ఖమ్మం

తెరపైకి ‘అంబేద్కర్ ఆదివాసీ జిల్లా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, జూన్ 3: ప్రత్యేక జిల్లా ఉద్యమాలతో ఎగిసిపడుతున్న భద్రాద్రిలో మరో నూతన పోరు మొదలైంది. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన భద్రాచలంను కేంద్రంగా ఉంచి జిల్లా ఏర్పాటు చేయాలని అటు గిరిజనులు.. భద్రాచలం కేంద్రంగానే ఆదివాసీ జిల్లా ఏర్పాటు చేయాలని ఇటు ఆదివాసీలు ఉద్యమం చేస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వీటికి భిన్నంగా ఆదివాసీ సంఘాలు భద్రాచలం కేంద్రంగా ‘అంబేద్కర్ ఆదివాసీ జిల్లా’ ఏర్పాటు చేయాలని పట్టుబడుతున్నాయి. రాజ్యాంగ నిర్మాతకు ప్రభుత్వం గౌరవం ఇవ్వాలని, ఈ క్రమంలో అంబేద్కర్‌ను గుర్తిస్తూ భద్రాచలం కేంద్రంగా అంబేద్కర్ ఆదివాసీ జిల్లాను ఏర్పాటు చేయాలని వారు నూతన గళం వినిపించడం విశేషం. దీంతో ఇంతకాలం భద్రాచలం కేంద్రంగా జిల్లా సాధన కోసం సాగుతున్న ఉద్యమం కొత్తరూపు సంతరించుకోనుంది. ఈ డిమాండ్‌తో జాతీయస్థాయి మద్దతు కూడగట్టుకునేందుకు ఆదివాసీ సంఘాల నాయకులు సన్నద్ధమవుతున్నారు. జాతీయస్థాయిలో కూడా భద్రాచలం కేంద్రంగా అంబేద్కర్ ఆదివాసీ జిల్లాను ఏర్పాటు చేయాలని తమ ఉద్యమాన్ని చాటేందుకు సిద్ధమవుతున్నామని గిరిజన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు పాయం సత్యనారాయణ శుక్రవారం వెల్లడించారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అంబేద్కర్‌ను గుర్తిస్తూ జిల్లాల ఏర్పాటు జరగలేదని, ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం భద్రాద్రివాసుల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకొని జిల్లాల ఏర్పాటులో భాగంగా భద్రాచలం కేంద్రంగా అంబేద్కర్ ఆదివాసీ జిల్లాను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా కొత్తగూడెంను జిల్లా చేసేందుకు మొగ్గు చూపుతుండటంతో ఇక్కడ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ భద్రాచలం కేంద్రంగా జిల్లా ఏర్పాటు జరిగే వరకు ఉద్యమం ఆపేదిలేదని అటు భద్రాచలం జిల్లా కేంద్ర సాధన సమితి, ఇటు ఆదివాసీ సంఘాలు తెగేసి చెబుతున్నాయి. నూతనంగా జిల్లా ఏర్పాటులో అంబేద్కర్ పేరు సూచించడంతో ఈ ఉద్యమం అన్ని వర్గాలను ఐక్యం చేస్తుందని రాజకీయ విశే్లషకులు అంచనా వేస్తున్నారు. అంబేద్కర్ నామంతో ఆదివాసీ ప్రాంతాన్ని జిల్లా చేయాలని కోరడంతో ప్రభుత్వం కూడా సందిగ్ధంలో పడే అవకాశాలు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. రాష్ట్ర విభజనతో చెల్లాచెదురైన భద్రాచలంకు పూర్వ వైభవం రావాలంటే జిల్లా సాధనే ఏకైక మార్గమని భావిస్తున్న దరిమిలా ఇక్కడ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆమరణ నిరహార దీక్షలు కూడా కొనసాగుతున్నాయి. జిల్లాను సాధించుకునే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని, ప్రజాస్వామ్య పద్ధతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివాసీ ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించి డిమాండ్లు వినాలని ఆదివాసీ సంఘాల రాష్ట్ర నేత సొంది వీరయ్య డిమాండ్ చేశారు.