ఖమ్మం

విలువలతో కూడిన విద్యనందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, డిసెంబర్ 21: ప్రభుత్వ ఉపాధ్యాయులు పేద విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించి, వారిలో విద్యా నైపుణ్యాలను పెంచేందుకు కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ రాం కిషన్ అన్నారు. భద్రాచలంలోని నన్నపనేని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద రోగులకు వైద్య ఖర్చుల కోసం రూ.లక్ష నగదు, చెక్కుల పంపిణీ, విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ బుధవారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జేసీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వసుధ ఫొండేషన్ ద్వారా పేద విద్యార్థులకు, రోగులకు సేవలందించడం ఎంతో అభినందించదగ్గ విషయమన్నారు. కనీస ఖర్చులు లేక అడ్మిషన్లు పొందలేకపోతున్న వారిని గుర్తించి ఆర్థికంగా చేయూత అందిస్తే ప్రభుత్వ సహాయంతో వారు చదువుకుంటారని అన్నారు. మహబూబ్‌నగర్‌లో పనిచేసే సమయంలో తాను, తోటి ఉద్యోగులు కలిసి రూ.80లక్షలు పోగు చేసి పేద విద్యార్థులకు చేయూతనందించామని చెప్పారు. కార్పోరేట్ పాఠశాలల కంటే కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే వౌలిక సదుపాయాలు, ఉన్నత నైపుణ్యాలు కలిగిన ఉపాధ్యాయులు ఉంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న పలువురికి రూ.లక్ష విలువజేసే నగదు, చెక్కులను జేసీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వసుధ ఫౌండేషన్ సలహాదారు, దేవస్థానం మాజీ ట్రస్టుబోర్డు ఛైర్మన్ వి.రామకృష్ణంరాజు, ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ వి.శ్రీనివాసరాజు, సభ్యులు పీవీ సత్యనారాయణ, ఎంఈవో జయరావు, హెచ్‌ఎం బాలాజీరాజు తదితరులు పాల్గొన్నారు.

స్తంభించిన ధాన్యం కొనుగోళ్లు
* ఐకెపి కేంద్రాల వద్ద పడిగాపులు
* చర్లలో గన్నీ బ్యాగుల కొరత
చర్ల, డిసెంబర్ 21: చర్ల మండలంలో గన్నీ బ్యాగుల కొరత ఏర్పడింది. 15 రోజులుగా బ్యాగులు లేకపోవడంతో ఐకెపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిచిపోయాయి. రోజులు గడుస్తున్నా బ్యాగులు రాక రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో సత్యనారాయణపురం, పెద్దముసిలేరు, గుంపెనగూడెం, దేవరపల్లి, రేగుంట గ్రామాల్లో ఐకెపీ(సెర్ప్) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఐదు కేంద్రాల్లో 15 రోజులుగా గన్నీ బ్యాగులు లేవు. ఒక్క సత్యనారాయణపురం కేంద్రానికే మంగళవారం కొన్ని బ్యాగులను పంపారు. మిగతా కేంద్రాల్లో ఇప్పటివరకు బ్యాగులు రాలేదు. కొనుగోళ్లు జరపడానికి బ్యాగులు లేకపోవడంతో రైతులు తీసుకొచ్చిన ధాన్యం కేంద్రాల వద్దనే నిల్వ చేస్తున్నారు. ఇప్పటికే అన్ని కేంద్రాల్లో వేల క్వింటాళ్ల ధాన్యం వచ్చి చేరింది. బ్యాగుల కోసం కమిటీ సభ్యులు, అధికారులు ఉన్నతాధికారులకు పరిస్థితిని వివరిస్తున్నప్పటికీ కేంద్రాలకు గన్నీ బ్యాగులు పంపడం లేదు. కాగా గత ఏడాది కొనుగోళ్లు జరిపిన విధంగానే ఈ ఏడాది కూడా కొనుగోళ్లు ఉంటాయని ప్రభుత్వం భావించినట్లుగా తెలుస్తోంది. ఆ లెక్కల ప్రకారమే కేంద్రాలకు బ్యాగులు పంపినట్లు సమాచారం. పెద్దనోట్లు రద్దు కావడంతో దళారులు రైతుల ధాన్యం కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులే చేసేదేమీ లేక వారి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే సత్యనారాయణపురం, పెద్దముసిలేరు కేంద్రాల్లో 50వేల క్వింటాళ్లకు పైగా ధాన్యం కొనుగోలు చేశారు. ఇంకా వేలల్లోనే కొనుగోళ్లు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. 15 రోజులుగా కొనుగోళ్లు లేకపోవడంతో కేంద్రాలు ధాన్యంతో నిండిపోయాయి. ఒక్కో కేంద్రంలో సుమారు 3 వేల నుంచి 4 వేల బస్టాల వరకు ధాన్యం ఉంది. ప్రభుత్వం త్వరగా గన్నీ బ్యాగులు పంపాలని రైతులు కోరుతున్నారు. ఇదే విషయాన్ని సెర్ప్ అధికారి రాంకుమార్‌ను వివరణ కోరగా బ్యాగుల కొరత వాస్తవమేనని చెప్పారు. కొనుగోళ్లు పెరగడంతోనే బ్యాగులు సరిపోలేదన్నారు. పరిస్థితిని అధికారులకు వివరించామని, రెండు రోజుల్లో బ్యాగులు వస్తాయన్నారు.