ఖమ్మం

ప్రజా దీక్షకు మద్దతుగా చేపట్టిన బంద్ సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జనవరి 23: స్థలాల క్రమబద్దీకరణ పట్టాల కార్యక్రమాన్ని నిర్వహించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జ్ కోనేరు సత్యనారాయణ (చిన్ని) నిర్వహిస్తున్న ప్రజా దీక్షకు మద్దతుగా అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బంద్ విజయవంతం అయింది. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ జెఎసి, ప్రజాఫంట్ నాయకులు బంద్ సందర్భంగా పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. వస్త్ర, వాణిజ్య, వ్యాపార సంస్థలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, సినిమా హాళ్లు పెట్రోల్ బంక్‌లు, బ్యాంకులను మూసివేశారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి బందోబస్తును నిర్వహించారు. ప్రజా దీక్ష నిర్వహిస్తున్న కోనేరు చిన్నిని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కొత్తగూడెం పట్టణ ప్రజలకు సంబంధించిన స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలను పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు కొత్తగూడెం తహశీల్దార్ అశోక్ చక్రవర్తి అఖిల పక్ష కమిటీ నాయకులకు హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ప్రభుత్వంతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తహశీల్దార్ అశోక్‌చక్రవర్తి ప్రకటించారు. దీంతో ప్రజా దీక్ష నిర్వహిస్తున్న కోనేరు చిన్నికి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు నామ నాగేశ్వరరావు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కమిటీ నాయకులు మాలోత్ రాందాస్‌నాయక్, ఎస్‌కె సాబీర్‌పాషా, కాసాని ఐలయ్య, ఎడవల్లి కృష్ణ, మండె వీరహనుమంతరావు, గుగులోత్ ధర్మ, రావి రాంబాబు, అన్నవరపు సత్యనారాయణ, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మారుమూల ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

వెంకటాపురం, జనవరి 23: మారుమూల ప్రాంతాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వెంకటాపురం, వాజేడు మండలాల్లో సోమవారం పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించి మాట్లాడారు. అవిభక్త ఖమ్మం జిల్లాలో ఉన్న ఈ మండలాలను జయశంకర్ జిల్లాలో విలీనం చేసినంత మాత్రాన ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించి కోట్లాది రూపాయల నిధులను విడుదల చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న పంచాయితీరాజ్ రోడ్లను ఆర్‌అండ్‌బీకి బదిలీ చేసి బీటీ రోడ్లుగా విస్తరించేందుకు రోడ్లు, భవనాల శాఖ కోట్ల రూపాయలను విడుదల చేస్తుందన్నారు. వెంకటాపురం, వాజేడు, గుమ్మడిదొడ్డి వరకు పీఆర్ రోడ్లను ఆర్‌అండ్‌బీకి బదిలీ చేసినట్లు తెలిపారు. వెంకటాపురం మండల కేంద్రంలో సుమారు రూ.20కోట్లతో నిర్మాణం ప్రారంభించిన 132/33కేవీ సబ్‌స్టేషన్‌ను ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వెంకటాపురం, వాజేడు, చర్ల మండలాలకు సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయితే నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. అలాగే మిషన్ కాకతీయ, భగీరథ, రెండు పడక గదుల ఇళ్లు, ఇంకా అనేక ప్రభుత్వ పథకాలను త్వరితగతిన పూర్తి చేయాలని, అనుకున్న లక్ష్యానికి ముందే నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భద్రాచలం, వెంకటాపురం, వాజేడు మీదుగా ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌ను హైదరాబాద్‌కు వెంటనే ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. అలాగే వాజేడు మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసేందుకు గ్రామస్తులు, నాయకులు వినతిపత్రం అందించారు. అంతకుముందు మంత్రి ఆలుబాకలో విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం వెంకటాపురంలో 132కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన అనంతరం మరికాల, వాజేడులో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంత్రి వెంట ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ ఛైర్‌పర్సన్ గడిపల్లి కవిత, డీసీఎంఎస్ ఛైర్మన్ ఎగ్గడి అంజయ్య, ఖమ్మం సీఈవో నగేష్, ఏటూరునాగారం డీయస్పీతో పాటు తెరాస నాయకులు పాల్గొన్నారు. ఏటూరునాగారం డీయస్పీ దక్షిణమూర్తి ఆధ్వర్యంలో సీఐ సాయిరమణ పర్యవేక్షణలో పోలీసులు పూర్తిస్థాయి బందోబస్తు నిర్వహించారు.

ప్రజల విజ్ఞప్తులను సత్వరం పరిష్కరించాలి

ఖమ్మం(గాంధీచౌక్), జనవరి 23: ప్రజల నుండి వచ్చే విజ్ఞప్తులను సత్వరంగా పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ద వహించాలని జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్ అధికారులు అదేశించారు. సోమవారం జిల్లా పరిషత్తు సమావేశ మందరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హజరై ప్రజల నుండి విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా ఉన్నతాధికారులు తప్పనిసరిగా హజరుకావాలన్నారు. ప్రజల నుండి స్వీకరించే విజ్ఞప్తులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలన్నారు. అన్ని కార్యాలయాలలో చేనేత వస్త్రాలు ధరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్యక్రమాలు జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. రోడ్లకు ఇరువైపుల చెత్తాచెదారం కుప్పలు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లపై నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జెసి టి వినయ్‌కృష్ణారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి జె శివశ్రీనివాస్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి మురళీధర్‌రావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కొండల్‌రావు, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కృషి చేయాలి

ఖమ్మం(గాంధీచౌక్), జనవరి 23: రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయటంతో పాటు ట్రాఫిక్ నిబందనలను ఖచ్చితంగా పాటించాలని ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పాపాలాల్ అన్నారు. 28వ రోడ్డు భద్రత వారోత్సవాలు సోమవారంతో ముగియటంతో ఈ వారం రోజులు రోడ్డు భద్రతపై పలు కార్యక్రమాలు నిర్వహించిన వారికి స్థానిక ఆర్టీవో కార్యాలయంలో మెమోంట్‌లు అందచేసి సన్మానం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో నగర మేయర్ పాపాలాల్, ఆర్టీవో హన్మంతరెడ్డిలు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయన్నారు. వాటిని గుర్తించి తిరిగి ప్రమాదాలు జరగకుండా అధికారులతో పాటు వాహనాదారులు కూడ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే నేటి యువతకు అత్యధునికంగా వస్తున్న వాహనాల వల్ల యువత నడిపే వేగంతో పాటు వారి తొందపాటు వల్ల అనేక అనార్ధాలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా వాహనాదారులు హెల్మెట్, సీటుబెల్టు, వాహన కండీషన్, సెల్‌ఫోన్ మాట్లాడకుండా ఉండటం వంటి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. వాహనాలు నడిపే ప్రతి డైవర్ వారి కుటుంబాలను, వారితో ప్రయాణించే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని వాహనాలను నడపాలని సూచించారు. అలాగే వాహనాదారులు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్, వాహన దృవపత్రాలను ఖచ్చితంగా ఉంచుకోవాలన్నారు. దేశంలోనే కాకుండా అన్ని విధాలవారికి అదర్శంగా ఉండే డ్రైవర్లు వారు విధి నిర్వహణను ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉండాలన్నారు. ఆనంతరం ఆర్టీవో కార్యాలయానికి వచ్చిన వాహనాదారులతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి మేయర్ బత్తుల మురళి, ఎంవిఐ బజాజ్ ధన్‌రాజ్, ఎవో కృష్ణరెడ్డి, రిటైర్డ్ ఆర్టీవో విజయ్‌పాల్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్ నాగరాజు, ఆర్టీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజలతో సంబంధం లేని
బంగారు తెలంగాణ ఎలా సాధ్యం
కొత్తగూడెం, జనవరి 23: తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి అభివృద్ధి పథకాలనూ అమలు చేయకుండా బంగారు తెలంగాణ ఏర్పాటు ఎలా సాధ్యమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కాసాని ఐలయ్య ప్రశ్నించారు. సోమవారం స్థానిక సూర్యప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాజన పాదయాత్రకు ప్రజల నుండి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే మంత్రులు హరీష్‌రావు, జగదీశ్వర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మహాజన పాదయాత్ర ఈనెల 26వ తేదీన భద్రాద్రి జిల్లా పినపాక మండలంలో ప్రవేశిస్తుందని తెలిపారు. సామాజిక న్యాయం, ప్రజల సమగ్రాభివృద్ధి, సామాజిక తెలంగాణ సాధన కోసం సిపిఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యలో నిర్వహిస్తున్న మహాజన పాదయాత్ర ఈనెల 24వ తేదీకి 100 రోజులు పూర్తిచేసుకుంటుందని తెలిపారు. భూపాలపల్లి జిల్లా ఏటూరి నాగారంలో 100 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మననీళ్ళు మనకే... మన ఉద్యోగాలు మనకే... అంటూ ప్రజలను నమ్మపలికిన టిఆర్‌ఎస్ నాయకులు అధికారంలోకి వచ్చాక కెసిఆర్ కుటుంబ సభ్యులకే బంగారు తెలంగాణ అప్పగించారన్నారు. గిరిజనులకు, దళితులకు మూడు ఎకరాల భూమి, కెజి టూ పిజి ఉచిత విద్య, పేదప్రజలందరికీ డబుల్ బెడ్‌రూం, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన కెసిఆర్ అధికారంలోకి వచ్చాక ఒక్కదానిని కూడా కనీసం ప్రస్తావించడం లేదని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేస్తూ ప్రైవేటు రంగంలో పెట్టుబడుల కోసం ప్రభుత్వం ఆరాట పడుతోందని ఆరోపించారు. గూగుల్, యాపిల్ లాంటి సంస్థలు పెట్టుబడుల పెట్టేందుకు ముందుకు వస్తున్నప్పటికీ స్థానికులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చెరువులు, ఇంకుడు గుంతలు తవ్వడంవల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. కొత్తగూడెం పట్టణంలో 373జీఓ ప్రకారం అర్హత కల్గిన ప్రజలందరికీ క్రమబద్ధీకరణ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

విశ్వశాంతి మహాయాగాన్ని విజయవంతం చేయండి
కామేపల్లి, జనవరి 23: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం మొట్టమొదటి సారిగా లోకకళ్యాణం కోసం నిర్వహిస్తున్న శ్రీమహమృత్యుంజయ జపఊర్వారుక (దోసపండు) విశ్వశాంతి మహయాగం విజయవంతం చేయాలని జడ్పిటిసి మల్లిబాబుయాదవ్, ఎంపిపి సరిరాంనాయక్, భక్తమండలి అధ్యక్షులు వట్టిపర్తి శివాజి విజ్ఞప్తి చేశారు. సోమవారం కామేపల్లిలోని బాలత్రిపురసుందరి సహిత ఇష్టాకామేశ్వరిస్వామి దేవాలయం ప్రాంగణంలో జరిగిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 3నుండి మే22వరకు 108రోజుల పాటు జరిగే మహయాగానికి సంబందించిన వివరాల వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. వివిద పీఠాధిపతులు, ఆధ్యాత్మిక వక్తలు, మహసంకీర్తనాపరులు పాల్గొనే ఈ మహయాగంలో 18ఉపయాగాలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. అదేవిదంగా అఖండ శివనామము, రామనామము, సంకీర్తనలు కోటి కుంకుమ, కోటి బిల్వార్చన కార్యక్రమాలు నిర్వహిస్తామని, కాళివనాశ్రమ పీఠాధిపతులు జ్యోగిని చంద్రకాళిప్రసాద్‌మాతాజి, విద్యాశంకరభారతి తదితర పీఠాధిపతులు హాజరయ్యే ఈ మహయాగానికి అందరూ సహకరించి దిగ్విజయం చేయాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అవధూదేంద్ర భక్తమండలి అధ్యక్షులు కేతగాని వెంకటేశ్వర్లు, వివిద రాజకీయ పార్టీల ప్రముఖులు పుచ్చకాయల వెంకటేశ్వర్లు, బానోతు నర్సింహనాయక్, బాదావత్ శ్రీను, ఆజ్మీరా హరినాయక్, ఎంపిటిసి ఆజ్మీరా చిన్ని, రాములు, లాలూనాయక్, కస్నానాయక్ తదితరులు పాల్గొన్నారు.

ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
ఖమ్మం రూరల్, జనవరి 23: ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను రూరల్ పోలీసులు సోమవారం మండలంలోని ముల్కలపల్లి క్రాస్‌రోడ్ వద్ద అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రూరల్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఖమ్మం డిఎస్‌పి సురేష్‌కుమార్ దొంగల ముఠా చేసిన దొంగతనాల వివరాలను వెల్లడించారు. ముదిగొండ మండలం మల్లన్నపాలెం గ్రామానికి చెందిన షేక్ రఫి సుమారు 50 దొంగతనం కేసుల్లో అరెస్టై జైలు జీవితం గడిపాడు. ఇతనిపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో కేసులు నమోదైయున్నాయి. ఖమ్మం బోసుబొమ్మ సెంటర్‌కు చెందిన ఆటోడ్రైవర్ మండల నవీన్ గత సంవత్సరం ఖమ్మం వన్‌టౌన్ పరిధిలో దొంగతనాలు చేశాడు. వరంగల్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన సుతారిమేస్ర్తి చలువాది వెంకటేష్ వరంగల్, నర్సంపేట, మహబాద్, ఖమ్మం, మణుగూరు, పాల్వంచ తదితర ప్రాంతాలలో చోరీలకు పాల్పడ్డాడు. ఈముగ్గురు పాతనేరస్తులని, ఖమ్మం జైల్‌లో వీరిమధ్య పరిచయం ఏర్పడిందని, వీరు జైలు నుంచి బయటకు వచ్చాక కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నారని డిఎస్‌పి తెలిపారు. విస్వసనీయ సమాచారం మేరకు ముల్కలపల్లి క్రాస్‌రోడ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఈముగ్గురిని రూరల్ పోలీసులు, సిసిఎస్ సిబ్బంది అరెస్ట్ చేసి వారి వద్దనున్న 27 తులాల బంగారు ఆభరణాలు, 38 తులాల వెండి ఆభరణాలు, ఒక ఆటో, ఒక పల్సన్ మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. వాటి విలువ సుమారు ఎనిమిది లక్షల రూపాయలు ఉంటుందన్నారు. ఈముగ్గురూ ఖమ్మం రూరల్, ముదిగొండ, ఖానాపురం హవేలి, నేలకొండపల్లి, మహబాద్, కురవి, మరిపెడ, నర్సింహులపేట పోలీస్ స్టేషన్‌ల పరిధిలో దొంగతనాలకు పాల్పడినట్టు అంగీకరించినట్టు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను సంబంధిత వ్యక్తులకు అందజేయనున్నట్టు డిఎస్‌పి తెలిపారు. ఈ దొంగల ముఠాను పట్టుకోవడంలో చురుకుగా పనిచేసిన సిఐ తిరుపతిరెడ్డి, ఎస్‌ఐలు చిరంజీవి, వెంకటేశ్వరరావు, ముదిగొండ ఎస్‌ఐ కరుణాకర్, సిసిఎస్ ఎస్‌ఐ ఇబ్రహీం, సిబ్బంది పి శ్రీనివాసరావు, కె నాగేంద్రరరావు, జి వెంకటేశ్వరరావు, బి రమేష్, దానియేలు, కె రామారావు, అలిలను డిఎస్‌పి ప్రత్యేకంగా అభినందించారు. అరెస్ట్ చేసిన ముగ్గురిని కోర్టుకు రిమాండ్ చేస్తున్నట్టు డిఎస్‌పి సురేష్‌కుమార్ తెలిపారు.

రామయ్యకు ముత్తంగి సేవ

భద్రాచలం, జనవరి 23: శ్రీ సీతారామచంద్రస్వామికి సోమవారం ముత్తంగి సేవ జరిగింది. రామయ్యకు, సీతమ్మవారికి, లక్ష్మణమూర్తికి ముత్యాలు పొదిగిన వస్త్రాలను అలంకరింప చేసి ప్రత్యేక పూజలు చేశారు. వీరితో పాటుగా లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వామిలకు కూడా ముత్తంగి సేవను చేసి నైవేద్యం సమర్పించారు. అంతకు ముందు ఉదయం గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి స్వామికి సుప్రభాత సేవ చేసి బాలభోగం సమర్పించారు. తర్వాత ముత్తంగి సేవ జరిగింది. కల్యాణమూర్తులను పల్లకీలో ఊరేగింపుగా ప్రాకార మండపానికి తీసుకెళ్లి అక్కడ నిత్యకల్యాణం ఘనంగా చేశారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం రాజభోగం, సాయంత్రం స్వామికి దర్బారు సేవ నిర్వహించారు.
దుమ్ముగూడెంలో మంత్రి తుమ్మల పర్యటన
దుమ్ముగూడెం, జనవరి 23: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుమ్ముగూడెం మండలంలో సోమవారం పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తొలుత రామారావుపేట గ్రామం వద్ద మొట్లవాగుపై రూ.1.20కోట్ల నిధులతో నిర్మించే బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గంగోలు గ్రామం వద్ద 45 డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. మిషన్ భగీరథ పథకం కోసం పర్ణశాల గ్రామంలో రూ.1.20కోట్ల నిధులతో నిర్మించిన 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మంత్రి ప్రారంభించారు. మంత్రి పర్యటన సందర్భంగా ఎంపీపీ తెల్లం సీతమ్మ, జడ్పీటీసీ అనె్నం సత్యాలు మండలంలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తూరుబాక గ్రామంలో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, నాన్ సీఆర్‌ఎఫ్ నిధులు మంజూరు చేసి ఆ గ్రామ ప్రజల దాహార్తి తీర్చాలని మంత్రిని కోరారు. అలాగే తాటివారిగూడెంనకు విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపి వేశారని, సరఫరా పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే ట్రాన్స్‌కో డీఈ నాయక్‌ను పిలిచి ఆ గ్రామానికి విద్యుత్‌ను పునరుద్ధరించాలని ఆదేశించారు. ఆయన వెంట ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, జడ్పీ ఛైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్యే సున్నం రాజయ్య, తహసిల్దార్ వెంకటేశ్వరరావు, ఎంపీడీవో రమాదేవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.