కర్నూల్

నందికొట్కూరులో నకిలీ నోట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, జనవరి 20 : కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో చావుదెబ్బ తిన్న వ్యాపారులు, ప్రజలు వాటి ప్రభావం నుంచి కోలుకోకముందే నకిలీ నోట్లు మార్కెట్‌లోకి రావడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంకా పూర్తిస్థాయిలో కొత్తనోట్లు అందుబాటులోకి రాకపోయినా వాటికంటే ముందుగా నకిలీ నోట్లు రాజ్యమేలుతుండడంతో కొత్త నోట్లు తీసుకునేందుకు వ్యాపారులు జంకుతున్నారు. అసలు నోటు ఏదో, నకిలీ నోటు ఏదో తెలుసుకోలేక తికమకపడుతున్నారు. కొత్త రూ. 2వేలు, రూ. 500 నోట్లను కొందరు కలర్ జికార్స్ చేసి చాకచక్యంగా మారుస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వ్యాపారాలు బిజీగా వున్న సమయంలో జిరాక్స్ చేసిన నోట్లు కొన్ని అసలు నోట్ల మధ్యన ఉంచి అందజేస్తుండడంతో వాటిని వెంటనే గుర్తు పట్టలేక తీసుకుని వ్యాపారులు నష్టపోతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం నందికొట్కూరు పట్టణంలోని మిడుతూరు రహదారిలో కిరాణా వ్యాపారం నిర్వహించే మల్లికార్జునప్పకు నకిలీ రూ. 500 నోటు వచ్చింది. ఆ నోటు పూర్తిస్థాయిలో ఒరిజినల్ రూ. 500 నోటును పోలి వుండడంతో తాను నోటు తీసుకున్నానని, అయితే ఆ నోటు ఇతరులకు ఇచ్చే సమయంలో నకిలీ నోటు అని గుర్తించినట్లు వాపోయాడు. ఇలాగే పలుచోట్ల నకిలీ రూ. 500 నోట్లు వస్తున్నప్పటికీ సంబంధిత వ్యాపారులు ఫిర్యాదుల వరకూ వెళ్లడం లేదు. కాగా పెద్దనోట్లు రద్దు చేసి నల్లధనాన్ని నిరోధించామని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నోట్ల రద్దు అనంతరం ఆ సమస్యకు పరిష్కారం చూపడంలో పూర్తిగా విఫలం చెందాయని వ్యాపారులు మండిపడుతున్నారు.
భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు
* దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాద్
* శ్రీశైలంలో అభివృద్ధి పనుల పరిశీలన
శ్రీశైలం, జవనరి 20 : శ్రీభ్రమరాం బిక మల్లికార్జున స్వామివార్ల దర్శనా ర్థం శ్రీశైలం వచ్చే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ తమ వంతు కృషి చేస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జెఎసి వి.ప్రసాద్ తెలిపారు. ఆయన శుక్రవారం శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానం పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను, మహాశివరాత్రి ఏర్పాట్లను, బృహత్ ప్రణాళిక పనులను పరిశీలించారు. అంతకు ముందు ఆయనకు ఆలయ రాజగోపురం వద్ద అధికారు లు సాదరస్వాగతం పలకగా ఆయన స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన బృహత్ ప్రణాళికలో భాగంగా చేపట్టిన శ్రీశైలం దేవస్థానం పరిధిలో చేపట్టిన పనులను, అభివృద్ధి పనులను ఇఓ నారాయణ భరత్‌గుప్తా, ఇఇ రామిరెడ్డి, జెఇఓ హరినాథ్‌రెడ్డిలతో కలిసి పరిశీలించారు. అందులో భాగం గా క్యూలైన్లు, దేవస్థానం వారు నూతనంగా నిర్మించిన వాణిజ్య సముదాయ భవనం, అభివృద్ధి పనుల్లో భాగంగా రోడ్ల విస్తరణను చేపట్టిన కార్యక్రమాన్ని పరిశీలించారు. అలాగే భక్తులకు తీసుకున్న ఏర్పాట్లను, ఇక ముందు తీసుకోవాల్సిన ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకొని వారికి పలు సూచనలు ఇచ్చారు. వీటితోపాటు గుడి చుట్టూ రోడ్ల విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని, శివరాత్రి, ఉగాది సమయాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా రోడ్ల విస్తరణను, క్యూ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం జరిగితే సహించేదిలేదని తెలిపారు. పాతాళగంగలో ఏర్పాట్లను కూడా పరిశీలించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
24, 25న బిజెపి
రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు
* రాష్ట్ర జనరల్ సెక్రటరీ సురేష్‌రెడ్డి
కర్నూలు ఓల్డ్‌సిటీ, జనవరి 20:స్థానిక లేబర్ కాలనీలోని సోమిశెట్టి తనిష్ కల్యాణ మండపంలో ఈ నెల 24, 25 తేదీల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నట్లు బిజెపి రాష్ట్ర జనరల్ సెక్రటరీ సురేష్‌రెడ్డి తెలిపారు. నగరంలోని బిజెపి కార్యాలయంలో శుక్రవారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు సుమారు 250 నుంచి 350 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశాలకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జాతీయ కార్యవర్గం సభ్యులు, 13 జిల్లాలకు చెందిన పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు కూడా హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశాల్లో పార్టీ వ్యవస్థాపకులు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శతజయంతి ఉత్సవాల సందర్భంగా చేపట్టబోయే వివిధ కార్యక్రమాలపై చర్చించనున్నట్లు తెలిపారు. అలాగే రాయలసీమ సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరుగుతుందన్నారు. ప్రతి కార్యకర్త కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సందడి సుధాకర్, రంగస్వామి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపారెడ్డి, జిల్లా అధ్యక్షుడు హరీష్, కార్యదర్శి రమేష్, కాళింగ నరసింహవర్మ, నగర కార్యదర్శి యోగానందచౌదరి, తదితరులు పాల్గొన్నారు.
లస్కర్లకు జీఓ నెం.151 వర్తింపు
కర్నూలు సిటీ, జనవరి 20:జిల్లాలోని వివిధ ఇరిగేషన్ సెక్షన్లలో పనిచేస్తున్న లస్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం.151ని వర్తింపజేస్తుందని శ్రీశైలం నీటి ముంపు నిర్వాసితుల ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బి.బాలచంద్రుడు తెలిపారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఔట్ సోర్సింగ్ లస్కర్లకు జీఓ నెం.151, కేటగిరి-3 ప్రకారం నెలసరి వేతనం రూ. 12వేలు ఉందని, అయితే పే అండ్ అకౌంట్స్ అధికారులు ఈ జీతం వర్తించదని ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ తీసుకు వస్తే అప్పుడు రూ. 12వేల ఇస్తామని చెప్పారన్నారు. ఈ విషయాన్ని తక్షణమే ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజినీర్ దృష్టికి తీసుకెళ్లి, ఆయన ద్వారా రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావును కలిసి విన్నవించామన్నారు. దీంతో మంత్రి దేవినేని స్పందించి ఇరిగేషన్ శాఖకు లస్కర్లకు జీఓ నెం. 151, కేటగిరి-3 ప్రకారం నెలకు రూ. 12 వేల వేతనం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 748మంది లస్కర్లకు ఈ విధానం వర్తిస్తుందని, అందరినీ రెగ్యులర్ చేస్తానని కూడా హామీ ఇచ్చారన్నారు. కార్యక్రమంలో శ్రీశైలం ప్రాజెక్టు నీటి ముంపు నిర్వాసితుల ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి రాముడు, శేషన్న, ఎల్లయ్య, వెంకటేశ్వర్లు, లోకేష్, రాజప్ప, తిక్కస్వామి, తదితరులు పాల్గొన్నారు.
కోట్ల విగ్రహాన్ని తొలగిస్తే సహించం
* పిఎసి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
డోన్, జనవరి 20 : నియోజకవర్గ పరిధిలోని ప్యాపిలిలో ఏర్పాటు చేయనున్న దింవగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కరరెడ్డి విగ్రహం ఏర్పాటుపై రాజకీయం చేయడం విడ్డూరమని, కోట్ల విగ్రహాన్ని తొలగిస్తే ఊరుకోమని పిఎసి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు. పట్టణంలోని వైకాపా నేత టిఇ కేశవయ్యగౌడ్ నివాసంలో శుక్రవారం ఆయన విలేఖరుల సమావేశం మాట్లాడుతూ టిడిపి పాలకులు, కెఇ సోదరులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన కోట్ల విజయభాస్కరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా అధికార పార్టీ నాయకులు అడ్డంకులు సృష్టించడం తగదన్నారు. కోట్ల విగ్రహ ఏర్పాటుకు వైకాపా తరఫున సంపూర్ణ సహకారం వుంటుందన్నారు. అధికార పార్టీ నాయకుల అండతోనే డోన్ మండలంలోని కన్నపుకుంట, కమలాపురం గ్రామాల్లో దళితుల భూముల్లో మైనింగ్ చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. లీజు పేరుతో దళితుల భూముల్లోని ఖనిజ సంపదను అక్రమంగా దోచుకునేందుకు ఎత్తులు వేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి పేరుతో చంద్రబాబు రాజధాని భూములను కొల్లగొడితే, మైనింగ్ వ్యాపారానికి డోన్‌లో తెలుగుతమ్ముళ్లు దళితుల భూములపై కనే్నశారని విమర్శించారు.
రాజ్యాంగేతర శక్తిగా కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని నాడు అసెంబ్లీలో గళం విప్పిన కెఇ కృష్ణమూర్తికి నేడు అతని సోదరుడు చేస్తున్నది కనిపించలేదా అని ప్రశ్నించారు. అధికారం అడ్డుపెట్టుకుని రాజ్యాంగేతర శక్తిగా తమ్ముడు వ్యవరిస్తున్నా నోరుమెదపడం లేదని ఆరోపించారు. అధికార పార్టీ ముసుగులో చేస్తున్న అక్రమాలను బయటపెడతానని బుగ్గన స్పష్టం చేశారు. సమావేశంలో వైకాపా నేత టిఇ కేశవయ్యగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
సిసి కెమెరాల నిఘాలో ఆదోని
* పలు కేసుల్లో నిందితుల అరెస్టు:డీఎస్పీ శ్రీనివాసరావు
ఆదోని, జనవరి 20: సిసిటివి కెమెరాల నిఘా నీడలో ఆదోని పట్టణం మొత్తం ఉండేలా నూతనంగా సిసిటివి కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు డిఎస్‌పి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పోలీస్ కంట్రోల్ రూంలో రూ.30లక్షలతో సిసిటివి కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేశామని, శనివారం ఎస్పీ రవికృష్ణతో ప్రారంభోత్సవం చేయిస్తారని డిఎస్పీ తెలిపారు. ఆదోని పట్టణం మొత్తంలో 60 ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి ఆప్రాంతాలను పోలీస్ కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన టీవిలకు అనుసంధానం చేశామని స్పష్టం చేశారు. కంట్రోల్ రూంలో విధులు నిర్వహించే పోలీసులు, ఎస్‌ఐలు ఎప్పటికప్పుడు కెమెరాల ద్వారా టీవిలో కనిపించే వివిధ అంశాలను పరిగణంలోకి తీసుకుని నేరాలు, ఘోరాలు, ప్రమాదాలు జరిగితే వెంటనే ఆయాప్రాంతాల్లో విధులు నిర్వహించే పోలీసులకు క్షణాల మీద సమాచారాన్ని అందిస్తారన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతాలకు వెళ్ళి నిందితులను పట్టుకోవడానికి సులువు అవుతుందన్నారు. అంతేకాకుండా ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే పోలీసులు సమాచారం అందుకుని గాయాలైన వారిని ఆసుపత్రిలో చేర్పించే అవకాశాలు ఉంటాయన్నారు. ఆదోని పట్టణంలో సిసి కెమెరాలు అందించిన పుటేజీల ద్వారా ఇప్పటి వరకు 25 కేసుల్లో నిందితులను పట్టుకుని కేసులను పరిష్కరించామన్నారు. ఇందులో 9 బంగారు నగలను మహిళల గొంతుల్లో నుండి లాక్కెలిన దొంగల కేసులను పట్టుకొని సొమ్మును రికవరీ చేశామని చెప్పారు. పోలీసులు పరిమితంగా ఉండడం వల్ల నేరాలు పెరిగిపోతున్నాయని, అందువల్లనే తాము కంట్రోల్ రూంలో సిసిటివి కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేశామని అన్నారు. ముఖ్యంగా ఆదోని మున్సిపల్ కౌన్సిల్ సిసిటివిల వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రూ.30లక్షలను పోలీసు శాఖకు ఇచ్చిందన్నారు. మున్సిపల్ కౌన్సిల్ సహకారంతోనే సిసిటివి వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం పోలీస్ కంట్రోల్ రూంలో ఉన్న 60 సిసి కెమెరాల పుటేజీలు ఎప్పటికప్పుడు వస్తుంటాయన్నారు.
ఆదోనిలోని మూడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సిసికెమెరాల ద్వారా సిసిటివిలో దృశ్యాలు కలిపిస్తాయని, రాత్రి పూట రోడ్లుపై అనుమానస్పందగా తిరిగిన వారిని ఫొటో దృశ్యాలలో గమనించి వెంటనే విధుల్లో ఉన్న పోలీసులకు సమాచారం ఇస్తారని, వారు అనుమానస్పదంగా తిరిగే వ్యక్తులను అదుపులోకి తీసుకుంటారని చెప్పారు. అలాగే మహిళలు ఒంటరిగా రోడ్లుమీద వెళ్లేటప్పుడు పోకిరీలు లేదా దొంగలు మహిళలపై దాడులకు పాల్పడడం, మెడలో నగలను లాక్కుని పారిపోవడం, క్రిమినల్ చర్యలకు పాల్పడడం వంటి చర్యలు జరిగితే సిసి కెమెరాల పుటేజీల ద్వారా వెంటనే నిందితులను పట్టుకోవడం లేదా నిందితులను గుర్తించి పరారైతే వారిని అరెస్టు చేయడం లాంటి నేరాలకు నిఘా వ్యవస్థ ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. ఆదోని పట్టణంలో 60 సిసి కెమెరాలను 20 ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇవి కాకుండా బ్యాంకులు, ఎల్‌ఐసి కార్యాలయం, వాణిజ్య వ్యాపార సంస్థలు, హోటళ్ళు, సినిమా హాళ్లు, రైల్వే స్టేషన్, బస్టాండ్, ప్రభుత్వ కార్యాలయాల వద్ద 200 సిసి కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. పోలీసుల సంఖ్య పరిమితంగా ఉన్న సిసికెమెరాల వ్యవస్థ ద్వారా నేరాలను అదుపు చేయడానికి ఎంతోఉపయోగ పడుతుందని అన్నారు.
ఆర్టీసీ అభివృద్ధికి చేయూత
* ప్రత్యేక ప్రణాళికతో ప్రైవేట్ వాహనాలకు కళ్లెం:ఎస్పీ రవికృష్ణ
కర్నూలు, జనవరి 20 : ఆర్టీసీ అభివృద్ధికి పోలీసు శాఖ సహకారం ఎప్పుడూ ఉంటుందని ఎస్పీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. నగరంలోని కమాం డ్ కంట్రోల్ సెంటర్‌లో శుక్రవారం ఏపిఎస్ ఆర్టీసీ, రవాణశాఖ సంయుక్తంగా సమావేశం నిర్వహించారు. మోటారు వాహనాల నిబంధనలను సక్రమంగా అమలు చేసేలా, అక్రమ రవాణా వాహనాలను సమర్థవంతంగా నిరోధించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరా రు. జిల్లాలో అనుమతిలేని చోట రహదారులపై ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలు, ఆటోలు ఓవర్ లోడుతో తిప్పుతున్నారని అలాంటి వాహనాలపై పోలీసు, ఆర్టీసీ, ఆర్టీఎ శాఖల అధికారులు సం యుక్తంగా తనిఖీలు నిర్వహించి కట్టడి చేయాలని నిర్ణయించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఏపిఎస్ ఆర్టీసీ నష్టాలకు గురవుతుందని, కావున జిల్లాలో అక్రమ రవాణా వాహనాల నిరోధానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ముఖ్యంగా ఆర్‌టిసి ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేరుస్తుందనే నమ్మకం ప్రజల్లో కల్పించాలన్నారు. డిటిసి ప్రమీల మాట్లాడుతూ నిబంధనలు సక్రమంగా అమలయ్యేలా ఆర్‌టిసికి సహాయ, ససకారాలు అందిస్తామని తెలిపారు. సమావేశంలో విజిలెన్స్ అధికారి శివకోటిబాబురావు, కర్నూలు ఆర్టీసీ ఆర్‌ఎం వెంకటేశ్వరావు, డిప్యూ టీ సిటిఎం శ్రీనివాసులు, డిఎంలు జగన్‌మోహన్‌రావు, అజ్మతుల్లా, విజిలెన్స్ సెక్యూరిటీ అధికారులు శ్రీనివాసులు, ముజఫర్ రహిమాన్, డీఎస్పీలు బాబుప్రసాద్, రామచంద్ర, సిఐలు పార్థసారధి, ఆదిలక్ష్మి పాల్గొన్నారు.
ఉరుకుంద క్షేత్రంలో
అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు
* దేవాదాయ శాఖ డిఇ శ్రీనివాస ప్రసాద్
మహానంది, జనవరి 20: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ఉరుకున్న ఈరన్న స్వామి ఆలయ అభివృద్ధికి రూ.15 కోట్లతో ప్రతిపాధనలు తయారు చేసి పంపినట్లు దేవాదాయ శాఖ మల్లీజోన్ -2 డిఇ శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆయన మహానంది పుణ్యక్షేత్రంలో వంద గదుల నిర్మాణం, ఎల్‌ఇడి విద్యుత్ అలంకరణ, స్థల పరిశీలనలకు వచ్చామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉరుకుంద క్షేత్రంలో ప్రాకార మండపాల నిర్మాణాలకు అభివృద్ధి పనులు తయారు చేసినట్లు తెలిపారు. అలాగే మద్దిలేటయ్య క్షేత్రంలో రెండు కోట్లతో అమ్మవారి ఆలయం, రూ.5 కోట్లతో వసతి గదుల నిర్మాణంకు టెండర్లు పూర్తి చేశామన్నారు. యాగంటి క్షేత్రంలో వేదపాఠశాలకు రూ.40 లక్షలతో ప్రతిపాధనలు పంపామన్నారు. అహోబిలంలో రూ.1.20 కోట్లతో ప్రహరీలు, షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు. రూ.12 కోట్లతో 59 పనులు రాగా, 22 పనులు పూర్తి చేశామని, 21 పనులు జరుగుతున్నాయని, పలు కారణాల వల్ల 17 పనులు ఆగిపోయాయన్నారు.