ఖమ్మం

బూత్ స్థాయి నుంచే పార్టీ బలోపేతం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జనవరి 20: తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బూత్ స్థాయి నుంచే బలోపేతం చేయాలని, దీన్‌దయాళ్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించాలని భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో తీర్మానించారు. భద్రాచలంలోని కెకె ఫంక్షన్ హాలులో శుక్రవారం ఆ పార్టీ రెండు రోజుల కార్యవర్గ సమావేశాలను కేంద్ర సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సమావేశాలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు కృష్ణదాస్, శాసనసభా పక్ష నేత కిషన్‌రెడ్డి, శాసనమండలి పక్ష నాయకులు ఎన్. రాంచందర్‌రావు, జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ నాగం జనార్థన్‌రెడ్డి, పేరాల శేఖర్‌రావు, భాజపా ఎమ్మెల్యేలు రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్ ప్రభాకర్, మాజీ మంత్రులు, రాష్ట్ర పదాధికారులు, వివిధ జిల్లాల భాజపా అధ్యక్షులు పాల్గొన్నారు. సంస్థాగత విషయాలపై విస్తృతంగా చర్చ జరిపారు. రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు పోలింగ్ బూత్ స్థాయి నుంచి కమిటీలు పూర్తి చేయాలని, మండల, జిల్లా కార్యవర్గ సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని తీర్మానించారు. పార్టీ సిద్ధాంతకర్త పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి ఉత్సవాల సందర్భంగా పూర్తి సమయమిచ్చే కార్యకర్తలను గుర్తించి వారికి శిక్షణ ఇచ్చి క్షేత్ర స్థాయిలో పార్టీని సామాజికంగా, భౌగోళికంగా విస్తరించడానికి వారి సేవలు విస్తృతంగా వినియోగించుకోవాలని సమావేశం వ్యూహ రచన చేసింది. ఫిబ్రవరి 11న పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ బలిదాన దివస్ సందర్భంగా పార్టీ ఆర్థిక పరిపుష్టికి సమర్పణ దివస్ నిర్వహించి ప్రజల నుంచి పారదర్శకంగా, స్వచ్ఛందంగా నిధులు సేకరించాలని సమావేశం తీర్మానించింది. సమావేశ ప్రారంభంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లిం రిజర్వేషన్లు తెరపైకి తెచ్చిందని, మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకమైనందు వల్ల భాజపా రాజకీయంగా, న్యాయపరంగా అడ్డుకుంటుందని అన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు మాట్లాడుతూ ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశ వివరాలు తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా విజయం సాధించిందని, త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా విజయం కైవసం చేసుకుంటుందన్నారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ దేశంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చారిత్రాత్మకం, సాహసోపేతం అన్నారు. నగదు రహిత లావాదేవీలు, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి ఈ నిర్ణయం ఉద్దేశించిందన్నారు. పేద ప్రజలకు, దళితులకు, గ్రామీణులకు, రైతులకు, మహిళలకు ఎంతో ఉపయోగకరమని, ఈ విషయంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. రానున్న రోజుల్లో దేశంలో పారదర్శకమైన ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధికి ఊతమిచ్చే ఆర్థిక కలాపాలు ఈ నిర్ణయాల వల్ల జరుగుతాయన్నారు.

సమస్యలను పరిష్కరించాలని స్కీం వర్కర్ల భారీ ర్యాలీ
ఖమ్మం(కల్చరల్), జనవరి 20: స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, కనీసవేతనం అమలు చేయాలని కోరుతూ, బడ్జెట్‌లో స్కీంలకు నిధులు తగ్గించడాన్ని నిరసిస్తూ స్కీం వర్కర్ల ఒకరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం నగరంలో వివిధ ప్రభుత్వ పధకాల వర్కర్లంతా భారీ ర్యాలీ నిర్వహించారు. స్దానిక సిఐటియు కార్యాలయం నుండి నరసింహాస్వామి గుడి, పాత సిపిఐ ఆఫీస్, వైరారోడ్, అంబేద్కర్ సెంటర్ నుండి ధర్నాచౌక్‌కు చేరుకుంది. ప్రదర్శనలో మహిళలు సమస్యలతో కూడిన ప్లకార్డులు చేతబూని పెద్ద పెట్టున నినదించారు. ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షడు కళ్యాణం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పేద ప్రజలకు అనేక సేవలందిస్తున్న వివద ప్రభుత్వ పధకాల అమలులో స్కీం వర్కర్లు చేస్తున్న కృషిని అనేక అంతర్జాతీయ సంస్థలు కొనియాడుతుంటే మన ప్రభుత్వాలు మాత్రం వీరికి పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేట్టి చాకిరీ చేస్తున్న స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి, కనీస వేతనం 18 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పధకాలను కష్టపడి అమలుచేస్తూ, పేద ప్రజలకు సేవలందిస్తున్న స్కీం వర్కర్ల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఎంతో ప్రతిష్టాత్మంగా జరుగుతున్న వివిధ స్కీంలను ప్రవేట్, కార్పోరేట్ సంస్ధలకు కట్టబెట్టాలని చూస్తున్నాయని, దానిలో భాగమే బడ్జెట్‌లో నిధులు కోతవేయడమేనన్నారు. ఐసిడిఎస్‌లో నగదు బదిలీని ప్రవేశపెటే ప్రయత్నాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆషా వర్కర్ల సమ్మె కాలంనాటి ఒప్పందాలను, కేంద్రం ఇచ్చిన సర్క్యులర్‌ను వెంటనే అమలు చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల స్కీం వర్కర్ల వేతనాలను విడుదల చేయాలన్నారు. అలాగే మధ్యాహ్నభోజన, అంగన్‌వాడీల వివిధ రకాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, రాజకీయ వేధింపులను అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు కె నరసింహారావు, ఉపాధ్యక్షుడు టి లింగయ్య, టి విష్ణువర్ధన్, నాయకులు బి కోటేశ్వరి, జ్యోతి, సుధ, పద్మ, అంజమ్మ, హేమలత, రత్నశ్రీ, జ్యోతి, రమ, కల్పన, రమణ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

విమానాశ్రయం ఏర్పాటు
బహుళజాతి కంపెనీల ప్రయోజనం కోసమే
* ఆదివాసి గిరిజనుల భూములు లాక్కుంటే అడ్డుకుంటాం
* విరసం నేత వరవరరావు
కొత్తగూడెం, జనవరి 20: బహుళ జాతి కంపెనీల ప్రయోజనం కోసమే కొత్తగూడెం ఏజన్సీ ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని విప్లవ రచయిత సంఘం నేత వరవరరావు ఆరోపించారు. శుక్రవారం కొత్తగూడెం క్లబ్‌లో కల్సిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో ఉన్న సహజ సంపదను కొల్లగొట్టేందుకు విమానాశ్రయం చేస్తున్నారని తెలిపారు. ఆదివాసీ గిరిజన హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గిరిజనుల భూములను స్వాధీనం చేసుకునే అధికారం ఈ ప్రభుత్వానికి లేదన్నారు. ఎలాంటి గ్రామ సభలు నిర్వహించకుండా పోలీసు బలగాలతో గిరిజనులు పోడు చేసుకుంటున్న సాగు భూముల్లో విమానాశ్రయ ఏర్పాటు అడ్డుకుంటామన్నారు. ఏజన్సీ ప్రాంతంలో నిర్మించేది విమానాశ్రయం కాదని సైనిక ఎయిర్‌బస్ అని అభివర్ణించారు. విమానాశ్రయానికి పారా మిలటరీ బలగాలు, సిఆర్పీఎఫ్, ఆర్మీ బలగాలతోపాటు కార్గో విమానాలు వస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు అనేక త్యాగాలు చేసి సాధించుకుంటే ఉద్యమకారులను అణచివేసే విధంగా ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని ఆరోపించారు. ఆదివాసీ గిరిజనుల సంక్షేమానికి పాటుపడాల్సిన ప్రభుత్వాలు గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకుంటున్నాయని విమర్శించారు. ఏజన్సీ ప్రాంతాల్లోని అడవి, భూమి, నీరు గిరిజనుల సొంతమని తెలిపారు. గిరిజనుల అనుమతి లేకుండా ఎలా విమానాశ్రయం నిర్మిస్తున్నారని ప్రశ్నించారు. పౌర విమానంలో పౌరులు ఎవరూ విమాన ప్రయాణం చేయరని, బడా వ్యాపారులు, బహుళ జాతి సంస్థల ప్రతినిధులే విమానాశ్రయాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. ఆదివాసీ గిరిజనులు భూముల్లో పంటలను ధ్వంసం చేస్తే ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే పోలవరం నిర్మాణం కారణంగా వందలాది గిరిజన గ్రామాలు నీట మునిగి పోతున్నాయని, ఉన్న కొన్ని గిరిజన గ్రామాలు ఆంధ్ర ప్రాంతంలో కలిశాయని తెలిపారు. ఈ నేపథ్యంలో విమానశ్రయ ఏర్పాటు వల్ల వందలాది గిరిజన గ్రామాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. విమానశ్రయ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిర్వహించే పోరాటంలోప్రజాతంత్రులంతా ఏకం కావాలన్నారు. ఈ సమావేశంలో కొత్తగూడెం మాజీ శాసన సభ్యుడు కూనంనేని సాంబశివరావు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవిచంద్ర, ప్రజా ఫ్రంట్ నాయకులు చారువాక, పౌరహక్కుల సంఘం నాయకుడు ఉపేందర్, టివివి అధ్యక్షులు మల్లెల రామనాధం తదితరులు పాల్గొన్నారు.