ఖమ్మం

నేడు, రేపు జనసేన అధినేత పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 22: మూడున్నర సంవత్సరాల క్రితం పార్టీగా ఆవిర్భవించిన తర్వాత జనసేన ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరిగినా తొలిసారి ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పర్యటించనున్నారు. మంగళవారం రాత్రి కొత్తగూడెంకు ఆయన చేరుకుంటారు. బుధవారం కొత్తగూడెం నుంచి ఖమ్మం వరకు 80 కిలోమీటర్ల మేర ప్రదర్శనగా ఖమ్మం చేరుకోనున్నారు. అనంతరం వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రతినిధులతో ఖమ్మంలో సమావేశం కానున్నారు.
ఇదిలా ఉండగా సుదీర్ఘ కాలంగా కమ్యూనిస్టులకు గట్టి పట్టు ఉన్న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కూడా తన ఉనికిని కాపాడుకోలేకపోయింది. ఆ సమయంలో చిరంజీవి పలుమార్లు జిల్లాలో పర్యటించినప్పటికీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కానీ ఎన్నికల సమయంలో ఆయనకు మద్దతివ్వలేదు. ప్రస్తుతం పవన్‌కల్యాణ్ మాత్రం తాను ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే యాత్ర చేపడుతున్నానని, పదవుల కోసం కాదని స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ యాత్రకు ప్రాధాన్యత దక్కుతోంది. ఇతర జిల్లాల్లో పర్యటించినా ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల పరిధిలో ఒకేరోజు పర్యటించడం, ముందురోజే కొత్తగూడెంలో బసచేయడం జిల్లాకు ఆయన ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఆయన ఖమ్మం కేంద్రంగానే రాజకీయాలు చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.
ఇదిలా ఉండగా మూడున్నరేళ్ళుగా ఆ పార్టీని నమ్ముకుని పనిచేసిన వారిని ఈ యాత్రలో దూరం పెట్టారు. ఓ ఎన్‌ఆర్‌ఐ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయని, పార్టీ జెండాను మోసిన తమను పట్టించుకోవడం లేదంటూ ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టి పవన్‌కల్యాణ్ వైఖరి మారాలంటూ ఆ నేతలు చెప్పడం గమనార్హం. అయితే ఆ పార్టీ నేతలు మాత్రం ఇవేమి పట్టించుకోకుండా సభకు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు.
ఇదే సమయంలో సోమవారం టీమాస్ ఆధ్వర్యంలో నిర్వహించాలనుకున్న ప్రదర్శనకు అనుమతి ఇవ్వని పోలీసులు పవన్‌కల్యాణ్ ర్యాలీకి ఎలా అనుమతి ఇస్తారంటూ వామపక్ష పార్టీల నేతల నుంచి ఆరోపణలు కూడా మొదలయ్యాయి. సమస్యలు చెప్పేందుకు అనుమతి ఇవ్వని పోలీసులు సమస్యలు తెలుసుకుంటామంటే ఎలా ఇస్తారని, తెలుసుకున్న వారు పాలకులకు చెప్పరా అని ప్రశ్నిస్తున్నారు. అదే క్రమంలో ఖమ్మం కేంద్రంగా జరగనున్న పవన్‌కల్యాణ్ యాత్రపై అన్ని రాజకీయ పార్టీలు ఆచితూచి స్పందిస్తున్నాయి. భవిష్యత్తులో రాజకీయాలు ఎలా మారుతాయోనని ఆలోచిస్తూ వేచి చూస్తున్నట్లు కొన్ని రాజకీయ పార్టీల నేతలు స్పష్టం చేశారు. అయితే పవన్ కల్యాణ్ జిల్లా సమస్యలపై అవగాహన కలిగి ఉన్నారా, ఆయన వైఖరి ఎలా ఉందనే దానిపై తమ స్పందన ఉంటుందని మరోపార్టీ నేత చెప్పుకొచ్చారు.

ప్రభుత్వ లక్ష్య సాధనలో బలవుతున్న వీఆర్‌వోలు
* దాడులకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలి * వీఆర్‌లోల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గరిక ఉపేందర్‌రావు

కామేపల్లి, జనవరి 22: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల లక్ష్య సాధనలో గ్రామ రెవెన్యూ అధికారులు బలైపోతున్నారని, భౌతిక దాడులకు గురవుతున్నారని వీఆర్‌వోల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరిక ఉపేందర్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా మూలనపడిన భూ ప్రక్షళన కార్యక్రమాన్ని చేపట్టిందని, తక్కువ వ్యవధిలోనే లక్ష్యాలు సాధించాలంటూ వీఆర్‌వోలపై ఒత్తిడి తీసుకువస్తోందని విమర్శించారు. దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న భూ రికార్డులను ప్రక్షాళన చేయడం, అనేక సంక్షేమ కార్యక్రమాల అమలులో రెవెన్యూ అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. వీరిపై రాజకీయ, అసాంఘిక శక్తులు భౌతిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఆయన విమర్శించారు. రాష్ట్రంలో సుమారు 12 వేల మంది రెవెన్యూ అధికారులు అవసరం ఉండగా కేవలం 4 వేల మందితో పనులు నిర్వహిస్తున్నారన్నారు. సమగ్ర భూ సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలంటే వీఆర్‌వోలకు శాస్ర్తియ, సాంకేతిక పద్ధతుల్లో శిక్షణ ఇవ్వాలని, పూర్తి స్థాయిలో నియామకాలు చేపట్టి భూ ప్రక్షళన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. తొందరపాటు చర్యలు తీసుకోవడం వలన క్షేత్ర స్థాయిలో వీఆర్‌వోలు బలైపోతున్నారన్నారు. బంగారు తెలంగాణ సాధనకు తాము సిద్ధంగా ఉన్నామని, పూర్తి స్థాయిలో అధికారులను నియమించి లక్ష్యాలను సాధించాలే గానీ అరకొర వేతనాలతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని అధికారులను ఇబ్బందుల పాల్జేయవద్దని సూచించారు. ప్రభుత్వ భూములు స్వాధీన చేసుకునేందుకు వెళ్ళిన వారిపై దాడులకు పాల్పడుతున్నారని, దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కామేపల్లి వీఆర్‌వోపై దాడి జరిగి రెండు రోజులైనా నేటి వరకు ఎవరిని అరెస్టు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే తాము ప్రత్యక్ష ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రామారావు, డివిజన్ ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబు, మండల అధ్యక్షుడు డి.బాలరాజు, విఆర్‌వోలు మీనయ్య, నాగేశ్వరావు, నరేష్, రాంచంద్రయ్య, సూర్యం, జానకిరాములు తదితరులు పాల్గొన్నారు.

టీమాస్ నాయకులు అరెస్ట్
ఖమ్మం (కల్చరల్), జనవరి 22: టీమాస్ ఆధ్వర్యంలో సోమవారం తలపెట్టిన ధర్నాకు పోలీసుల నుండి అనుమతి లభించలేదు. స్థానిక పెవిలియన్ గ్రౌండ్ నుండి ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నా నిర్వహించేందుకు ఆ సంఘ నేతలకు అనుమతి రాకపోవడంతో పెవిలియన్ గ్రౌండ్‌లోనే నిరసన సభ జరిపారు. సభ అనంతరం నేతలు ప్రదర్శనగా వెళ్ళేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ధనవంతుల పాలన ఇక కొనసాగనివ్వం
* రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్న పాలకులు
* ఆర్థిక, సామాజిక సమానత్వం కోసం టీమాస్ పోరాటం * 25న హైదరాబాద్‌లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆవిర్భావం

ఖమ్మం, జనవరి 22: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్ళు అయినా 93 శాతం ఉన్న పేదల బతుకుల్లో ఎలాంటి మార్పులేదని, ధనవంతులు పాలిస్తున్నంత కాలం ఎలాంటి మార్పు రాదని, అందుకే కడుపు మండిన పేదలంతా ఒక్కటై టీమాస్ ఏర్పర్చుకున్నారని, ఇక వారి పాలన కొనసాగనివ్వమని టిమాస్ రాష్ట్ర నాయకుడు తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. సోమవారం టీమాస్ ఆధ్వర్యంలో తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం సందర్భంగా స్థానిక పెవిలియన్ గ్రౌండ్‌లో టీమాస్ జిల్లా కన్వీనర్ యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇన్నాళ్ళు సాగిన ధనికుల పాలనతో ప్రజలు విసిగిపోయారని, ఎవరికో ఒకరికి ఓట్లు వేసి గెలిపించామని, వారు గెలిచిన తర్వాత పేదల బతుకుల గురించి పట్టించుకోలేదన్నారు.బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న స్వాతంత్య్ర భారతంలో పేదలు పేదలుగానే, ధనవంతులు మరింత ధనవతులుగా మారారే తప్ప అంతకు మించి జరిగిందేమీ లేదన్నారు. ఇక రాష్ట్రంలో మన నిధులు, నీళ్ళు, నియామకాలు మనకే దక్కాలనే ఏకైక ఎజెండాతో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పేదోడి బతుకు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అనే సామెత గుర్తు చేస్తోందన్నారు. నాలుగేళ్ళ నాడు అధికారంలోకి వచ్చిన కెసిఆర్ వాగ్దానాలతోనే ప్రజల్ని మోసం చేస్తున్నాడని ఆరోపించారు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని సర్కార్‌కు వినతిపత్రం ఇవ్వడానికి కూడా పేదలకు హక్కు లేకుండా చేశారని దుయ్యబట్టారు. రాజ్యాంగంలో అంబేద్కర్ కల్పించిన హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని, అలాంటి పాలకులకు చరమ గీతం పాడే రోజులు దగ్గర పడ్డాయన్నారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా నియామకాలు చేపట్టలేక పోయారని, దీనితో ఉన్నత చదువులు చదివిన యువకులు రిక్షా కార్మికులుగా మిగిలారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు, హక్కుల గురించి ప్రశ్నించే వారిపై ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి అణిచివేయాలని చూస్తున్నారని, ఈ పోలీస్ పాలన మనకొద్దన్నారు. దేశంలో ఆర్థిక, సామాజిక సమానత్వం కోసం మన ఓటు మనమే వేసుకుని మన పాలన మనమే చేసుకోడానికి ఈ నెల 25న హైదరాబాద్‌లో ఆవిర్భవించనున్న బహుజన లెఫ్ట్ ఫ్రంట్ సదస్సుకు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిమాస్ జిల్లా చైర్మన్ డి జ్వలిత, రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు, ముక్తి భాస్కర్‌రావు, బివి రాఘవులు, బుగ్గవీటి సరళ, బత్తుల హైమావతి, జిల్లా నాయకులు మాచర్ల భారతి, కత్తి నెహ్రూ, వినయ్‌కుమార్, బండి రమేష్, బత్తుల లెనిన్, కె నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

సంకల్ప బలాన్ని అలవర్చుకోవాలి
* జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత
ఖమ్మం రూరల్, జనవరి 22: ప్రజలకు ఏదైనా సేవ చేయాలన్న సంకల్ప బలాన్ని ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు అలవర్చుకోవాలని జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత అన్నారు. సోమవారం మండలంలోని కొండాపురంలో ఆర్‌జెసి డిగ్రీ, జూనియర్ కళాశాలల ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో వారం రోజులపాటు ఏర్పాటు చేసిన శీతాకాల శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు. గ్రామాల్లో ప్రజలు అభివృద్ధిని సాధించినప్పుడే గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందన్నారు. ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ప్రజల జీవన స్థితిగతుల్లో చోటు చేసుకున్న మార్పును అభివృద్ధి దిశగా మార్చేందుకు ప్రయత్నించాలని ఆమె సూచించారు. గ్రామాల్లో వౌలిక వసతుల కల్పనలో తమవంతు తోడ్పాటుందించాలన్నారు. నూరు శాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంటల నిర్మాణం, పారిశుద్ధ్యం, డ్రాపౌట్స్‌ను తిరిగి బడిలో చేర్పించడం, గుట్కాలు తినడం వల్ల కలిగే అనర్థాలు, బాల్య వివాహాల నివారణ, మూఢ నమ్మకాలు, సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన, చైతన్యాన్ని పెంపొందించాలని ఆమె సూచించారు. గ్రామీణ వ్యవస్థ, ప్రజల జీవన శైలి, ఆర్థిక స్థితిగతులపై పట్టు సాధించి సామాజిక సేవా భావాన్ని పెంపొందించుకున్న వాలంటీర్లు పోటీ ప్రపంచంలో రాణిస్తారని అన్నారు. ఆర్‌జేసి విద్యా సంస్థల చైర్మన్ కృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సామాజిక సేవలో కూడా పాలుపంచుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ బిఆర్ మూర్తి, ఎంపిడిఓ సిహెచ్ శ్రీనివాసరావు, టిఆర్‌ఎస్ మండల ఇన్‌చార్జి సాధు రమేష్‌రెడ్డి, మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, ఎంపిటిసి అంబాల నాగేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ ఎన్‌ఎస్‌ఎస్ క్యాంప్‌లు విద్యార్థులలో సేవా భావాన్ని పెంపొందించుకునేందుకు తోడ్పడతాయన్నారు. అనేక సామాజిక అంశాలపై ప్రజలను చైతన్యపర్చడం తమ జీవితంలో ఓ తీపి గుర్తుగా నిలుస్తుందన్నారు. అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్‌ను కవితను ఆర్‌జెసి కృష్ణ శాలువ కప్పి ఘనంగా సత్కరించారు. గ్రామ సర్పంచ్ దండ్యాల రమేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో హెచ్‌ఎం పద్మతులసి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ లక్ష్మీపతి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు జె కృష్ణ, సిహెచ్ శోభన్‌బాబు, మండల కోఆప్షన్ సభ్యుడు జానిమియా, పెద్దలు శ్రీకాంత్, నూకల వెంకటేశ్వర్లు, మంగళగూడెం ఎంపిటిసి యండపల్లి రవి, మట్టా వెంకటేశ్వర్లు, కె వెంకటనారాయణ, సిబ్బంది, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.

మార్కెట్‌కు కొత్త వేరుశనగ
* ఆరంభంలోనే దోపిడీకి గురవుతున్న రైతులు

ఖమ్మం(గాంధీచౌక్), జనవరి 22: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లోకి కొత్త వేరుశనగ పంట వస్తోంది. కొత్త పంటకు కనీసం ఎక్కువ ధర వస్తుందని ఆశిస్తున్న రైతులకు కనీసం మద్దతు ధర కూడా లభించటం లేదని రైతులు వాపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మొదట్లో ఎక్కువ ధర కోసం రైతులు హడావిడిగా వేరుశనగ పంటను మార్కెట్‌కు తరలించక ముందే కమిషన్‌దారుల చేతుల్లో రైతులు దోపిడీకి గురవుతున్నారు. పంటను మార్కెట్‌కు తరలించక ముందే కమిషన్‌దారులు రైతుల వద్దకు వెళ్ళి పంట పరిశీలించుకొని ముందుగానే ధర నిర్ణయించుకొని రైతు వద్ద కొనుగోలు చేస్తున్నారు. అనంతరం అదే రైతుతో పంటను మార్కెట్‌కు తరలించి రైతు ముందే ఎక్కువ ధరకు అమ్మకాలు జరుపుతున్నా ఏమీ చేయలేని పరిస్థితుల్లో రైతు ఉండటం గమనార్హం. వేరుశనగ పంటను పండించేందుకు ఎకరానికి 50 వేల రూపాయలు పెట్టుబడులు పెట్టినప్పటికీ కనీసం మద్దతు ధర లభించకపోవటంపై రైతు కుదేలవుతున్నాడు. మార్కెట్‌లో నిర్వహిస్తున్న ఆన్‌లైన్ విధానంతో కమిషన్‌దారులు ముందుగానే రైతుల వద్ద పంటలను ఒక ధరకు కొనుగోలు చేసుకుని అనంతరం అదే రైతు, రైతుకు సంబంధించిన ధృవ పత్రాలతో మార్కెట్‌లోకి ప్రవేశించి కమిషన్‌దారులు రైతు ముందే ఎక్కువ ధరకు అమ్ముకుంటున్న పరిస్థితులు నెలకొనటం విశేషం. మార్కెట్‌లో అధికారులు ఎన్ని నిబంధనలు తీసుకువచ్చినా కమిషన్‌దారులు, వ్యాపారులు దానికి అనుగుణంగా అనేక మార్గలు ఎంచుకొని రైతులను మోసం చేస్తున్నరన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వేరుశనగ పంట ప్రారంభమైన తరుణంలో అధికారులు మరింత పటిష్టమైన చర్యలు చేపట్టల్సివుంది.