ఖమ్మం

తెరాసలో ముసలం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైరా, జూన్ 16: తెలంగాణ రాష్ట్ర సమితిలో నాయకుల మధ్య విభేదాలతో ముసలం ప్రారంభమైందని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గురువారం స్థానిక నీటిపారుదల శాఖ విశ్రాంతి భవనంలో విలేఖరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పరిపాలనను కేవలం కెసిఆర్ కుటుంబానికి చెందిన ఆ నలుగురు మాత్రమే శాసిస్తున్నారని ఏద్దేవా చేశారు. ప్రతి విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ తన కుమారుడు కెటిఆర్, కూతురు కవిత, మేనల్లుడు హరీష్‌రావులతోనే పాలన సాగిస్తున్నారన్నారు. ఇది కుటుంబ పాలన మాత్రమేనని, ఇది ఎంతో కాలం కొనసాగదని జోస్యం చెప్పారు. తెరాసలో మొదటి నుండి ఉన్న వారికి పాలనాపరమైన అంశాలలో ప్రాధాన్యం తగ్గిందని, నాడు ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వారిని కాదని ఆంధ్రపార్టీలలో కొనసాగిన వారికి పెద్దపీటవేయడం ముసలానికి ప్రధాన కారణం అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంట్రాక్ట్ పనులు ఆశ చూపి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని, ఇది ఎంతో బాధాకరమైన అంశమన్నారు. అనతికాలంలోనే ముసలం ముదిరి తెరాస కుప్పకూలి పోతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌పార్టీ ఎంతో ఉన్నతమైన ఆశయాలతో కూడిన పార్టీ అని, అధికారం కోసం ఏనాడు ఆరాట పడలేదన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా త్వరలో పార్టీ ఉద్యమాలు చేపట్టనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు అయితం సత్యం, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు తాజుద్దీన్, మండల కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు పసుపులేటి మోహన్‌రావు, నాయకులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, దాసరి దానియేలు, శీలం నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వామపక్షాల్లో
తగ్గిన పోరాట పటిమ
* ప్రజా సమస్యలపై ఆందోళనలు నిల్
* ఐక్యత ఊసెత్తని కమ్యూనిస్టులు
ఖమ్మం, జూన్ 16: ప్రజా సమస్యలపై ఐక్యంగా పోరాడుతాం... పోరాటాల ద్వారానే సమస్యలను పరిష్కరించుకుంటాం... సమస్య ప్రాతిపదికగా ఐక్య ఉద్యమాలకు శ్రీకారం చుడతాం.. ఇవి అప్పుడప్పుడు కమ్యూనిస్టు నేతలు చెప్పే మాటలు. అవి ఆచరణ సాధ్యం కావని ఆ పార్టీ నేతలకే తెలిసినా తమ ఒరవడి మాత్రం మార్చరు. అదే సమయంలో కొన్నిసార్లు ఐక్యంగా ఆందోళనలు నిర్వహించినా వాటిని సఫలీకృతం చేసుకోవటంలో విఫలమైన సందర్భాలు అనేకం. అంతేకాకుండా జిల్లాలో అత్యంత బలమైన పార్టీలుగా ఉన్న వామపక్షాలు ఉమ్మడిగా కంటే విడివిడిగా చేస్తేనే జన సమీకరణ బాగా చేస్తారనే నానుడి కూడా ఉంది. కానీ ఈ ఏడాది ఐక్య ఉద్యమాల సంగతేమో కానీ విడివిడిగా కూడా ఆందోళనలకు, పోరాటాలకు దూరంగా ఉన్నారు. క్రమంగా వారిలో పోరాట పటిమ తగ్గినట్లుగా కనబడుతోంది. దీని వెనుక రహస్యం ఏముందో తెలియదు కానీ కనీసం రైతు సమస్యలపై కూడా పోరాడిన దాఖలాలు లేవు. అక్కడక్కడ మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేసినా అవి ఉనికిని కాపాడుకోవటానికేననే విమర్శలు తెచ్చుకున్నారు.
ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభమైనా రైతు సమస్యలపై కమ్యూనిస్టులు ఉద్యమించిన దాఖలాలు లేవు. సాదాబైనామా, నకిలీ విత్తనాలు, పత్తి వేయవద్దని నిర్బంధం, విత్తనాలు, ఎరువుల కొరత, గిట్టుబాటు ధరలు తదితర సమస్యలు రైతుల వేధిస్తున్నా వామపక్ష పార్టీల అనుబంధ సంఘాలుగా ఉన్న రైతు సంఘాలు ఎందుకు ఆందోళన చేయటం లేదనేది ప్రశ్నగా మిగిలింది. రాష్ట్రంలోనే ఉద్యమాలకు పుట్టినిల్లుగా ఉన్నఖమ్మం జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే మిగిలిన జిల్లాల పరిస్థితి ఏలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కాగా ఖమ్మం జిల్లాలో రైతుల తర్వాత ప్రధాన సమస్యగా ఉన్న పోడు భూముల సమస్యపై విడివిడిగా ఆందోళనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో బలంగా ఉన్న సిపిఎం, సిపిఐ, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసిలు ఎవరికి వారు పోడు భూములపై గిరిజనులకు హక్కులు కల్పించాలంటూ ఆందోళనలు చేస్తున్నా, ప్రభుత్వ నిర్ణయాలు అమలవుతూనే ఉన్నాయి. ప్రభుత్వం వత్తిడి తెచ్చే స్థాయిలో ఈ ఆందోళనలు జరగటం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి.
ఇటీవల ఖమ్మం జిల్లాలో జరిగిన వరుస ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు ఆశించిన ఫలితం రాబట్టుకోవటంలో విఫలం కావటం వల్లే ఉద్యమాలకు కూడా దూరమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు అండగా ఉంటామని చెప్పే వామపక్షాలు సమస్యలపై పోరాటాలకు దూరమవుతున్న కొద్ది ప్రజలు కూడా తమ సమస్యలకు అలవాటుపడుతూ అధికార పార్టీ నేతల వైపే చూస్తుండటం స్పష్టంగా కన్పిస్తున్నది. ప్రజా సమస్యలపై పోరాటాలే మార్గంగా ఏర్పడిన వామపక్ష పార్టీలు వాటికి దూరమవ్వటం వెనుక సిద్ధాంతాల మార్పిడి కూడా జరుగుతుందనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ కనుసన్నల్లోనే వామపక్ష నేతలు కూడా నడుస్తున్నారని సీనియర్ కమ్యూనిస్టు యోధులు బాహాటంగానే చెప్తుండటం కొసమెరుపు.

పంథా మార్చుకున్న మావోలు
* రాకెట్ లాంఛర్స్ వినియోగంపై శిక్షణ పూర్తి
* లాంగ్ రేంజ్ ప్రొటక్షన్‌పై అగ్రనేతల దృష్టి ?
పినపాక, జూన్ 16: ఒకప్పుడు మెరుపుదాడులు బాంబ్ బ్లాస్టర్స్, క్లెమోర్ బాంబర్స్‌ను వినియోగించిన మావోయిస్టులు భారీగా నష్టపోయారు. మారిన కాలమాన పరిస్థితుల ప్రభావంతో పంథా మార్చుకొన్న మావోయిస్టులు శత్రుసైన్యాన్ని అంతమొందించేందుకు రాకెట్ లాంచర్స్ వినియోగంపై నిపుణులచేత శిక్షణ పూర్తి చేసుకొన్నట్లు నిఘావర్గాల సమాచారం. ఒకప్పుడు ( షార్ట్ రేంజ్‌ప్రొటెక్షన్) దగ్గర నుండి శత్రువు సైన్యంపై పడుతూ మెరుపుదాడులతో విరుచుకు పడేవారు. దానితో పెద్దగా లాభం ప్రయోజనం లేకపోగా దళ సభ్యులు నుండి అగ్రనేతలను సైతం కోల్పోయారు. ఇప్పుడు లాంగ్‌రేంజ్ ప్రొటెక్షన్ దూరప్రాంతాల నుండి శత్రువుసైన్యాన్ని బైనాక్యులర్లతో గుర్తించి తమను తాము రక్షించు కుంటూ రాకెట్ లాంచర్స్ వినియోగిస్తుంటారు. రాకెట్ లాంచర్స్‌ను, గోల్డ్‌బిస్కెట్స్‌ను మావోయిస్టులు ఐదు సంవత్సరాల క్రితమే(ఐయస్‌ఐ) ద్వారా సేకరించారు. అప్పట్లో అగ్రనేతలు గణేష్, ప్రసాదన్న సూచనల మేరకు ఖమ్మం-వరంగల్ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో డంప్‌లు దాచి వుంచే ప్రదేశాలలో దాచి వుంచారు. పినపాక మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన రైతు పొలం దున్నుతుండగా డంప్‌ల వ్యవహారం బయట పడింది, అప్పట్లో ఇది సంచలనం సృష్టించింది. కాగా దొరికిన గోల్డ్ బిస్కెట్లను రైతు కిరాణాషాపులో విక్రయించేందుకు రాగా సమాచారం తెలియడంతో కరకగూడెం పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. వాటిని పరిశీలించగా అవి పాకిస్థాన్ తీవ్రవాదులు ద్వారా సేకరించినట్లు తెలిసింది. ఆ తర్వాత మావోలు మొట్టమొదటి సారిగా రాకెట్ లాంచర్స్‌ను ఏడూళ్ళబయ్యారం పోలీస్టేషన్‌పై ప్రయోగించగా అది మిస్‌ఫైరింగ్‌లో భూమిపై పడటంతో స్టేషన్‌లో ఉన్న సిబ్బంది భయ భ్రాంతులకు గురై బయటకు పరుగులు తీసారు. అప్పట్లో రాకెట్ లాంచర్స్ వినియోగంపై పెద్దగా అనుభవం లేక పోవడంతో సాంకేతిక అనుభవం కల్గిన(టెక్‌మధు) లాంటి వారి సూచనలు తీసుకొనే సమయంలో టెక్‌మధు పోలీసులకు పట్టుపడ్డారు. దీంతో ఆ ప్రక్రియ కొంత కాలం మరుగున పడింది, ఇప్పుడు చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రెండవసారి వినియోగించడం పోలీసు వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఐయస్‌ఐ తీవ్రవాదుల ద్వారా రహస్యపుప్రదేశాలలో శిక్షణ పొందుతున్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది.

సాదాసీదాగా స్థారుూ సంఘాల సమావేశం
* హాజరుకాని పలు శాఖల అధికారులు
ఖానాపురం హవేలి, జూన్ 16: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు మూడు నెలలకు ఒక సారి నిర్వహించే స్థారుూ సంఘాల సమావేశం సాదాసీదాగా ముగిసింది. గురువారం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత అధ్యక్షతన జరిగిన స్థారుూ సంఘాల సమావేశంలో పలు శాఖల అధికారులు హాజరు కాకపోగా, అదే స్థారుూలో ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు కూడా హాజరుకాలేదు. ఈ స్థారుూ సంఘాల సమావేశానికి గతంలో కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు పెద్దగా హాజరైన దాఖలాలు లేవు. మూడు నెలలకు ఒక సారి నిర్వహించే సమావేశం తూతూమంత్రంగా జరుగుతుండటంతో ప్రజాప్రతినిధుల్లో నిరాశ నెలకొంటోంది. మూడు నెలలకు ఒక సారి నిర్వహించే సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చించాలని ఎంతో ఆశగా వచ్చినప్పటికీ ఆ స్థారుూ అధికారి హాజరుకాకపోవటంతో ప్రజాప్రతినిధుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉండగా సమావేశానికి హాజరైన పలువురు జడ్పీటిసిలు, కో ఆప్షన్ సభ్యులు అధికారుల సమాధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలాల్లో జరిగే పలు కార్యక్రమాలపై పూర్తిస్థారుూలో అవగాహన కల్పించేందుకు తమ వద్ద సమాచారం ఉండటం లేదని, ప్రతి అంశానికి సంబంధించిన వివరాలను తమకు అందించాలని కోరారు. అదే విధంగా రేషన్ సరుకులు పూర్తిస్థారుూలో అందటం లేదని, బియ్యం, పంచధార మినహా ఇతర ఏ వస్తువులు అందకపోవటంతో పేద ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. గతంలో జరిగిన సమావేశంలో సైతం ఈ అంశంపై చర్చించినా నేటి వరకు సమస్య పరిష్కారం కాలేదన్నారు. అదే విధంగా వ్యవసాయానికి సంబంధించి రైతులకు ఇప్పటి పత్తి పంటకు ప్రత్యామ్నాయంగా అపరాలు సాగు చేయాలని సూచిస్తున్న అధికారులు మాత్రం ఆ స్థారుూలో విత్తనాలను సమకూర్చటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అనేక మంది రైతులు పత్తిపంటనే సాగు చేస్తున్నారన్నారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులను అందుబాటులో వ్యవసాయ శాఖ ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖాధికారులు మాట్లాడుతూ కొన్ని ప్రాంతాల్లో విత్తన సమస్య ఎదురైందని, తక్షణమే సమస్యను పరిష్కరించామన్నారు.
అదే విధంగా అంగన్‌వాడిల పనితీరు సరిగ్గా ఉండట లేదని, పలు ప్రాంతాల్లో అంగన్‌వాడి కేంద్రాలు మధ్యాహ్నంకే మూసివేస్తున్నారని ఐసిడిఎస్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని, ఎక్కడైనా అంగన్‌వాడి కేంద్రాల తెరవనట్లు, కానీ ఏదైనా అంశంపై తమకు సమాచారం అందిస్తే తక్షణమే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అంగన్‌వాడి కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నట్లు వెల్లడించారు.
విద్యకు సంబంధించి జిల్లాలోని అనేక పాఠశాలల్లో విద్యార్థులు సమస్యలతో అల్లాడుతున్నారని, వేసవి సెలవుల్లో సమస్యను పరిష్కరించి ఉంటే ప్రస్తుతం విద్యార్థులు అవస్థలు ఎదుర్కొవాల్సిన అవసరం ఉండదన్నారు. మంచినీరు, మరుగుదొడ్లు సమస్య తీవ్రంగా వేధిస్తోందన్నారు. విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని హామీనిచ్చారు. వైద్యశాఖకు సంబంధించి వర్షాకాలం సంభవిస్తున్న దృష్ట్యా ఏలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని పిహెచ్‌సిల్లో మందులు అందుబాటులో ఉంచాలన్నారు. అదే విధంగా పలు అంశాలపై సాదాసీదాగా సమావేశం ముగించారు.

బంగారు తెలంగాణ సాదిధ్ధాం - జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత
బంగారు తెలంగాణ సాధన దిశలో ప్రజాప్రతినిధులు, అధికారులంతా భాగస్వాములు కావాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత అన్నారు. ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో ఉందన్నారు. వర్షాకాలం సమీపిస్తున్నందున హరితహారం కింద మొక్కలు నాటి పచ్చదనమైన జిల్లాగా ఖమ్మంను మార్చాలన్నారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక వసతులను కల్పించటంతో పాటు అంగన్‌వాడి కేంద్రాల్లో పౌష్టికాహారం అందిస్తున్న పనితీరును ప్రజాప్రతినిధులు, అధికారులు తనిఖీ చేయాలన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సిఈఓ నగేష్, డిప్యూటీ సిఈఓ కర్నాటి రాజేశ్వరి, జడ్పీ ఏవో భారతి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఆక్రమిత భూములను పేదలకు పంచాలి

తిరుమలాయపాలెం, జూన్ 16: మండలంలో అనేక చోట్ల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయని, వాటిని స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలని మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సమావేశంలో తీర్మానాన్ని కూడా చేశారు. తొలుత ఎంపిపి అశోక్ ఏజెండాను ప్రవేశపెట్టగా, జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు జీయావుద్దీన్ మాట్లాడుతూ మండలంలో 4వేల ఎకరాలకుపైగా భూమి ఆక్రమణదారుల చేతుల్లో ఉందని, దానిని స్వాధీనం చేసుకోవాలన్నారు. ఎంపిటిసిలు వెంకన్న, రమేష్‌లు మాట్లాడుతూ విఆర్వోలు స్థానికంగా ఉండకపోవటం వల్ల రైతులకు ఇబ్బందులు జరుగుతున్నాయని, సాదాబైనమాను విఆర్వోలే రిజిస్ట్రేషన్లు చేయాలన్నారు. ప్రభుత్వం నుంచి రేషన్ సరుకులు సరిగ్గా రావటం లేదని, వచ్చిన వాటిని కూడా డీలర్లు సరిగ్గా పంచటం లేదని ఆరోపించారు. అంగన్‌వాడి సెంటర్లు సరిగ్గా నడపటం లేదని, వాటిపై చర్యలు తీసుకోవాలని ఎంపిటిసిలు ప్రసాద్, వీరన్న, రమేష్‌లు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎంపిపి అశోక్ మాట్లాడుతూ మండల కేంద్రంలో అంగన్‌వాడి కేంద్రాలు 12గంటలకే మూసివేస్తున్నారని, స్వయంగా సిడిపివో ఉషారాణి తనకు తెలిపారని, దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పటంతో సభ్యులు కూడా మండలం మొత్తం పరిశీలించాలని డిమాండ్ చేశారు. బచ్చోడు గ్రామంలో చెరువు మరమత్తు పనులు రాత్రి సమయంలో మాత్రమే చేస్తున్నారని ఎంపిడివోకు ఫిర్యాదు చేశారు. కాగా ఎంఈఓ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో 280మంది విద్యార్థులను నూతనంగా చేర్పించామని, పలు పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం కూడా ప్రారంభించామన్నారు. ఎక్కువ మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేలా చూస్తున్నామన్నారు. అయితే మరుగుదొడ్లు లేని పాఠశాలల్లో వాటిని వెంటనే నిర్మించాలని సభ దృష్టికి తీసుకొచ్చారు. పిఆర్ ఏఈ హన్మంతరావు మాట్లాడుతూ సిసి రోడ్లు, సైడ్‌కాల్వల నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 50లక్షలు మంజూరు చేయించారని, పనులు త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు. కాగా మండలంలో ఆరుగురికి క్షయ వ్యాధి సోకినట్లు పిహెచ్‌సి వైద్యులు డాక్టర్ రాంబాబు తెలపగా, దీనిని నివారించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానించింది. సమావేశానికి అటవీ, ఎక్సైజ్, మైక్రో ఇరిగేషన్, ఉద్యానవనం, బిసి సంక్షేమం, సహకార శాఖాధికారులు గైర్హాజరయ్యారు. సమావేశంలో జడ్పీటిసి విజయ, ఎంపిడివో సన్యాసయ్య, తహశీల్దార్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఖర్చుల కాలం.. ధరలతో సతమతం
భద్రాచలం టౌన్, జూన్ 16: మే నెలతో పోల్చితే జూన్ నెలలో అన్ని వస్తువుల ధరల్లోనూ మార్పులు క్రమంగా కనిపిస్తున్నాయి. పెరిగిన ధరలతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో మార్కెట్‌కు వస్తువులు తక్కువగా రావడం, డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువగా ఉండటంతో ధరల్లో వ్యత్యాసాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వర్షాలు పడుతుండటంతో కొన్ని వస్తువులకు వినియోగదారుల నుంచి డిమాండ్ తగ్గింది. నిత్యవసర వస్తువుల ధరలు పక్షం రోజుల్లో పోల్చితే పెరుగుతూ వస్తున్నాయి. బియ్యం ధరల్లో మార్పు లేకపోయినా పప్పులు, నూనెల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. కిలో కందిపప్పు ధర రూ.150కి పైగానే ఉండగా మినపపప్పు ధరల్లో నిత్యం స్వల్ప మార్పులు కనిపిస్తున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. టమాటా ధర అందనంద దూరంలో ఉంది. పక్షం రోజుల క్రితం రూ.40 ఉన్న టమాటా ధర జూన్ రెండవ వారానికి రూ.100కు సమీపంలో ఉంది. వేసవితాపంతో అల్లాడిన ప్రజలకు శీతల పానియాలు ఊరటనివ్వగా వర్షాలు పడుతుండటంతో శీతల పానియాలకు ఇప్పుడు డిమాండ్ తగ్గింది. మే నెలతో పోల్చితే జూన్‌లో 30 శాతం వరకు అమ్మకాలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
మార్చి, ఏప్రిల్, మే నెలల్లో విస్తృతంగా సాగిన పండ్లరసం(జ్యూస్)ల అమ్మకాలు మందగించాయి. అలాగే మార్కెట్‌లో ఫ్రీజులు, కూలర్ల అమ్మకాలు కూడా కొంతమేర తగ్గాయి. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం.. మరోవైపు మూఢం కారణంగా వీటి అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలు కూడా తెరుచుకోవడంతో వస్త్ర వ్యాపారంపుంజుకుంటుంది. 15 రోజులతో పోల్చితే స్వల్పంగా ఈ వ్యాపారం పెరిగింది. వస్త్ర వ్యాపారులు అమ్మకాలు పెంచుకునేందుకు డిస్కౌంట్ల బాట పడుతున్నారు. రానున్న రెండునెలల కాలంలో రంజాన్, వినాయకచవితి వంటి పండుగలు ఉన్న నేపథ్యంలో వ్యాపారులు ముందుగానే దిగుమతి చేసుకుంటున్నారు. పాఠశాలలు కూడా తెరుచుకోవడంతో యూనిఫాం అమ్మకాలు విపరీతంగా పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

హామీలు విస్మరించిన కెసిఆర్
* టిడిపి జిల్లా అధ్యక్షుడు తుళ్ళూరి
ఖమ్మం(మామిళ్ళగూడెం), జూన్ 16: నూతన రాష్ట్రంలో బంగారు తెలంగాణ సాధించుకుందామని ప్రజలకు మాయమాటలు చెప్పి, అనేక హామీలను ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన కెసిఆర్ ప్రభుత్వం వాటిని విస్మరించిందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తుళ్ళూరి బ్రహ్మయ్య ఆరోపించారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ పటిష్ఠతకు, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 15న రాజధానిలో వర్క్‌షాప్ నిర్వహించడం జరిగిందన్నారు.
రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందిన కెసిఆర్ ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండగట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి తెలగుదేశం నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రజల్లోకి వెళ్ళి పని చేయనున్నట్లు తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా నేటికి బీమా ఆధారితను రైతుల్లోకి తీసుకెళ్ళలేదని, వారికి దీనిపై అవగాహన కల్పించడంలో వ్యవసాయశాఖ విఫలం చెందిందని ఆరోపించారు. ఈ సమావేశంలో కూరపాటి వెంకటేశ్వర్లు, గొడ్డేటి మాధవరావు, గొల్లపూడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అంటువ్యాధుల నివారణకు అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్
ఖానాపురం హవేలి, జూన్ 16: రానున్న వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని అంటువ్యాధుల నివారణకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ వైద్యాశాఖాధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక టిటిడిసి సమావేశ మందిరంలో వైద్యశాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నిర్ధేశించిన ఆవాస ప్రాంతాల్లో డెంగ్యూ, మలేరియా నివారణకు కృషి చేయాలన్నారు. దోమల నివారణకు ప్రతి ఇంట్లో ఐఆర్‌ఎస్‌ను స్ప్రే చేయాలన్నారు. స్ప్రే చేసే సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యమివ్వాలన్నారు. గిరిజన, ఆశ్రమ పాఠశాలల్లో తప్పకుండా స్ప్రే చేయాలన్నారు. ముందస్తుగా గ్రామాల్లో వేడి చేసి చల్లార్చిన నీటిని తాగేలా అవగాహన కల్పించాలన్నారు. అదే విధంగా ప్రాథమిక పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు దశల వారిగా వైద్య పరీక్షలు చేయాలన్నారు. గ్రామ పంచాయతీ పరిసరాల పరిశుభ్రత, చేతిపంపుల వద్ద నీటి నిల్వలు లేకుండా ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు చూడాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో మలేరియా, డెంగ్యూ కేసుల వివరాలను తెలుసుకొని ఆయా ప్రాంతాల్లో దృష్టి సారించాలన్నారు. జిల్లాలోని ఆవాస ప్రాంతాలకు వ్యాధుల నివారణకు మరిన్ని నిధులు విడుదల చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ను కోరారు. సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్ లలితుకుమారి, అడిషనల్ డైరెక్టర్ ప్రభావతి, వరంగల్ జోన్ మెడికల్ అధికారి జయశ్రీ, డిఎం అండ్ హెచ్‌ఓ కొండల్‌రావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ప్రాజెక్టులతో మభ్యపెడుతున్న ప్రభుత్వం
* బలవంతపు భూసేకరణ సరికాదు * సిపిఐ నేత చాడా
ఖమ్మం(జమ్మిబండ), జూన్ 17: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనల ద్వారా ప్రజలను మోసం చేస్తోందని, ప్రాజెక్టులతో మభ్యపెడుతూ పబ్బం గడుపుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. గురువారం గిరిప్రసాద్ భవన్‌లో మండే వీరహన్మంతరావు అధ్యక్షతన జరిగిన సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజలకిచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. కేవలం బంగారు తెలంగాణ పేరుతో దృష్ట రాజకీయాలను ప్రోత్సహిస్తూ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను సికండిగా చూపి టిఆర్‌ఎస్ నెట్టుకొస్తుందని ఎద్దేవా చేశారు. సాంకేతిక నిపుణుల సలహాలను పక్కనపెట్టి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. రిజర్వాయర్ స్థాయి పెంపు తదితర అంశాలు భవిష్యత్తులో పలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టులకు సంబంధించి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, తెలంగాణ ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలని ప్రభుత్వానికి సూచించారు.
భూసేకరణ విషయంలో చట్టప్రకారం భూములు సేకరించాలని, బలవంతంగా భూములు లాక్కుంటే సిపిఐ సహించదని హెచ్చరించారు. పిడి యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తూ గిరిజనులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నారిన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడు రైతులకు అండగా తమ పార్టీ నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాడేందుకు వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. పువ్వాడ నాగేశ్వరరావు, బాగం హేమంతరావు, సిద్ధి వెంకటేశ్వర్లు, కూనంనేని సాంబశివరావు, ఎస్‌కె సాబీర్‌పాషా, జానీమియా, బిజె క్లైమెంట్ తదితరులు పాల్గొన్నారు.