ఖమ్మం

‘ఆకర్షణ’లో పడి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, నవంబర్ 21: అధికార టీఆర్‌ఎస్ పార్టీ దెబ్బకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటు సైకిల్.. ఇటు హస్తం.. మరోవైపు వామపక్ష పార్టీలు మటాష్ అయిపోతున్నాయి. తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్ పార్టీ అక్కడితో ఆగిపోకుండా.. పార్టీని మరింత దృఢపరిచేందుకు పావులు కదుపుతోంది. అందుకోసం ‘ఆపరేషన్ ఆకర్ష్’ పేరిట శ్రీకారం చుట్టింది. తమ పార్టీలో ఎంతమంది చేరినా పుష్పక విమానంలో లాగా మరొకరికి చోటు ఉంటుందంటూ అన్ని పార్టీల నాయకులను పిలిచి మరీ పార్టీలో చేర్చుకుంటూ ముందుకెళుతోంది. దాంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట, ఇల్లందు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో వలస నేతలను పెద్దఎత్తున ఆకర్షించింది. ముఖ్యంగా ఒక్కొక్క మండలాన్ని లక్ష్యంగా చేసుకుంటూ అధికార పార్టీ దూసుకుపోతోంది. కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో గులాబీ జోరు రోజురోజుకు మరింత పెరుగుతోంది. అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన దుమ్ముగూడెం మండలంలో వివిధ పార్టీలకు చెందిన వేలాదిమందిని పార్టీలో చేర్చుకొని చేరికలకు అవకాశం కల్పించిన టీఆర్‌ఎస్ రోజుకో వందమంది చొప్పున పార్టీలోకి వలసలను ప్రోత్సహిస్తూ తమ బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. భద్రాచలం పట్టణంలోనూ తెరాస ఎత్తుకు పైఎత్తులు వేస్తూ తెదేపా తరఫున గెలిచిన సర్పంచ్‌ని ముందుగా టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంది. అక్కడితో ఆగకుండా తమ జోరును ప్రతి మండలంలో కొనసాగిస్తూ ముందుకెళ్తోంది. అధికార పార్టీ వ్యూహంతో గడిచిన ఎన్నికల్లో వివిధ పార్టీల తరఫున ప్రత్యర్థులుగా పోటీ చేసిన వారు ఒకే గూటికి చేరుతున్నారు. ఇప్పటికే ఆ తంతు పూర్తి అయింది. గత ఎన్నికల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న నాయకులు ఇప్పుడు ఒకరినొకరు నొప్పించకుండా వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో ఇల్లందు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఊకే కొమరం కనకయ్య, టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఊకే అబ్బయ్యలు ఒకే గూటికి చేరారు. దుమ్ముగూడెం మండలంలోనూ స్థానిక ప్రజాప్రతినిధుల పరిస్థితి తాజా చేరికలతో అలాగే ఉంది. ఆ మండలం నుంచి రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావ్ ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో పార్టీలోకి వలసలు భారీగా జరుగుతున్నాయి.

రంగులు మారుతున్న రాజకీయం

నవ్విపోదురు నాకేంటి సిగ్గు అన్న రాజకీయ నాయకులు తీరు ప్రజలను ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. పట్టుమని రెండేళ్లు కూడా ఒక పార్టీలో ఇమడలేని రాజకీయ నాయకులు ఇక సిద్ధాంతాలకు, ప్రజాస్వామ్యానికి ఏం విలువనిస్తారని ప్రజలు చర్చించుకుంటున్నారు. పూటకో మాట మాట్లాడుతూ.. రోజుకో పార్టీలో తిరుగుతూ అధికారం, డబ్బు పరమావధిగా మారుతున్న రాజకీయాలు ప్రజల ఏవగింపునకు గురవుతున్నాయి. దశాబ్ధాల తరబడి పార్టీని నమ్ముకుంటూ పార్టీయే ప్రాణంగా బతికిన నాయకులు సైతం చిన్న చిన్న కారణాలతో అలిగి పార్టీని వీడి వెళ్లిపోతుండటం అధినాయకులకు సైతం ఇబ్బందికరంగా మారుతోంది. ఒకప్పటి విలువలు ప్రస్తుత పార్టీల్లో లేవని, పుచ్చలపల్లి సుందరయ్య, రంజబ్‌ఆలీ వంటి కరుడుగట్టిన నాయకులు పార్టీలలో ఇప్పుడు లేరని, ఇప్పుడంతా రెడీమేడ్ నాయకులు వచ్చారని, చిన్న పంతాలకే పార్టీలు వీడుతూ వ్యక్తిగతంగా తమకు, పార్టీకి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీలు కూడా కార్పొరేట్ కల్చర్‌ను ప్రోత్సహిస్తూ డబ్బున్న వారికే పదవులు అందిస్తూ తమ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తుండటం రాజకీయాల్లో నైతిక విలువలు కోల్పోవడానికి ఒక కారణమని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. కొందరు నాయకులు సామాజిక స్పృహ కంటే స్వలాభపేక్షతోనే రాజకీయాల్లోకి వస్తుండటంతో ప్రజలకు రాజకీయాల పట్ల ఏహ్యభావం కలుగుతోంది. తుదిశ్వాస ఉన్నంత వరకు పార్టీలో కొనసాగుతానని రాజకీయ నాయకుల ప్రకటనలు నీటి మూటలవుతున్నాయి. ఆ పదానికే కొత్త అర్థం తీసుకొస్తున్నారని ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇకనైనా ప్రజలు మేల్కొని రంగులు మార్చే ఊసరవెల్లిలా మారిన రాజకీయ నాయకులు నైజాన్ని ఎండగట్టాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు.

అభివృద్ధే ఎజెండా
* 800కోట్లతో నగరాభివృద్ధి * పెండింగ్ పనులపై దృష్టి
* కార్పొరేటర్ల రివ్యూలో ఎమ్మెల్యే పువ్వాడ
ఖమ్మం(ఖిల్లా), నవంబర్ 21: ఖమ్మం కార్పొరేషన్‌లో రానున్న రోజుల్లో అన్ని వౌలిక వసతులతో నగర స్వరూపాన్ని మార్చి ఖమ్మంను రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దనున్నట్లు ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ కార్పొరేటర్లతో మమతా కాన్ఫరెన్స్‌హాల్‌లో మేయర్ పాపాలాల్‌తో కలిసి మంగళవారం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఖమ్మం కార్పొరేషన్ అభివృద్ధిలో వెనుకంజలో ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కార్పొరేషన్‌లో కోట్ల రూపాయల నిధులు విడుదలైనట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు సాధించిన ప్రగతి రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ సాధించలేదని స్పష్టం చేశారు. గత పాలకుల సమయంలో 80కోట్ల రూపాయల నిధులు వస్తే టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో 800కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు తెచ్చుకోగలిగామన్నారు. ఇప్పటివరకు సాధించిన నిధులతో కొన్ని పనులు పూర్తికాగా మరికొన్ని పనులు పురోగతిలో, ఆరంభ దశలో ఉన్నాయన్నారు. ముఖ్యంగా కార్పొరేటర్లు తమ డివిజన్ల పరిధిలో పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం నుంచి తెచ్చుకున్న నిధులను ఆయా పనులను పూర్తిచేసినప్పుడే వాటికి సార్ధకత లభిస్తుందన్నారు. ఖమ్మంకు ఐటిహబ్ రావడం జిల్లా కీర్తిప్రతిష్టలు మరింత పెరిగాయన్నారు. లకారం ట్యాంక్‌బండ్ సుందరీకరణ, మరమత్తులు పూర్తిచేసుకొని త్రాగునీటి బాండాగారంగా మారిందని, పూర్తి సబ్సిడీతో చేప పిల్లలను వదిలి మత్స్యకారులకు జీవనోపాధి కల్పించామన్నారు. ఖమ్మం కార్పొరేషన్ డంపర్‌బిన్లు, జెసిబిలు, చెత్త సేకరణ కోసం ప్రతి డివిజన్‌కు ఓనర్ కం డ్రైవర్ మినీవ్యాన్లు, రోడ్డు స్వీపింగ్ మిషన్లు అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన చెప్పారు. శానిటేషన్‌పై మరికొన్ని మార్పులు చేయాల్సి ఉందని, అందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి తీర్మానాలు ఎప్పటికప్పుడు పెట్టి పరిష్కరిస్తున్నామన్నారు. ఖమ్మం నగరంను పక్క జిల్లాలు అబ్బురపడే విధంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన నాటినుండి కేవలం అభివృద్ధే ఎజెండాగా పనిచేస్తున్నానని, అదే తరహాలో ప్రతి కార్పొరేటర్ పనిచేయాలన్నారు. 70గోళ్ళపాడు ఛానెల్ ఆధునీకరణ, 10కోట్లతో నూతన మున్సిపల్ కార్యాలయం, రైతుబజార్ నిర్మాణం, సులభ్ కాంప్లెక్స్‌ల నిర్మాణం, 14కోట్లతో హైటెక్ బస్టాండ్, 77కోట్లతో ధంసలాపురం ఆర్‌ఓబి నిర్మాణం, 24కోట్లతో లకారం చెరువు పూడికతీత, సుందరీకరణ, అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సబ్‌స్టేషన్లను నిర్మించి లో ఓల్టేజి సమస్యను అధిగమించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 249కోట్లతో మిషన్ భగీరథ ద్వారా ఖమ్మంలో ఇంటింటికి తాగునీటి సౌకర్యం, పేదలకు రెండువేల డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ళు, వందకోట్ల నిధులతో ఖమ్మం నగరంలో రోడ్ల నిర్మాణం, గ్రీనరీ, నూతన పార్కుల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ సిస్టం, సర్ధార్ పటేల్ స్టేడియంలో బాస్కెట్‌బాల్ కోర్టు, ఇతర ఆధునీకరణ పనుల నిర్మాణాన్ని చేపట్టామన్నారు. పనులన్నింటిని పూర్తిచేసి మెట్రో ఖమ్మంగా చూడాలన్నదే తన ధ్యేయమన్నారు. ఈ సమీక్షా సమావేశంలో టిఆర్‌ఎస్ పార్టీ అన్ని డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.

వీఆర్‌ఓలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి
* కేసును పోలీసులు నీరుగారుస్తున్నారు
* న్యాయం జరగకపోతే విధులు బహిష్కరిస్తాం * విఆర్‌ఓల సంఘం నేతల డిమాండ్
ఖమ్మం(మామిళ్ళగూడెం), నవంబర్ 21: గ్రామ రెవెన్యూ అధికారులపై దాడులు చేసిన మట్టి మాఫియా ముఠాను వెంటనే అరెస్టు చేసి వారిని కఠినంగా శిక్షించాలని విఆర్‌ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేందర్, జిల్లా అధ్యక్షుడు సున్నం రామారావులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి ప్రాంతంలోగల మట్టిని అక్రమంగా తరలిస్తుండగా రూరల్ తహశీల్దారు ఆదేశాల మేరకు విఆర్‌ఓలు పి ముత్తయ్య, పి శేషుకుమార్, భాస్కర్, శాంతారావులు విఏఓలతో కలసి గ్రావెల్ తరలిస్తున్న ప్రాంతానికి వెళ్ళి జెసిబితోపాటు 4ట్రాక్టర్‌లను స్వాధీనం చేసుకొని రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా దాడి చేసారన్నారు. ట్రాక్టర్లు, జెసిబి యజమానులు గంధం నాగేశ్వరరావు, పిచ్చయ్య, రవి, రెంటాల వెంకన్నలు ట్రాక్టర్ డ్రైవర్లతో కలసి అసభ్యపదజాలంతో తిడుతూ చంపుతామంటూ కర్రలతో దాడులుచేసారన్నారు. విఆర్‌ఓలపై దాడులు చేసిన వారిపై తమ విధులు ఆటంకపరిచారని, ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టారని, తమపై హత్యా ప్రయత్నం చేసారని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు నామ మాత్రంగా విధులు ఆటంకపరిచారనే ఆరోపణపై మాత్రమే కేసు నమోదు చేసిన పోలీసులు బాధ్యతా రాహిత్యంగ వ్యవహరిస్తూ ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. విఆర్‌ఓలు చేసిన ఫిర్యాదుమేరకు నిందితులపై కేసు నమోదు చేయాలని, లేనిపక్షంలో తాము విధులు బహిష్కరించి ఆంధోళనలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో నిత్యం తీరిక లేకుండా మానసిక ఒత్తిడులతో పని చేస్తున్న తమను బలిపశువులను చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ దాడులపై తమ సంఘం తీవ్రంగా పరిగణించి భవిష్యత్ కార్యాచరణకు సిద్దంగా ఉన్నామన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ను కలిసి విన్నవించామన్నారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు షేక్ నాగుల్‌మీర, నరసింహారావు, సీమల నాగేంద్రబాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సామాజిక తెలంగాణ, సమగ్రాభివృద్ధి కోసం
ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక
* సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
ఖమ్మం(కల్చరల్), నవంబర్ 21: ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో స్వచ్ఛ రాజకీయాల ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధిని కోరుకునే, అగ్రకుల పెత్తందారి ఆధిపత్యాన్ని అడ్టుకునే శక్తులను సమీకరించి సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధే ఎజెండా లక్ష్యంగా ఒక ప్రత్యామ్యాయ రాజకీయ వేదికను నిర్మించనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. సోమవారం స్ధానిక సుందరయ్యభవన్‌లో యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ మూడున్నర సంవత్సరాల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదని ఆరోపించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చేసిన ప్రధాన వాగ్దానాలే అమలుకు నోచుకోలేదన్నారు.రాష్ట్రంలో గిరిజనులు, దళితులు, మైనార్టీలు, మహిళలు, కార్మికులు, కర్షకులు ప్రభుత్వ పాలనపట్ల అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజల బతుకులు మారతాయనే ఆశ ఆవిరైందన్నారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక కుటుంబపాలన ఆవిష్కృతమై రాజ్యమేలుతుందన్నారు. ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ఎక్కువకాలం పాలించిన కాంగ్రెస్ కూడా తెలంగాణ వెనకబాటు కారణమన్నారు. రాష్ట్రంలో ప్రధానంగా రైతులకు మిర్చి, పత్తితో పాటు ఇతర పంటలకు గిట్టుబాటు ధరలేక పంటలకు పెట్టిన పెట్టుబడి రాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరించడం దారుణమన్నారు. రాష్ట్రంలో గతం కంటే ఒక్క సంవత్సరంలోనే 3500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారుని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు దాదాపు 4వేల కోట్ల రూపాయలుందన్నారు. దీని ద్వారా ఎక్కువ మంది గిరిజన, దళిత, వెనుకబడిన విద్యార్ధులే విద్యకు దూరమవుతున్నారని తెలిపారు. రాష్ట్ర ఫ్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ వేదికను నిర్మించేందుకు వామపక్ష, లౌకికశక్తులు, సామాజిక శక్తులు, అభ్యుదయ మేధావులు, కవులు, కళాకారులు, రచయితలు, కాంగ్రెస్, బిజెపి ఏతర పక్షాలను కలుపుకుని సిపిఎం ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను నిర్మిస్తుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు, జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటి సభ్యులు బుగ్గవీటి సరళ, నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్యాణం వెంకటేశ్వరరావు, బత్తుల లెనిన్ పాల్గొన్నారు.