ఖమ్మం

హోరెత్తిన పోడు పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జూన్ 6: బంగారు తెలంగాణ అంటూ ఊకదంపుడు ప్రసంగాలు చేస్తున్న కెసీఆర్ బంగారు పంజరంలో ఈ తెలంగాణ బందీగా మారిందని కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, పోడు భూములకు పట్టాలివ్వాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం గిరిజనులు ఐటీడీఏను ముట్టడించారు. భారీ ధర్నా నిర్వహించారు. సుమారు 5వేల మంది గిరిజనులతో భద్రాచలం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఐటీడీఏ వద్దకు చేరుకుని ముట్టడించారు. ఐటీడీఏ ముందు బైఠాయించిన సీపీఐ శ్రేణులు, గిరిజనులు చేసిన నినాదాలతో భద్రాద్రి హోరెత్తింది. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ 2005 అటవీహక్కుల చట్టం ప్రకారం కేవలం 50వేల మందికే పట్టాలు పంపిణీ చేసి మిగిలిన 4లక్షల మందిని విస్మరించారని ఆరోపించారు. ప్రతీ దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఇప్పుడు గిరిజనుల సాగులో ఉన్న భూములను లాక్కునే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం బడా కంపెనీలకు వేల ఎకరాలు ఎలా కట్టబెడుతోందని ప్రశ్నించారు. 1.40లక్షల ఎకరాల భూమిని పరిశ్రమల పేరిట ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కెసీఆర్ హరితహారం పేరుతో ఆ భూమిలో మొక్కలు నాటుకోవచ్చు కదా? అని నిలదీశారు. పేదల కడుపు కొట్టి భూములను లాక్కునేందుకు ఈ ప్రభుత్వం సిద్ధవౌతోందని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. నిర్బంధ తెలంగాణ కొనసాగుతోందని, కోదండరామ్ గొంతు మూగబోయిందని, గద్దర్ ఆటపాట ఆగిపోయిందని, హరగోపాల్ మాటలు లేవని, విమలక్కను జైలు పాల్జేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం కలం తీసి గళం విప్పి గజ్జెకట్టి ఆడిపాడిన వారిని నిర్బంధాలకు గురి చేస్తున్నారని వారి గొంతు నులుముతూ పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్‌కు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2500కోట్లు కేటాయించి రూ.2వేల కోట్లు ఖర్చు చేసిందని, ఇపుడు కెసీఆర్ ప్రభుత్వం వాటి పేరు మార్చి రూ.8వేల కోట్లు మళ్లీ కేటాయించారని ఆరోపించారు. చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించడం ఈ ముఖ్యమంత్రికి నామోషీ అని కరువు తాండవిస్తుందని కేంద్రానికి విన్నవించడం అవమానంగా భావిస్తున్న ఈ ప్రభుత్వం ధనిక తెలంగాణగా గొప్పలు చెప్పుకుంటుందని ఎద్దేవా చేశారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, సహాయకార్యదర్శి సాబీర్ పాషా మాట్లాడుతూ రెండేళ్ల క్రితం రూ.60వేల కోట్ల అప్పులు ఉంటే ఇపుడు రూ.1.60లక్షల కోట్లు అప్పులు పెరిగాయన్నారు. ఈ తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత కెసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏ అంశంపై ఏ వర్గం ప్రజలకు న్యాయం జరిగిందో కెసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పోడు భూములకు పట్టాలివ్వాలని, గిరిజనులపై అటవీ అధికారుల దాడులను నిలిపివేయాలని, పేదలకు భూ పంపిణీ చేయాలని, ప్రభుత్వం తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు రావులపల్లి రాంప్రసాద్, ఏఐటీయూసి జిల్ల కార్యదర్శి సింగు నర్సింహరావు,వ్య.కా.సం. జిల్లా కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు, డివిజన్ పార్టీ కార్యదర్శి కల్లూరి వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శి రావులపల్లి రవికుమార్, తమ్మళ్ల వెంకటేశ్వరరావు, కుంజాశ్రీను, ఆకోజు సునీల్, బర్లపాటి సాయి, రాజు తదితరులు పాల్గొన్నారు.

భారీగా మోహరించిన పోలీసులు
5వేల మంది గిరిజనులు ప్రదర్శనగా వచ్చి నినాదాలు చేయడంతో భద్రాచలం పట్టణం దద్దరిల్లింది. ముందుగానే పరిస్థితిని నిఘా వర్గాల ద్వారా పసిగట్టిన ఏఎస్పీ భాస్కరన్ మణుగూరు డీఎస్పీ రాజేశ్, పాల్వంచ, భద్రాచలం సీఐలు షుకూర్, బాణాల శ్రీనివాసుల నేతృత్వంలో భారీగా పోలీసులను మోహరించారు. నిఘా వర్గాలు సమాచారాన్ని సేకరించగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ ఎస్సై కరుణాకర్ ఐటీడీఏ గేటు వద్ద సిబ్బందితో పహారా కాశారు. ఆందోళనకారులను లోనికి వెళ్లనీయలేదు. పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు ఏపీఓ జనరల్ భీంరావును పంపించి సీపీఐ నేతలను చర్చలకు ఆహ్వానించారు. వారితో చర్చించి గిరిజనుల తరుపున వినతిపత్రాలను స్వీకరించారు. పోడు భూముల సమస్యపై దృష్టిసారిస్తామని ఈ సందర్భంగా పీఓ హామీ ఇచ్చారు.

పర్యావరణ పరిరక్షణతోనే మానవాళి మనుగడ
* జిఎం ఆనందరావు
కొత్తగూడెం రూరల్, జూన్ 6: మానవవాళి మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఎంతో ముఖ్యమని జిఎం (పర్సనల్ వెల్ఫేర్ అండ్ సిఎస్‌ఆర్) ఆనందరావు అన్నారు. పర్యావరణ దినోత్సవ వేడుకలలో భాగంగా సోమవారం సింగరేణి ప్రధాన కార్యాలయం, కొత్తగూడెం ఏరియాలోని జిఎం కార్యాలయంలో జరిగిన దినోత్సవ వేడుకలలో ఆయన మాట్లాడుతూ సింగరేణి పారిశ్రామిక అభివృద్ధి సాధించడంతో పాటు ప్రకృతి సిద్ధంగా లభించే భూమి, నీరు, గాలిని కలుషితంకాకుండా కాపాడి భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. భావితరాల వారికి సుసంపన్నమైన, ఆహ్లాదకరమైన, సురక్షితమైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రతిఒక్కరు కృషి చేయాలన్నారు. ఎస్‌ఓటుసిజిఎం షాలెంరాజు మాట్లాడుతూ నదులు ఎండిపోవడం వలన తాగునీరు అందక ప్రజలు అల్లడిపోవడం, అతివృష్టి, అనావృష్టివంటివి పర్యావరణ విధ్వంసానికి ఉదాహరణలు అన్నారు. భూమిపై ఎన్నోజీవుల జాతులు ఉన్నా మానవుడొక్కడే పర్యావరణ క్షీణతకు కారణవౌతున్నాడని ప్రతిసెకన్‌కు 1.5ఎకరాల అడవులను మానవుడు నరికివేస్తున్నట్లు శాస్తవ్రేత్తలు గుర్తించారని అన్నారు. పర్యావరణాన్ని కాపాడాలంటే సాధ్యమైనన్ని చెట్లు పెంచాలని సూచించారు. చెట్లుపెంచడం వలన సకాలంలో వర్షాలుపడి కాలుష్య సమస్య పరిష్కారవౌతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడవులను 33శాతం విస్తరించాలని, రాబోయే మూడేళ్ళలో 230కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. ఎన్విరాన్‌మెంట్ మేనేజర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచస్థాయిలో ఆలోచించు-ప్రాంతీయంగా ఆచరించు అని ప్రపంచదేశాలు ఇచ్చిన నినాదాన్ని వినిపించారు. ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కలిగిన సుమారు 100దేశాలు పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయని, ఆఫ్రికాలోని అంగోలాదేశం ఈసారి పర్యావరణ దినోత్సవానికి అతిధ్యమిస్తుందని, అదేవిధంగా అమేజాస్ పర్యావరణాన్ని కాపాడేందుకు గోవైల్డ్ఫ్‌ర్ లైఫ్ అనే నినాదాన్ని ఇచ్చిందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈకార్యక్రమంలో టిబిజికెఎస్ ఉపాధ్యక్షులు సంగెం చందర్, జిఎం (బిడి) సిహెచ్ నర్సింహారావులు ప్రసంగించగా చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ మధుసూధన్‌రావు, డిజిఎం (పర్సనల్) దీక్షిత్‌లు, డివైఎల్‌జిఆర్ ఎన్విరాన్‌మెంట్ త్యాగేశ్వర్, సిఎంఓఎఐ ట్రైజరర్ భుజంగరావు, టిబిజికెఎస్ సెంట్రల్‌కమిటీ మెంబర్ నిర్మలదేవి, పిట్‌సెక్రటరీ వజ్రమ్మ, డిజిఎం క్వాలిటీ చంద్రకాంత్, డివైపిఎం కిరణ్‌బాబు, పర్చేజ్ ఎస్‌ఇ శ్రీ్ధర్, ఎస్టేట్స్ మేనేజర్ నర్సింహా, డివైపిఎం వరప్రసాద్, ఐటి మేనేజర్ శేషశ్రీ, సీనియర్ ఎఓ మధుబాబు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

భారీ వర్షంతో తడిసిముద్దయిన నగరం
* రోడ్లపైకి డ్రైనేజి నీరు
ఖమ్మం(మామిళ్ళగూడెం), జూన్ 6: సోమవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి నగరం తడిసి ముద్దయింది. సుమారు గంటన్నర పాటు కురిసిన కుండపోత వానతో నగరమంతా వర్షపునీరు ఏరులైపారింది. మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో అల్లాడిన నగర ప్రజలు 3 గంటల సమయంలో గంటన్నరపాటు కురిసిన వర్షానికి ఉపశమనం పొందారు. కాగా గంటపాటు కురిసిన కుండపోత వర్షంతో ఒక పక్క ఆనందంగా ఉన్నా డ్రైనేజి వాటర్ పొర్లడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని కమాన్‌బజార్, గాంధీచౌక్, కస్బాబజార్, మామిళ్ళగూడెం, వైరారోడ్డు, కాల్వొడ్డు, వినోద ధియేటర్ ప్రాంతాల్లో వర్షపునీరు డ్రైనేజిల్లోంచి పొర్లి రోడ్డుపైకి చేరింది. గాంధీచౌక్, కమాన్‌బజార్, వినోద ధియేటర్ ప్రాంతాల్లో రోడ్లపై నడుములోతు నీరు రోడ్డుపైకి రావడంతో పాదచారులు నడిచే పరిస్థితి లేకపోయింది. రోడ్డు ప్రక్కన పార్కింగ్ చేసిన వాహనాలు నీటిలో మునిగిపోయాయి. వర్షాకాలం ప్రాంరభానికి ముందే నగరంలోని డ్రైనేజీల వాటర్ పైకి రావడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కార్పొరేషన్ అధికారులు డ్రైనేజీలను శుభ్రం చేయకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని, ప్రతి సంవత్సరం వర్షం వస్తే తమకు ఇలాంటి అనుభవాలు ఎదురవుతుందని, అధికారులు, పాలకులు ఈ సమస్యను పరిష్కరించడంలేదని ఆరోపిస్తున్నారు.
వరద ధాటికి కూలిన సైడ్‌డ్రైన్
ఖానాపురం హవేలి: ఖమ్మం నగరంలో సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి సైడ్‌డ్రైన్ కూలిపోయింది. ఎన్టీఆర్ బైపాస్ రోడ్డు నుంచి ఇల్లెందు వైపు వెళ్ళే రోడ్డులో ఖానాపురం స్టేజీ సమీపంలో ఇటీవల సైడ్‌డ్రైన్ నిర్మించగా అది ఈ వర్షానికే కూలిపోవటంతో స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. మొదట్లో కురిసిన వర్షానికే సైడ్‌డ్రైన్ కూలిపోతే మున్ముందు కురిసే వర్షాలకు అసలు డ్రైన్ ఉంటుందా...? లేదా...? అనేది ప్రశ్నార్థకంగా స్థానికులు చర్చించుకుంటున్నారు.

అధికారుల తీరుపై భట్టి ఆగ్రహం

బోనకల్, జూన్ 6: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జరిగిన మండల స్థాయి సమీక్షా సమావేశం అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య వాడివేడిగా జరిగింది. పలు సమస్యలను ప్రజాప్రతినిధులు మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క దృష్టికి తీసుకెళ్ళారు. ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధుల కింద గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించి అందులో 40శాతం తాగునీటికి, 30శాతం కరెంటు బిల్లులకు మరలా తిరిగి తీసుకుంటుందని తెలిపారు. మండల కేంద్రంలో ఎనె్నస్పీ పనులు నాసిరకంగా జరిగాయని ఎంపిపి చిట్టిమోదు నాగేశ్వరరావు, జడ్పీటిసి బాణోత్ కొండా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సంబంధిత ఎనె్నస్పీ అధికారులు పట్టించుకోవడం లేదని భట్టి దృష్టికి తీసుకెళ్ళారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ఎనె్నస్పీ అధికారులు పనుల విషయంలో అలసత్వం వహిస్తే సం బంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని సూచించారు. హరితహారం పథకం ద్వారా ప్రభుత్వం పదికోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని, ఒక్క మొక్క కూడా క్షేత్రస్థాయిలో బ్రతకలేదన్నారు. ఇంధిరమ్మ బిల్లులు రాక నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం పావలా వడ్డీ, వడ్డీలేని రుణాలను నిలిపివేసి డ్వాక్రా మహిళలు జీవితాలతో చెలగాటం ఆడుతుందన్నారు. తక్షణమే మండలంలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అధికారులను ఆయన ఆదేశించారు. మండలంలో నెలరోజుల్లోపు బెల్టుషాపులు లేకుండా చేస్తామని ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్ ఎస్‌ఐ రాజసమ్మయ్య భట్టికి హామీనిచ్చారు. అనంతరం ఆయన స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంకుడు గుంటకు శంకుస్థాపన చేశారు. ఈ సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ డిఇ నర్సింహరావు, డిఆర్‌డిఇ కోటేశ్వరరావు, ఇరిగేషన్ డిఇ నారాయణ, ఎంపిడిఓ విద్యాలత, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మాతృ మరణాలు
జరగకుండా చూడాలి
* ఎజెసి శివ శ్రీనివాస్
ఖమ్మం(జమ్మిబండ), జూన్ 6: మాతృ మరణాలు అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అడిషనల్ జాయింట్ కలెక్టర్ శివ శ్రీనివాస్ వైద్యాధికారులకు సూచించారు. సోమవారం టిటిడిసి సమావేశ మందిరంలో మెటర్నల్ డెత్ రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ రివ్యూ మీటింగ్‌లో మొత్తం ఆరు కేసులను పరిశీలన చేసి ప్రతి కేసు వివరాలతో పాటు ఆశా, ఏఎన్‌ఎం, వైద్యాధికారులు స్పందించిన తీరులు పరిశీలించారు. ఈ ఆరు కేసుల మరణానికి గల కారణాలను వైద్యులతో సమీక్షించారు. మాతృ మరణాలు జరగకుండా వైద్యాధికారులు, పారా మెడికల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా సరైన సమయంలో చేయాల్సిన, పాటించవల్సిన నియమాల గురించి తల్లులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కొండల్‌రావు మాట్లాడుతూ మాతృ మరణాలకు కారణాలు తెలుసుకొని వాటిని క్షుణ్ణంగా పరిశీలించి మున్ముందు జరగకుండా చూడాలన్నారు. మరణానికి కారణాలా, సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలా, ఆస్పత్రుల నిర్లక్ష్యమా అని తెలుసుకోవాలన్నారు. పరీక్షలు సరిగ్గా చేయకపోవడం కూడా కారణమైతే వాటిని సరిదిద్దుకోవాలని సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా గర్భిణీలు పాటించాల్సిన నియమాలు, జాగ్రత్తల గురించి అవగాహల కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు కొల్లు ఆనందవాణి, బి వెంకటేశ్వర్లు, కృపా ఉషశ్రీ, విజయలక్ష్మి, మాలతి, భాస్కర్, హర్‌నాధ్‌బాబు, వైద్యాధికారులు ప్రసాద్, అన్నామేరి, మంగళబాయి, సాంబశివారెడ్డి, పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.

సాదా బైనామ ఆన్‌లైన్ సేవలకు అంతరాయం

నేలకొండపల్లి, జూన్ 6: ఈ నెల 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సాదా బైనామకు ఉచితంగా రైతులు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశండంతో కేంద్రాల వద్ద రైతులు క్యూలో నిలబడి పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాదా బైనామ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి క్యూలో ఉండగా మీసేవ కేంద్రాల్లోని ఆన్‌లైన్ సేవలు మొరాయించడంతో రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన రైతులు పడిగాపులుకాస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఈ నెల 2వ తేదీ నుంచి ప్రభుత్వం సాదా బైనామకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పినప్పటికీ మీసేవ కేంద్రాల్లో ఆన్‌లైన్ సౌకర్యంలో అంతరాయం ఏర్పడడంతో దరఖాస్తులను స్వీకరించలేదు. కాగా 5వ తేదీ నుంచి దరఖాస్తులు కేంద్రాల్లో తీసుకుంటున్నప్పటికీ గంట గంటకు ఆన్‌లైన్ సౌకర్యం నిలిచిపోవడంతో రైతులు మీసేవ కేంద్రాల వద్ద తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివిధ గ్రామాల నుంచి పెద్దఎత్తున రైతులు మీసేవ కేంద్రాల వద్ద క్యూ కట్టగా రైతుల అవసరాలను ఆసరాగా తీసుకొని కొన్ని కేంద్రాల నిర్వహకులు ఉచిత సేవలు కాస్తా నగదు సేవలుగా మార్చుకొని డబ్బులు దోచుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాదాబైనామ దరఖాస్తు గడువు 10 రోజులుగా నిర్ణయించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం విధించిన నిర్ణిత గడువును పొడిగించాలని రైతులు కోరుతున్నారు. ఓ పక్క ఖరీఫ్ సీజన్‌ను ప్రారంభించేందు భూములను సిద్ధం చేసుకుంటున్న రైతులకు సాదాబైనామ రావడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొలం పనులు వదిలిపెట్టి మీసేవ కేంద్రాల వద్ద గంటల తరబడి నిలబడడంతో వారి పనులు వాయిదా పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెండింగ్ ఫిర్యాదులపై కలెక్టర్ ఆగ్రహం
ఖానాపురం హవేలి, జూన్ 6: పెండింగ్ ఫిర్యాదులను పరిష్కరించటంలో అధికారులు నిర్లక్ష్యం వహించటంతో జిల్లా కలెక్టర్ లోకేష్ ఆయా శాఖల అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం గ్రీవెన్స్‌డేలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. గత వారం డిసిహెచ్‌ఎస్ 28, గృహనిర్మాణ శాఖ 4, ఎంపిడివోలు 3, డ్వామా 2, డిఆర్‌డిఏ 1 దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలన్నారు. అదే విధంగా గతంలో కార్పొరేషన్ పరిధిలో 38, డిఆర్‌డిఏ 37, ఎంపిడివోలు 30, జిల్లా పంచాయతీ అధికారి 28, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి 14, ఏడి ల్యాండ్ సర్వే 10, డిఎఫ్‌ఓ 17 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పెండింగ్‌లో దరఖాస్తులను పెంచటంతో పాటు గ్రీవెన్స్‌డేకు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆదేశించారు. ప్రధానంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూమి కొనుగోలుకు ఎకరాకు 10లక్షల రూపాయలు పరిహారంగా అందించాలని అర్జిదారులు కోరగా, ప్రభుత్వపరంగా 7లక్షల రూపాయలు మాత్రమే చెల్లించగలమని స్పష్టం చేశారు. సాదాబైనమా స్పష్టతనివ్వాలని, మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యత పెంచాలని, మోరంపల్లి బంజర్ - జింకలగూడెం గ్రామాల మధ్య నిర్వహించనున్న టోల్‌గేట్‌ను వేరే ప్రాంతానికి మార్చాలని ఆ ప్రాంతవాసులు కలెక్టర్‌కు విన్నవించారు. స్పందించిన కలెక్టర్ దీనిపై విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. ఏన్కూరు మండలం నూకలపాడు గ్రామానికి చెందిన వేల్పుల జయరాజు తన గృహం లెంటల్ లెవల్ పూర్తయిందని, తనకు ఇంటి బిల్లు చెల్లించాలని కలెక్టర్‌ను కోరగా సమస్యను పరిష్కరించాలని హౌసింగ్ పిడిని ఆదేశించారు. ఖమ్మం మమత ఆసుపత్రి సమీపంలో గృహాలను తొలగించారని, తమకు ఇంటి స్థలం కేటాయించాలని చెరువుబజార్‌కు చెందిన పాకలపాటి గురువులు కోరగా సమస్యను పరిష్కరించాలని ఆర్డీవోను ఆదేశించారు. పెండింగ్ ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏజెసి శివ శ్రీనివాస్, డిఆర్వో శ్రీనివాస్, గ్రీవెన్స్ మానిటరింగ్ సెల్ ఇన్‌చార్జి ఆంజనేయశర్మ పాల్గొన్నారు.

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి : ఎస్పీ

ఖమ్మం(క్రైం), జూన్ 6: బాధితుల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ షానవాజ్‌ఖాసీం పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజాదివస్ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుండి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విన్నపాలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం కోసం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. దుర్వ్యసనాలకు భానిసైన భర్త తన పిల్లలను శారీరకంగా, మానసికంగా చిత్ర హింసలకు గురిచేస్తున్నారని, తల్లిదండ్రులు పేదరికంలో అనుభవిస్తున్నప్పటికీ అదనపు కట్నం కోసం వేదిస్తున్నాడని మరొకరు, తమ పెళ్ళైన నాటి నుండి గృహ నిర్భందం చేసి చిత్ర హింసలు పెడుతున్న, భర్త, అత్తమామ, బావలపై చర్యలు తీసుకోవాలని, తన కొడుకు మరణించిన తర్వాత కోడలు తన కుటుంబాన్ని అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తుందని ఒక అతను ఇలా వ్యక్తిగత సమస్యలతో పాటు చనిపోయిన తన భర్త స్తిరాస్థి కాజేసేందుకు బంధువులు ప్రయత్నిస్తున్నారని, పట్టాదారు పుస్తకం, పహణీ నకల్లు ఉన్న తన స్వంత భూమిని ఆక్రమించుకున్నారని తదితర భూవివాదం, ఆర్థిక సమస్యలు దాదాపు 20వరకు ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.
రైల్వే లెవెల్‌క్రాసింగ్‌లో
అప్రమత్తత అవసరం
* సేఫ్టి అధికారి సుధాకర్
రుద్రంపూర్, జూన్ 6: రైల్వే గేటులెవల్ క్రాసింగ్ దాటేటప్పుడు ప్రజలు అప్రమత్తంగావుండి వాహనాలను నడపాలని సేఫ్టి అధికారి సుధాకర్ అన్నారు. కొత్తగూడెం (్భద్రాచలం రోడ్)రైల్వేస్టేషన్‌లో అంతర్జాతీయ రైల్వే లెవల్ క్రాసింగ్ భద్రతా వారోత్సవాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఆర్‌టిఎ ధన్‌రాజ్‌బజాజ్ హాజరయ్యారు. సేఫ్టి అధికారి సుధాకర్ మాట్లాడుతూ సౌత్‌సెంట్రల్ రైల్వే డివిజన్ సేఫ్టి అధికారి కెఎల్ మీనా ఆదేశాల మేరకు ఈవారోత్సవాలు చేపడుతున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడో ఒకచోటు రైల్వేలెవెల్ క్రాసింగ్‌ల వద్ద తరుచూ జరుగుతున్న ప్రమాదాలతోప్రజలు, స్కూల్ విద్యార్థులు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాణం కంటే ప్రపంచంలో ఏదీ ముఖ్యం కాదని అన్నారు. రైల్వే గేట్ల ను దాటుతున్న సమయంలో వాహన చోదకులు సిగ్నల్స్‌ను గమనించాలని, నిబంధనలను తప్పకుండా పాటించాలని సూచించారు. రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల వద్ద వాటిని దాటేసమయాల్లో వాహనదారులు సంయమనం పాటించాలని సూచించారు. రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ లెవెల్ క్రాసింగ్ భద్రతావారోత్సవాలలో భాగంగా జూన్ 6వ తేదీనుండి జూన్ 10వ తేదీ వరకు లెవెల్ క్రాసింగ్ భద్రతావారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. మణుగూరు నుండి డోర్నకల్ మధ్య మాన్ గేటెడ్, అన్‌మ్యాన్ గేటెడ్ లెవెల్ క్రాసింగ్ గ్రామాల ప్రజలకు, కొత్తగూడెం బస్టాండ్ లోని ఆర్‌టిసి డ్రైవర్లకు దీనిపై విస్తృతస్థాయిలో అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేసారు. ఈకార్యక్రమంలో అధికారులు సుబ్బారావు, ఇంజనీర్ అధికారి మల్లేశ్వరరావు, కొత్తగూడెం రైల్వేసిబ్బంది పాల్గొన్నారు.