కర్నూల్

శాసనమండలి పోరుకు రంగం సిద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జనవరి 21:శాసన మండలిలో ఖాళీ కానున్న స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ చేసి మార్చి మొదటి వారంలో పోలింగ్ నిర్వహించవచ్చని అధికారుల ద్వారా తెలుస్తోంది. జిల్లాలో స్థానిక సంస్థలు, పట్ట్భద్రులు, ఉపాయాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం స్థానిక సంస్థల తరఫున శిల్పా చక్రపాణిరెడ్డి, పట్ట్భద్రుల నియోజకవర్గం నుంచి గేయానంద్, ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి బచ్చల పుల్లయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరి పదవీ కాలం మార్చి 15వ తేదీతో ముగియనుందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ దఫా పట్ట్భద్రుల నియోజకవర్గం నుంచి జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కెజె రెడ్డి టిడిపి మద్దతుతో బరిలో ఉంటారని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించగా స్థానిక సంస్థల తరఫున మండలి స్థానానికి మరోమారు తనకే అవకాశం వస్తుందని శిల్పా చక్రపాణిరెడ్డి ధీమాతో ఉండగా ఆయన స్థానంలో ఎన్నికయ్యేందుకు పలువురు పోటీ పడుతున్నట్ల తెలుస్తోంది. మాజీ మంత్రి కెఇ ప్రభాకర్ ఈసారి ఎమ్మెల్సీగా ఎన్నిక కావడానికి సిఎం చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. స్థానిక సంస్థల నుంచి కాకపోయినా నామినేటెడ్ కోటాలోనైనా తనకు అవకాశం కల్పించాలని ఆయన ఇప్పటికే పార్టీ అధినేతను కలిసి విన్నవించినట్లు పేర్కొంటున్నారు. కాగా ఈ స్థానం నుంచి ఈ సారి బిసిలు, మైనారిటీల్లో ఒకరికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారని పార్టీ నేతల ద్వారా తెలుస్తోంది. మైనారిటీ కోటాలో నంద్యాలకు చెందిన మాజీ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ అవకాశం దక్కించుకోవచ్చని స్పష్టమవుతోంది. ఆయనకు నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మద్దతు ఉన్నట్లు పార్టీలో చర్చించుకుంటున్నారు. స్థానిక సంస్థల కోటాలో ఫరూక్, ప్రభాకర్‌లలో ఒకరికి అవకాశమిస్తే మరొకరికి నామినేటెడ్ కోటాలో మండలి సభ్యత్వం కల్పిస్తారని తెలుస్తోంది. అయితే స్థానిక సంస్థల కోటాలో ఈ సారి కూడా తనకే అవకాశం ఇవ్వడానికి గతంలోనే సిఎం చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారని శిల్పా చక్రపాణిరెడ్డి ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా శాసనమండలి నుంచి జిల్లాకు చెందిన ముగ్గురు పదవీ విరమణ పొందనున్నారని వారి స్థానంలో జిల్లా నుంచే మరోమారు ముగ్గురిని మండలికి ఎంపిక చేయాలని పార్టీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు గతంలో వినతి పత్రం ఇచ్చారని ఓ సీనియర్ నేత వెల్లడించారు. ఆయన అంగీకరిస్తే ఈ సారి కూడా ముగ్గురు సభ్యులు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే జరిగితే రానున్న 2019 ఎన్నికల్లో కొత్తగా వైకాపా నుంచి పార్టీలో చేరిన పలువురు సభ్యులకు తిరిగి టికెట్లు కేటాయించడానికి ఇబ్బందులు తొలిగిపోతాయని పేర్కొంటన్నారు. ఇప్పటికే కర్నూలు నుంచి టిజి వెంకటేష్‌ను రాజ్యసభకు పంపడం ద్వారా స్థానిక ఎమ్మెల్యే ఎస్వీ మోహనరెడ్డికి మార్గం సుగమమైందని, నంద్యాలలో మండలికి ఫరూక్‌ను, పార్లమెంటు స్థానానికి భూమా, శిల్పాలలో ఒకరిని ఎంపిక చేస్తే ఎమ్మెల్యే టికెట్ మరొకరికి ఇవ్వడానికి వీలవుతుందని వారు వెల్లడిస్తున్నారు. ఇక శ్రీశైలం నుంచి శిల్పా చక్రపాణిని మండలికి ఎంపిక చేస్తే బుడ్డా రాజశేఖరరెడ్డి కూడా ఊపిరి పీల్చుకుంటారని ఆ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. ఏదైమైనా శాసన మండలికి జిల్లా నుంచి ఎవరిని ఎంపిక చేయాలో ఫిబ్రవరి రెండవ వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నారు.
రిపబ్లిక్ డే ఘనంగా నిర్వహించాలి
* కలెక్టర్ విజయమోహన్
కర్నూలు, జనవరి 21 : 68వ భారత గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ విజయమోహన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ ఉదయం 7.45 గంటలకు జాతీ య పతాకాన్ని ఆవిష్కరించాలన్నారు. కావున అధికారులు అందుకు తగిన ఏర్పాట్లను జాగ్రత్తగా చేసుకోవాలని సూచించారు. పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకం ఏర్పాట్లు, సాయుధ దళాల మార్చ్ఫాస్ట్ రిహార్సల్ చూసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పోలీసు మైదానంలో షామియానా, చైర్‌లు, విఐపిలకు ఆహ్వాన పత్రికలు పంపడం తదితర ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆర్డీఓ రఘుబాబును ఆదేశించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని డిఇఓను ఆదేశించారు. గత ఏడాది కంటే భినంగా ఏర్పాట్లు చేసుకునేందుకు ప్రతి అధికారి కృషి చేయాలన్నారు. శకటాల ప్రదర్శనలో కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగుల పేర్లను ఈ నెల 22వ తేదీలోగా అందజేయాలని ఆదేశించారు. ఎస్పీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవానికి పోలీసు శాఖ అప్రమత్తంగా వుం డాలని సంకేతాలు వచ్చాయన్నారు. స్టాల్స్, మైదానంలో అనుమానిత వ్య క్తులు సంచరిస్తే తమకు సమాచారం అందించాలని తెలిపారు. సమావేశంలో డిఆర్‌ఓ గంగాధరగౌడ్, అన్నిశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నేడు పోలీసు కానిస్టేబుల్
మెయిన్ పరీక్ష
* హాజరు కానున్న 16,796 మంది అభ్యర్థులు
* 27 పరీక్ష కేంద్రాలు.. భారీ బందోబస్తు
కర్నూలు, జనవరి 21:పోలీసు కానిస్టేబుల్ మెయిన్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ ఆకే రవికృష్ణ శనివారం తెలిపారు. ఈ నెల 22వ తేదీ జరిగే మెయిన్ పరీక్షకు కర్నూలు నగరంలో 27 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు కర్నూలు జిల్లా నుంచి 7,969, కడప జిల్లా నుంచి 5,196, అనంతపురం జిల్లా నుంచి 3,631 మంది చొప్పున మొత్తం 16,796 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారన్నారు. సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ వాచ్, ఇతర వస్తువులను పరీక్ష హాలులోకి అనుమతించబోమని ఎస్పీ స్పష్టం చేశారు. పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ఉంటుందని, 1 నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని ఎస్పీ తెలిపారు. పరీక్ష కేంద్రాల చుట్టూ దాదాపు 200 మీటర్ల మేర పరీక్ష జరిగే సమయంలో జిరాక్స్ షాపులు, హోటళ్లు, టైప్ ఇనిస్టిట్యూట్లు, నెట్ సెంటర్లు మూసివేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు.
9 మంది సిఐల బదిలీ
కర్నూలు, జనవరి 21 : జిల్లా పోలీసు శాఖలో పని చేస్తున్న 9 మంది సిఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డిఐజి బివి రమణకుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో ఆదోని ట్రాఫిక్ సిఐగా ఉన్న అబ్దుల్‌గౌస్‌ను ఆలూరు సర్కిల్‌కు, ఆలూరు సిఐ శంకరయ్యను ఆదోని ట్రాఫిక్‌కు, కర్నూలు విఆర్‌లో ఉన్న రామకృష్ణను ప్యాపిలి పిఎస్‌కు, ప్యాపిలి సిఐ జి.ప్రసాద్‌ను ఎమ్మిగనూరుకు, ఎమ్మిగనూరు సిఐ కె.శ్రీనివాసమూర్తిని ఆదోని పోలీసు కంట్రోల్ రూం(పిసిఆర్)కు, శ్రీశైలం సిఐ ఎ.విజయకృష్ణను కర్నూలు విఆర్‌కు, కోసిగి సిఐ ఇ.కంబగిరిరాముడును బేతంచెర్ల పోలీస్ స్టేషన్‌కు(అటాచ్), బేతంచెర్ల సిఐ ఆర్‌జి సుబ్రహ్మణ్యంను కర్నూలు సిసిఎస్‌కు, కర్నూలు పోలీసు కంట్రోల్ రూంలో ఉన్న టి.శివశంకర్‌ను అనంతపురం నాల్గవ టౌన్‌కు బదిలీ చేశారు. ఉత్తర్వులు అందుకున్న సిఐలు వెంటనే ఆయా స్టేషన్లలో రిపోర్టు చేయాలని డిఐజి ఆదేశించారు.
రాత్రి గస్తీపై నిఘా
* ఎస్పీ ఆకే రవికృష్ణ
ఆదోనిటౌన్, జనవరి 21: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ-బీట్ విధానంతో రాత్రి పూట గస్తితిరిగే పోలీసులపై నిఘా నేత్రం ఉంటుందని రాత్రి ముమ్మరంగా గస్తీ అమలుల్లోకి వచ్చిందని ఎస్పీ రవికృష్ణ స్పష్టం చేశారు. శనివారం ఆదోనిలో ఏర్పాటు చేసిన విలేఖకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రాత్రి పూట గస్తి కోసం 490 ట్యాబ్‌లను ఆయా స్టేషన్లలలో ఏర్పాటు చేశామని ఇప్పటికే 300 పోలీస్ స్టేషన్లలో ఈ- బీట్ గస్తి అమలుల్లోకి వచ్చిందన్నారు. ముఖ్యంగా ఈ-బీట్ గస్తికి వెళ్ళే కానిస్టేబుళ్ళు విధిగా ట్యాబులను తీసుకోని పోవాల్సి ఉటుందని ఈ ట్యాబులకు జిపి ఎస్ అనుసంధానం అయి ఉంటాయని వివరించారు. ప్రతి కానిస్టేబుల్ రాత్రి పూట గస్తి సమయం పూర్తిగా నిర్వహించాల్సి ఉంటుందని ఎలాంటి నిర్లక్ష్యం చేసిన, గస్తీకి వెళ్లకపోయిన వెంటనే సమాచారం వస్తుందన తెలిపారు. ట్రాక్ ఇస్టరీ మొత్తం సేకరిస్తామని, ముఖ్యంగా రాత్రి పూట జరిగే నేరాలు, సంఘటనలపై వెంటనే స్పందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో నేరాలు శాతం భాగా తగ్గిందని, ఫ్యాక్షన్ పూర్తిగా తగ్గుముఖం పట్టిందన్నారు. యువత చదువువైపు, ఉద్యోగాల వైపు పోతున్నారని గ్రామీణ ప్రాంతాల తల్లిదండ్రులు సైతం తమ పిల్లలు ఉన్నతస్థాయిలో ఉండాలని కోరుకుంటున్నారన్నారు. సిసి టీవిల కెమెరా విధానం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో అమలు చేస్తామని అన్నారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణకై త్వరలో ఈ ఛలాన విధానం అమలు చేస్తామని, దీని కోసం కర్నూలు, నంద్యాల, ఆదోనిలో కొత్త టెక్నాలాజీ అమల్లోకి తెస్తామన్నారు. దీని వల్ల వాహనాలు ఎవరైన ఎక్కడైన వదిలిపోతే ట్రాఫిక్‌ను అంతరాయం కల్గించిన వారిపై జరిమానా విధించి వారి ఇంటికి రసీదు పంపుతామన్నారు. ఈ సమావేశంలో డిఎస్‌పి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
నేలను బతికించుకుంటేనే
దేశం సుభిక్షం
* రీజనల్ ఎగ్జిక్యూటివ్ డా. వైవిఎన్ మూర్తి
మహానంది, జనవరి 21: ప్రస్తుతం రైతులు ఎరువుల వాడకం వల్ల నేల సారవంతం తగ్గిపోయి పోషక విలువలు క్షీణించిపోతున్నాయని, రసాయనిక ఎరువులు వాడి నేలను బ్రతికించుకుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని రీజనల్ ఎగ్జిక్యూటీవ్ వైవియన్ మూర్తి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా.శివశంకర్ పేర్కొన్నారు. శనివారం మహానంది వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ విద్యతోపాటు విద్యార్థులు తెలుసుకోవాల్సిన రసాయనిక ఎరువుల వాడకంపై ఆచార్య ఎన్‌జి రంగ వ్యవసాయ యూనివర్శిటీ వారు ఎఫ్‌ఎఐ వారితో ఒక రోజు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు విద్యార్థులకు ఎరువుల వాడకంపై సూచించారు.
దేశంలో ప్రస్తుతం ఎరువులు ఇష్టానుసారంగా వాడుతున్నారని, అవగాహన లేకుండ వాడుతున్న ఎరువుల వల్ల నేల సారవంతం క్షీణిస్తుందన్నారు. నేలను బతికించుకుంటేనే రాబోయే కాలంలో పంట దిగుబడి వస్తుందని వారు పేర్కొన్నారు. ఎరువుల వాడకం వల్ల భూమిలోని క్రిమి కీటకాలు నశించిపోతున్నాయన్నారు. ఆరోగ్యమైన నేలలను మన దేశంలోని వ్యవసాయాన్ని బతికించుకోవాలంటే సేంద్రీయ ఎరువుల వాడాలన్నారు. నేలకు అనువైన కొత్త రకాల ఎరువులను పలు కంపెనీలు తీసుకువస్తున్నాయని, వాటిని రైతులు వాడకంపై అవగాహన పెంచుకొని వాడాలన్నారు. నేలను బట్టి, పంటను బట్టి ఎరువులు వాడకం జరుపుకోవడం వల్ల నేల సారవంతం పెరుగుతుందని, పంట దిగుబడి పెరుగుతుందని నేల బతికి ఉంటుందని, దీని వల్ల రైతు అభివృద్ధి చెంది దేశానికి వెన్నముక అవుతారన్నారు. ఈ సేంద్రీయ ఎరువులకు మూడు కంపెనీలు మాత్రమే అందిస్తున్నాయని తెలిపారు. టాటా కెమికల్, నాగార్జున ఫల్టిలైజర్స్, ఇండోగల్ఫ్ కంపెనీలు మాత్రమే ఈ ఎరువులు అమ్మకం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్ డా.బాలగురువయ్య, బోధనా, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మైనింగ్ ప్రాంతాల్లో ప్రమాదాలను
నివారించాలి
* బళ్లారి డిఎంఎస్ మనీష్‌ముర్కేట్
డోన్, జనవరి 21:మైనింగ్ ప్రాంతా ల్లో ప్రమాదాలను నివారించాలని బళ్లారి డిఎంఎస్ మనీష్‌ముర్కేట్ సూచించారు. పట్టణ సమీపంలోని ఎస్‌డబ్ల్యుఎంఎల్ కార్యాలయ ఆవరణలో శనివారం మైనింగ్ సేఫ్టీ అసోసియేషన్ కర్నాటక ఆధ్వర్యంలో మైన్స్ సేఫ్టీ వారోత్సవాలు నిర్వహించగా ముఖ్యఅతిథిగా మనీష్‌ముర్కేట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖనిజ సంపదకు పుట్టినిల్లయిన డోన్ ప్రాంతంలో వివిధ రకాల అపారమైన సంపద వుందని, వాటిని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాలన్నారు. కార్మికులు, యాజమాన్యం అనే తేడా లేకుండా మైనింగ్‌కు తోడ్పడితే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. వ్యాపారాలను పారదర్శకంగా నిర్వహించాలని, ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోవడంతో మీరు చేసే వ్యాపారాలను సెల్‌లోనే చూసుకునే అవకాశం వుందన్నారు. చిన్న చిన్న పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. డోన్ ప్రాంతంలో బడా పారిశ్రామిక వేత్తలు వున్నారని చిన్న పరిశ్రమలను ప్రోత్సహిస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. మైనింగ్ ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుకుండా చూడాల్సిన బాధ్యత యజమానులదే అన్నారు. కార్మికులకు రక్షణతో పాటు భద్రత కూడా కల్పించాలని సూచించారు. అలాగే వ్యాపార అభివృద్ధి, కార్మిక సంక్షేమం, ప్రమాదాల నివారణ, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై కూలంకుషంగా వివరించారు. ఆయా రంగాల్లో నైపుణ్యం కనబర్చిన కార్మిక, యాజమాన్యాలకు అవార్డులు అందజేశారు. వారోత్సవాల్లో బళ్లారి డిడిఎంఎస్ కన్వీనర్ తిరుపతి నాగేశ్వరరావు, ఎంఎస్‌ఏకె ఎగ్జిక్యూటివ్ సభ్యులు సుజాతశర్మ, ఆలా రమణ, ఎంఎస్‌ఏకె మైన్స్ ప్రెసిడెంట్ రామ్మోహనరావు, మైన్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్‌ఎల్ మధు, పారిశ్రామికవేత్తలు డి.కృష్ణారెడ్డి, చండ్రపల్లె లక్ష్మినారాయణయాదవ్, రేగటి రామ్మోహనరెడ్డి, కమలాపురం రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.