ఖమ్మం

రసరమ్యంగ సీతారాముల పరిణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఏప్రిల్ 15: జగదభిరాముడు...రఘుకుల సోముడు..శ్రీరామచంద్రుడు..కల్యాణరాముడుగా మారి...సౌందర్యరాశి...సుగుణాల సీతమ్మను అభిజిత్ లగ్నంలో పరిణయమాడాడు. నునుసిగ్గుల మొలకైన సీతమ్మకు నొసటన కల్యాణబొట్టు, బుగ్గన కాసింత దిష్టిచుక్కను పెట్టి..రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన పట్టు వస్త్రాలను అలంకరింప చేశారు. దీంతో అసలే సుగుణాల రాశి జనకుని కూతురు సీతమ్మ మరింత అందంగా కన్పించింది. ఆమెకు ఏ మాత్రం తీసిపోని విధంగా రఘువంశోత్తముడు...దశరథరాజు తనయుడు...రామచంద్రుడు చూపరులను ఆకట్టుకునేలా సర్వాభరణ భూషితుడై కల్యాణ వేదిక మిథిలాపురికి తన పరివారంతో చేరుకున్నాడు. భక్తరామదాసు చేయించిన పచ్చల పతకం, చింతాకుపతకం, కలికితురాయి, రామమాడ వగైరా ఆభరణాలను ఆ వధువరులకు అలంకరించడంతో మరింత అందాన్నిచ్చాయి. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు నడుమ...ఆలయ అర్చకులు నయనానందకరంగా జగదభిరాముని కల్యాణాన్ని శుక్రవారం నిర్వహించారు. మండే ఎండలను సైతం లెక్కచేయకుండా భద్రాద్రి చేరుకున్న భక్తులకు రామయ్య తన చలువ పందిళ్లలో చోటిచ్చి భక్తుల సమక్షంలోనే పెళ్లి కుమారుడయ్యాడు. మంగళవాయిద్యాలు మారుమ్రోగుతుండగా..మంత్రశోప్నల మధ్య అభిజిత్ లగ్నం ప్రవేశించగానే మిథిలాపురి కల్యాణ మండపంలోని రజిత సింహాసనంపై కొలువైన సీతారాములపై జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. మూడు మంగళసూత్రాలతో భక్తరామదాసు చేయించిన మంగళ పతకాన్ని కలిపి వేదపండితులు మాంగల్యధారణ చేశారు. ముత్యాల తలంబ్రాలు సీతారాముల శిరస్సుల నుంచి జల్లులా పడుతుంటే భక్తులంతా ఆ సమయంలో ఒళ్లంతా కళ్లు చేసుకుని చూశారు.

కల్యాణ వైభోగం జరిగిందిలా....
తెల్లవారుఝామున 2 గంటల సమయంలో దేవాలయం తలుపులు తెరిచారు. సుప్రభాత సేవ, తిరువారాధన, ఆరగింపు,శాత్తుమురై, మంగళాశాసనాలు నిర్వహించారు. అనంతరం మూలవరులకు అభిషేకం చేశారు. ఉదయం 8 గంటలకు రామాలయంలో ధృవమూర్తులకు కల్యాణం జరిపారు. కల్యాణమూర్తులను అలంకరించారు. ఆ తర్వాత దేవాలయం నుంచి పూలపల్లకీలో భక్తుల కోలాహాల మధ్య, భక్తకోటి రామనామం జపిస్తుండగా మంగళవాయిద్యాలు మ్రోగుతుండగా ఊరేగింపుగా శిల్పకళాశోభితమైన మిథిలాపురంలోని కల్యాణ మండపానికి వారిని తీసుకొచ్చారు. స్వామి సెక్టార్లోకి ప్రవేశించగానే భక్తులంతా లేచి నీరాజనాలు పలికారు. అది మొదలు జగత్కల్యాణానికి తెరలేచింది. వేదపండితులు మంత్రపూజలతో పరిణయానికి వినియోగించే సకల వస్తు సామాగ్రికి ప్రోక్షణ చేశారు. ఒక దర్బతాడును సీతమ్మ నడుముకు బిగించారు. రామయ్య కుడిచేతికి, సీతమ్మ ఎడమ చేతికి రక్షాసూత్రాలు కట్టారు. కన్యాదానం, అనంతరం ఇరువంశాల గోత్రాలను మూడుసార్లు చదివారు. ఒక్క సీతారాములకే కాక కల్యాణాన్ని తిలకించే భక్తులందరికీ వర్తింపచేసేలా అర్చకులు మంగళాష్టకాలు పఠించారు. అభిజిల్లగ్నం ప్రవేశించగానే సీతారాముల శిరస్సుపై జీలక్రర బెల్లం పెట్టారు. గౌరీదేవిని, సరస్వతిని,శ్రీమహాలక్ష్మీ అమ్మవార్లను ఆవాహన చేసిన మంగళసూత్రాలతో భక్తరామదాసు చేయించిన మంగళపతకాన్ని కలిపి మాంగల్యధారణ కార్యక్రమం పూర్తి చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ముత్యాల తలంబ్రాలు సీతారాముల శిరస్సుపై పోస్తూ వాటి విశిష్టతను వివరించారు. బ్రహ్మముడి వేసి అర్చకస్వాములు బంతులాటాడి, కర్పూర నీరాజనం సమర్పించి కల్యాణ క్రతువును ముగించారు. దీన్ని వారనాయనం అంటారు. దీన్ని తిలకించిన భక్తులకు సద్బుద్ధి కల్గిన సంతానం కల్గుతుందని ప్రతీక. రాష్టమ్రుఖ్యమంత్రి కెసీఆర్ దంపతులు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిలు ప్రభుత్వం తరుపును పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. చినజీయర్ స్వామి, టీటీడీ తరుపున ఈఓ సాంబశివరావు, డాలర్ శేషాద్రి, శృంగేరీ పీఠం తరుపున నేండ్రగంటి కృష్ణమోహన్, గణపతి సచ్చిదానంద స్వామి తరుపున పట్టు వస్త్రాలు స్వామికి సమర్పించారు.

ప్రముఖుల తాకిడి
సీతారాముల కల్యాణానికి పలువురు ప్రముఖులు తరలివచ్చారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఢిల్లీలో అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, పల్లంటి రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు రాజయ్య, మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, జలగం వెంకట్రావు, ఎంపీలు సీతారాంనాయక్, బాల్క సుమన్, జెడ్పీ ఛైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి, ఆధ్యాత్మిక వేత్త దైవజ్ఞశర్మ తదితరులు కల్యాణం వీక్షించారు.