ఖమ్మం

ఏన్కూరులో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏన్కూరు, డిసెంబర్ 17: తుఫాన్ ప్రభావంతో మండలంలో సోమవారం భారీ వర్షం కురిసింది. దీంతో మిర్చి తోటలు, కూరగాయలు, ఆకు కూరల తోటలు మొత్తం నీట మునిగి రైతులు ఆందోళన చెందుతున్నారు. కల్లాల్లో, ఇళ్ల ముందు, మార్కెట్‌లో వరి ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది. ఎన్నో వ్యయప్రయాసలతో పంటలు సాగు చేసి పండించినా చేతికందే సమయానికి తుఫాన్ రూపంలో పంటలు అన్ని నాశనం కావటంతో మండల రైతాంగం లబోదిబో మంటున్నారు. ప్రస్తుతం వరి ధాన్యం కొంత ఇళ్లకు చేరింది. మిర్చి తోటలు పూత కాతతో కళకళలాడుతున్నాయి. కొన్ని గ్రామాలలో టమాట, వంగ, బెండ, బీర, చిక్కుళ్లు, మునగ, కరివేపాకు తదితర పంటలు సాగు చేశారు. తుఫాన్ ప్రభావంతో గాలితో కూడిన వర్షం రావటంతో మిర్చి తోటలు గాలికి కింద పడిపోతున్నాయని, కూరగాయల తోటల్లో నీరు నిలిచి పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభం నుండి పంటలన్నింటికి చీడపీడలతో ఇబ్బందులు పడుతూ వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఎన్నో కష్టాలు పడ్డ రైతులకు పెథాయ్ తుఫాన్‌తో పంటలన్ని నీళ్లపాలై అప్పుల పాలైపోతున్నామని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షానికి గ్రామాలలోని అంతర్గత రోడ్లన్నీ జలమయమయ్యాయి. చలి గాలితో కూడిన వర్షం రావటంతో ప్రజలు ఇండ్లలో నుండి బయటకు రావటానికి భయపడి పోతున్నారు. మండలంలో ఆదివారం రాత్రి నుండి సోమవారం మద్యాహ్నం వరకు విద్యుత్ అంతరాయం కలిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు స్పందించి పంట నష్టాన్ని సర్వే చేసి ప్రభుత్వం నుండి రైతాంగానికి సహాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలని మండల రైతులు కోరుతున్నారు.

మండలంలో 945 ఎకరాల వరిపంట నష్టం

కామేపల్లి, డిసెంబర్ 17: తుఫాన్ ప్రభావం వల్ల మండలంలో 940 ఎకరాలు వరిపంట నష్టం వాటిల్లినట్లు మండల వ్యవసాయాధికారులు సోమవారం అంచనా వేశారు. గత రాత్రి నుండి మండలంలో కురుస్తున్న తుఫాను ప్రభావం వల్ల వర్షాలకు వరిపంట తీవ్రంగా నష్టం వాటిల్లింది. దీంతోపాటు పత్తి, మిర్చి పంటలు సైతం పాక్షికంగా నష్టం వాటిల్లినట్లు అంచనాలు చేస్తున్నారు. ఒకవైపు వర్షాభావంతో ఇతర నీటి వనరులు, బోరుబావుల ద్వారా ఎంతో కష్టపడి పండించుకున్న వరిపంట చేతికందే సమయంలో తుఫాను ప్రభావం వల్ల వర్షానికి నీటిపాలవ్వడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆరుగాలం శ్రమించి చేతికందిన పంట చేజారిపోవడంతో వారు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. కొందరు రైతులు మిషన్‌తో వరిపంటను కోయగా మరికొందరు పశుగ్రాసం కోసం కూలీలతో వరిపంటను కోయించారు. ఇవన్నీ వరిపొలాల్లో ఉండగానే వర్షం తాకిడితో పంటమొత్తం నీటి పాలయ్యాయి. సోమవారం మండల వ్యవసాయాధికారి తారాబాయి వివిధ గ్రామాల్లో నష్టపోయిన వరిపంటను పరిశీలించి అంచనాలు రూపొందించారు. 243 ఎకరాలు నిలిచిన వరి, 702 ఎకరాలు నీట మునిగిన వరి నష్టపోయినట్లు నివేదికలను ప్రభుత్వానికి అందజేశారు. అదే విధంగా తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.