ఖమ్మం

జిల్లా అభివృద్థికి బ్యాంకులు తోడ్పాటు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), ఏప్రిల్ 21: 2017-18 ఆర్థిక సంవత్సరానికి గానూ జిల్లాకు నాబార్డు ద్వారా నిర్దేశించిన లక్ష్యాలను బ్యాంకర్లు సాధించి జిల్లా అభివృద్థిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్ అన్నారు. నాబార్డు నిర్దేశించిన సంభావ్య లింక్ క్రెడిట్ ప్రణాళిక పుస్తకాన్ని శుక్రవారం టిటిడిసి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాబార్డు ద్వారా 2017-18 సంవత్సరానికి 3230కోట్లు రుణాలు అందించే వీలుందన్నారు. పంట రుణాల కింద 2428కోట్లు, పరిశ్రమలకు సంబంధించి 342కోట్లు, ఇతరు రుణాల కింద 459కోట్లు నాబార్డు ద్వారా రుణాలు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. నాబార్డు నిర్దేశించిన లక్ష్యాలను బ్యాంకర్లు సకాలంలో అందించాలని, రైతులకు పరిశ్రమలకు, ఇతర జీవనోపాధి పథకాలకు సంబంధించి రుణ లక్ష్యాలను వందశాతం సాధించి జిల్లాభివృద్థికి పాటుపడాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, లీడ్‌బ్యాంక్ మెనేజర్ ఎస్‌ఎస్‌ఆర్ శర్మ, నాబార్డు ఏజిఎం బి వెంకటేశ్వరరావు, డిఆర్వో శివశ్రీనివాస్, కార్పొరేషన్ కమిషనర్ బి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాల అమల్లో అధికారులే కీలకం
* జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్

ఖమ్మం, ఏప్రిల్ 21: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ అభివృద్థి పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో అధికారులదే కీలకబాధ్యత అని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ అన్నారు. 11వ సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం టిటిడిసి సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగ ప్రస్థానంలో నిరంతరం ఎదురవుతున్న సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొన్నప్పుడే విధి నిర్వహణలో విజయం సాధిస్తారన్నారు. అన్ని వర్గాల ప్రజలను అభివృద్థి దిశగా నడిపించడంలో సివిల్ సర్వీసెస్ అధికారులు క్రీయాశీలక బాధ్యత పోషించాలన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలన్నారు. ఆధునిక, శాస్త్ర సంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రతి అధికారి, ఉద్యోగి తమ నైపుణ్యతను పెంపొందించుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేసేందుకు అన్ని విభాగాల సిబ్బంది సహాయ సహకారాలు అవసరమని గుర్తించి అందుకు అనుగుణంగా సమన్వయంతో ముందుకు వెళ్ళాలన్నారు. బాధ్యత, నిబద్ధత, గౌరవ భావంతో ప్రతి ఉద్యోగి ఉండాలన్నారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సిబ్బందితో సమన్వయంతో మెలిగి జిల్లాను ప్రగతిపథంలో నడిపేందుకు సివిల్ సర్వీసెస్ అధికారులు నడుచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, డిఆర్వోలు శివశ్రీనివాస్, ఆర్డీఓ పూర్ణచందర్‌రావు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కొండల్‌రావు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

లింగ నిర్ధారణ చేస్తున్న డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఖమ్మం(మామిళ్ళగూడెం), ఏప్రిల్ 21: నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తున్న ఆసుపత్రులపై, అక్రమంగా లింగ నిర్ధారణ చేస్తున్న, భ్రూణ హత్యలకు పాల్పడుతున్న డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా కమిటీ అధ్యక్షురాలు మాచర్లపాటి కోరారు. ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భ్రూణ హత్యల విషయంలో డిఎంఅండ్‌హెచ్‌ఓ తన బృందంతో దాడులు చేసి ఆసుపత్రులను సీజ్ చేసిన విషయాన్ని వారు అభినందించారు. ఈ చర్యల వల్ల స్ర్తి, పురుష నిష్పత్తి తగ్గిపోతున్న నేపథ్యంలో వైద్యులు మానవత్వాన్ని మంటగలుపుతూ అబార్షన్ చేస్తున్నారన్నారు. తనిఖీలకు వెళ్ళిన వైద్యాధికారులపై బెధిరింపులకు పాల్పడ్డ వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఖమ్మంలో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వైద్యులు ఆసుపత్రుల యాజమాన్యాలపై చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు మెరుగు రమణ, అమరావతి, రమ్య, బేబి, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా గంగాదేవి విగ్రహప్రతిష్ట
* పోటెత్తిన భక్తులు
ఏన్కూరు, ఏప్రిల్ 21: మండల పరిదిలోని జన్నారం గ్రామంలో శుక్రవారం గంగాదేవి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకొని గత మూడు రోజులుగా ఆగ్రామంలో యాగశాలలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గంగాదేవి విగ్రహాన్ని ఊరేగింపు చేసి అమ్మవారికి బోనాలు సమర్పించారు. కోలాటబృందం సభ్యులు ఆలయ సమీపంలో కోలాటం చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మండలంలో ఎక్కడ లేని విదంగా గంగాదేవి విగ్రహ ప్రతిష్ట చేయటంతో తిలకించేందుకు అన్ని గ్రామాలు నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనటంతో భక్తులు పోటెత్తి ఆలయ ప్రాంగణం అంతా జాతరను తలపించే విదంగా మారిపోయింది. వచ్చిన భక్తులుకు అన్నదానం చేశారు. ఈకార్యక్రమంలో స్థలదాత నాగేశ్వరరావు, వర్థబోయిన నరసింహారావు, సర్పంచ్ దూద్య, సొసైటి చేర్మన్ స్వర్ణ నరేందర్, ఎంపిటిసి వెంకటేశ్వరరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.

* నున్నా నాగేశ్వరరావు
ఖమ్మం(కల్చరల్), ఏప్రిల్ 21: ఈ నెల 23, 24 తేదిల్లో జనగామ జిల్లా కేంద్రంలో జరుగు తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ప్రధమ మహాసభలను జయప్రదం చేయాలని రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నున్నా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం రైతుసంఘం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బండి రమేష్, ఉపాధ్యక్షుడు మామిళ్ళ సంజీవరెడ్డి, జిల్లా నాయకులు ఏలూరి రఘు, వంకాయలపాటి వెంకటేశ్వరరావులతో కలిసి రాష్ట్ర మహాసభల గోడ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నున్నా మాట్లాడుతూ ఏప్రిల్ 23న ఆదివారం సాయంత్రం 3 గంటలకు జనగామ రైల్వేస్టేషన్ నుండి రైతులతో భారీ ప్రదర్శన ప్రారంభవౌతుందని, 5 గంటలకు బస్టాండ్ సమీపంలోని ప్రెస్టన్ గ్రౌండ్‌లో పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ బహిరంగ సభలో అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యులు హన్నన్‌మొల్లా, జాతీయ నాయకులు విజ్జూ కృష్ణన్, సారంపల్లి మల్లారెడ్డి, రైతు జెఎసి చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. 24, 25 తేదిల్లో 6 వందల మంది రైతు ప్రతినిధులు పాల్గొనే ఈ మహాసభల్లో మిర్చి, ధాన్యం తదితర పంటలకు గిట్టుబాటు ధరలు, రైతు రుణమాఫీ, బ్యాంకు రుణాలు, కౌలు రైతుల సమస్యలు, 2013 భూసేకరణ చట్టం అమలు, సాగునీటి ప్రాజెక్టులు తదితర విషయాలపై చర్చలు, నిర్ణయాలు, తీర్మానాలు చేస్తామన్నారు. రైతుల ఆత్మహత్యలను నివారించడంలో, చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. 3 లక్షల వరకు వడ్డీలేని రుణాలు, విత్తనాలు ఎరువులు, పురుగు మందులు పూర్తి సబ్సీడీతో రైతులకు అందించాలని, 60 సంవత్సరాల వయస్సున్న రైతులందరికి 3 వేల రూపాయల చొప్పున పెన్షన్, రైతు కుటుంబాలకు ఉచిత ఆరోగ్య కార్డుల కోసం చేపట్టే ఉద్యమాలకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఖమ్మం జిల్లా నుండి అధిక సంఖ్యలో జనగామలో జరిగే తెలంగాణ రాష్ట్ర ప్రధమ మహాసభలకు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

డిసిసి కోసం పట్టు
* దిగ్విజయ్ ఎదుట నేతల వాదులాట
* వేర్వేరు పేర్లను సూచించిన రేణుక, భట్టి

ఖమ్మం, ఏప్రిల్ 21: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి కోసం ఆ పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్న సమయంలో కమిటీని నియమించిన నేతలు జిల్లాల విభజన తర్వాత జరిగిన తొలి సమావేశంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కొత్త అధ్యక్షులను ఎన్నుకునేందుకు నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో శుక్రవారం పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ దిగ్విజయ్‌సింగ్ పార్టీ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హాజరైన రేణుకాచౌదరి, భట్టి విక్రమార్క తదితరులు తమ అనుచరులకు పార్టీ పదవిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేణుకాచౌదరి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానానికి దిరిశాల భద్రయ్య, జువ్వాజి ఆనందరావు పేర్లను ప్రతిపాదించగా భట్టివిక్రమార్క పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ పేరును ప్రతిపాదించారు. కొత్తగూడెం జిల్లాకు రేణుకాచౌదరి యడవల్లి కృష్ణ పేరును సూచించగా భట్టివిక్రమార్క వనమా వెంకటేశ్వరరావు, వనమా రాఘవల పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
ఇటీవల ఖమ్మం జిల్లాలో దిగ్విజయ్‌సింగ్ పర్యటించిన సమయంలో ఆయన ఎదుటే నేతలు వాదులాడుకోవడం, కార్యకర్తలు గ్రూపులుగా విడిపోవడం తెలిసిందే. శుక్రవారం జరిగిన సమావేశంలో దీనిపై కూడా చర్చించినట్లు సమాచారం. కార్యకర్తలు పార్టీపట్ల నిబద్దతతో ఉన్నప్పటికీ నేతల మధ్య సమన్వయం లోపంతో వారు పార్టీకి దూరమవుతున్నారని, ఇది సరైంది కాదని హితవు పలికారు. అధికార పార్టీని అడ్డుకోవడంతో పాటు పార్టీ ప్రతిష్టతను ఇనుమడింపజేసే నేతనే జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని, దానిని జిల్లా నేతలంతా బలపర్చాలని దిగ్విజయ్‌సింగ్ సూచించినట్లు తెలిసింది.