ఖమ్మం

కొనసాగుతున్న ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, డిసెంబర్ 2: భద్రాచలం మన్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉద్రిక్తత కొనసాగుతోంది. మావోయిస్టుల పిఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో మన్యంలో జనజీవనం స్తంభించింది. మావోయిస్టు దండకారణ్యంకు అతి సమీపంలో ఉన్న భద్రాచలం డివిజన్ సరిహద్దున ఏ సంఘటన జరిగినా ఉలిక్కి పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మావోయిస్టుల ఆర్ధిక లావాదేవీలు, ఇతర కార్యక్రమాలకు సరిహద్దు గ్రామాలు రాచమార్గాలుగా మారాయి. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లాలో మావోయిస్టుల రూ.12లక్షల పెద్దనోట్లను మార్చుతూ ఇద్దరు వ్యక్తులు దొరికిపోయారు. వీరితో పాటు పోస్టల్ శాఖ ఉద్యోగి కూడా చిక్కారు. పట్టుబడ్డ వ్యక్తులు భద్రాచలం డివిజన్‌లోని మారుమూల ప్రాంతంలో రోడ్డు నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్ వద్ద పనిచేసే వారుగా గుర్తించారు. దేశంలో ఏ మూలన మావోయిస్టులకు సంబంధించిన సంఘటన జరిగినా దానికి లింకు భద్రాచలం మన్యంలో ఉంటుండటం గమనార్హం. దీనికి తోడు మావోయిస్టుల పిఎల్‌జీఏ వారోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. భద్రాచలం సరిహద్దున ఉన్న విలీన మండలం చింతూరులోని అల్లిగూడెం, సరివెల ప్రాంతంలో మావోయిస్టులు భారీ సంఖ్యలో వాల్‌పోస్టర్లు, బ్యానర్లు వదిలారు. పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని గంగులూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో హీరోలి గ్రామం వద్ద మావోయిస్టులు ప్రెషర్ బాంబు పేలి కూంబింగ్ నిర్వహించి వస్తున్న 204 కోబ్రా జవాన్లు ఇద్దరు ముమేంద్రకుమార్, తరుణ్‌కుమార్‌లు తీవ్రంగా గాయపడ్డారు. కోయల్‌బేడా ప్రాంతంలో ప్రధాన రహదారిపై పిఎల్‌జీఏ వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని పోస్టర్లు, కరపత్రాలు వదిలారు.
ప్రెషర్ బాంబుల కలకలం....
మావోయిస్టులు ఇప్పుడు ప్రెషర్‌బాంబులతో కలకలం సృష్టిస్తున్నారు. ఇటీవల భద్రాచలం మన్యంలో రెండు ఘటనలు కేవలం మూడు నెలల వ్యవధిలో చోటు చేసుకున్నాయి. ఇటీవలే భద్రాచలం డివిజన్ నుంచి భూపాల్‌పల్లి జయశంకర్ జిల్లాలో విలీనమైన వెంకటాపురం మండలం విజయపురి కాలనీ వద్ద మూడు నెలల క్రితం మావోయిస్టులు పోలీసులు, పోలీసు ఇన్‌ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని ప్రెషర్‌బాంబును ఏర్పాటు చేశారు. వాల్‌పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లు ఏర్పాటు చేసి వాటి కింద వ్యూహాత్మకంగా మావోయిస్టులు ప్రెషర్‌బాంబులు ఉంచుతున్నారు. వాటిని తాకితే చాలు పేలుతున్నాయి. ఓ ద్విచక్ర వాహనదారుడు మూత్ర విసర్జన చేస్తూ ప్రెషర్‌బాంబు పేలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తాజాగా గురువారం ఇదే ప్రాంతంలో మావోయిస్టుల బ్యానర్లు తొలగిస్తున్న క్రమంలో ప్రెషర్‌బాంబు పేలింది. ఆటో డ్రైవర్ కార్తీక్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇది మరవక ముందే సరిహద్దునే ఉన్న బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్‌స్టేషన్ వద్ద కూడా మావోయిస్టులు ఏర్పాటు చేసిన ప్రెషర్‌బాంబు పేలి ఇద్దరు కోబ్రా జవాన్లు శుక్రవారం గాయపడ్డారు. కొద్ది రోజుల క్రితమే వెంకటాపురం మండలం రామచంద్రాపురం వద్ద జాతీయరహదారిపై మావోయిస్టులు మందుపాతరలు ఏర్పాటు చేశారు. మావోయిస్టులు అడవిలోని కాలిబాటల్లో, ప్రధాన రహదారులపై మందుపాతరలు, ప్రెషర్‌బాంబులు ఏర్పాటు చేస్తున్న క్రమంలో సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు.