కర్నూల్

పూర్తికాని పుష్కర పనులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 1 : కృష్ణా పుష్కరాల సందర్భంగా జిల్లాలో శ్రీశైలం, సంగమేశ్వరంతో పాటు నదీ జలాలు ప్రవహించే పరివాహక గ్రామాల్లో చేపట్టిన పుష్కర పనులు ఇంకా పూర్తి కాలేదు. కర్నూలులో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జూలై 31వ తేదీ నాటికి పుష్కర పనులు పూర్తి కావాలని సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సమీక్షలో ఆ రోజుకు అన్ని శాఖల తరఫున సగటున 61శాతం పనులు పూర్తయినట్లు అధికారులు సిఎంకు వివరించారు. దీంతో ఆయన పనులు వేగవంతం చేసి నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆ తరువాత ఎలాంటి కారణాలను తాను వినబోనని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినా ఇప్పటి వరకూ 80శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. దీంతో కలెక్టర్ విజయమోహన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి నివేదిక పంపుతానని హెచ్చరించారు. అయితే అధికారులు మాత్రం పుష్కర పనులు పూర్తి చేయడానికి పలుమార్లు వర్షాలు ఆటంకం కలిగించాయని వివరించారు. చిన్న వర్షం కురిసినా పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంటుందని వివరణ ఇచ్చారు. దీంతో కలెక్టర్ మరో మూడు రోజులు గడువు ఇస్త్నుట్లు 4వ తేదీ నాటికి పనులు పూర్తి కావాలని నిర్ధేశించారు. ఇదే విషయాన్ని తాను ముఖ్యమంత్రికి వివరిస్తానని స్పష్టం చేశారు. శ్రీశైలంలో ఇటీవల కురిసిన వర్షాలకు విరిగిపడిన కొండ చరియల వల్ల రెండు రోజుల పాటు పుష్కర పనులు చేయడానికి ఏమాత్రం అవకాశం లేకపోయిందని అధికారులు పేర్కొంటున్నారు. 12 ఏళ్ల క్రితం కూడా పుష్కర పనులు జరుగుతున్న సమయంలో ఇదే విధంగా జరిగిందని వారు గుర్తు చేస్తున్నారు. కొండ చరియలు మళ్లీ ఇబ్బందులు సృష్టించకుండా తగిన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఈ నెలలో భారీ వర్షాలకు అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రభుత్వానికి సూచించింది. దీంతో వర్షాల సమయంలో నల్లమల అరణ్యంలో కొండ చరియలు ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉన్న చోట ప్రస్తుతం అధికారులు దృష్టి సారించారు. కొండ చరియలు విరిగిపడితే రాకపోకలకు పూర్తిస్థాయి అంతరాయం ఏర్పడి భక్తులు కష్టాలు పడాల్సి వస్తుందని సిఎం చంద్రబాబుకు కలెక్టర్ సమాచారం అందించారు. దాంతో రాష్ట్ర స్థాయి అధికారులతో పాటు కృష్ణా పుష్కరాల ప్రత్యేక అధికారి అనంతరాము కొండ చరియలు విరిగి పడిన ప్రాంతాలను పరిశీలించి భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. ఇక జలాశయంలో 830 అడుగులకు నీటి మట్టం చేరితే పుష్కర స్నానాలకు అవకాశం ఉండేలా ఘాట్లు నిర్మిస్తున్నారు. ఈ ఘాట్ల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ఆగస్టు 12వ తేదీ నాటికి జలాశయం నీటి మట్టం 850 అడుగులకు పైనే ఉంటుందని వారంటున్నారు. దీని కారణంగా దిగువన లింగాలగట్టుకు కూడా నీటిని విడుదల చేసి భక్తుల పుష్కర స్నానాలకు అవకాశం కల్పిస్తామంటున్నారు. ఎగువన సంగమేశ్వరం వద్ద పుష్క ఘాట్ల నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. సంగమేశ్వరం వద్ద 820 అడుగుల స్థాయిలో పురాతన సంగమేశ్వర ఆలయం వెనుక భాగాన నిర్మించిన పుష్కర ఘాట్లు నీటిలో మునిగిపోయాయి. ఎగువన ఉన్న ఘాట్ వద్దకు నీరు రావడానికి జలాశయం నీటి మట్టం 830 అడుగులకు చేరుకుంటే చాలని అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటి మట్టం 823 అడుగులుగా ఉండటంతో ఒకటి, రెండు రోజుల్లో ఎగువ ఘాట్ వద్ద స్నానాలకు అవకాశం ఉంటుందని వెల్లడిస్తున్నారు. ఒక వైపు కృష్ణా జలాలు తరుముకొస్తుంటే మరో వైపు ఘాట్ల నిర్మాణ పనులను వేగవంతం చేశారు. ఇక భక్తులకు తాత్కాలిక మరుగుదొడ్లు, సామాను భద్రపరిచే గదులు, వాటర్ ప్రూఫ్ టెంట్లు, పిండ ప్రదానానికి ఏర్పాట్లు పూర్తి కావాల్సి ఉంది. ఈ పనులన్నింటినీ 4వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సాగునీటి శాఖకు చెందిన అధికారులు పుష్కర విధుల్లో చేరగా ఇతర శాఖల అధికారులు ఈ వారంలో విధుల్లో చేరనున్నట్లు స్పష్టమవుతోంది. ఎట్టి పరిస్థితుల్లో 4వ తేదీ నాటికి పనులు పూర్తి చేస్తామని కలెక్టర్ విజయమోహన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
భద్రతే ప్రధాన లక్ష్యం..
* భక్తులకు గుర్తింపు కార్డు తప్పనిసరి..
* పోలీసులు అప్రమత్తంగా ఉండాలి..
* పుష్కరాల సమీక్షలో ఐజి శ్రీ్ధర్‌రావు
కర్నూలు, ఆగస్టు 1:కృష్ణా పుష్కరాల్లో భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా పని చేయాలని రాయలసీమ ఐజి ఎన్.శ్రీ్ధర్‌రావు పోలీసు అధికారులను ఆదేశించారు. నగరంలోని జిల్లా పోలీసు అతిథి గృహంలో సోమవారం ఐజి కృష్ణా పుష్కరాలపై సమీక్ష సమావేశం నిర్వహించగా కర్నూలు రేంజ్ డిఐజి రమణకుమార్, ఎస్పీ ఆకే రవికృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐజి మాట్లాడుతూ పుణ్యస్నానాలకు వచ్చే భక్తులు ఆధార్, ఓటరు, తదితర గుర్తింపు కార్డులు కలిగి ఉండాలన్నారు. పుష్కరాల సందర్భంగా బందోబస్తు విధుల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రద్దీని బట్టి భక్తులను స్నానపు ఘాట్ల వద్దకు మళ్లించాలన్నారు. పుష్కర ఘాట్లకు సంబంధించిన ఇన్‌చార్జి అధికారులతో అక్కడి సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. పుష్కరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. అనుమానితులు, అనుమానిత వస్తువులు తారసపడితే భక్తులు తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. భక్తుల వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలన్నారు. పుష్కర్ ఘాట్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి భక్తుల సమస్యలపై తక్షణమే స్పందించాలన్నారు. చిన్నపిల్లలు, వయస్సు పైబడిన వృద్ధులు స్నానపు ఘాట్ల దగ్గర జాగ్రత్తగా ఉండాలని, నీటి ప్రవాహం వేగంగా ఉన్న చోట లోతు ఎక్కువ ఉండే ప్రదేశాలకు వెళ్లకూడదని పోలీసులు మైక్ సెట్‌లలో హెచ్చరించాలన్నారు. సమీక్షలో ఏఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఓఎస్‌డి రవిప్రకాష్, కడప ఏఎస్పీలు రాజన్, సత్యఏసుబాబు, ఏఆర్ ఏఎస్పీ వెంకటేష్, హోంగార్డ్సు కమాండెంట్ చంద్రవౌళి, డీఎస్పీలు బాబుప్రసాద్, కృష్ణమోహన్, కృష్ణపూర్తి, మురళీధర్, హుస్సేన్‌పీరా, రామచంద్ర, రాజశేఖర్‌రాజు, వెంకటాద్రి, సుప్రజ, తదితరులు పాల్గొన్నారు.
గాజులదినె్న ప్రాజెక్టుకు జలకళ..
* 376 అడుగులు దాటిన నీటిమట్టం..
* గేట్లు ఎత్తేందుకు రంగ సిద్ధం..
* ముంపు గ్రామాలను అప్రమత్తం చేసిన అధికారులు
గోనెగండ్ల, ఆగస్టు 1 : ఇటీవల కురిసిన వర్షాలకు గాజులదినె్న ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో పూర్తిస్థాయిలో నిండింది. డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 377 అడుగులు కాగా ఇప్పటికే 376.78 అడుగులకు నీరు చేరడంతో నిండు కుండలా మారింది. ఈ విషయాన్ని సోమవారం ప్రాజెక్టు డిఇ లక్ష్మణ్‌కుమార్ జిల్లా కలెక్టర్ సి.హెచ్ విజయమోహన్ దృష్టికి తీసుకుపోయారు. దీంతో కలెక్టర్ వెంటనే ముంపు గ్రామాల వాసులను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు ముంపు గ్రామాలైన ఒంటర్‌దినె్న, పిల్లిగుండ్ల, పుట్టపాశం, హెచ్ కైరవాడి, లింగందినె్న, తిప్పనూరు, కోడుమూరు గ్రామాల ప్రజలకు సమాచారం ఇచ్చారు. ఇక ఏ క్షణానైనా డ్యాం గేట్లు ఎత్తివేయవచ్చని డిఇ వెల్లడించారు.
విద్యాసంస్థల బంద్ విజయవంతం
* సిఎం దిష్టిబొమ్మతో శవయాత్ర
కర్నూలు అర్బన్, ఆగస్టు 1:వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపుమేరకు సోమవారం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్‌యు నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరణ పేరుతో ప్రభుత్వ విద్యాసంస్థలను మూసి వేయడం సిగ్గు చేటన్నారు. బంద్‌లో భాగంగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు శ్రీనివాసులు, రంగన్న, ఆనంద్, రాజ్‌కుమార్, భాస్కర్ ఆధ్వర్యంలో సిపిఐ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకూ సిఎం చంద్రబాబు దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. విద్యార్థి సంఘాలు శవయాత్ర నిర్వహిస్తూండగా మార్గమధ్యలో పోలీసులు వారిని అరెస్టు చేశారు. అలాగే జిల్లాలోని కర్నూలు, నంద్యాల, నందికొట్కూరు, డోన్, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, మంత్రాలయం, ఆదోని, కోడుమూరు, ఆలూరు, బనగానపల్లె, ఆత్మకూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలను మూసివేయడంతో బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రజల అభివృద్ధే ధ్యేయం అంటూ కెజి నుంచి పిజి వరకూ ఉచిత విద్యను అందిస్తామని, రాష్ట్రాన్ని నాలెడ్డి హబ్‌గా తీర్చిద్దిదుతామని పేర్కొంటున్న ప్రభుత్వం మరోవైపు క్రమబద్ధీకరణ పేరుతో ప్రాథమిక పాఠశాలలను మూసి వేయడం, గురుకుల హాస్టళ్ల పేరుతో సంక్షేమ హాస్టళ్లను మూసి వేయడం, రాష్ట్రంలో ఉన్న యూనివర్శిటీలను అభివృద్ధి చేయకుండా విదేశీ యూనివర్శిటీలకు రెడ్ కార్పెట్ వేసి ప్రభుత్వ ఉన్నత విద్యకు కళ్లెం వేయడం తగదన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా వున్న అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులను భర్తీ చేయకుండా, సంక్షేమ హాస్టళ్లలో వార్డెన్లను నియమించకుండా, వౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించకుండా సమస్యల నిలయాలుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్, వివిధ వృత్తి విద్యా కోర్సుల ఫీజులను భారీగా పెంచి విద్యార్థుల తల్లిదండ్రులపై భారం మోపడం వల్ల నిరుపేద, సామాన్య వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారన్నారు. ఎయిడెడ్ కళాశాలల్లో అధ్యాపకుల భర్తీని నిలిపివేయడంతో అవి మూతపడే దశకు చేరుకున్నాయని, కాంట్రాక్టు లెక్చరర్లను వెంటనే రెగ్యులర్ చేయాలని, శిథిలావస్థకు చేరుకున్న ఉన్నత పాఠశాలల భవనాలను పునఃనిర్మించాలని, సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, అలాగే గురుకుల, సంక్షేమ, మోడల్ స్కూళ్ల పేరుతో మూసివేసిన 310 సంక్షేమ హాస్టళ్లను తక్షణమే తెరిచి వాటిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. తాము శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు దౌర్జన్యంగా అరెస్టు చేసి అక్రమ కేసులు పెట్టడం వల్ల ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యా రంగం సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బంద్‌లో విద్యార్థి సంఘాల నాయకులు సోమన్న, నాగరాజు, భరత్‌కుమార్, రాజ్‌కుమార్, శివ, వెంకటేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.
‘్ఫసల్ బీమా యోజన’పై
రైతుల్లో అవగాహన కరవు!
* ఖరీఫ్‌లో 5.65 లక్షల హెక్టార్లలో పంటల సాగు..
* 115.02 హెక్టార్లకు మాత్రమే బీమా
కర్నూలు సిటీ, ఆగస్టు 1 : రైతుల సంక్షేమం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’ పథకాన్ని ప్రవేశపెట్టిందే కానీ ఆ పథకంపై అవగాహన కల్పించడంలో, సమన్వయ పరచటంలో విఫలం చెందిందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వాతావరణంలో మార్పుల వల్ల అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాలు, తుపాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాల మూలంగా రైతాంగం నష్టాల పాలవుతుంది. ఈ నేపథ్యంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని లాభం కలిగే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం ప్రవేశపెట్టింది. పంటకాలంలో వాతావరణ విపత్కర సంఘటనల వల్ల పంట నష్టం జరిగినప్పుడు ఈ పంటల బీమా రైతులను ఆదుకుంటుంది. ఈ పథకంలో అన్ని వర్గాలకు చెందిన రైతులను భాగస్వాములుగా చేసేందుకు తక్కువ ప్రీమియంతో ప్రవేశపెట్టారు. రైతులు ఎక్కువగా పండించే పంటలను బీమా పథకంలో చేర్చి ప్రీమియం చెల్లించిన రైతులకు నష్ట పరిహారం చెల్లించటం జరుగుతోంది. ఈ ప్రీమియంను వేరుశెనగ పంటకు బజాజ్ అలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌కు బాధ్యత అప్పజెప్పి, మిగతా పంటలకు ఐసిఐసిఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లకు అప్పజెప్పింది. ఆయా కంపెనీలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి వ్యవసాయ శాఖ అధికారుల సహాయంతో బీమా పథకం గురించి రైతులకు అవగాహన కల్పించాలి. ఈ పథకం కింద మొదట గత నెల 15 నుంచి 31వ తేదీ లోగా ప్రీమియం చెల్లించేందుకు గడువు వుండగా, వాటిపై రైతులకు సరైన అవగాహన లేక తక్కువ దరఖాస్తులు వచ్చాయి. దీంతో మరొకసారి ఆగస్టు 2వ తేదీ లోగా రైతులు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద ప్రీమియం చెల్లించేందుకు గడువును పొడిగించింది. జిల్లా వ్యాప్తంగా ఒక్క ఖరీఫ్ సీజన్‌లోనే 5.65 లక్షల హెక్టార్లలో 6.5 లక్షల మంది రైతులు వేరుశెనగ(వాతావరణ ఆధారిత), జొన్న, సజ్జ, కంది, ప్రొద్దుతిరుగుడు, మిరప, ఆముదం, వరి, కొర్ర, పత్తి, తదితర రకాల పంటలను సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి కేవలం 181 మంది రైతులు 115.02 హెక్టార్లకు మాత్రమే దరాఖాస్తు చేసుకున్నారు. రైతులకు బ్యాంకుల ద్వారా పంట రుణం ఏవిధంగా పొందాలన్నది తెలుసు కానీ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం గురించి తెలియదు. నష్ట పరిహారం వస్తే కొంత మేరకు రైతులకు ఊరటగా ఉంటుంది. అయితే బీమా పథకాల గురించి తెలియక పూర్తిగా నష్టపోతున్నారు.
ప్రత్యేక హోదాతో సీమకు ఒరిగేదేమీలేదు..
* 371-జె ఆర్టికల్ వర్తింపజేయాలి:మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌జైన్
ఆదోని, ఆగస్టు 1: ప్రత్యేక హోదా ఇచ్చినా వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అభివృద్ది జరగదని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌జైన్ స్పష్టం చేశారు. సోమవారం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇచ్చిన్నా పరిశ్రమలు, అభివృద్ధి అంతా కూడా కోస్తాంధ్రకే పరిమితం అవుతుందని అభిప్రాయ పడ్డారు. కొత్తగా అమరావతి రాజధాని ఏర్పాటు చేయడం వల్ల పరిశ్రమల ఏర్పాటుకు, ఇతర అంశాలకు ఈప్రాంతంలో కావాల్సిన వనరులు ఉన్నాయన్నారు. అమరావతితో ఇతర ప్రాంతాలకు రోడ్ల లింక్ కూడా ఏర్పాటైందని, పుష్కలంగా నీరు ఉండడం వల్ల పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు అక్కడే మొగ్గుచూపుతారన్నారు. వెనుబడిన రాయలసీమ ప్రాంతంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా పరిశ్రమలు రావడానికి పారిశ్రామిక వేత్తలకు కావాల్సిన నీటి సౌకర్యం లేదన్నారు. అంతేకాకుండా ఇతర ప్రాంతాలకు రోడ్లు లింక్ సౌకర్యం కూడా తక్కువగా ఉందని, అందువల్ల ప్రత్యేక హోదా ఇచ్చినా మళ్ళీ కోస్తాంధ్రకే ఉపయోగ పడుతుందన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాష్ట్భ్రావృద్ధికి ఇచ్చిన నిధులను ఎక్కువ శాతం కోస్తాంధ్ర ప్రాంతానికి ఖర్చు చేయడం వల్ల సీమ ప్రజల్లో అసహనం పెరిగిందన్నారు. రాయలసీమ ప్రాంతంలో తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టులు ఉన్నా ఎలాంటి ప్రయోజనం సీమ ప్రాంతానికి కలుగడం లేదన్నారు. శ్రీశైలంప్రాజెక్టు నుండి నీటిని కోస్తాంధ్రకే మళ్లిస్తున్నారని, తుంగభద్ర రాయలసీమ నుంచి వెళ్తున్నా సీమ ప్రజలకు ఉపయోగ పడేది చాలా తక్కున్నారు. తుంగభధ్ర నుంచి 100 టిఎంసిల నీరు వృథాగా పోతోందన్నారు. మొదటి నుండి సీమ ప్రాంతాన్ని పాలకులంతా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. సీమ ప్రాంతం అభివృద్ధి కావాలంటే 371 జె ఆర్టికల్ కింద రాయలసీమ ప్రాంతం జిల్లాలను తీసుకురావాలన్నారు. రాయలసీమ బిడ్డగా చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిజంగా రాయలసీమ ప్రాంతం అభివృద్ధి కావాలని ఆకాంక్ష ఉంటే శాసన సభలో రాయలసీమ ప్రాంతాన్ని 371-జె ఆర్టికల్ కిందక ఉంచాలని తీర్మాణం చేసి కేంద్రానికి పంపాలని ఆయన కోరారు. 371జె ఆర్టికల్ కింద సీమ ప్రాంతాన్ని చేరిస్తే ఈ ప్రాంతాలను అభివృద్ధి చెందేంత వరకు కేంద్రం నిధులతో సంక్షేమ పనులు చేస్తారన్నారు.
కర్నూలులో రాయలసీమ
ఐజి కార్యాలయం
కర్నూలు, ఆగస్టు 1:నగరంలోని పాత ఎస్పీ బంగ్లాలో త్వరలో రాయలసీమ ఐజి కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కర్నూలులో సోమవారం జరిగిన పుష్కరాల సమీక్ష సమావేశంలో ఐజి శ్రీ్ధర్‌రావు నగరంలోనే రాయలసీమ ఐజి కార్యాలయం ఏర్పాటు చేయాలని, మూడు రోజుల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. కృష్ణా పుష్కరాలు ఉన్నందున భద్రత దృష్ట్యా, ఇక్కడే నుంచి రాయలసీమ పోలీసు పరిపాలన నిర్వహించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాలతో నగరంలో త్వరలో ఐజి కార్యాలయం ఏర్పాటు కానుంది. రెండు, మూడు రోజుల్లో కృష్ణా పుష్కరాలపై పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఐజి ఆదేశించారు. కృష్ణా పుష్కరాలకు రాష్ట్ర గవర్నర్, సిఎం, ఇతర ప్రముఖులు వస్తున్నందున, రాయలసీమ ముఖ ద్వారం కర్నూలు కాబట్టి ఇక్కడే రాయలసీమ ఐజి కార్యాలయం ఏర్పాటు చేసేందుకు అధికారులు త్వరలో పనులు మొదలు పెట్టనున్నారు.
ఏపికి కేంద్రం చాలా నిధులిచ్చింది
* బిజెపి జిల్లా అధ్యక్షుడు హరీష్‌బాబు
ఆత్మకూరు, ఆగస్టు 1:కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు చాలా నిధులు ఇచ్చిందని బిజెపి జిల్లా అధ్యక్షుడు హరీష్‌బాబు పేర్కొన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బిజెపి ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పిందని టిడిపితో సహా అన్ని పార్టీలు విమర్శించండం అన్యాయమన్నారు. మోదీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా విద్యార్థుల కోసం 11 రకాల విద్యాసంస్థలు ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడగకుండానే కేంద్రం రోడ్డు నిర్మాణాలకు దాదాపు రూ. 63 వేల కోట్లు ఇచ్చిందన్నారు. అలాగే వెనకబడిన రాయలసీమ ప్రాంతం అభివృద్ధి కోసం రూ. 15 వేల కోట్లు ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో జగదీష్, రమేష్, కృష్ణారెడ్డి, విశ్వరూపాచారి, విశ్వనాథశెట్టి పాల్గొన్నారు.
పుష్కరాల్లో భక్తులకు
ఇబ్బందులు తలెత్తకూడదు
* ప్రణాళికలు సిద్ధం చేసుకోండి..
* అధికారులకు శ్రీశైలం దేవస్థానం ఇఓ సూచన
కర్నూలు, ఆగస్టు 1:కృష్ణా పుష్కరాల్లో పుణ్యస్నానమాచరించే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుం డా సంబంధిత అధికారులు ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని శ్రీశైలం దేవస్థానం ఇఓ నారాయణభరత్‌గుప్తా సూచించారు. ఇఓ కార్యాలయ సమావేశ భవనంలో సోమవారం కర్నూలు జిల్లా ఇన్‌చార్జి అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఓ మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల్లో శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులకు చేయాల్సిన ఏర్పాట్లపై 19మంది ఉన్నతస్థాయి అధికారులను ఒక్కో ప్రదేశానికి ఇన్‌చార్జి అధికారిగా నియమించారన్నారు. ఆయా అధికారులు ఇప్పటి నుంచే సంబంధిత ప్రదేశాన్ని పరిశీలించి భక్తులకు అందించాల్సిన సదుపాయాలపై విశే్లషించి సూచిస్తే తగిన ఏర్పాట్లు చేస్తామన్నా రు. ప్రధానంగా పుష్కరనగర్, పార్కింగ్ ప్రదేశాలు, స్నానఘట్టాలు తదితర ప్రదేశాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి వేయాల్సిన వాటర్‌ఫ్రూప్ టెంట్లు, ఇతర వౌలిక సదుపాయాల కల్పనపై నివేదించాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని ఆయన అధికారులను కోరారు. అన్ని ప్రదేశాల్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఎల్‌ఇడి స్క్రీన్‌ల ద్వారా ప్రసారం, గుర్తించిన ప్రదేశాల్లో ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూ చించారు. పాతాళగంగ వద్ద, లింగాలగట్టు ప్రాంతాల్లో 108 అంబులెన్స్‌లు ఏర్పా టు చేయాలని డిఎంహెచ్‌ఓకు సూచించారు. విధులు నిర్వహించే సిబ్బందికి గుర్తింపుకార్డు జారీ చేయడంతో పాటు భోజన వసతి కల్పిస్తామన్నారు. అవుటర్ రింగ్ రోడ్డులో ఏర్పాటు చేయనున్న పార్కింగ్ ప్రదేశాల్లోనే ప్రైవేట్, ఆర్టీసీ, ఇతర వాహనాలను అనుమతిస్తామన్నారు. సాయం త్రం 6 గంటల తర్వాత ప్రమాదకరమైన పాతాళగంగ ఘాట్లలో స్నానం చేసేందుకు అనుమతించరాదని ఇఓ స్పష్టం చేశారు. సమావేశంలో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మహేశ్వరరెడ్డి, ఇఇ రామిరెడ్డి, జిల్లా ఉన్నతస్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక హోదా సాధనలో
చంద్రబాబు విఫలం
* ఎమ్మెల్యే ఐజయ్య
నందికొట్కూరు, ఆగస్టు 1:సిఎం చంద్రబాబు ఓటు-నోటు కేసులో ఇరుక్కున్నందునే ఏపికి ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించడం లేదని, కేంద్రం వద్ద ‘హోదా వద్దు- ప్యాకేజీ ముద్దు’ అంటున్నారని ఎమ్మెల్యే ఐజయ్య ఆరోపించారు. పట్టణంలోని తన నివాసంలో సోమవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన బిజెపి అధికారంలో వున్నప్పటికీ సిఎం చంద్రబాబు చొరవ తీసుకోకపోవడంతో ప్రస్తుతం కేంద్రం ప్రత్యేకహోదాను పట్టించుకోవడం లేదన్నారు. ప్రత్యేకహోదా వస్తే ఏపి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు. ప్రత్యేక ప్యాకేజీ వల్ల కేవలం టిడిపి నాయకులే బాగు పడతారన్నారు. ఇప్పటికే కేంద్రం రాష్ట్రానికి రూ. 1.42 లక్షల కోట్లు సాయం చేశామని ప్రకటిస్తుందని, అయితే ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేశారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పకపోవడం సిగ్గు చేటన్నారు. హోదా ప్రకటించని కేంద్రంతో ఇక పొత్తు ఎందుకని, తమ పార్టీ ఎంపిలను బయటకు రావాలని ప్రకటించకుండా సిఎం చంద్రబాబు వేచిచూసే ధోరణిలో వ్యవహరించడం రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయడమే అన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు గట్టిగా మాట్లాడితే కేంద్రం వెంటనే అతడిపై ఒక కమిషన్ వేస్తుందనే భయంతోనే ఆయన నోరు మెదపడం లేదన్నారు. కావున ప్రత్యేక హోదా కోసం వైకాపా చేపడుతున్న బంద్‌కు సహకరించాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ నేత అశోకరత్నం, వైకాపా నాయకులు భరత్‌కుమార్‌రెడ్డి, తువ్వా లోకేశ్వరరెడ్డి, పగిడ్యాల మండల కన్వీనర్ రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.
హోదా రాష్ట్రానికి సంజీవనిలాంటిది
ఆత్మకూరు, ఆగస్టు 1:రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా సంజీవని లాంటిదని శ్రీశైలం నియోజకవర్గ వైకాపా ఇన్‌చార్జి బుడ్డా శేషారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా అధినేత జగన్ పిలుపు మేరకు చేపట్టనున్న రాష్ట్ర బంద్‌ను నియోజకవర్గ ప్రజలు జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, విద్యాసంస్థలు, ప్రజాసంఘాలు, వామపక్షాల సహకారంతో బంద్ చేపడుతామన్నారు. ప్రత్యేక హోదా వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకువస్తారన్నారు. ప్రత్యేక హోదాపై బిజెపి మాట మార్చడం దారుణం అన్నారు. టిడిపికి సిగ్గు ఉంటే వెంటనే కేంద్రంలో మంత్రి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.