ఖమ్మం

కిడ్నాప్ కథ సుఖాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చర్ల, నవంబర్ 21: తెరాస నాయకుల కిడ్నాప్ కథ సుఖాంతమైంది. మూడు రోజుల క్రితం పూసుగుప్ప గ్రామానికి వెళ్లిన ఆరుగురు టీఆర్‌ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్న మావోయిస్టులు శనివారం తెల్లవారుజామున యాంపురం గ్రామ సమీపంలో వారిని విడుదల చేశారు. అక్కడి నుంచి రెండు మోటార్ సైకిళ్లపై బయలుదేరిన వారు ఉదయం 10 గంటలకు చర్ల మండల కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు కుటుంబ సభ్యులతో కన్నీటిపర్యంతమయ్యారు. ఒకరినొకరు హత్తుకుని ఓదార్చుకున్నారు. టీఆర్‌ఎస్ నాయకులను మావోయిస్టులు క్షేమంగా విడుదల చేశారన్న వార్త మీడియాలో రావడంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టీఆర్‌ఎస్ మండల, డివిజన్, జిల్లా స్థాయి నాయకులు నాయకత్వం సైతం ఊపిరిపీల్చుకుంది. అలాగే వీరిని మావోల చెర నుంచి విడుదల చేయడానికి చర్ల ఎస్సై రవీందర్‌తో పాటు వెంకటాపురం సిఐ సాయిరమణ కూడా ముమ్మరంగా ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. కొంతమంది గిరిజనుల ద్వారా వారు మావోయిస్టులకు రాయబారం పంపించినట్లు సమాచారం. మావోయిస్టులు వారిని క్షేమంగా విడుదల చేశారని తెలుసుకున్న చర్ల పోలీసులు లెనిన్ కాలనీ వద్దకు వెళ్లి వారిని క్షేమంగా చర్లకు తీసుకొచ్చారు. రాష్ట్రంలో సంచలనం కలిగించిన తెరాస నాయకులు కిడ్నాప్ కథ సుఖాంతం కావడంతో ప్రతిఒక్కరూ ఆనందం వ్యక్తం చేశారు.

ఇద్దరిని చంపేస్తామన్నారు
* కెసిఆర్ తెచ్చింది నెత్తుటి తెలంగాణ
* ప్రజలు కోరుకునే తెలంగాణ రావాలి
* ప్రభుత్వం విధానం మార్చుకోకపోతే తెరాస నేతలను హతమారుస్తాం
* విలేఖర్ల సమావేశంలో మావోల అల్టిమేటం వివరించిన మానె రామకృష్ణ

చర్ల, నవంబర్ 21: బంగారు తెలంగాణ తీసుకొస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు నెత్తుటి తెలంగాణ తీసుకొచ్చాడని, రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న పాలన రావాలని, లేకుంటే టీఆర్‌ఎస్ కార్యకర్తలను చంపుతామని, అందుకే మమ్మల్ని కిడ్నాప్ చేసి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపారని శనివారం మావోల చెర నుంచి విడుదలైన తెరాస నియోజకవర్గ ఇంఛార్జ్ మానె రామకృష్ణతో పాటు ఐదుగురు సభ్యులు విలేఖర్లకు తెలిపారు. మావోల చెర నుంచి విడుదలైన అనంతరం వారు విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మావోయిస్టులు వారిని ఎందుకు, ఎప్పుడు కిడ్నాప్ చేశారు, ఏయే విషయాలను తెలియజేశారనే విషయాలను వారు మీడియాకు తెలిపారు. బుధవారం ఉదయం పూసుగుప్ప గ్రామానికి ఇందిరమ్మ ఇళ్ల సర్వేపై వెళ్లామని, ఇంతలో మావోలు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. రెండు రోజులపాటు కళ్లకు గంతలు కట్టి అడవిలో తిప్పారని, అనంతరం మావోయిస్టు నేతలు హరిభూషణ్, జగన్ తమను విచారించినట్లు వారు తెలిపారు. అనంతరం అందరినీ కూర్చోబెట్టి కొన్ని విషయాలు చెప్పారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ ఇస్తామని చెప్పి మోసం చేశారని మావోలు చెప్పినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్‌కౌంటర్లు ఉండవని చెప్పి వరంగల్‌లో మా వాళ్లను అత్యంత దారుణంగా చంపి అవయవాలను ఛిద్రం చేశారు కదా అని తెలిపారని అన్నారు. ప్రభుత్వం మా వాళ్లను చంపినప్పుడు మేము మీతో పాటు టీఆర్‌ఎస్ నాయకులను ఎందుకు చంపకూడదని ప్రశ్నించారని అన్నారు. రాష్ట్రంలో అవినీతి తాండవం చేస్తోందని, ముఖ్యమంత్రి పాలన సరిగా లేదని తప్పుబట్టారని తెలిపారు. మీరు ఉద్యమాలు చేయబట్టే తెలంగాణ వచ్చింది కాబట్టి మేము మీలో ఇద్దరిని హతమారుస్తామని చెప్పినట్లు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించక ముందు మాకు ఫోన్ చేసి తెలంగాణ రాష్ట్రానికి సహకరించాలని, ఎన్‌కౌంటర్లు లేకుండా చూస్తామని చెప్పారని మావోయిస్టులు తెలిపారని అన్నారు. ఇదే సందర్భంగా చంపితే ఇద్దరిని కాకుండా చంపితే అందర్ని చంపాలని మేము పట్టుబట్టామని, దీంతో ఆలోచించిన మావోలు మొదటిసారి తమను వదిలేస్తున్నట్లు చెప్పారని అన్నారు. ఇప్పటికైనా సిఎం తమ డిమాండ్లు అమలుచేసి ప్రభుత్వ పాలన సరిగ్గా చేయాలని, ఈ విషయాలన్ని సిఎం దృష్టికి తీసుకెళ్లండని చెప్పారని అన్నారు. లేకుంటే ప్రతి ఒక్క టీఆర్‌ఎస్ కార్యకర్తను కూడా హతమారుస్తామని తెలిపారు. శనివారం ఉదయం దట్టమైన అడవుల మధ్య వదిలేశారని, మూడు రోజుల పాటు నరకం అనుభవించామని విలేఖర్ల సమావేశంలో తెలిపారు.

సింగరేణిలో మరిన్ని కోల్‌వాషరీలు
* సిఎండిని కలిసిన దక్షిణాఫ్రికా ప్రతినిధుల బృందంకొత్తగూడెం, నవంబర్ 21: దక్షిణాఫ్రికాలోని వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధుల బృందం సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్‌తో హైద్రాబాద్‌లోని సింగరేణి భవన్‌లో శనివారం సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్భ్రావృద్ధిలో భాగంగా వివిధ ప్రభుత్వ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్న ఈ బృందంలోని సభ్యులు సిఎండితో భేటీ అయ్యారు. సింగరేణికి సంబంధించిన అనేక విషయాలు బృందంలోని సభ్యులకు సిఎంపి తెలియజేశారు. విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గు ఉత్పత్తి చేయడానికి పెద్దఎత్తున ప్రణాళికలు చేస్తున్నట్లు వివరించారు. దీనికోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించేందుకు ప్రణాళికలు తయారు చేశామని, బొగ్గు నాణ్యతను మెరుగుపర్చడానికి సింగరేణి వ్యాప్తంగా మరిన్ని కోల్ వాషరీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా బొగ్గు గనులు నిర్వహించేందుకు ప్రణాళికలు చేశామని అన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో దక్షిణాఫ్రికా దేశంలో బొగ్గు గనులు నిర్వహించేందుకు ఉన్న అవకాశాలతో పాటు మిగతా విషయాలపై నిర్మాణాత్మక ప్రతిపాదనలు సమర్పించాల్సిందిగా బృందంలోని ప్రతినిధులను సింగరేణి సిఎండి కోరారు. దక్షిణాఫ్రికా ప్రతినిధులలో ఇఖరాం ఓస్మాన్, ఎస్‌డిపి బ్లాక్‌మూసి, డైరెక్టర్ రాట్స్ కంపెనీతో పాటు ఏడుగురు సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సింగరేణి తరఫున సిఎండి శ్రీ్ధర్‌తో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్‌మూమెంట్) ఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
సింగరేణి కార్మికుల సౌకర్యం, రక్షణ కోసం తేలికైన క్యాప్‌ల్యాంప్‌లు
* రూ 11.50 కోట్లతో 40 వేల క్యాప్‌ల్యాంప్‌ల కొనుగోలు
కొత్తగూడెం, నవంబర్ 21: సింగరేణి బొగ్గు గనుల్లో విధులు నిర్వహించే కార్మికుల రక్షణతో పాటు సౌకర్యవంతంగా పని చేసేందుకు వీలుగా సంస్థ చర్యలు చేపడుతోంది. గనుల్లోకి వెళ్ళేందుకు ఇప్పటికే మ్యాన్‌రైడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిన సంస్థ గనుల్లో రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించాలనే ఉద్దేశంతో అత్యాధునిక రక్షణ పరికరాలను సమకూరుస్తోంది. ఇదే క్రమంలో బరువు తక్కువగా ఉండే క్యాప్‌ల్యాంప్‌లను కొనుగోలు చేసేందుకు గతంలో చేసిన ప్రణాళికలు కార్యరూపం దాల్చాయి. దీనిలో భాగంగా సింగరేణి సంస్థ 11.50 కోట్లతో 40 వేల క్యాప్ ల్యాంప్‌లు కొనుగోలు చేసి గనులకు తరలించింది. మరో 7 వేల ల్యాంప్‌లను త్వరలో సంస్థ కొనుగోలు చేయనుంది. ఇప్పటివరకు కార్మికులు వాడుతున్న క్యాప్ ల్యాంప్‌లు దాదాపు రెండు కేజీల పైగా బరువు ఉండి అసౌకర్యంగా ఉండేవి. నడుముకు కట్టుకునే బ్యాటరీ ఒక్కటే రెండు కేజీల బరువు ఉండేది. దీనిని బెల్ట్‌కు తగిలించుకుని కార్మికులు డ్యూటీలో ఉన్నంతసేపు పని చేయాల్సి వచ్చేది. నడిచేటప్పుడు, బరువులు ఎత్తేటప్పుడు కార్మికులు ఇబ్బందిపడేవారు. అయినప్పటికీ భూగర్భ గనుల్లో కార్మికులకు వెలుతురు ఇచ్చేది క్యాప్‌ల్యాంపే కనుక తప్పనిసరిగా దీనిని ధరించి మాత్రమే కార్మికులు తమ విధులు నిర్వహించాల్సి వచ్చేది. కార్మికులు పొరపాటున జారిపడితే బరువు, వెడల్పు ఎక్కువగా ఉండే బ్యాటరీల వలన నడుము, తుంటి భాగం ఒత్తిడికి గురై గాయాలపాలయ్యేవారు. ప్రస్తుతం సమకూర్చిన తేలికపాటి క్యాప్ ల్యాంప్‌లు కేవలం 600 గ్రాముల బరువు మాత్రమే ఉంటాయి. ఎంతో తేలికగా ఉండడంతో పాటు గతంలోని ల్యాంప్‌ల కంటే ఎక్కువ వెలుతురునిస్తాయి. ఈ ల్యాంప్‌లను చార్జింగ్ చేసుకునే సమయంతో పాటు ఖర్చు కూడా చాలా తక్కువ. గతంలో వాడే బ్యాటరీలకు సాధారణంగా యాసిడ్ నింపి చార్జింగ్ చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం సమకూరుస్తున్న క్యాప్ ల్యాంప్ బ్యాటరీలలో యాసిడ్ పోయాల్సిన అవసరం లేదు. తేలికపాటి క్యాప్ ల్యాంప్‌లను సమకూర్చడంపై కంపెనీ వ్యాప్తంగా కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కార్మికులందరికీ ఈ లైట్లు
ప్రస్తుతం 90 శాతం మంది కార్మికులకు సరిపోయే విధంగా 40 వేల తేలికపాటి లైట్లు కొనుగోలు చేసినట్లు సింగరేణి సిఎండి ఎన్ శ్రీ్ధర్ తెలిపారు. మరో 7 వేల క్యాప్‌ల్యాంప్స్ కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్మికుల రక్షణ - సంక్షేమం విషయంలో ఎంతటి ఖర్చుకైనా వెనకాడేదిలేదన్నారు. పని ప్రదేశాల్లో సౌకర్యాలను కల్పిస్తూ రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికే సంస్థ ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.