ఖమ్మం

అంతా తానై నడిపించిన పొంగులేటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 2: పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన నేత.. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన స్థానిక సంస్థల, సాధారణ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటిన నాయకుడు. 2013 ఫిబ్రవరి 13వ తేదీన జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆ సభలోనే ఖమ్మం ఎంపిగా పొంగులేటి పోటీ చేస్తారని, ఉభయ రాష్ట్రాలోనూ తొలి అభ్యర్థిగా పొంగులేటి పేరును జగన్ ప్రకటించారు. అప్పుడు జరిగిన స్థానిక ఎన్నికల్లో 5 జడ్పిటిసి, 6 ఎంపిపి స్థానాలకు తోడు పదుల సంఖ్యలో ఎంపిటిసిలు, సర్పంచ్‌లను గెలిపించుకోగలిగారు. సాధారణ ఎన్నికల్లో ఎంపిగా తనతో పాటు అశ్వారావుపేట, పినపాక, వైరా ఎమ్మెల్యే స్థానాలను పార్టీ ఖాతాలో వేసుకోగలిగారు. కాని మారిన రాజకీయ పరిణామాల్లో భాగంగా వైరా, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు స్థానాల్లో విజయం సాధించడమే కాకుండా మరో నాలుగు స్థానాల్లో ద్వితీయ స్థానంలో ఉన్నారు. కార్పొరేషన్‌లో దాదాపు 20వేల ఓట్లను దక్కించుకొని టిఆర్‌ఎస్, కాంగ్రెస్ తర్వాతి స్థానంలో వైసిపిని నిలిపారు. కాని పార్టీ నేతలనుంచి వస్తున్న ఒత్తిడిని, రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను, తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడిగా ఉన్న ముద్ర ఆయనను టిఆర్‌ఎస్ వైపు అడుగులు వేయించిందని ప్రచారం కూడా ఉంది. గత కొద్ది రోజులుగా అయోమయంలో ఉన్న ఆయన రెండు రోజుల క్రితం వైఎస్ జగన్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. జగన్ నుంచి సానుకూల స్పందన రాకపోవడం, అధికార టిఆర్‌ఎస్ నుంచి ఆహ్వానాలు అందుతున్న నేపథ్యంలో సోమవారం కార్యకర్తలతో సమావేశమై టిఆర్‌ఎస్‌లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో కొందరు నేతల నుంచి విముఖత వ్యక్తమయినప్పటికీ రాజకీయ ప్రలోభాలు, ఒత్తిడిలు, పార్టీ మారాల్సిన పరిస్థితులను వివరించడం ద్వారా పరిణతి చెందిన రాజకీయ వ్యక్తిగా వ్యవహరించి వారిని ఒప్పించారు. ఏకగ్రీవంగా జిల్లా, రాష్ట్ర నేతలను అందరిని ఒప్పించి తనతో పాటు టిఆర్‌ఎస్‌లోకి తీసుకెళ్ళగలిగారు. ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు తర్వాత అత్యంత బలమైన నేతగా పేరు సంపాదించుకున్న పొంగులేటి టిఆర్‌ఎస్‌లో చేరడం పట్ల ఆ పార్టీ మరింత బలోపేతం అయిందని చెప్పవచ్చు. ఇటీవల ప్లీనరీ జరిగిన సమయంలోనే పొంగులేటితో చర్చలు జరిగాయని ప్రచారం జరిగినా అది అప్పట్లో ఆచరణలోకి రాలేదు. చివరకు ఈ నెల 4వ తేదీన ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో తన భారీ అనుచరగణానికి తోడు ఖమ్మం జిల్లాలోని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు అంతా కలిసి టిఆర్‌ఎస్‌లో చేరనున్నారు. దీంతో రెండేళ్ళ క్రితం ఖమ్మం జిల్లాలో అత్యంత బలహీనంగా ఉన్న టిఆర్‌ఎస్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకంటే ఇప్పుడు ఖమ్మంలోనే అత్యంత బలమైనదిగా మారుతోంది.

అభివృద్ధిలో భాగస్వామినయ్యేందుకే టిఆర్‌ఎస్‌లోకి...
* జగన్ కుటుంబమంటే చెప్పలేనంత అభిమానం
* ఖమ్మం ఎంపి పొంగులేటి
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, మే 2: వైఎస్‌ఆర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని నాడు రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో భాగస్వామిని అయ్యేందుకే టిఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్‌ఆర్ ఆశయాల సాధన కోసం జగన్మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన పార్టీలో తాను 2013 ఫిబ్రవరిలో చేరానని, అనతికాలంలో ఎంపిగా విజయం సాధించటంతో పాటు ఖమ్మం జిల్లాలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నానని గుర్తు చేశారు. దీంతో పాటు రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాకు ఉన్న ఖ్యాతిని ఇనుమడింపచేశానన్నారు. తాను చేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి తీసుకొచ్చాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్మోహన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనే విషయం తెలుసుకొని స్పందించకుండా కర్నూల్ దీక్ష చేస్తున్నట్లు ప్రకటించటంతో మనస్తాపం చెందానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశ్యంతో టిఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. జగన్మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయటంతో పాటు తనను ఎంతో ఆదరించే వాడన్నారు. తనకు జగన్ కుటుంబమంటే ఎంతో అభిమానం అని, ఆ అభిమానం కోసం రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని చూసి తట్టుకోలేకపోతున్నట్లు వెల్లడించారు. పార్టీకి రాజీనామా చేసినట్లు జగన్మోహన్‌రెడ్డికి లేఖ పంపించానన్నారు. అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేందుకు ఈ నెల 4వ తేదీన ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నట్లు వెల్లడించారు. తనతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా నాయకత్వం, వైఎస్‌ఆర్‌సిపి ప్రజాప్రతినిధులంతా టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నట్లు వెల్లడించారు. విలేఖరుల సమావేశంలో పాయం వెంకటేశ్వర్లు, మట్టా దయానంద్, లింగాల కమల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

2 కెఎంపి-4: విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కెటిఆర్

రాష్ట్రంలో ఇతర పార్టీలకు మనుగడ లేదు
* రాష్టమ్రంత్రి కెటిఆర్
ఖానాపురం హవేలి, మే 2: తెలంగాణ రాష్ట్రంలో ఇతర పార్టీలకు మనుగడ లేదని రాష్టమ్రంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సోమవారం ఆయన ఖమ్మంలో విలేఖరులతో మాట్లాడుతూ ఖమ్మంలో నిర్వహించిన టిఆర్‌ఎస్ ప్లీనం విజయవంతమవ్వటంతో పాటు అదే సమయంలో పాలేరు ఉప ఎన్నిక కూడా జరగనుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పునరేకీకరణ శరవేగంగా జరుగుతుందన్నారు. రాష్ట్రం ఏర్పడిన 22నెలల్లోనే అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ ప్రభుత్వమే అగ్రభాగంలో ఉందన్నారు. వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి తెలంగాణ ప్రజల అవసరాల కంటే ఏపి అవసరాలే ముఖ్యమన్నట్లుగా ప్రవర్తిస్తున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేని వైఎస్‌ఆర్‌సిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిస్థితులను వివరించినప్పటికీ జగన్ తన దీక్ష విషయంలో మార్పు చేసుకోకపోవటం బాధాకరమన్నారు. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పొంగులేటిని భాగస్వాముని చేయాలనే ఉద్దేశ్యంతో పొంగులేటిని కలిసినట్లు వివరించారు. దీనిపై పొంగులేటి సానుకూలంగా స్పందించారన్నారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సిపి కనుమరుగైనట్లేనని, త్వరలో మరో పార్టీకి కూడా ఆ పరిస్థితే రానుందని జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నియమ నిబద్ధతతో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే అన్ని ఎన్నికల్లో విజయాన్ని తెచ్చిపెట్టాయన్నారు. విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, నాయకులు దిండిగల రాజేందర్ పాల్గొన్నారు.

రెండేళ్లలో అరవయ్యేళ్ల అభివృద్ధి
* సంక్రాంతి నాటికి ఇంటింటికీ మంచినీరు
* గెలిపిస్తే శభాష్ అనిపించుకుంటా
* టిఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల
ఖమ్మం రూరల్, మే 2: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రెండేళ్లలోనే 60 ఏళ్ల అభివృద్ధిని చేసి చూపించారని టిఆర్‌ఎస్ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన రాష్ట్ర రవాణాశాఖామంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణలతో కలిసి మండలంలోని రాజీవ్ గృహకల్ప, పోలేపల్లి, గోళ్లపాడు, తీర్థాల, గుండాలతండా, మద్దివారిగూడెం, పోలిశెట్టిగూడెం, మంగళగూడెం, ఊటవాగుతండా గ్రామాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాలలో మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మేళతాళాలు, నృత్య ప్రదర్శనలతో ఎదురేగి ఘనస్వాగతం పలికారు. మహిళలు తుమ్మల, మహేందర్‌రెడ్డి తదితరులకు నుదుటిన తిలకం దిద్ది, హారతి ఇచ్చి విజయం చేకూరాలని ఆకాంక్షించారు. ఈసందర్భంగా రాష్ట్ర రవాణాశాఖామంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎక్కడాలేని విధంగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ప్రజల అవసరాలను స్వయంగా తెలుసుకొని అడక్కుండానే సమస్యలన్నింటినీ తీర్చుతున్న కెసిఆర్ సేవానిరతిని వివరించారు. టిఆర్‌ఎస్ పాలేరు అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో మిషన్ భగీరధ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల అభివృద్ధి, కళ్యాణలక్ష్మి పథకం, దళితులకు మూడెకరాల భూమి, ప్రజలకు 24 గంటలు, రైతులకు తొమ్మిది గంటల కరెంట్, ఆరు కిలోల బియ్యం, పెన్షన్ల పెంపు, అంగన్‌వాడీ కేంద్రాలలో గర్భిణులు, బాలింతలకు గుడ్డు, పాలు పంపిణీ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల మంజూరు వంటి పథకాలను అమలు చేస్తున్న ఘనత కేసిఆర్‌కే దక్కిందన్నారు. అదేవిధంగా రోడ్లు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ఇప్పటికే అనేకచోట్ల శ్రీకారం చుట్టినట్టు వివరించారు. రాజీవ్‌గృహకల్ప లబ్దిదారులు తమకు బ్యాంక్ నుంచి సబ్సిడీ ఇప్పించాలని, పాఠశాల భవనం, లైబ్రరీ, డ్రైనేజీలు నిర్మించాలని, గోళ్లపాడుకట్టు నిర్మాణం, తీర్థాల ఎత్తిపోతల పథకం మరమ్మతులు వెంటనే చేపట్టాలని, గుండాలతండాలో ఇసుకవాగుపై చెక్‌డ్యామ్ నిర్మించాలని, ఊటవాగుతండాలో పాఠశాల, బిటి రోడ్డు నిర్మించాలని ప్రజలు తుమ్మలకు విన్నవించగా ఆయన వెంటనే స్పందించి తనకు అఖండ విజయం చేకూర్చితే మీరడిగిన సమస్యలన్నింటినీ పరిష్కరించి శభాష్ అని అనిపించుకుంటానని, లేకుంటే మిమ్ములను మరోసారి ఓట్లేయమని అడగబోనని స్పష్టం చేశారు. ప్రచార కార్యక్రమం సందర్భంగా ఆయా గ్రామాలలోని వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తుమ్మల, మహేందర్‌రెడ్డి సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో నాయకులు బోడేపూడి రమేష్, మద్ది మల్లారెడ్డి, సాధు రమేష్‌రెడ్డి, సర్పంచ్‌లు అక్కినపల్లి వెంకన్న, బండి జగదీష్, ఉసికల వెంకన్న, యల్లయ్యనాయక్, పార్టీ మండల అధ్యక్షుడు దారావత్ రామ్మూర్తినాయక్, కొప్పుల ఆంజనేయులు, కనే్నటి వెంకన్న, పాప్యానాయక్, పంతులు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

2 కెజిపి 5: జిఎం కెవి రమణమూర్తి

ఉత్పత్తి లక్ష్య సాధనలో కొత్తగూడెం వెనుకంజ
* సమష్టి కృషితో లక్ష్యాన్ని సాధించాలి
*ఏరియా జిఎం రమణమూర్తి
కొత్తగూడెం, మే 2: 2016-17 ఆర్థిక సంవత్సరంలో తొలిమాసమైన ఏప్రిల్‌లో కొత్తగూడెం ఏరియా నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది. ఏప్రిల్ మాసంలో 7.49 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 6.46 లక్షల టన్నులు సాధించి 86శాతం ఉత్పాదకరేటును సాధించింది. రోడ్డు రవాణా ద్వారా అత్యధికంగా 1, 67, 076 టన్నుల బొగ్గును రవాణా చేసి 2013 ఏప్రిల్ మాసంలో చేసిన అత్యధిక రవాణా రికార్డును అధిగమించింది. 2013 ఏప్రిల్‌లో 1,48,313 టన్నుల బొగ్గును కొత్తగూడెం ఏరియా రవాణా చేయగలిగింది. బొగ్గురవాణాలో 6.75లక్షల టన్నులు ఏప్రిల్ మాసంలో చేసి 90 శాతంతో సింగరేణిలోనే ద్వితీయస్థానంలో కొత్తగూడెం ఏరియా నిలిచింది. గనుల వారీగా బొగ్గు ఉత్పత్తి వివరాలిలావున్నాయి. గౌతంఖని ఓపెన్‌కాస్టు 2.41లక్షల టన్నుల లక్ష్యానికి 2.16లక్షల టన్నులు సాధించి 90శాతం, జెవిఆర్ ఓపెన్‌కాస్టు గని 4.21లక్షల టన్నులకు 3.75లక్షల టన్నులతో 89శాతం ఉత్పాదక రేటును నమోదు చేసుకున్నాయి. భూగర్భగనులలో వికె-7ఇంక్లైన్ గని 0.58 లక్షల టన్నులకు 0.32 లక్షల టన్నులు సాధించి 55 శాతం, పివికె-5 ఇంక్లైన్ గని 0.29లక్షల టన్నులకు 0.23లక్షల టన్నులను సాధించి 78శాతం ఉత్పాదకరేటును నమోదు చేసుకున్నాయి.
ఈసందర్భంగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కెవి రమణమూర్తి మాట్లాడుతూ 2016-17 వార్షిక లక్ష్యాలను సమష్టి కృషితో, పూర్తిరక్షణతో సాధించాలని కోరారు. కొత్తగూడెం ఏరియాలో ప్రతి ఇంటికీ యోగా కార్యక్రమంలో భాగంగా ప్రారంభమైన యోగా శిక్షణ తరగతులను స్థానిక యోగా గురువులతో ప్రతిరోజు ఉదయం 6గంటల నుండి 7గంటల వరకు, సాయంత్రం 6గంటల నుండి 7గంటల వరకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నమ్ముకున్నవారి కోసమే పార్టీ మారుతున్నా

ఖమ్మం(మామిళ్ళగూడెం), మే 2: తనను నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉండేందుకే పార్టీ మారుతున్నట్లు ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సోమవారం పార్టీ మారే ఆలోచనలపై స్థానిక ఎస్‌ఆర్ గార్డెన్స్‌లో రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం, అధికార పార్టీ ప్రలోభాలతో తెలంగాణాలో ఇతర పార్టీలకు భవిష్యత్ లేదన్నారు. పార్టీలో చేరిన నాటి నుంచి రాష్ట్రం, జిల్లాలో పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు ఎన్నో కష్టాలు పడ్డాడని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేక స్థానాలను గెలిపించుకోవడంతో పాటు సాధారణ ఎన్నికల్లో తాను ఎంపిగా గెలవడంతో పాటు 3 స్థానాల్లో ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగామన్నారు. నేటి వరకు జిల్లాలో ఏ ఎన్నికలు జరిగినా వైసిపి అభ్యర్థిని పోటీలో ఉంచి పార్టీని బతికించుకున్నామన్నారు. తెలంగాణాలో రాజకీయ ప్రలోభాలు, ఏపిలో వైసిపి సంక్షోభంలోకి వెళ్ళడం, వైఎస్ జగన్ సైతం సంక్షోభంలోకి వెళ్ళడం పార్టీని కాపాడుకునే పరిస్థితి లేదన్నారు. తాను ఎంపి ఎన్నికల కంటే ఇతర ఎన్నికల్లో పార్టీ తరుపున కష్టపడి అధిక ప్రచారం చేశానని, ఓ అధికార పార్టీ ముఖ్య నాయకుడి డబ్బు ప్రలోభాలతో వాటిల్లో సరైన స్థానాలు గెలవలేకపోయామన్నారు. ఇన్ని రోజులు వైసిపిని ఒంటిచేతితో నడిపించానన్నారు. రాష్ట్రంలో కమ్యూనిస్టులకు ఉన్న ధైర్యం తమకు లేదని, ఎన్ని ప్రభుత్వాలు, ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా వారి పార్టీ, క్యాడర్ చెక్కుచెదరలేదన్నారు. రాష్ట్రంలో పార్టీని కాపాడుకునే పరిస్థితి లేదని, ఆ ధైర్యం తమకు లేదని వెల్లడించారు. ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార పార్టీ ప్రలోభాలకు లొంగిపోయారని, ఉన్న ఎమ్మెల్యేని కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని, తనను నమ్మిన కార్యకర్తలను కాపాడుకునేందుకు అనేక రాత్రులు భోజనం, నిద్ర లేకుండా ఆలోచించానని ఆవేదన వ్యక్తం చేశారు. తన వల్ల లబ్ధి పొందిన వారు చాల మంది ఉన్నా తనతో పాటు తన బాధలను పంచుకున్న వారు కొద్ది మందే ఉన్నారని, వారందరిని కాపాడుకోవడమే తన కర్తవ్యమని అన్నారు.

అవినీతిని ప్రోత్సహించకండి

కొత్తగూడెం, మే 2: సింగరేణి సంస్థలో జూనియర్ అసిస్టెంట్‌లుగా ఉద్యోగాలు పొందిన మీరంతా అదృష్టవంతులని, విధినిర్వహణలో అవినీతి చేయవద్దని, అదేవిధంగా ప్రోత్సహించవద్దని సింగరేణి డైరెక్టర్ (ఫైనాన్స్ అండ్ పా) జె పవిత్రన్‌కుమార్ అన్నారు. స్థానిక సింగరేణి మహిళా కళాశాలలో జరిగిన పోస్టింగ్ కౌన్సిలింగ్ కార్యక్రమానికి సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సింగరేణిలో కొత్తగా ఉద్యోగాలు పొందిన 402మంది జూనియర్ అసిస్టెంట్ అభ్యర్థులు, సింగరేణి అధికారులు ఈకార్యక్రమానికి హాజరయ్యారు. ఈసందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సింగరేణి సంస్థ ఒక్కటే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు. సింగరేణి అభివృద్ధికి కృషిచేసి భావితరాలకు మార్గదర్శకులు కావాలని కోరారు. విశిష్ట అతిథిగా హాజరైన డైరెక్టర్ ఇఅండ్‌ఎం పి రమేష్‌బాబు మాట్లాడుతూ సంస్థ అభివృద్ధికి కష్టపడి పనిచేసి ఉన్నత పదవులు పొందాలని కోరారు. జనరల్ మేనేజర్లు ఎ ఆనందరావు, కె బసవయ్య, ఉమామహేశ్వర్, రుష్యేంద్రుడు, ఎజిఎంలు ఎ నాగేశ్వరరావు, మురళీసాగర్, డిజిఎం ఎన్ చిట్టిబాబు, అనిల్‌కుమార్, శ్రీనివాస్, రాజ్‌గోపాల్, మూర్తి, సామ్యేల్‌రాజు, గోపిమోహన్, శ్రీనివాసాచారి, ఆర్ రమేష్, సాంబకృష్ణ, ఎన్ రమేష్‌లు పాల్గొన్నారు.
పాలేరు ఉప ఎన్నిక
వామపక్షాల టూర్ షెడ్యూల్
ఖమ్మం(కల్చరల్), మే 2: పాలేరు నియోజక వర్గ ఉప ఎన్నిక సిపియం అభ్యర్థి పోతినేని సుదర్శన్‌రావు విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం నుండి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో వామపక్షపార్టీల జిల్లా నాయకులతో టూర్ షెడ్యూల్‌ను సిపిఎం జిల్లా కమిటీ ప్రకటించినట్లు ఆ పార్టీ జిల్లా కమిటీటి సభ్యులు వై విక్రమ్ తెలిపారు. మంగళవారం నేలకొండపల్లి మండలం మూటాపురంలో ఉదయం 6 గంటలకే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ అభ్యర్ధి పోతినేని సుదర్శన్‌రావుతో పాటు సిపిఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, సిపిఐ జిల్లా నాయకులు ఎండి వౌలానా, సిపియం పాలేరు ఎన్నికల ఇన్‌చార్జి బి వెంకట్ తదితరులు పాల్గొంటారన్నారు. 3న నేలకొండపల్లి, 4న కూసుమంచి, 5న ఖమ్మం రూరల్ మండలాల్లో జరిగే ప్రచార కార్యక్రమంలో సిపియం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిలు పాల్గొంటారన్నారు.

వేసవి క్రీడా శిక్షణ ప్రారంభం

ఖమ్మం(స్పోర్ట్స్), మే 2: విద్యార్థుల్లో దాగిఉన్న అంతర్గత క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు జిల్లా స్పోర్ట్స్ అథారిటి ఆధ్వర్యంలో సోమవారం వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు సర్దార్ పటేల్ స్టేడియంలో సాయంత్రం ప్రారంభమయ్యాయి. శిబిరాలను చీఫ్ ప్లానింగ్ అధికారి జడ్ రాందాస్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన శిబిరాల్లో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించేందుకు ఈ శిబిరాలు తోడ్పడతాయన్నారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించి, నెల రోజులపాటు కొనసాగే శిక్షణా శిబిరాలకు పంపించాలని కోరారు. జిల్లా క్రీడాధికారి కబీర్‌దాస్ మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగానే ఈ సంవత్సరం కూడా గ్రామీణ ప్రాంతాల్లో 20శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రాంతాల వారిగా గుర్తింపు ఉన్న క్రీడలను గుర్తించి శిక్షణా కేంద్రాలను నిర్వహిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కొత్తగూడెం, బోనకల్, ఇల్లెందు, ఖమ్మం రూరల్, ఏన్కూర్, కల్లూరు, చింతకాని, మధిర, మణుగూరు, భద్రాచలం, పాల్వంచ తదితర కేంద్రాల్లో శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. పట్టణ కేంద్రంలో పోలీస్ పరేడ్‌గ్రౌండ్, పెవిలియన్‌గ్రౌండ్, సెయింట్ జోసప్‌హైస్కూల్‌తో పాటు స్టేడియంలో 17క్రీడాంశాలలో శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. నెల రోజుల పాటు జరిగే శిబిరాలలో పాల్గొన్న క్రీడాకారులకు సర్ట్ఫికెట్లు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. శిక్షణా కేంద్రాలను నిర్వహిస్తున్న ఫిజికల్ డైరెక్టర్లు, సీనియర్ క్రీడాకారులకు గౌరవ వేతనం అందజేస్తామన్నారు. సర్థార్‌పటేల్ స్టేడియంలో అధ్లెటిక్స్, జిమ్నాటిక్స్, బాడ్మింటన్, వెయిట్‌లిప్టింగ్, ఉషు, ఖోఖో, లాన్‌టెన్నిస్, కబడ్డీ, బాల్‌బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుడ్‌బాల్, స్కేటింగ్, కరాటే, హాండ్‌బాల్, స్విమ్మింగ్‌లలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్న శిక్షకులకు వివిధ క్రీడలకు సంబంధించిన క్రీడా పరికరాలను అందజేశారు.

ఆడబిడ్డను ఓడించేందుకు మంత్రులు అవసరమా...?
* కాంగ్రెస్ అభ్యర్థి సుచరిత
నేలకొండపల్లి, మే 2: పాలేరు ఆడబిడ్డనైన తనను ఓడించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ తన మంత్రి వర్గాన్ని ఎన్నికల రంగంలోకి దించడం ఎంతవరకు సబబు అని పాలేరు నియోజకవర్గ ఓటర్లు ఆలోచించాలని కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సుచరితరెడ్డి అన్నారు. రాంరెడ్డి వెంకటరెడ్డి ఆశయసాధన కోసమే ఈ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆచర్లగూడెం, నేలకొండపల్లి, అనాసాగరం, గువ్వలగూడెం, ముజ్జుగూడెం, సదాశివపూరం గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రతి ఇంటికి తిరిగి ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఉప ఎన్నిక రావడం దురదృష్టకరమన్నారు. వెంకటరెడ్డి పాలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని, ఆయన సతీమణిగా పాలేరు అభివృద్ధికి కృషి చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. పాలేరు నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందిన మహా నేత వెంకటరెడ్డి అని, ఆయన అడుగుజాడల్లో నడుస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి గోపాలరెడ్డి, చరణ్‌రెడ్డి, ఉన్నం బ్రహ్మయ్య, నేలకొండపల్లి గ్రామ సర్పంచ్ వంగవీటి నాగేశ్వరరావు, రాజపుత్ర శ్రీనివాససింగ్, నిర్మలరెడ్డి, గురవయ్య, టిడిపి నాయకులు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వడదెబ్బకు జిల్లాలో
నలుగురు మృతి
కారేపల్లి/ బోనకల్లు/దుమ్ముగూడెం మే 2: వడదెబ్బ తగిలి జిల్లాలో సోమవారం నలుగురు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి కారేపల్లికి చెందిన నేరెళ్ళ శంకర్(66) గత రెండు రోజుల క్రితం దగ్గరలోని బంధువుల ఇంటికి పని నిమిత్తం వెళ్ళాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం నుండి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో సోమవారం మృతి చెందాడు. కాగా మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి గ్రామానికి చెందిన పచ్చిపాల ముత్తయ్య(69) తమ వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండేవాడు. ఈ క్రమంలో ఎండు తీవ్ర అస్వస్థతకు గురై సోమవారం ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందాడు. మృతదేహాలని సింగరేణి ఆర్‌ఐ ఎర్రయ్య, వీర్‌వో బ్రహ్మం, వీఆర్‌ఏ కోటయ్యలు సందర్శించారు.
గోవిందాపురంలో వృద్ధురాలు...
వడదెబ్బకు బోనకల్లు మండల పరిధిలోని గోవిందాపురం(ఎల్)లో వృద్ధురాలు మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి గ్రామానికి చెందిన కోట బాలమ్మ(80) ఎండ తీవ్రతను తట్టుకోలేక మధ్యాహ్నం మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
రామారావుపేటలో వృద్ధురాలు
దుమ్ముగూడెం: మండల పరిధిలోని రామారావుపేట గ్రామానికి చెందిన నూపా భద్రమ్మ(69) అనే వృద్ధురాలు వడదెబ్బకు గురై సోమవారం మృతిచెందింది. వీఆర్‌వో వీరయ్య మృతురాలి ఇంటి వద్దకు వెళ్లి మృతికి గల కారణాలు ఆరా తీశారు.