ఖమ్మం

ఖాజీపేట-విజయవాడ మధ్య 3వ లైన్ నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 10: ఖాజీపేట-విజయవాడ మధ్య 3వ రైల్వేలైన్ నిర్మాణాన్ని చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మెనేజర్ వినోద్‌కుమార్‌యాదవ్ తెలిపారు. శుక్రవారం మధిర, ఖమ్మం రైల్వేస్టేషన్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెవెన్యూ బడ్జెట్‌తో కలిపి ప్రవేశపెట్టిన రైల్వేబడ్జెట్‌లో ఖాజీపేట నుండి విజయవాడ విద్యుద్దీకరణతో కూడిన 3వ లైన్ నిర్మాణానికి 69కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. 3వ లైన్ నిర్మాణ పనులు కొండపల్లి వరకు వచ్చినట్లు తెలిపారు. రైల్వే బడ్జెట్‌లో అండర్ రైల్వేబ్రిడ్జి నిర్మాణాలకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చామని, డ్రైనేజి సమస్య లేనిచోట రైల్వే క్రాసింగ్ గేట్లను తొలగించి అండర్ బ్రిడ్జిలను నిర్మిస్తామన్నారు. ప్యాసింజర్ రైళ్ళ వలన ప్రయాణీకులకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నారు. డోర్నకల్ నుండి విజయవాడ వరకు అదనపు ప్యాసింజర్ రైళ్ళను నడపనున్నట్లు తెలిపారు. మధిర నుండి కొండపల్లి వరకు రైల్వే ట్రాక్‌కు అవసరమైన చోట్ల 1.20 కోట్లతో మరమ్మతులు నిర్వహించినట్లు తెలిపారు. మధిర రైల్వేస్టేషన్‌లో వివిధ అభివృద్ధి పనులకు 66.14 లక్షల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. ప్రయాణీకుల భద్రతకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రయాణీకులకు అనుగుణంగా రైళ్ళను నడుపుతామని స్పష్టం చేశారు. విలేఖరుల సమావేశంలో డిఆర్‌ఎం ఆశిష్ అగర్వాల్, సిజిఎం మధుసూధన్‌రావు, చీఫ్ సెక్యూరిటి కమీషనర్ సంజయ్ సాంస్కృతియాన్, డిజిఎం డాక్టర్ బియస్ కిష్టపర్, సిపిఓ రమణరెడ్డి, స్టేషన్ సూపరింటెండెంట్ యస్‌ఏ మెరిట్ రైల్వేసిబ్బంది పాల్గొన్నారు.

ప్రయాణీకుల భద్రతకు ప్రాధాన్యం
* రైల్వే జిఎం వినోద్‌కుమార్ యాదవ్
మధిర, ఫిబ్రవరి 10: రైల్వే ప్రయాణీకుల రవాణ, భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు దక్షిణ మధ్యరైల్వే జనరల్ మెనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మధిర, ఖమ్మం రైల్వేస్టేషన్లను ఆయన ప్రత్యేక రైలులో వచ్చి పరిశీలించారు. ఈ సందర్భంగ మధిర రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైల్వేబడ్జెట్‌లో ప్రయాణీకుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. మధిరలో పలు మెయిన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళను ఆపాలని వినతులు వచ్చాయన్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్ళే మెయిన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళను ఒక స్టేషన్‌లో ఆపాలంటే 5నుండి 7నిమిషాలు పడుతుందని, దీని వలన ఆ ట్రైన్ ఆగే స్టేషన్ షెడ్యుల్‌తో పాటు ఆ లైన్‌పై నడిచే అన్ని రైళ్ళపై ఈ ప్రభావం పడుతుందన్నారు. మధిరలో ఎక్స్‌ప్రెస్ రైళ్ళ నిలుపుదలపై సాధ్య, సాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. రైల్వేగేటు వద్ద డ్రైనేజీ సమస్య లేకుండా ఉంటే ఫుట్ అండర్ రైల్వేబ్రిడ్జిని నిర్మిస్తామన్నారు. మధిర రైల్వే డి కేటగిరిలో ఉండటం వలన ఎలక్ట్రానిక్ కోచ్ డిస్‌ప్లేలు ఏర్పాటు సాధ్యపడదన్నారు. ఈ సందర్భంగా రైల్వేస్టేషన్ పక్కన ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ పార్కును ఆయన ప్రారంభించారు. నగర పంచాయతీ చైర్‌పర్సన్ మొండితోక నాగరాణి, కౌన్సిలర్లు వీరమాచినేని నాగసులోచన, తాండ్ర జ్యోతి, రైల్వే అధికారులతో కలసి హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. జిఎంకు ఘనస్వాగతం పలికారు. రైల్వేస్టేషన్‌కు చేరుకున్న రైల్వే జిఎంకు స్థానిక అధికారులు, ప్రయాణీకుల సంఘం, వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. సెయింట్ ఫ్రాన్సిస్ ఉన్నత పాఠశాల విద్యార్థులు బ్యాండ్ మేళాలతో ఆహ్వనించారు.

కేంద్రీయ విద్యాలయాల్లో ఇబ్బందులుంటే తెలియజేయండి
* విద్యాలయ నిర్వాహకులకు అదేశం
* ఎంపి పొంగులేటి
ఖమ్మం(గాంధీచౌక్), ఫిబ్రవరి 10: కేంద్రీయ విద్యాలయలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. ముఖ్యంగా నాణ్యమైన విద్యకు నిలయంగా పేరుగాంచిన కేంద్ర విద్యాలయంలో విద్యా బోధనతో పాటు అన్ని సదుపాయాలను కల్పించాలని అదేశించారు. శుక్రవారం కేంద్రీయ విద్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని ప్రతి తరగతి గదులను పరిశీలించి సదుపాయాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే టాయిలెట్లు పరిశుభ్రంగా ఉన్నాయలేదా అని పరిశీలించి దుర్గందం వెదజల్లుతుండటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే పాఠశాలలో ఉన్న సదుపాయాలు, అసౌకర్యాలను గురించి పిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా సెకండ్ షిప్ట్ ద్వారా విద్యాబోధన జరపాలని, తద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని సూచించారు. అందుకు కావల్సిన అనుమతుల విషయంలో తన సహాయ సహకరాలు అందిస్తానని హమీనిచ్చారు. అలాగే స్కూల్‌లో విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు. రెగ్యులర్ ఉపాధ్యాయుల నియామకానికి ప్రతిపాదనలు పంపాలని, తాను కూడ కేంద్రానికి విన్నవిస్తానని తెలిపారు. 6నెలల క్రితం తన నిధుల నుండి విడుదలయిన మినరల్‌వాటర్ ప్లాంట్ ఇప్పటి వరకు పూర్తి చేయకుండా అలసత్వం వహిస్తున్న వర్కర్లను వీలైనంత త్వరగా పని పూర్తి చేయాలని అదేశించారు. అలాగే రానున్న ఆర్థిక సంవత్సరంలో బైపాస్‌రోడ్డు నుండి పాఠశాల వరకు అంతర్గత రోడ్డును ఎంపి నిధులతో నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపాలని తన పిఎను అదేశించారు. ఎంపి వెంట కార్పొరేటర్లు దరావత్ రామ్మూర్తినాయక్, శే్వత, నాయకులు ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఆకుల మూర్తి, లింగాల కమలరాజు, పులిపాటి ప్రసాద్, వెంకటకృష్ణ, కీసర పద్మజారెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రాజెక్టులను పూర్తి చేసి ఇల్లందును సస్యశ్యామలం చేస్తా
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల
టేకులపల్లి, ఫిబ్రవరి 10: సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఇల్లందు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. టేకులపల్లి మండలంలో వివిధ అభివృద్ధి పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపనలు చేశారు. అనంతరం బోడు గ్రామ పంచాయతీలోని పారికలవాగు చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. అడవి లేకుండా అడవి బిడ్డలైన గిరిజనులు జీవించలేరని, మాయమాటలతోనో, తాత్కాలిక రాజకీయ లబ్ధి పొందడానికి మాటలు చెప్పే కొంతమంది రాజకీయ పార్టీల నేతల మాటలు నమ్మొద్దని, అడవితల్లి బతికి ఉంటేనే మనిషికి ఆరోగ్యం, వర్షాలు, పండ్లు, ఫలాలు సమకూరుస్తుందన్నారు. గిరిజన ప్రాంతాన్ని రహదారులు, తాగునీరు, సాగునీరుతో అభివృద్ధి చేయడానికి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటు మంత్రిగా తానూ బాధ్యత తీసుకుంటానన్నారు. రాష్ట్రంలో పేద పిల్లల కోసం ఒకేసారి 450 రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేశారన్నారు. ప్రతి గ్రామానికి అనుసంధానంగా రహదారుల కోసం ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు సూచించారు. రెండేళ్లలో రహదారుల నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, గోదావరి జలాలతో సాగునీరు ముందుగా టేకులపల్లి మండలానికి వస్తాయన్నారు. గతంలో ఆగిపోయిన పనులన్నింటికీ నిధులు సమకూర్చుకుని అభివృద్ధి చేసుకోడానికి ముఖ్యమంత్రి మంచి అవకాశాలు ఇస్తున్నందున మరింత అభివృద్ది జరుగుతుందన్నారు. ఫారెస్టు అనుమతులు లభించక 15 ఏళ్లుగా నిలిచిపోయిన పారికలవాగు చెరువుకు నీటిని మళ్లించే మొర్రేడు వాగుపై చెక్‌డ్యామ్, అక్కడ నుండి వచ్చే కాల్వ పనులు ఆగిపోయాయన్నారు. ప్రస్తుతం అనుమతులు లభించాయని, ఆ పనులు కూడా పూర్తి అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీచైర్‌పర్సన్ గాడిపల్లి కవిత, ఎంపిపి భూక్యా లక్ష్మి, జడ్పీటీసి లక్కినేని సురేందర్, సర్పంచ్‌లు పూనెం సురేందర్, అజ్మీర బుజ్జి, కుంజా వీరభద్రం, ఎంపిటిసిలు, అధికారులు పాల్గొన్నారు.
బియ్యం అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు

ఖమ్మం, ఫిబ్రవరి 10: జిల్లాలో బియ్యం అక్రమ రవాణాకు పాల్పడే వ్యక్తుల పట్ల ప్రత్యేక నిఘాపెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్ అన్నారు. టిటిడిసిలో శుక్రవారం జిల్లా ఎస్పీ షానవాజ్‌ఖాసీంతో కలిసి తహశీల్దార్లు, ఎండిఓలు, పోలీస్, ఎక్సైజ్ శాఖాధికారులతో నిర్వహించిన సమావేశంలో గుడుంబా నియంత్రణ, అక్రమబియ్యం రవాణా, హరితహారం, గుట్కానిషేధం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. బియ్యం రవాణాచేసే వారిపట్ల గట్టినిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా గుడుంబా విక్రయాలు జరగడానికి వీలులేకుండా గట్టి నిఘా ఏర్పాట్లు చేసి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. యువతను గుట్కా బారి నుండి రక్షించేందుకు విక్రయాలు పూర్తిస్థాయిలో నిషేధించి గుట్కా విక్రయించే దుకాణాలను సీజ్ చేయాలన్నారు. రెగ్యులర్‌గా కోల్డ్ స్టోరేజ్‌లను తనిఖీలు నిర్వహించి నివేదిక అందించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల పట్ల జరుగుతున్న సంఘటనలను పరిశీలించే విధంగా గ్రామాల్లో ఉన్న మహిళా వార్డుమెంబర్లు, సర్పంచ్‌లు, స్వయం సహాయక సంఘాలను భాగస్వాములను చేస్తూ షీటీం బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు పోలీస్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. హరితహారం కార్యక్రమం విజయవంతంగా చేపట్టేందుకు కార్యచరణ రూపొందించుకోవాలని అటవీశాఖాధికారులకు సూచించారు. 61వేల హెక్టార్లలో మొక్కలు నాటేలక్ష్యంగా స్థలాన్ని గుర్తించాలని, ఫారెస్టు ప్రాంతాల్లో ప్లాంటేషన్ నిర్వహించడానికి అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. ప్రతి మండలంలో మూడులక్షలకు తగ్గకుండా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని పంచాయతీల్లో డంపింగ్‌యార్డులు ఏర్పాటు చేయడంతో పాటు స్మశాన వాటికల స్థలాలను గుర్తించాలన్నారు. రాబోయే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుండే ప్రణాళికలు రూపొందించుకొని ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యాన్ని పూర్తిచేసేందుకు పనులు వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో జెసి వినయ్‌కృష్ణారెడ్డి, ఏఎస్పీ సాయికృష్ణా, జిల్లా ఫారెస్టు, ఎక్సైజ్, డిఆర్‌డిఏ శాఖాధికారులు పాల్గొన్నారు.

పోలీసులకు ఫైరింగ్‌పై శిక్షణ
ఖమ్మం(జమ్మిబండ), ఫిబ్రవరి 10: పోలీసు అధికారులకు ప్రతి ఏడాది నిర్వహించే ఆయుధాల ఫైరింగ్ శిక్షణలో భాగంగా రఘునాథపాలెం మండలం మంచుకొండలోని పోలీస్‌ఫైరింగ్ రేంజ్‌లో ఫైరింగ్ శిక్షణను ఖమ్మం పోలీస్ కమిషనర్ శుక్రవారం ప్రారంభించారు. జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న డిఏస్పీ, సిఐ, ఎస్‌ఐలకు ఫైరింగ్ శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ షాన్‌వాజ్‌ఖాసీం మాట్లాడుతూ ఆయుధ కారాగార నిపుణులైన సిబ్బందిచే తర్ఫీద్ ఇవ్వడంతో పాటు షార్ట్‌వెపన్ ఫైరింగ్ ప్రాక్టీస్‌లో పాల్గొంటారని పేర్కొన్నారు. మొదటి బెస్ట్ ఫైరర్‌గా ఆర్‌ఐ విజయబాబు, ద్వితీయ విజేతగా ఎంపిఒ నాగేశ్వరరావు, తృతీయ విజేతగా ఎర్రుపాలెం, రఘనాధపాలెం ఎస్‌ఐలు ఆంజనేయులు, గోపిలు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎఆర్‌డి డిఎస్పీ సంజీవ్, ఖమ్మం, వైరా డిఎస్పీలు సురేష్‌కుమార్, శ్రీ్ధర్‌రెడ్డి, సిఐలు సారంగపాణి, రహ్మన్, వెంకటనర్సయ్య, తిరుపతిరెడ్డి, నాగేంద్రచారి, వెంకన్నబాబు, రమేష్, శ్రీ్ధర్, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
టిడిపి గ్రామ కమిటీల ఎన్నిక
పెనుబల్లి, ఫిబ్రవరి 10: పెనుబల్లి మండలంలోని నాలుగు గ్రామ పంచాయతీలలో శుక్రవారం గ్రామ కమిటీలను ఎంపిక చేసినట్లు మండల టిడిపి నాయకులు మోరంపూడి బాబూరావు, అప్పారావులు తెలిపారు. పెనుబల్లి, కోండ్రుపాడు, కారాయిగుడెం, కెఎం బంజరు గ్రామాలలో గ్రామ కమిటీలు ఎంపిక చేసినట్లు వివరించారు. ఎన్నిక జరిగిన గ్రామాలలో అధ్యక్ష, కార్యదర్శులుగా వెలివల పుల్లయ్య, యలమర్తి మధు, నరసింహారావు, వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, సురేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ టిడిపికి పూర్వ వైభవం తెచ్చేందుకు గ్రామ కమిటీలు నడుంబిగించాలని కోరారు. త్వరలో మండలంలోని అన్ని గ్రామాలకు కమిటీలను ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆచంటి శ్రీనివాసరావు, రవి, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు..
రైల్వేస్టేషన్‌లో సమస్యలు పరిష్కరించాలి

* జిఎంకు వినతులు
ఖమ్మం(ఖిల్లా), ఫిబ్రవరి 10: ఖమ్మం రైల్వేస్టేషన్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసి నాయకులు రామయ్య డిమాండ్ చేశారు. దక్షిణమధ్య రైల్యే జనరల్ మేనేజర్ శుక్రవారం ఖమ్మం వచ్చిన ఆయన రైల్వేస్టేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా నూడెమోక్రసి నాయకులు కలసి వినతిపత్రం అందజేశారు. అనంతరం రామయ్య మాట్లాడుతూ ఖమ్మం మీదుగా వందల సంఖ్యలో పలు రైళ్ళు రాకపోకలు కొనసాగుతుండగా కొన్నింటిని మాత్రమే ఖమ్మంలో ఆపుతున్నారన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో వ్యాపార కూడలిగా ఉన్న ఖమ్మం స్టేషన్‌కు ఎంతో ప్రధాన్యత ఉందన్నారు. సంఘమిత్ర, లక్నో, యస్వంత్‌పూర్, కేరళ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లను ఖమ్మంలో నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. రైల్వేస్టేషన్‌లో ఎక్స్‌లేటర్లను ఏర్పాటు చేయాలని, ఫ్లాట్‌ఫారమంతా ప్రయాణికులకు నీడ కల్పించే విధంగా షెడ్లను నిర్మించాలన్నారు. అదే విదంగా విచారణ కేంద్రాన్ని మెరుగుపర్చాలని, రైల్వే స్టేషన్ ముందున్న ప్రభుత్వ మలేరియా ఆసుపత్రి స్థలాన్ని ఖమ్మం స్టేషన్ అవసరాలకు వినియోగించాలన్నారు. రైళ్ళల్లో సరఫరా చేస్తున్న తినుభండారాలలో నాణ్యత పాటించని వారిపై, స్టేషన్లలోఅధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందించిన వారిలో నాయకులు ఆవుల అశోక్, మంగతాయి, విప్లవ్‌కుమార్, జగన్ తదితరులు పాల్గొన్నారు.
మధిరలో...
మధిర: మధిర రైల్వేస్టేషన్‌ను పరిశీలించేందుకు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మెనేజర్ వినోద్‌కుమార్‌యదవ్‌కు మధిర రైల్వే స్టేషన్లో పలు ఎక్‌ప్రెస్ రైళ్ళను నిలుపుదల చేయడంతో పాటు సౌకర్యాలను కల్పించాలని వినతులు వెల్లువెత్తాయి. అహ్మదాబాద్ నుండి కోయంబత్తుర్ వెళ్ళే నవజీవన్ ఎక్స్‌ప్రెస్, చెన్నై నుండి లక్నో వెళ్ళే లక్నో ఎక్స్‌ప్రెస్, హౌరా నుండి హైదరాబాద్ వెళ్ళే హౌరాఎక్స్‌ప్రెస్, విశాఖ షిర్డీసాయినగర్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళను మధిరలో నిలుపుదల చేయాలని కోరారు. అదే విధంగ ప్లాట్‌ఫారం వెలుపల రైళ్ళ సమయాన్ని తెలిపే ఎలక్ట్రానిక్ బోర్డులను ఏర్పాటు చేయాలని, ప్లాట్‌ఫారంపై కోచ్ డిస్‌ప్లె బోర్డులను ఏర్పాటు చేయాలని, 2వ నెంబరు ప్లాట్‌ఫాంపై ఉన్న బుకింగ్ కౌంటర్ 24గంటలు పనిచేసేల చూడాలని, ఫుట్‌ఓవర్ బ్రిడ్జిపై రూప్‌షేట్ ఏర్పాటు చేయాలని, రైల్వేగేటు వద్ద అండర్ రైల్వేబ్రిడ్జిని నిర్మించాలని కోరుతూ వినతిపత్రాలను అందజేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో నగర పంచాయితీ చైర్‌పర్సన్ మొండితోక నాగరాణి, రైల్, బస్ ప్రయాణీకుల సంఘం నాయకులు, వివిధ రాజకీయపార్టీల నాయకులు మధిర ప్రెస్‌క్లబ్ పట్టణ ప్రముఖులు ఉన్నారు.
జిఎంను కలసిన ఎంపి, మార్కెట్ చైర్మన్
ఖమ్మం(గాంధీచౌక్): ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఖమ్మంకు వచ్చిన రైల్వే జిఎం వినోద్‌కుమార్‌ను ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మార్కెట్ చైర్మన్ ఆర్‌జెసి కృష్ణలు మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఖమ్మం రేల్వే స్టేషన్ అంశాలపై చర్చించారు. ప్రధాన వ్యాపార కూడలిగా ఉన్న ఖమ్మంలో ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న రైళ్ళు అన్ని అగటం లేదని, వ్యాపారాల దృష్ట్యా అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. ఖమ్మం నగరంలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా అందరికి అందుబాటులో ఉండే రైళ్ళను నిలిపేందుకు కృషి చేయాలన్నారు.

ఆరోగ్యానికి ప్రతీక యోగా
ఖమ్మం(జమ్మిబండ), ఫిబ్రవరి 10: ప్రజల్లో పెరుగుతున్న ఆరోగ్య చైతన్యాన్ని సిద్ధార్థ యోగా ఒలంపియాడ్ ప్రతిబింబిస్తున్నదని తెలంగాణ ఆయూష్ శాఖ కమిషనర్ రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మంలో శుక్రవారం ప్రారంభమైన యోగా ఒలంపియాడ్‌లో ఆయన మాట్లాడుతూ యోగాద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని, మెరుగైన సమాజం కోసం యోగా ఉపయోగపడుతుందన్నారు. అనేక రోగాలకు యోగాలో మెరుగైన చికిత్స ఉన్నదన్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు యోగాద్వారా తమ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటున్నార్నారు. ప్రకృతి వైద్యులు డాక్టర్ కెవై రాంచందర్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల స్థాయి యోగా ఒలంపియాడ్ ప్రకృతి జీవనాన్ని తెలియజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రకృతి జీవనం అధ్యక్షుడు బసవేశ్వరరావు, వివేకానంద సంస్థ అధ్యక్షులు శ్రీనివాసరావు, ప్రకృతి వైద్యులు డాక్టర్ పద్మ, ఆయూష్ రీజనల్ డైరెక్టర్ విజయ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్‌లోని అక్రమాలపై స్పందించిన మంత్రి హరీష్‌రావు
* నివేదిక పంపాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశం
ఖమ్మం(గాంధీచౌక్), ఫిబ్రవరి 10: గత కొన్ని రోజులుగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి, కందుల రైతులకు జరుగుతున్న అక్రమాలపై వివిధ పార్టీలు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలను తెలుసుకున్న రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు స్పందించారు. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్‌కు మార్కెట్‌లో జరుగుతున్న అక్రమాలపై పూర్తి నివేదిక అందించాలని అదేశించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి, రైతుల పంటలకు కనీసం గిట్టుబాటు ధర లభించటంలేదని, దళారి వ్యవస్థ, వ్యాపారుల దోపిడి అరికట్టాలని, పంటల కొనుగోలు విషయంలో దళారి వ్యవస్థను పెంచిపోషిస్తున్నారని, వారు జరిపే అక్రమాలు అధికారులకు తెలిసినప్పటికి ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంతో అందోళన చేపట్టారు. పండించిన పంటకు మద్దతు ధర కల్పించటంతో పాటు జెండాపాట, కాంటాల రూపంలో దోపిడిని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి హరీష్‌రావు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో జరుగుతున్న విషయాలపై, తీసుకోవల్సిన చర్యలపై సత్వరమే నివేదిక పంపాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

రాముడు, ప్రేక్షకులే తీర్పు ఇవ్వాలి
భద్రాచలం, ఫిబ్రవరి 10: ఓం నమో వేంకటేశాయ చిత్ర విజయంపై భద్రాద్రి రాముడు, ప్రేక్షకుల తీర్పే ప్రామాణికమని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరరావు అన్నారు. భద్రాద్రి రామయ్యను శుక్రవారం ఉదయం దర్శించుకుని పూజలు చేసిన అనంతరం చిత్రకూట మండపంలో ఆయన విలేఖర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. హీరో అక్కినేని నాగార్జున గురువారం రాత్రే ప్రీమియర్ షో ఏర్పాటు చేయగా మెగాస్టార్ చిరంజీవి, పివి సింధు తదితర ప్రముఖులు చూసి బాగుందని నాకు సెల్‌ఫోన్ల ద్వారా సందేశాలు పంపారని, నాగార్జున కూడా మంచి టాక్ ఉందని చెప్పడంతో చాలా సంతోషపడ్డానన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా విదేశాల్లో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉందన్నారు. నాకు తెలిసి ఈ సినిమా చూసిన ప్రేక్షకుల ఆనందంతో ప్రసుత్తం విశ్వమంతా గోవింద నామస్మరణతో మార్మోగిపోతుందన్నారు. తర్వాతి ప్రాజెక్టు గురించి విలేఖర్లు ప్రశ్నించినపుడు ఆయన స్పందిస్తూ ఆ వెంకన్నస్వామి ఎటు తోవ చూపితే అటే వెళ్తానని అన్నారు. ఇప్పటి వరకు నన్ను నడిపించేది ఆయనేనని, అన్నమయ్య విజయం సాధించినా, నేను తితిదే సభ్యునిగా నియమితుడినైనా అంతా స్వామిదేనన్నారు. నేటి నుంచి ఎస్వీబీసి చానెల్‌లో భక్తి చైతన్యం, భక్తుల అనుభవాలు, నేను నా స్వామి వంటి నూతన భక్తి కార్యక్రమాలు ప్రసారం అవుతాయన్నారు. భక్తులకు కూడా తెలియని ఎన్నో వెంకన్న సేవలు తెలుసుకోగల్గుతున్నారన్నారు. ఇటువంటి ఛానెల్ భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామికి కూడా ఒకటి ఉంటే మంచిదని రాఘవేంద్రరరావు అభిప్రాయపడ్డారు. ఈయన వెంట రచయిత భారవి, కొడాలి శ్రీనివాసన్, చావా లక్ష్మీనారాయణ, అజీం, చందూ, శ్రీనివాసరాజు, దేశప్ప తదితరులు ఉన్నారు.