పెరిగి, చిన్నప్పటి నుండి మంచి గాయనిగా పేరు తెచ్చుకున్న గాయని శ్రీమతి గాయత్రి బొమ్మకంటి. దశాబ్దాలుగా అమెరికాలో స్థిరపడినా, అక్కడి నుండే సరస్వతీదేవి సమార్చన చేస్తున్నారు. వీరి కుమారుడు తరుణ్ బొమ్మకంటి కూడా వయొలిన్, గాత్రకళాకారుడు.
శ్రీమతి గాయత్రి బొమ్మకంటి గారితో ముఖాముఖి ఆమె మాటల్లోనే.
* * *
8 సం. వయసులో మా పిన్నిగారి వద్ద సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టాను. అలా పెళ్లయ్యేదాకా, నేను కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. ఇంట్లో ఎప్పుడూ సంగీతం, కళలు వాతావరణం ఉండేది. పెళ్లిళ్లు, పండుగలు, ఫంక్షన్స్, పూజలు, స్కూల్‌లో ఎప్పుడూ నేను పాడేదాన్ని. నా మధురస్మృతులు, జ్ఞాపకాలు, నాకు అస్థిత్వాన్ని ఇచ్చినవన్నీ గాత్ర సంగీతంతోనే ముడిపడి ఉన్నాయి. రోజూ అభ్యాసం చేసేవాళ్లం. ఇంట్లో సినిమా సంగీతం వినటానికి ఒప్పుకునేవాళ్లు కాదు. ఎప్పుడూ సంగీత సభలకు వెళ్లడం, పెద్ద సంగీతకారుల ప్రదర్శనలు వినడం, చూడటం, నేర్చుకోవడం ఇవన్నీ నా ఎదుగుదలకు సోపానాలు. క్రమశిక్షణ, అభ్యాసం, ప్రతిభ, సృజన, వీటి చుట్టూ నా బాల్యం తిరిగింది. చాలా ప్రోత్సాహం లభించింది. ఏ సంగీత పోటీ ఉన్నా మా స్కూల్ నుండి నేనే వెళ్లేదాన్ని.
అమెరికాలో దాదాపు 20 సంవత్సరాలుగా ఉంటున్నాను. ఇక్కడ ఉండటంలో నా చిన్నప్పటి మధురస్మృతులు, గాత్ర సంగీతం విలువ తెలుస్తోంది. నా కొడుకు తరుణ్‌ని కూడా ఇక్కడి ప్రదర్శనలకు తీసుకెళ్లడం, వాడికి మన భారతీయ సంగీతం మీద మక్కువ కలిగించాను. భారతీయ సంప్రదాయ సంగీతం వయొలిన్ నేర్పించాను. అది వాడి అస్థిత్వానికి పునాది, ఉనికి అయింది. మా కుటుంబ విలువల్లో నాకు, మా బాబుకీ సంగీతం విడతీయని బంధంగా, మా అనుబంధానికి ఒక తీగ పందిరిగా అయింది. ఇక్కడి విదేశాలలో పిల్లలకి భారతీయ కళలు నేర్పించాలి, ప్రోత్సహించాలి. ఇది చాలా ముఖ్యం. నేను ఇప్పుడు కూడా రోజూ గంట అభ్యాసం చేస్తాను. మా బాబు కూడా రోజూ వయొలిన్ అభ్యాసం చేస్తాడు. నేను ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నాను. నేను నిత్యవిద్యార్థిని.
మా అమ్మ పద్మజ, మా పిన్ని ఇందిర ఇద్దరూ ప్రఖ్యాత గాయనీమణులు. అందువల్ల నాకు చిన్నప్పటి నుండి సంగీతం సులభంగా అబ్బింది. నేను నా కొడుక్కి అలాగే నేర్పించాను. పొద్దునే్న సుప్రభాతం పాడటం, భజనలు, పాటలు జోలపాడుతూ లాలి పోస్తూ, గోరుముద్దలు పెడుతూ ఎప్పుడూ పాట పాడుతూ వాడిని పెంచాను. అందుకే తరుణ్‌కి నాతో ఉన్న స్మృతులు గాత్రం, పాటలతోనే ఉన్నాయి.
ఇప్పుడు ఇక్కడ మంచి కళాకారులున్నారు. స్కైప్, యూట్యూబ్ మొదలైన సాధనాలు, మాధ్యమాల ద్వారా సంగీత శిక్షణ లభిస్తోంది. సాంకేతిక విజ్ఞానం వల్ల సంగీతం ఇంకా సులువుగా నేర్చుకోగలుగుతున్నాం. అమెరికాలో కొన్ని దశాబ్దాల క్రితం ఇన్ని అవకాశాలు, ప్రోత్సాహం ఉండేది కాదు. ఇప్పుడు చాలా మారింది. ఇక్కడ గురుకులాలు కూడా ఉన్నాయి. కొన్ని వారాలు ఉండి గురు శిష్య సంప్రదాయంలో నేర్చుకుంటున్నారు. భారతదేశం నుండి కూడా గొప్ప సంగీతకారులు వచ్చి ప్రదర్శనలిస్తున్నారు. నేర్పిస్తున్నారు. దీనివల్ల పిల్లలకి జవము జీవము వస్తాయి.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి