ఖమ్మం

నగదు బదిలీ పథకంతో ప్రజా పంపిణీ వ్యవస్థకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, అక్టోబర్ 22: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించే సబ్సిడీ బియ్యం పంపిణీని ప్రభుత్వం నిలిపివేసే ప్రయత్నం చేస్తోంది. సబ్సిడీ ద్వారా అందించే బియ్యం బదులు నగదు బదిలీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. బియ్యం పంపిణీపై ముఖ్యమంత్రి కెసిఆర్ హైద్రాబాద్‌లో సమీక్ష నిర్వహించటంతో నగదు బదిలీ పథకం ఖాయం అవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. బియ్యం పంపిణీ నిలిపివేసి నగదు బదిలీ ప్రవేశపెడితే జిల్లాలో 442 రేషన్ షాపులు మూతపడే ప్రమాదం ఉంది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో యుపిఎ ప్రభుత్వం నాలుగేళ్ల క్రితమే ఆహార భద్రత చట్టం ద్వారా సబ్సిడీ రూపంలో ఇవ్వడం కన్నా నగదు రూపంలో ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం త్వరలో కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే సమగ్ర సర్వే ద్వారా ఉన్న రేషన్ కార్డుల వివరాల సమాచారాన్ని ప్రభుత్వం సేకరించింది. రేషన్ బియ్యాన్ని రద్దు చేయటం వలన ప్రజా పంపిణీ వ్యవస్థ మూలనపడే అవకాశాలున్నాయి. దీని ప్రభావం సామాన్య ప్రజలపై తీవ్రంగా చూపే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 23 మండలాల్లో 442 రేషన్ షాపుల ద్వారా 2,57,523 రేషన్ కార్డుల ద్వారా 8,17,280 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఆరు కేజీల బియ్యాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. ఇప్పటికే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇచ్చే సరుకులను పెంచాలంటూ రేషన్ డీలర్లు ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టడం వలన రేషన్ షాపు డీలర్లు ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం పక్కదారి పడుతున్నాయనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ తీసుకోనున్న నిర్ణయం ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బానిస సంకెళ్ల నుంచి విముక్తికి మహిళలు ఉద్యమించాలి
* మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి
* మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి * పివోడబ్ల్యూ రాష్ట్ర మహాసభలో వక్తలు
కొత్తగూడెం రూరల్, అక్టోబర్ 22: సమాజంలోని ఆచారాలు, కట్టుబాట్లు, పురుషాధిక్యత పేరుతో మహిళలను అంగడి బొమ్మలుగా మారుస్తున్నారని, బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొందేందుకు మహిళలు ఉద్యమించాలని వక్తలు పిలుపునిచ్చారు. ఆదివారం ఉర్దూఘర్‌లో జరిగిన పివోడబ్ల్యూ తెలంగాణ రెండో రాష్ట్ర మహాసభలో జాతీయ హక్కుల కార్యకర్త బేలా భాటియా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మహాసభ జరుపుకుంటున్న మహిళా ప్రతినిధులకు విప్లవ అభినందనలు తెలిపారు. 70 ఏళ్ల స్వాతంత్య్ర కాలం నుంచి నేటి వరకు మహిళల పరిస్థితుల్లో మార్పులు రాకపోవటం పాలకుల పనితీరుకు నిదర్శనమని అన్నారు. సమాన హక్కుల కోసం, మహిళలపై జరుగుతున్న దాడుల నిర్మూలన కోసం, మహిళా రిజర్వేషన్ల కోసం, ప్రగతిశీల మహిళలు ఉద్యమించాలన్నారు. దేశంలో రోజురోజుకు స్ర్తిలపై దాడులు, అత్యాచారాలు పెరుగుతున్నప్పటికీ పాలక ప్రభుత్వాలు చర్యలు ప్రారంభించకపోవటం దారుణమని అన్నారు. గృహ హింస, వరకట్న వేధింపులు, ఈవ్ టీజింగ్‌కు విద్యార్థినులు, మహిళలు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా చోటు లేకపోవటం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మహిళలపై ఉన్న ప్రేమను తెలుపుతుందన్నారు. ఇప్పటికైనా పాలక ప్రభుత్వాలు మహిళా చట్టాలను పకడ్బందీగా అమలుచేసి మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అక్టోబర్ విప్లవం, ప్రభావం అనే అంశంపై పివోడబ్ల్యూ జాతీయ కమిటీ సభ్యురాలు రమా సుందరి మాట్లాడుతూ అక్టోబర్ విప్లవంలో మహిళలు పోషించిన పాత్రను వివరించారు. మహిళల్లో చైతన్యం రావటానికి అక్టోబర్ విప్లవం నాంది పలికిందని తెలిపారు. సమానత్వ హక్కుకై మహిళలు రాజీ లేని పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ప్రగతిశీల మహిళలు ఉద్యమాలు నిర్వహించాలన్నారు. పివోడబ్ల్యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య అధ్యక్షతన జరిగిన మహాసభల్లో సింరగేణి కళాశాల ప్రిన్సిపాల్ స్వర్ణ ప్రారంభోపన్యాసం చేయగా పివోడబ్ల్యూ ఎపి ప్రధాన కార్యదర్శి పద్మ, న్యూ డెమొక్రసీ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ ప్రసంగించారు. ఈ మహాసభల్లో పివోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి అనసూర్య, నాయకురాళ్లు విజయ, భద్రమ్మ, పద్మ, నిర్మల, రాములమ్మ, గీత, సుగుణ, కళావతి, బాయమ్మ, మంజుల, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అక్కడ ప్రైవేటు వ్యాపారులదే హవా
* అడిగే వారు లేరు... పట్టించుకునే వారు అసలే లేరు.

ఖమ్మం, అక్టోబర్ 22: తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద మార్కెట్‌గా పేరొందిన ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ప్రైవేటు వ్యాపారులకు అడ్డాగా మారింది. మార్కెట్ కమిటీ పాలకవర్గం పదవీ కాలం ముగియడం, పత్తి కొనుగోలుకు వచ్చిన సిసిఐ తేమ పేరుతో కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారుల ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. పత్తి విపరీతంగా మార్కెట్‌కు వస్తున్న నేపథ్యంలో ప్రైవేటు వ్యాపారస్తులు అతి తక్కువ ధరకు తమ ఇష్టానుసారం కొనుగోలు చేస్తున్నారు. రైతులకు, వ్యాపారులకు మధ్య అనుసంధానంగా ఉండాల్సిన పాలకవర్గం లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఖమ్మం మార్కెట్‌కు ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, కృష్ణాజిల్లాల నుండి పత్తి వస్తున్నది. ఖమ్మం మార్కెట్‌లో ఇనామ్ అమలు చేయాల్సి ఉన్నా అది చేయకపోవడం, మార్కెట్‌కు వచ్చే పత్తిరైతును వ్యాపారులే తమ కనుసన్నల్లో పత్తి అమ్ముకునేలా చేయడం గమనార్హం. మార్కెట్ అధికారులు ఆ ప్రాంతంలోనే పరిశీలన జరుపుతున్నా దీనిపై పట్టించుకోకపోవడం గమనార్హం. మార్కెట్ కమిటీ ఉన్నప్పుడు నిత్యం అక్కడికి వెళ్ళి ఆందోళనలు చేస్తూ రైతులకు అండగా ఉండే రైతుసంఘాలు మార్కెట్‌వైపు చూడటమే మానేశాయి. అలాగే కొందరు వ్యాపారులు తాము చెప్పిన రేటుకే పత్తి కొనుగోలు జరిగేలా ఇతర వ్యాపారులను కూడా నియంత్రిస్తున్నారని తెలుస్తోంది. దీనిపై మార్కెటింగ్ శాఖాధికారులు, మార్కెట్ అధికారులు కనీస స్థాయిలో కూడా స్పందించకపోవడం గమనార్హం. అయితే పాలకవర్గం లేకపోవడం వల్లే కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని రైతులు చెబుతుండగా ప్రభుత్వం మాత్రం ఖమ్మం మార్కెట్ చైర్‌పర్సన్ ఆర్‌జెసి కృష్ణ ఆధ్వర్యంలోని కమిటీకి పొడిగింపు ఇవ్వలేదు. జిల్లాలోని మరికొన్ని మార్కెట్ కమిటీల పదవీకాలం పొడిగించినా ఖమ్మం మార్కెట్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. మార్కెట్‌కు పంట ఉత్పత్తులు అధికంగా వస్తున్న నేపథ్యంలో కమిటీని వెంటనే వెయ్యకపోతే ఇబ్బందులని, కనీసం ఉన్నతాధికారుల పర్యవేక్షణ అయినా ఉండాలని రైతులు కోరుతున్నారు.

జోనల్ వ్యవస్థను పటిష్ఠపరచాలి
* టిఎన్‌జిఓ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి
ఖమ్మం(ఖిల్లా), అక్టోబర్ 22: సెక్రటరీ ఉద్యోగుల నుండి అన్ని విభాగాల ఉద్యోగులను జోనల్ వ్యవస్థలోకి తీసుకువచ్చి ఆ వ్యవస్థను పటిష్ఠపరచాలని టిఎన్‌జిఓ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కారం రవీందర్‌రెడ్డి, మామిళ్ళ రాజేందర్‌లు అన్నారు. స్థానిక టిఎన్‌జిఓ ఫంక్షన్‌హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు సమైఖ్య రాష్ట్రంలో జరిగిన నష్టాలను పూడ్చివేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జోనల్ వ్యవస్థను పున:పరిశీలించడం అభినందనీయమని, అందరికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. స్థానికులకు 60శాతం, స్థానికేతరులకు 40శాతం ఉన్న ఉద్యోగ అవకాశాలను మెరుగు పరచి స్థానికులకే 90శాతం ఉద్యోగ అవకాశాలు దక్కేందుకు కృషి చేయాలన్నారు. ఏలాంటి జాప్యం చేయకుండ పిఆర్‌సిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగా ఏర్పడి జిల్లాల్లో ఉద్యోగులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆర్డర్‌టుసర్వ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు శాస్వత కేటాయింపు జరగాలన్నారు. ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెంటనే రాష్ట్రానికి రప్పించే చర్యలు తీసుకోవాలన్నారు. స్పౌస్ విధానాన్ని ఎక్కడ అమలు చేయడం లేదని, జిఓ వచ్చి ఆరు నెలలు అవుతున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పోరాడుతామని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 9న నిర్వహించనున్న ఛలో పార్లమెంట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విలేఖరుల సమావేశాలో యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి. రాజారాం, వేల్పుల విజేత, నాయకులు వల్లోజి శ్రీనివాసరావు, వివి సాగర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రకృతి పరిహాసం.. మార్కెట్‌లో ధర పతనం
* క్వింటా పత్తిరూ.2వేలకు తక్కువగా కొనుగోళ్లు
జూలూరుపాడు, అక్టోబర్ 22: ప్రకృతి పరిహాసానికి పత్తి రైతు మరోసారి బిక్కమొఖం వేస్తున్నాడు. ఎన్నో ఆశలతో ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చే దశలో వాతావరణం అనుకూలించక తెగుళ్లు వ్యాప్తి అధికమైంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాభావం కారణంగా ఎర్రరేగడి భూముల్లో పంట దెబ్బతిన్నది. తెగుళ్ల కారణంగా పత్తి చేలల్లో కాయలు నల్లబారటంతోపాటు, చెట్లు కూడా పలుచోట్ల ఎండి పోతున్నాయి. మండలంలో అత్యధిక విస్తీర్ణంలో 19వేల ఎకరాలకు పైగా పత్తి పంటను రైతులు సాగు చేశారు. పంట చేతికొచ్చే దశలో ప్రకృతి కరుణించకపోగా, మరోవైపు తొలిదశలో చేతికొచ్చిన కొద్దిపాటి పత్తిని అమ్ముకునేందుకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం క్వింటా పత్తికి రూ.4వేలు మద్దతు ధర ప్రకటించినా, మండలంలో కొనుగోళ్లు మాత్రం క్వింటా పత్తి రూ.1 నుంచి 2వేలలోపు మాత్రమే లభిస్తుంది. రైతులు అప్పులుచేసి మరీ పెట్టుబడులు పెట్టి పత్తిని సాగు చేయటంతో చేతికొచ్చిన పంటను ఎప్పటికప్పుడు అమ్ముకునేందుకు రైతులు ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం అధికారికంగా కొనుగోళ్ళను ప్రారంభించటానికి ముందుగానే మండలంలో ఎక్కడబడితే అక్కడ నిబంధనలకు విరుద్దంగా కొందరు వ్యాపారులు పత్తిని కొనుగోలు చేస్తున్నారు. పత్తికి నాణ్యత తక్కువ అనే పేరుతో తక్కువ ధర కొనుగోలు చేస్తుండటంతో నష్టపోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ఏన్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో గత కొనే్నళ్లుగా మండల కేంద్రంలో తాత్కాలిక యార్డు ద్వారా పత్తిని కొనుగోళ్లు జరుపుతున్నారు. ఈ ఏడాది ఒంటి గుడిశ క్రాస్ రోడ్డు సమీపంలో నూతనంగా నిర్మించిన మార్కెట్ గోదాము ప్రాంతంలో కొనుగోళ్లు జరుపనున్నట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి నిర్మల ప్రకటించారు. ఇంతే కాకుండా అనుమతి పొందిన వ్యాపారులు మాత్రమే పత్తి కొనుగోళ్లు చేయాలని సూచించారు. అధికారుల ఆదేశాలను పక్కనపెట్టిన కొందరు వ్యాపారులు ఇష్టారాజ్యంగా పత్తి కొనుగోళ్లు చేస్తుండటంతో నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పత్తి కొనుగోళ్లలో నిబంధనలు కచ్చితంగా పాటించే విధంగా రెవిన్యూ, మార్కెట్ కమిటీ, సంబంధితశాఖలకు చెందిన అధికారులు తగు చర్యలు తీసుకుని, న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

నవంబర్ 9,10 తేదీల్లో బాలోత్సవ్
ఖమ్మం(జమ్మిబండ), అక్టోబర్ 22: నవంబర్ 9,10 తేదీల్లో ఖమ్మం నగరంలో బాలోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్థానిక భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థిని, విద్యార్థులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా బాలోత్సవ్ పోస్టర్‌ను స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడుతూ పిల్లల్లోని నైపుణ్యతను వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొనేలా చూడాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కమర్తపు మురళీ, నాగరాజు, నిర్వాహకులు సైదులు, రాజేష్, లారెన్స్, భవాని శంకర్, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి కరాటే పోటీలు ప్రారంభం
పెనుబల్లి, అక్టోబర్ 22: టైగర్ కరాటే స్కూల్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కరాటే పోటీలను ఆదివారం ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విఎం బంజరలో ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కరాటే పోటీలలో హాజరైన ఒరిస్సా, తమిళనాడు, కేరళ, బిహార్ తదితర రాష్ట్రాల నుండి అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ కరాటే వల్ల ఆత్మరక్షణతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. కరాటే విద్యను అభ్యసించిన వారు అన్ని సమయాలలో విద్యను ప్రదర్శించకుండా అవసరమైనప్పుడే ప్రతిభను చూపాలని తెలిపారు. కార్యక్రమంలో కరాటే స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీకాంత్, ఎంపిటిసి కోటగిరి సుధాకర్, శ్రీనివాస్‌రెడ్డి, మోహన్‌రావు, బేబి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

రాష్టస్థాయి యోగాపోటీలకు ఎంపికైన విద్యార్థినులు
కొణిజర్ల, అక్టోబర్ 22: రాష్టస్రాయి యోగాపోటీలకు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపిక అయినట్లు పాఠశాల పిడి దొండపాటి శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21 నుంచి 23 వరకు సిద్దిపేటలో అరవ రాష్టస్థాయి యోగా చాంపియన్ షిఫ్-2017 పోటీలు సిద్దిపేటలో జరుగనున్నాయి. యు-10, యు-17 పోటీలకు పదవ తరగతి చదువుతున్న బి ప్రశాంతి, 9వ, తరగతి చదువుతున్న రామలక్ష్మి, 8వ తరగతి చదువుతున్న ఎం సింధూ, త్రివేణి, బి స్వాతి, డి ఉమామహేశ్వరి ఎంపికైయ్యారని తెలిపారు. విద్యార్థినిలను ప్రధానోపాధ్యాయుడు దామాల పుల్లయ్య అభినందించారు.

శ్రీ భక్తరామదాసు మందిరాన్ని సందర్శించిన శ్రీ మాధవానంద సరస్వతి స్వామిజీ
నేలకొండపల్లి, అక్టోబర్ 22 : నేలకొండపల్లిలో శ్రీ్భక్తరామదాసు ధ్యాన మందిరాన్ని ఆదివారం శ్రీ మాధవానంద సరస్వతిస్వామిజీ సందర్శించారు. సిద్ధిపేట జిల్లాలోని తొగుట్టకు చెందిన శ్రీ మాధవానంద సరస్వతి పీఠంకు చెందిన స్వామి నేలకొండపల్లిలోని ఉత్తరేశ్వర స్వామి దేవాలయంను, భక్తరామదాసు మందిరంను సందర్శించారు. స్వామిజీకి భక్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ 108 చండీయాగం హోమాలు చేయాలని లక్ష్యంగా చేపట్టినట్లు తెలిపారు. శ్రీరాముడు, భక్తరామదాసుకు మధ్య గల భక్తి పూర్వక అనుబంధాన్ని గురించి ప్రవచనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వంగవేటి నాగేశ్వరరావు, ఉపసర్పంచ్ రాజపుత్ర శ్రీనివాససింగ్, సామల కోటేశ్వరరావు, శ్రీ ఉత్తరేశ్వర స్వామి దేవాలయ కమిటి చైర్మన్ పెండ్యాల గొపాలకృష్ణమూర్తి, భక్తరామదాసు విధ్వత్ కళాపీఠం అధ్యక్షుడు సాధు రాధాకృష్ణమూర్తి, సుధాకర్‌రావు, తాటిపల్లి వెంకటేశ్వర్లు, రాయపూడి నాగేశ్వరరావు, రాజపుత్ర సత్యనారాయణ, కనమర్లపూడి నాగేశ్వరరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

వంచనకు గురిచేస్తున్న ప్రభుత్వ విధానాలు
* సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నున్నా నాగేశ్వరరావు
ఖమ్మం(కల్చరల్), అక్టోబర్ 22: నేటి పాలకులు, ప్రభుత్వ విధానాలు ప్రజలను వంచనకు గురిచేస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నున్నా నాగేశ్వరరావు ఆరోపించారు. ఆదివారం నగరంలోని 2, 3 డివిజన్ల సిపిఎం శాఖ మహాసభ పాండురంగాపురంలో జరిగింది. ముందుగా పార్టీ జెండాను రావుల నాగమ్మ ఎగరవేశారు. ఈ సందర్భంగా నున్నా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వాస్తు పిచ్చి పట్టి ప్రజాధనాన్ని వృధాచేస్తూ కొత్త భవనాలను నిర్మిస్తున్నాడని ఆరోపించారు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయాలను మార్చాలనుకోవడం దురదృష్టకరమన్నారు. ఖమ్మం కలెక్టరేట్ తరలింపు విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్ధానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌లు దోబూచులాడుతున్నారని, ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారన్నారు. ఖమ్మం కలెక్టరేట్‌ను యధావిధిగా కొనసాగించాలని, లేనిపక్షంలోపోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు. కలెక్టరేట్ తరలింపుకు నిరసనగా ఈనెల 30న జిల్లా బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు. కలెక్టరేట్ యదావిధిగా ఉంటుందని ప్రెస్‌మీట్ పెట్టి ప్రకటించిన ఎమ్మెల్యే, నేడు ఆ విషయమై వౌనంగా ఉండడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ మహాసభలో సిపిఎం జిల్లా నాయకులు కె నర్సయ్య, పార్టీ మండల కార్యదర్శి ఎస్‌కె మీరాసాహెబ్, గార్లపాటి బాలాజీరావు, ఎం నాగమణి, బత్తిని ఉపేందర్, తీగల వెంకటేశ్వర్లు, బొడ్డు పద్మ, గద్దల పెంటయ్య, అంకిరెడ్డి, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

కల్లుగీత వృత్తిరక్షణకు 5వేల కోట్లు కేటాయించాలి
ఖమ్మం(కల్చరల్), అక్టోబర్ 22: కల్లుగీత వృత్తిదార్ల సంక్షేమానికి బడ్జెట్‌లో 5 వేల కోట్టు కేటాయించాలని టికెజికెఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోటపోతుల వెంకటరమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్ధానిక మంచికంటిభవన్‌లో తెలంగాణ కల్లుగీత కార్మికసంఘం ఖమ్మం జిల్లా 2వ మహాసభ జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిధిగా హాజరైన రమణ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కోసం కల్లుగీత కార్మికులు అనేక రూపాల్లో ఉద్యమాలు చేపట్టారని గుర్తుచేశారు. కాని పాలకులు కల్లుగీత కార్మికుల కోసం చేసింది ఏమిలేదన్నారు. వృత్తి రోజు రోజుకు దెబ్బతింటున్న తరుణంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం మరిన్ని మద్యం దుకాణాలను తెరచి కల్లుగీత కార్మికులను నిలువు ముంచారని ఆరోపించారు. తరాలుగా ప్రభుత్వాలకు పన్నులు చెల్లించి, ప్రమాదకరమైన వృత్తిని చేస్తున్నప్పటికిని పాలకులు ఆదరించకపోవడం దారుణమన్నారు. వృత్తిరక్షణకు సొసైటీలకు శాశ్వత లైసెన్స్‌లు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏజన్సీల్లో కల్లుగీత వృత్తిని పునరుద్ధరించాలన్నారు. చెట్ల పెంపకానికి సొసైటీకి 10 ఎకరాల భూమిని కేటాయించాలని, 50 సంవత్సరాలు నిండిన వృత్తిదారులకు సామాజిక పెన్షన్‌తో పాటు అదనంగా 3వేలు ఇవ్వాలన్నారు. వృత్తిలో చెట్టుపై నుండి పడి చనిపోయినా, శాస్వత అంగవైకల్యం కలిగినా వృత్తిదారుని కుటుంబానికి 10 లక్షల ఎక్స్‌గ్రేసియా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పైన, అలాగే అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఎక్‌గ్రేషియాలను వెంటనే విడుదల చేయాలన్నారు. మద్యనిషేదాన్ని అమలు చేస్తూ, కేరళ తరహాలో కల్లు విధానాన్ని తెలంగాణ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు మెరుగు సత్యనారాయణ, సిహెచ్ కృష్ణముర్తి, చలమల విఠల్‌రావు, మందా సైదులు, గండు సైదులు, గునిగంటి లక్ష్మినారాయణ, పి హుస్సేన్, నాయుడు చందర్‌రావు, వృత్తిసంఘాల కన్వీనర్ బి మల్సూర్, టీమాస్ జిల్లా కన్వీనర్ యర్రా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.