ఖమ్మం

ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తే సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, ఫిబ్రవరి 20: ఆలయ ఆచార, సంప్రదాయాలను మార్చే అధికారం ఎవరికీ లేదని, ఈ విషయంలో కొందరు పనిగట్టుకుని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో తాళ్ళూరి రమేష్‌బాబు పేర్కొన్నారు. సంప్రదాయాలను కాలరాస్తున్నారంటూ ఆరోపణలు చేసేవారు తగిన ఆధారాలు ఉంటే నేరుగా తనను కాని, కమిషనర్‌ను కాని సంప్రదించాలని, ఆధారాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. దేవస్థానం వద్ద గల చిత్రకూట మండపంలో ఈవో బుధవారం విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. రాముడిని రామనారాయణుడు అని పలకడం సరికాదని కొందరు ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. ఏదైనా అనుమానం ఉంటే పుస్తకాలు ముద్రించడం, కరపత్రాలు పంచడం సరైన పద్ధతి కాదని, ఈ వైఖరి చూస్తే కావాలనే చేస్తున్నట్లు ఉందన్నారు. రామనారాయణుడు అనే పదం అనేక ఏళ్లుగా వాడుకలో ఉన్నదేనని, ఈ విషయంపై అర్చక స్వాములతో ఇప్పటికే మాట్లాడామని ఆయన తెలిపారు. వివాదం పెద్దది కాకముందే పరిష్కరిస్తామని, రామనారాయణ వివాదంపై ఇప్పటికే ఇరువర్గాల వారి వాదనలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని, నివేదిక కూడా ఇచ్చామని ఈవో తెలిపారు. దీనిపై ఎటువంటి ప్రకటన చేయాలన్నా కమిషనర్‌కే అధికారం ఉందని, ఈ వివాదంపై వెంటనే ఉత్తర్వులు రావాలని కమిషనర్‌ను కోరామన్నారు. ఏటా శ్రీరామనవమికి ముందు కొందరు ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించేలా కుట్ర చేస్తున్నారని, రాముడిని రామనారాయణుడు అని అనడంలో ఎటువంటి తప్పు లేదని ఈవో స్పష్టం చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అర్చకస్వాములు, ఆరోపణలు చేస్తున్నవారు దీనిపై మాట్లాడకూడదని, దీనికి త్వరలోనే పరిష్కారం దొరుకుతుందన్నారు. ఆలయ స్థానాచార్యులు స్థలశాయి మాట్లాడుతూ కొనే్నళ్లుగా నవమికి ముందు ఇటువంటి వివాదం రాజేస్తున్నారని, ఆలయంలో పూజా క్రతువులు వైష్ణవ సంప్రదాయం, పాంచరాత్రాగమన శాస్త్ర ప్రకారం జరుగుతున్నాయన్నారు. ‘భద్రాద్రీశునికి జరుగుతున్న ఘోరాపచారం’ పేరుతో వెలువడిన పుస్తకంలో పొందుపర్చిన విషయాలన్నీ అవాస్తవాలని, భద్రాద్రి ఆలయ సంప్రదాయాలకు గొడ్డలిపెట్టులా ఉన్నాయన్నారు. ఇక్కడి అర్చకుల మనోభావాలను దెబ్బతీసేలా కొందరు ఇటువంటి పుస్తకాలు ముద్రించి కుట్ర చేస్తున్నారని, ఆలయంలో ఉన్న ఆరోగ్యకర వాతావరణాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆలయ సంప్రదాయాలకు విఘాతం కలిగిస్తే సహించమని, సిగ్గు శరం లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని, రామనారాయణ వివాదంపై ఎటువంటి చర్చకైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఆలయ విశ్రాంత ప్రధానార్చకుడు కోటి కృష్ణమాచార్యులు, వేద పండితుడు మురళీ కృష్ణమాచార్యులు ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రాద్రిలో జరిగేది శ్రీరామ కల్యాణమా, లేక లక్ష్మీనారాయణుల కల్యాణమా అనే ప్రశ్న అసంబద్ధమని, రామదాసు కాలం నుంచి భద్రాద్రిలో శ్రీరామ కల్యాణమే జరుగుతోందని తెలిపారు. ఆలయ ప్రాచీనతను దెబ్బతీసేలా, తప్పుల తడకతో కొందరు పుస్తకాలు ముద్రించి విషయాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని, వీరి పోకడ శైవ, వైష్ణవ వివాదాలకు దారితీసేలా ఉందన్నారు. 1961లోనే ప్రభుత్వం, దేవాదాయ శాఖ కలిసి ముద్రించిన పుస్తకంలో రామనారాయణుడు అని ఉందని, కానీ దీన్ని బూతద్దంలో చూపుతూ కొందరు పూట గడుపుకుంటున్నారని ఆరోపించారు. భద్రాద్రి ఆలయంలో వైష్ణవ సంప్రదాయాలను మరింత పటిష్టం చేస్తామని, రామదాసు ఆచారాలను ప్రతిబింబించేలా చూస్తామన్నారు. విలేఖర్ల సమావేశంలో అర్చక స్వాములు, వేద పండితులు, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.