కృష్ణ

చిన్నారుల ప్రాణాలతో చెలగాటం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 8: అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే నాసిరకం కందిపప్పుతో సంబంధిత అధికారులు చిన్నారుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. పురుగులతో కూడిన కందిపప్పుతో పప్పుకూర, సాంబారు వండి వడ్డిస్తున్నారు. ఇవి చిన్నారుల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. గత ఏడు నెలలుగా నాసిరకం కందిపప్పునే అంగన్‌వాడీ కేంద్రాల్లో వినియోగిస్తున్నా పట్టించుకున్న వారే కరవయ్యారు. స్మార్ట్ విలేజ్ పేరిట అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, రేషన్ దుకాణాలు, పిహెచ్‌సిలు, హెల్త్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించాల్సిన ప్రత్యేకాధికారులు అక్కడున్న లోపాలను గుర్తించలేక పోతున్నారు. తూతూమంత్రంగా తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు రుచికరమైన భోజనంతో పాటు పౌష్ఠికాహారం అందిస్తున్నామంటూ సభలు, సమావేశాల్లో ప్రగల్భాలు పలికే ప్రజాప్రతినిధులు ఆచరణలో విఫలమవుతున్నారు. గతంలో అంగన్‌వాడీ కేంద్రాలకు కందిపప్పును ఐసిడిఎస్ అధికారులు నేరుగా సరఫరా చేసేవారు. అయితే జనవరి నుండి ప్రభుత్వం ఈ-పోస్ ద్వారా బియ్యం, కందిపప్పును సరఫరా చేస్తోంది. ఈ-పోస్ అమలులోకి రావటంతో గత ఏడాది డిసెంబర్‌లోనే ఐసిడిఎస్ అధికారులు అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండెంట్లకు సంబంధం లేకుండా తమ వద్ద ఉన్న నాణ్యత లేని కందిపప్పు నిల్వలను కొన్ని ప్రాజెక్టులకు సరఫరా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా బందరు రూరల్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు పెద్దఎత్తున నాసిరకం కందిపప్పు చేరింది. ఈ కందిపప్పునే శుభ్రపర్చి చిన్నారులకు వండి పెట్టమని అధికారుల ఆదేశాల మేరకు అంగన్‌వాడీ కార్యకర్తలు వండి పెడుతున్నట్లు తెలుస్తోంది. బందరు మండలం ఉల్లిపాలెం అంగన్‌వాడీ కేంద్రంలో ఇలాంటి నాసిరకం కందిపప్పును వినియోగిస్తున్నారు. దాదాపు అన్ని కేంద్రాల్లోనూ ఇదే నాసిరకం కంది పప్పునే వినియోగిస్తున్నట్టు సమాచారం. ఇదిలావుంటే, ఈ-పోస్ ద్వారా ఇచ్చే కందిపప్పు కూడా నాసిరకంగా ఉంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్నారులకు రుచికరమైన ఆహారం అందించాల్సిన అంగన్‌వాడీ కేంద్రాలకు నాసిరకం ఆహార పదార్థాలను ప్రభుత్వం సరఫరా చేయడం వల్ల చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదముందని తల్లిదండ్రులు వాపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి నాసిరకం కందిపప్పు సరఫరా నిలుపుదలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
విచారణ నిర్వహిస్తాం:కృష్ణకుమారి
బందరు రూరల్ ప్రాజెక్టులో నాసిరకం కందిపప్పు వినియోగిస్తున్నారన్న ఆరోపణలపై విచారణ నిర్వహిస్తామని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కృష్ణకుమారి ‘ఆంధ్రభూమి’ ప్రతినిధికి తెలిపారు. జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు రేషన్ దుకాణాల ద్వారా నాణ్యమైన కందిపప్పునే సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఎక్కడైనా అవకతవకలకు పాల్పడితే విచారణ నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె వివరించారు.