ఖమ్మం

రాజయ్య దీక్ష భగ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, అక్టోబర్ 8: భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కొమరం ఫణీశ్వరమ్మల ఆమరణ నిరశన దీక్షలను శనివారం తెల్లవారుఝామున భద్రాచలం పోలీసులు భగ్నం చేశారు. వాజేడు, వెంకటాపురం మండలాలను భద్రాచలంలోనే కొనసాగించాలని, భద్రాచలంను జిల్లాగా ప్రకటించాలని, ఆంధ్రాలో విలీనమైన 5 పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలపాలని డిమాండ్ చేస్తూ వారు వేర్వేరుగా భద్రాచలంలో ఆమరణ నిరశన దీక్ష చేపట్టిన సంగతి పాఠకులకు విదితమే. వీరిలో ఎమ్మెల్యే సున్నం రాజయ్య రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పడిపోవడంతో పరిస్థితి విషమంగా మారడంతో సిఐ బాణాల శ్రీనివాసులు, ఎస్సై అబ్బయ్యలు తమ సిబ్బందితో శనివారం తెల్లవారుఝామున 3.30 గంటల సమయంలో దీక్షా శిబిరాల వద్దకు చేరుకున్నారు. వారినిబలవంతంగా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యేకు వెంటనే చికిత్స ప్రారంభించారు. కానీ ఫణీశ్వరమ్మ మాత్రం చికిత్సకు నిరాకరించి ఆసుపత్రిలోనే దీక్షను కొనసాగించారు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రమణ ఆదేశాలతో కొత్తగూడెం ఇంఛార్జ్ కోనేరు చిన్ని భద్రాచలం వచ్చి ఆమెను బుజ్జగించి నిమ్మరసం తాగించారు. తెలంగాణ సర్కారు ఎమర్జెన్సీ కాలాన్ని తలపించేలా నిర్బంధకాండకు దిగుతోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని సిపిఎం, తెలుగుదేశం నాయకులు ధ్వజమెత్తారు. ప్రజాపోరాటాలను గుర్తించరా? అంటూ ప్రభుత్వంపై తిరగబడ్డారు. మరో వైపు సిపిఎం శనివారం సాయంత్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణను తయారు చేసింది. ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆధ్వర్యంలో హైదరాబాదు వెళ్లి అక్కడే తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు ప్రకటించారు. సిపిఎం డివిజన్ కార్యదర్శి యలమంచి రవికుమార్, పట్టణ కార్యదర్శి వెంకటరెడ్డి, నర్సారెడ్డి, సత్యాలు, తెల్లం సీతమ్మ, బండారు శరత్, తెదేపా నాయకులు కొడాలి శ్రీనివాసన్, కోనేరు రాము, అజీమ్, మల్లా ప్రతాప్, కంభంపాటి సురేష్, కుంచాల రాజారాం, కోనేరు దుర్గ, వి.రాము, రేపాక రాంబాబు, రావమ్మ, దేవి తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా మహాబతుకమ్మ వేడుక
ఖమ్మం(కల్చరల్), అక్టోబర్ 8: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మహాబతుకమ్మ వేడుకను శనివారం స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లా సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో 18 అడుగుల భారీ బతుకమ్మను తీరొక్కపూలతో అందంగా పేర్చారు. వేడుకల్లో ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, జడ్పీ చైర్మన్ గడిపల్లి కవిత, కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్, జేసి దివ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణలు పాల్గొని మహాబతుకమ్మ ఉత్సవాన్ని ప్రారంభించారు చివరి రోజు శనివారం మహాబతుకమ్మ వేడుకలో రంగు రంగు దుస్తులతో అందమైన భారీ బతుకమ్మలను శిరస్సున ధరించి ముక్కోటి దేవతలు మురిసిపోయేలా నగర నడివీధుల్లో మహిళలు కవాతు చేశారు. అత్యవసర పనులను సైతం పక్కన పెట్టి వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్ని ఆసాంతం ఆస్వాదించారు. రాష్టమ్రంతటా దసరా నవరాత్రులను శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించుకుంటుండగా, జిల్లాలో మాత్రం మహాబతుకమ్మ వేడుకల్ని ప్రత్యేకంగా మహిళలతో పాటు విద్యార్థినులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆడిపాడుకుంటూ వైభవోపేతంగా జరుపుకున్నారు. శుక్రవారం నుండే చివరి రోజు వేడుకల కోసం పూలు, పూజా సామాగ్రి, వాయినాలు, ప్రసాదాల తయారీ వంటి కార్యక్రమాలు చేపట్టారు. తంగేడు పూలు, గునుగు పూలను సేకరించి పలు రకాల రంగుల్లో ముంచి ఆరబెట్టుకున్నారు. శనివారం ఉదయానే్న పెద్ద పెద్ద ఎదురు, ఇత్తడి, స్టీల్ ప్లేట్లను సేకరించి ఇంటి ఆడబిడ్డలకు అందించారు. వారి నైపుణ్యాన్ని రంగరించి అందమైన పూలకు తగ్గ భారీ బతుకమ్మలను పేర్చారు. తమ తమ వీధుల్లోని కూడళ్ళ వద్ద వారు తమ బతుకమ్మలను ఉంచి మనసారా ఆటపాటలతో గౌరమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాధారణంగా దేవాలయాల్లో, ఇళ్లలో, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లో పూజలకు వివిధ రకాల పూలను వినియోగిస్తుంటాం. మరి అలాంటిది పరిమళ భరితమైన ఆ పూలకే పెద్ద ఎత్తున పూజలు చేయడమే బతుకమ్మ. చివరి రోజు సద్దుల బతుకమ్మకు నైవేద్యంగా సద్దులు, మాలీద ముద్దలు కట్టి పులిహోర, పెరుగన్నం చేశారు. సాయంత్రం పట్టుబట్టలతో ముస్తాబై సాయంత్రం బతుకమ్మలను నగర వీధుల గుండా ఊరేగించారు. సాయంత్రం 6గంటలకు సర్దార్ పటేల్ స్టేడియం చేరుకున్నారు. స్టేడియంలో భారీ ఏర్పాట్ల మధ్య నిర్వహించిన మహాబతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. వందలాది బతుకమ్మలతో వేలాది మంది మహిళలు చేసిన ప్రదర్శన నరగవాసులను ఆకట్టుకుంది. బతుకమ్మలను ఒకేచోట ఉంచి వలయాకారంలో వాటిచుట్టూ తిరుగుతూ చప్పట్లూ, కోలాటాలతో ఆడిపాడారు. చీకటి పడుతుండగా పోయి రావమ్మా గౌరమ్మా పొద్దుపోయే గౌరమ్మా...మళ్ళెప్పుడొస్తావే గౌరమ్మా.. అని పాడుతూ బతుకమ్మను సాగనంపారు. చివరిగా నా నోము నీకిత్తునే గౌరమ్మ.. నీ నోము నాకీయ్యవే గౌరమ్మా అని పాడుతూ వెంట తెచ్చుకున్న సద్దులను ముతైదువులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులు, నగర ఆడ పడుచులు, మహిళా కళాకారులతో పాటు కళా సారథులు పాల్గొన్నారు. మహాబతుకమ్మ వేడుకలో భాగంగా పేర్చిన బతుకమ్మలను స్టేడియంలో ఉంచగా ఎక్కువ రకాల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను ఎంపిక చేసి బహుమతులను అందజేశారు.
నేడు వీరలక్ష్మీ అలంకారం
భద్రాచలం, అక్టోబర్ 8: శ్రీసీతారామచంద్రస్వామి సన్నిధిలోని లక్ష్మీతాయారు అమ్మవారు ఆదివారం భక్తులకు వీరలక్ష్మీ అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. మన దరిద్రాన్ని, అన్ని రకాల ఉపద్రవాలను పారద్రోలే వీరత్వం కలిగిన అమ్మ. త్రిమూర్తులకూ సాధ్యం కాని మహిషాసురుడిని ముగ్గురమ్మల శక్తి స్వరూపమైన వీరలక్ష్మిగా అవతరించి సంహరించింది. ఈ అమ్మను ఆరాధిస్తే అన్నిరకాల దుష్టశక్తుల భయాలు తొలగుతాయి.
బతుకమ్మ సంబరాలు
భద్రాచలం టౌన్, అక్టోబర్ 8: భద్రాచలం పట్టణంలోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో శనివారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఉన్న తులసి చెట్టు చుట్టూ దీపాలు అమర్చి రంగురంగుల పూలతో బతుకమ్మలు ఏర్పాటు చేశారు. మహిళలు ఆటపాటలతో 2 గంటల పాటు ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయ పూజారి బి వెంకటరత్నం బతుకమ్మకు హారతి ఇచ్చి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు మాగంటి సూర్యంతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

పోలీసు స్టేషన్ భవనం ఎంపిక
చండ్రుగొండ, అక్టోబర్ 8: నూతనంగా ఏర్పాటు కానున్న మండలకేంద్రమైన అన్నపురెడ్డిపల్లిలో పోలీసుస్టేషన్ ప్రారంభించేందుకు శనివారం కొత్తగూడెం డిఎస్‌పి సురేందర్‌రావు భవనాన్ని పరిశీలించారు. అన్నపురెడ్డిపల్లి గురుకుల పాఠశాల ఆవరణంలో అదనంగావున్న భవనాన్ని డిఎస్‌పి పరిశీలించి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా డిఎస్‌పి విలేఖరులతో మాట్లాడుతూ దసరా పండుగనాడు అన్నపురెడ్డిపల్లి మండలంగా ఏర్పాటు కానున్నదని అదేరోజు పోలీస్టేన్‌ను ప్రారంభిచనున్నట్లు డిఎస్‌పి తెలిపారు. ఈ మేరకు భవనానికి మరమ్మతులు చేసి ప్రారంభానికి సిద్ధంచేయాలని సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. డిఎస్‌పి వెంట జూలూరుపాడు సిఐ మల్లయ్యసామి, స్థానిక ఎస్‌ఐ కె ప్రసాద్, సిబ్బంది రంగారావు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.
తెలుగు సాంప్రదాయాలకు బతుకమ్మ ప్రతిబింబం
కామేపల్లి, అక్టోబర్ 8: తెలంగాణ సంప్రదాయాలకు బతుకమ్మ వేడుకలు ప్రతిబింబాలని ఇల్లెందు శాసనసభ్యుడు కోరం కనకయ్య అన్నారు. శనివారం కామేపల్లిలోని జూ. కళాశాలలో జరిగిన మండల స్థాయి బతుకమ్మ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. గత ప్రభుత్వాలు తెలంగాణ సంస్కృతిని విస్మరించాయని, తెలంగాణ ప్రభుత్వం దీక్షతో బతుకమ్మ వేడుకలను పునరుద్ధరింపజేసిందన్నారు. ప్రతి ఒక్కరికిబతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వివిధ గ్రామాలు, వివిధ కార్యాలయాల నుండి వచ్చిన బతుకమ్మలతో ఆటపాటలాడారు. వేడుకల్లో జడ్పీటిసి మల్లిబాబుయాదవ్, ఎంపిపి సరిరాంనాయక్, తహశీల్దార్ లక్ష్మణస్వామి, ఎంపిడిఓ జివి రమణ, ఎంఇఓ ప్రసాద్, ఎఇ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు అజ్మీరాహరి, ఎంపిటిసి చిన్ని, పార్వతి, మాధవరావు, చిదంబరరావు, రామోజీ, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహానాయక్ తదితరులు పాల్గొన్నారు.

48 గంటల్లో ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి

దుమ్ముగూడెం, అక్టోబర్ 8: ఆదివాసీ ఎమ్మెల్యేలు 48 గంటల్లో రాజీనామా చేయాలని జీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ సోందె వీరయ్య డిమాండ్ చేశారు. జీఎస్పీ చేపట్టిన పాదయాత్ర శనివారం దుమ్ముగూడెం మండలం చేరుకుంది. ఈ పాదయాత్రకు సంఘీభావంగా న్యూడెమోక్రసీ తుడుందెబ్బ నాయకులు తమ మద్దతు తెలిపారు. లక్ష్మీనగరంలో జరిగిన పాదయాత్ర సందర్భంగా సొందె వీరయ్య మాట్లాడుతూ షెడ్యూల్డ్ ప్రాంతాన్ని కాపాడుకోవడం కోసం ఆదివాసీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలన్నారు. ఇటువంటి సమయంలో కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తేకుంటే నియోజకవర్గం జనరల్ ప్రాంతం అవుతుందని హెచ్చరించారు. ఆదివాసీ ప్రజాప్రతినిధుల అసమర్ధత గతంలో భద్రాచలం పార్లమెంట్ కోల్పోయామని, ఇప్పుడు జిల్లాల విభజనతో భద్రాచలం అసెంబ్లీ కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఏజెన్సీ ప్రాంతాన్ని ముక్కలు చేస్తున్న ప్రభుత్వంపై రాజీనామా చేసి ఒత్తిడి తేవాలన్నారు. ఖమ్మం జిల్లాలో నలుగురు ఆదివాసీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ప్రభుత్వం దిగి వస్తుందన్నారు. ఈ పాదయాత్రలో న్యూడెమోక్రసీ నాయకులు ముక్తార్‌పాషా, లక్ష్మయ్య, సర్పంచి కణితి రాముడు, ఎంపీటీసీ రేసు లక్ష్మీ, ముర్రం వీరభద్రం, చలపతి, ముద్దరాజు, కృష్ణ, సత్యనారాయణ, ప్రకాశ్, నాగరాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
శాస్ర్తియతలేని విభజన
ఖమ్మం(జమ్మిబండ), అక్టోబర్ 8: ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన సమయంలో ఏడు మండలాలను ఖమ్మం జిల్లా కోల్పోయిందని, దాని నుంచి తేరుకునేలోపే జిల్లాల పునర్విభజనలో మరోనాలుగు మండలాలను కోల్పోవాల్సి వచ్చిందని సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు పేర్కొన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన గురు, శుక్రవారాల్లో జరిగిన సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను ఆయన వెల్లడించారు. జిల్లాల పునర్విభజనలో జిల్లాకు తీవ్రనష్టం వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. గత రాష్ట్ర విభజనలో ఏజన్సీ మండలాలైన ఏడు మండలాలను కోల్పోయామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. గార్ల, బయ్యారాన్ని మహబూబాబాద్ జిల్లాలో, వాజేడు, వెంకటాపురాన్ని భూపాలపల్లి జిల్లాలో కలపడం ఏమిటని ప్రశ్నించారు. జిల్లా ప్రయోజనాలు సైతం పట్టించుకోని పరిస్థితిలో అధికారపార్టీ నేతలున్నారని, రాష్ట్ర విభజన సమయంలో హడావుడి చేసిన టిఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు నోరు మెదపకపోవడానికి వెనుక ఏముందని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో అధికార పార్టీకి చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు ముద్దాయిలుగా నిలబడక తప్పదన్నారు. జిల్లాలోని మండలాలను ఇతర జిల్లాలకు కలపడం సరికాదని, ఖమ్మం, లేదా కొత్తగూడెంలోనే ఉంచాలని డిమాండ్ చేశారు.
నవంబర్ 21,22 తేదీల్లో
పార్టీ జిల్లా నిర్మాణ మహాసభలు
వచ్చేనెల 21,22 తేదీల్లో సిపిఐ జిల్లా నిర్మాణ మహాసభలు నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి హేమంతరావు తెలిపారు. జిల్లాల పునర్విభజన చేసిన అనంతరం ఖమ్మం, భద్రాచలం జిల్లాలకు సంబంధించి నూతన కమిటీలను ఎన్నుకునేందుకు ఈ మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పోటు ప్రసాద్, శింగు నర్సింహరావు, ఎస్‌కె జానీమియా, తాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
నేలకొండపల్లిలో.బౌద్ధస్థా ప్రతినిధులు
నేలకొండపల్లి, అక్టోబర్ 8 : నేలకొండపల్లిలోని బౌద్ధ స్థూపాన్ని శనివారం 14 దేశాలకు చెందిన బౌద్ధస్థా ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా స్థూపానికి సంబంధించిన చారిత్రక ప్రాముఖ్యతను వారికి ప్రభుత్వ అధికారులు వివరించారు. బౌద్ధస్థూపం చుట్టూ తిరిగి వాటికి సంబంధించిన ఇటుకలను పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం బుద్ధుడి ప్రాశస్త్యాన్ని ప్రజలకు ఏ విధంగా వివరించేది వారికి తెలిపారు. స్థూపం చూట్టు తిరిగి ఇక్కడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దానికి సంబందించి అధారాలను, ఇక్కడ దొరికిన వస్తులను అధికారులు పోటోల ద్వారా వివరించారు. స్థూపం గురించి నల్గొండ జిల్లా డివిజనల్ అధికారి వెంకటేశ్వరావు బోద్ధస్థా ప్రతినిధులకు వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ పర్యటక అభివృద్ధి కార్పొరేషన్ మేనేజర్ శ్రీనివాసరావు, బుద్ధవనం ప్రత్యేక అధికారి లక్ష్మయ్య, నేలకొండపల్లి గ్రామ సర్పంచ్ వంగవేటి నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బ్రహ్మయ్య, వెంకయ్య, గాంధీ తదితరులు పాల్గొన్నారు.