ఖమ్మం

బ్రహ్మోత్సవాలకు నీవే రక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, మార్చి 24: భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వసంత పక్ష ప్రయుక్త శ్రీ రామ నవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం, చతుఃస్థానార్చనం, భేరీపూజ, దేవతాహ్వానం, బలిహరణం శాస్త్రోక్తంగా జరిగాయి. సాయంత్రం స్వామి హనుమంతుని వాహనంపై రాజవీధుల్లో తిరువీధి సేవ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గరుడ పటం ధ్వజ స్తంభంపైకి అధిరోహించే సమయంలో నైవేద్యంగా పెట్టే గరుడ ముద్దలను సంతానం లేని మహిళలకు పంపిణీ చేయడం ఆనవాయితీ. వాటిని అందుకున్న మహిళలు గర్భగుడి వెనకకు వెళ్లి స్వామిని స్మరించుకుంటూ స్వీకరించారు.

అగ్ని ప్రతిష్ట గరుడ ప్రసాదం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం ప్రాకార మండపంలో అగ్ని మథించారు. కవ్వం లాంటి వస్తువుతో అగ్నిని సృష్టించి షోడశోపచారాలతో అర్చన చేశారు. ఆచార్యుడు ఆ అగ్నిని శిరస్సుపై ధరించి సమస్త మంగళ వాయిద్యాలతో అంతరాలయానికి తీసుకెళ్లారు. మూల విరాట్‌కు చూపించి దోష పరిహారం కోరారు. ఆ అగ్నిని యాగశాలకు తీసుకెళ్లి అగ్ని గుండంలో ప్రవేశపెట్టారు. అగ్ని ప్రతిష్టాపన చేశారు. ఈ సందర్భంగా శేయాధివాసంలో ఉన్న గరుత్మంతుడిని మేల్కొలిపే కార్యక్రమం జరిగింది. సమస్త రాజలాంఛనాలతో గరుత్మంతుడికి పూజలు చేశారు. మహాకుంభం (గరుడ కుంభం) ధరించి గర్భాలయం చుట్టూ మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య తిరిగి ధ్వజస్తంభం వద్దకు తీసుకొచ్చారు. గరుత్మంతుడిని స్తంభం వద్ద ప్రతిష్టించారు. ముందుగా స్వామికి విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, బ్రహ్మఘోష, వేదస్వస్తి, గరుడ అష్టోత్తర శతనామార్చన, గరుడ మంగళాష్టకాలు, చూర్ణికలు, ధ్వజస్తంభం చుట్టూ బలిహరణం వేసి స్వామికి ఎదురుగా ఉన్న సంతానం లేని 108 మంది స్ర్తిలకు గరుడ ప్రసాదం ముద్దలను పంపిణీ చేశారు. అనంతరం భక్తుల జయజయధ్వానాల మధ్య గరుత్మంతుడిని స్తంభంపై అధిష్టించారు. బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు క్షేత్రానికి రక్షకుడిగా గరుత్మంతుడిని స్వామి నియమించారు. గరుడ ప్రసాదాన్ని స్వీకరించిన మహిళలు తొలుత అంతరాలయంలో మూలవరులను దర్శించుకుని, తర్వాత గర్భాలయం వెనక భాగానికి వెళ్లి జై శ్రీరామ్ అంటూ ప్రసాదంగా తీసుకున్నారు. ఈ సందర్భంగా గరుడ ప్రసాదాన్ని స్వీకరించిన మహిళలు ఉపవాసం ఉండాలని సూచించారు.

భేరీ పూజ ... దేవతాహ్వానం
అనంతరం ప్రాకార మండపంలో భేరీ పూజ ఘనంగా జరిగింది. ఢంకాలు మోగించి 33 గురు దేవతలను ఆహ్వానించే పూజా కార్యక్రమం భక్తి ప్రపత్తులతో జరిగింది. 4 డోళ్లు, 4 సన్నాయిలు, హార్మోని, తానం, జేగంట, గంట, కంజర, కాహలం, శంఖం ఇలా 16 రకాల వాయిద్యాలతో దేవతలను ఆహ్వానించి ప్రతిష్టించారు. ఈ సందర్భంగా 21 మంది వాయిద్యకారులకు దేవస్థానం స్వామి శేష మాలికలను అందించి సన్మానించింది. అష్ట దిక్పాలకును ఆవాహన చేసి దేవాలయం చుట్టూ రాగములు, తానములు, గజ్జెలు, చూర్ణికలతో బలిపీఠం వద్దకు చేరుకుని 8 పొంగలి ముద్దలను, ఆంజనేయస్వామికి మరో ముద్దను ప్రసాదంగా ఉంచారు. భూత బలిగా తెల్ల ప్రసాదాన్ని తయారుచేసి వీరంగం వాయిస్తూ ఆమడ దూరంలో విసిరారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవస్థానం ఈఓ కె.ప్రభాకర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది భక్తులకు ఏర్పాట్లు చేశారు. తర్వాత స్వామి హనుమంతుని వాహనంపై రాజవీధిలో తిరువీధి సేవకు వెళ్లారు. గోవిందరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తిరిగి ఆలయానికి వచ్చారు.