కృష్ణ

వ్యాపార కేంద్రాలుగా ‘విద్యాలయాలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 10: చదువుల తల్లి సరస్వతీ దేవి నడయాడే విద్యాలయాలు వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి వర్గాలకు విద్య అందని ద్రాక్షలా మారుతోంది. ఎంతో మంది మేధావులను సమాజానికి అందించిన ప్రభుత్వ పాఠశాలల పట్ల పాలకులు అవలంభిస్తున్న విధానాల వల్ల కార్పొరేట్ విద్యా సంస్థలు రాజ్యమేలుతున్నాయి. విద్యా రంగాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తుండటంతో పవిత్ర దేవాలయాలుగా భావించే ప్రభుత్వ పాఠశాలలు పతనావస్థకు చేరుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలతో పాటు కూలీ నాలీ చేసుకుని జీవించే శ్రమజీవులు సైతం నేటి పోటీ ప్రపంచంలో తమ పిల్లలను ఉన్నత స్థాయిలోకి తీసుకువెళ్ళేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు సరిగ్గా లేకపోవటంతో ఆ వైపు కనె్నత్తి చూడటం లేదు. అప్పోసొప్పో చేసైనా తమ పిల్లలను ప్రైవేట్ విద్యాలయాల్లో చేర్పించేందుకు నిద్రాహారాలు మాని స్కూల్ ఫీజుల నిమిత్తం రూపాయి రూపాయి కూడబెట్టుకుంటున్నారు. దీనే్న అసరాగా చేసుకుంటున్న ప్రైవేట్ విద్యా సంస్థలు శ్రమజీవులు రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నారు. ఆ ఫీజు ఈ ఫీజు అంటూ తలకు మించిన భారాన్ని వారి నెత్తిన పడేస్తున్నారు. ప్రైవేట్ విద్యాలయాల్లో పిల్లలను చదివించాలనుకుంటే వేలాది రూపాయలను మంచినీళ్ళలా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. జూన్ నెల మొత్తం ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రుల గుండెలు డబ్బు డబ్బు అంటూ కొట్టుకోక మానడం లేదు. ఒకటి కాదు రెండు కాదు రక రకాల ఫీజుల పేరుతో వేలాది రూపాయలను దండుకుంటున్నారు. పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగ్‌లు, యూనిఫాంలు, రవాణా ఛార్జీలు, ట్యూషన్ ఫీజులు, విజ్ఞాన యాత్రలు, సాంస్కృతిక పోటీలకు అవసరమైన శిక్షణ ఒక్కటేమిటి ఇలా చెప్పుకుంటూ పోతే పలు రూపాల్లో వసూళ్ళకు పాల్పడుతూ విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఉచితంగా కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యను అందించాల్సి ఉంది. కానీ ఆ చట్టాన్ని అమలు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఫీజుల నియంత్రణలో విద్యా శాఖాధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. దీంతో కార్పొరేట్ విద్యా సంస్థలు తమ విద్యా వ్యాపారాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. అడ్మిషన్ల సమయంలోనే వేలాది రూపాయలు దండుకుంటున్న యాజమాన్యాలు నెల నెలా మరింత భారాన్ని మోస్తున్నారు. ఎల్‌కేజీలో చేర్చాలంటే రూ.10 నుండి రూ.25 వేలు వరకు అడ్మిషన్ ఫీజు వసూళ్ళు చేస్తున్నారు. ఇక 1 నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థుల అడ్మిషన్ ఫీజులు మాత్రం దిమ్మతిరిగే విధంగా ఉంటున్నాయి. తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు సైతం మోజు చూపిస్తుండటంతో ప్రతి సంవత్సరం ఫీజులను విపరీతంగా పెంచుకుంటూ పోవడం యాజమాన్యాల వంతుగా మారింది. వేసవి శెలవులు ముగియక ముందే తమ పాఠశాలల్లోని సీట్లన్నింటినీ పెద్ద మొత్తంలో అమ్మేసుకుని జేబులు నింపుకుంటున్నారు. ఏది ఏమైనా నలుగురికీ పంచాల్సిన విద్య డబ్బు చేతిలో కీలుబొమ్మగా మారుతోందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.