కర్నూల్

జిల్లా టిడిపి నేతలపై నిఘా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఫిబ్రవరి 15:రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వార్త కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జిల్లా నుంచి నంద్యాల ఎమ్మె ల్యే భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఖాయమని టిడిపి ప్రధాన కార్యాలయం నుంచి సమాచారం అందిందన్న ప్రచారంతో భూమా వ్యతిరేకులు టిడిపిలో కొనసాగడానికి విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆళ్లగడ్డ టిడిపి ఇన్‌చార్జి గంగుల ప్రభాకరరెడ్డి వైకాపాలో చేరుతున్నట్లు ప్రకటించగా నంద్యాల నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి శిల్పామోహనరెడ్డి కూడా పార్టీ వీడే యోచనలో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయనతో పా టు గతంలో తాను మంత్రి పని చేసిన అనుభవం, పరిచయాలతో మరి కొం దరు టిడిపి అసంతృప్త నేతలతో కూడా ఆయన మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. దీంతో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నాయకులు అప్రమత్తమై పార్టీని వీడే నేతలెవరన్న విషయం తేల్చడానికి పలువురు నేతల కదలికలపై నిఘా వేసినట్లు తెలుస్తోంది. అంతేగాక ప్రభుత్వ నిఘా వర్గాల నుంచి కూడా వారు సమాచారం సేకరించి ఎవరు ఎవరిని కలుస్తున్నారు, ఏం మాట్లాడారు వంటి వివరాలు సేకరించి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమాచారం పంపుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. భూమాకు మంత్రి పదవి ఇవ్వవద్దని శిల్పా సోదరులు ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేయడం కన్నా ఆయనకు మంత్రి పదవినిస్తే తమకేం కావాలో కోరుకుంటే మంచిదని సీనియర్ నేతలు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. భూమా కారణంగా ఎలాంటి ఇబ్బందులు రానివ్వనని చంద్రబాబు హామీ ఇచ్చిన తరువాత శిల్పా వర్గం ఆలోచనలో మార్పు వచ్చినా మున్ముం దు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అర్థం కాని స్థితిలో టిడిపి నేతలు ఉన్నారు. నిఘాలో తేలే సమాచారంతో చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. శాసనమండలికి స్థానిక సంస్థల ప్రతినిధిగా తమ పార్టీ మద్దతుదారుడిని ఎన్నికయ్యేలా చేసేందుకు ప్రతిపక్ష వైకాపా కసరత్తు ముమ్మరం చేసింది. ఈ స్థానానికి 2014 జూన్‌లో జరిగిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా శిల్పా చక్రపాణిరెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. జిల్లాలోని స్థానిక సంస్థల్లో వైకాపాకు మెజారిటీ ఉన్నా అప్పట్లో పలువురు నాయకులు వైకాపాను వీడి టిడిపిలో చేరడంతో ఆ పార్టీ అభ్యర్థి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈసారి జరిగే సాధారణ ఎన్నికల్లో తిరిగి తన పట్టును నిలుపుకోవడం కోసం ఆ పార్టీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పట్ట్భద్రుల నియోజకవర్గం నుంచి విజయం తమదేనన్న ధీమాతో ఉన్న ఆ పార్టీ నాయకులు స్థానిక సంస్థల మండలి అభ్యర్థిని కూడా గెలిపించుకోవాలని తహతహలాడుతున్నారు. ఇందుకు వారు సానుకూల వాతావరణాన్ని సృష్టించుకుంటున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి గంగుల ప్రభాకర రెడ్డి టిడిపిని వీడుతున్నట్లు ప్రకటించగా ఆయన దారిలో మరి కొందరు నాయకులు ఉన్నారని అంతేగాక భవిష్యత్తులో వైకాపాలో చేరడానికి సిద్ధంగా ఉన్న కొందరు నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు సహకరించనున్నారని వైకాపా జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి వెల్లడించారు. గతంలో తమ పార్టీని వీడిన నేతల్లో కొందరు తిరిగి త్వరలో పార్టీలో చేరనున్నారని మరి కొందరు భవిష్యత్తులో పార్టీలో చేరుతారని వెల్లడిస్తున్నారు. వీరంతా ప్రస్తుతం శాసన మండలికి పట్ట్భద్రులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపాకు మద్దతు ఇవ్వనున్నారని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఈ రెండు స్థానాల్లో విజయం ఖాయమని ఆయన ధీమాతో ఉన్నారు. శాసన మండలి పట్ట్భద్రుల నియోజకవర్గానికి ప్రస్తుతం నామినేషన్లను స్వీకరిస్తుండగా మార్చి 9న పోలింగ్, 15వ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక స్థానిక సంస్థల నుంచి ఎన్నిక కోసం ఈ నెల 21న నోటిఫికేషన్ జారీ చేసి మార్చి 21న పోలింగ్ నిర్వహించనున్నారు. కాగా స్థానిక సంస్థల ప్రతినిధిగా టిడిపి తరపున మరో మారు శిల్పా చక్రపాణిరెడ్డికి అవకాశం ఇవ్వనున్నట్లు పార్లీ నేతలు కొందరు పేర్కొంటుండగా మరి కొందరు ఈ సారి బిసిలకు అవకాశం కల్పిస్తారని పేర్కొంటున్నారు. శిల్పా సోదరులు పార్టీ వీడనున్నారన్న ప్రచారం నేపథ్యంలో దీనిపై వాస్తవాలు తేలిన తరువాతే పార్టీ తుది నిర్ణయం ప్రకటిస్తుందని ఓ నాయకుడు వెల్లడించారు. వైకాపా నుంచి మైనారిటీ అభ్యర్థిని నిలిపే ఆలోచనలో ఉన్నట్లు ఆ పార్టీ నాయకుల ద్వారా తెలుస్తోంది. వైకాపాను వీడి టిడిపిలో చేరిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మంత్రి పదవి ఖాయమని తేలడంతో ఆళ్లగడ్డ, నంద్యాల నియోజవర్గాల్లోని టిడిపి నేతలు పార్టీ వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో గంగుల ప్రభాకరరెడ్డి తాను వైకాపాలో చేరుతున్నట్లు ప్రకటించగా మరి కొందరు ఒకటి, రెండు రోజుల్లో ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో శాసన మండలికి జరిగే ఎన్నికల్లో ఆసక్తికర మలుపులు ఉంటాయని ప్రజలు భావిస్తున్నారు.
కెసిలో కంపు తొలగేనా!
కర్నూలు సిటీ, ఫిబ్రవరి 15:కెసి కాల్వ కర్నూలు, కడప జిల్లాల జల నిధి. అటు వంటి జలనిధి కాల్వలోకి మురుగు నీరు అనేక చోట్ల కలవటం వల్ల కంపు కొడుతుంది. కర్నూలు నగరంతో పాటు కడప జిల్లాలో 21లక్షల మందికి దాహం తీర్చే జలామృతం. నగరంలో 16కి.మీ పొడవున కెసి కాల్వ ప్రవహిస్తుంది. ఈ పరిదిలో కారల్‌మార్క్స్ నగర్‌లో 2 చోట్ల, ధర్మపేటలో 2చోట్ల, బంగారు పేట, రైల్వే స్టేషన్ రోడ్డు, స్టాంటన్ పురం, మునగాలపాడు, జోహారాపురం వంటి 9చోట్ల కెసి కాల్వలో మురుగు నీరు కలుస్తుంది. ఈ విధంగా 9 ప్రాంతాల్లో రోజుకు దాదాపు 130-150 క్యూసెక్కుల వరకు మురుగు నీరు చేరుతుందని జలవనరుల శాఖ అధికారులు అంచాన వేశారు. ప్రస్తుతం కాల్వలో నీటి ప్రవాహం లేక పోవడంతో ప్రాణ జలం అందించే కెసి కాల్వ కాల కూట గరళంగా మారి పోయింది. అంతే కాకుండ ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలన్నింటిని కాల్వలోనే వేస్తూ, ఏకంగా కెసి కాల్వను డంపింగ్ యార్డుగా మార్చేసారు. అంతటితో ఆగడం లేదు. కాల్వ వెంట ఉన్న సూక్ష్మ పరిశ్రమల నుంచి వచ్చే మోలాసిస్ వంటి వ్యర్థాలను కూడ కెసిలో కలుస్తున్నాయి. మల, మూత్ర విసర్జనాలకు సైతం కాల్వనే వాడుతున్నారు. తుంగ భద్ర, కృష్ణా నదుల నుంచి విడుదల చేసే నీటిలో ఇవ్వన్ని కలిసి నగర వాసులకు తాగునీరు అందించే రక్షిత మంచి నీటి పథకానికి చేరుతున్నాయి. ఆ నీటిని తాగితే ప్రజలు అనారోగ్యం పాలు కావాల్సిందే. ముచ్చుమర్రి నుంచి కృష్ణా జలాలను ఈ వేసవిలో నగరానికి తరలించి ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ నీరు వ్యర్థాలతో కలుషితమై ప్రజారోగ్యం ప్రమాదంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. నగర పాలక అధికారులు మాత్రం నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. దీంతో ప్రజా రోగ్యానికి భద్రత లేకుండ పోతోంది. గతంలో జూలై నుంచి ఏప్రిల్ వరకు పుష్కలంగా నీటి ప్రవాహం ఉండేది. 2500 క్యూసెక్కులకు పైగా సుంకేసుల జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో మురుగు నీరు కాల్వలో కలుస్తున్న పెద్దాగా ప్రభావితం చూపేది కాదు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొనటంతో కెసి కాల్వకు ఎప్పుడు నీటిని విడుదల చేస్తున్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది. నగర వాసులతో పాటు కాల్వ తీరం వెంట ఉన్న గ్రామాలకు తాగునీటి ఆధారానికి కెసి కాల్వనే 2జిల్లాలో 21లక్షల మందికి తాగునీటిని అందించే కీలక వనరు ఇది. కాల్వలో కలిసిన కాలుష్యం నీటినే ఆయా మంచి నీటి పథకాలకు తీసుకు వచ్చి పిల్టర్ చేసి తాగునీరు అందిస్తున్నారు. అలాగే కాలం చెల్లిన పిల్టర్ బెడ్ల వల్ల మార్చక పోవటం ఒక కారణం అయ్యితే తగినంత మోతాదులో క్లోరినేషన్ చేయక పోవడం, నీటి సరపరా సమయంలో కాలుష్యం తదితర కారణాల వల్ల ప్రజలు కలుషిత నీటినే తాగి రోగాల భారిన పడుతున్నారు. డబ్బులున్న వారు మినరల్ వాటర్ నీటిని కొనుగోలు చేసి తాగుతుంటే పేదలు మాత్రం నగర పాలక సంస్థ సరపరా చేసే నీటినే తాగాల్సిన పరిస్థితి.
కెసి కాల్వ శుద్ది పనులు చేడుతున్నాం
* నగర పాలక సంస్థ ఎస్‌ఈ శివరామిరెడ్డి:
నగరంలోని అశోక్ నగర్, రైల్వే స్టేషన్ రహాదారిలో, విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రక్కన రెండు చోట్ల మున్సిపల్ డ్రైనేజిని కాల్వలో వదిలారు. ఈ నీరు కెసిలోకి చేరటంతో దుర్గందం వెదజల్లుతున్నది. ఇది వాస్తవమే. గతంలో రూ.15లక్షలతో కాల్వ శుద్ది చేపట్టాం. కాల్వలోకి వదిలిన డ్రైలను బంద్ చేసి బయటికి మళ్లించేందుకు అశోక్ నగర్ వద్ద రూ.25లక్షలతో, రైల్వే స్టేషన్ వద్ద రూ.46లక్షలతో పనులను చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించి పనులు చేపట్టి కెసి కాల్వ శుద్ది పనులను చేస్తున్నాం.
వైకాపా గూటికి గంగుల
ఆళ్లగడ్డ, ఫిబ్రవరి 15: ఆళ్లగడ్డ నియోజకవర్గం టిడిపి ఇంచార్జి గంగుల ప్రభాకర్‌రెడ్డి బుధవారం వైకాపాలో చేరారు. ఆయన సోదరులు గంగుల మనోహర్‌రెడ్డి, గంగుల సుభాష్‌రెడ్డి, తనయుడు గంగుల బ్రిజేంద్రనాథ్‌రెడ్డితో పాటు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన గంగుల వర్గీయులు, అభిమానులు, ప్రజాప్రతినిధులు దాదాపు 130 వాహనాల్లో హైదరాబాద్‌కు తరలివెళ్లారు. జగన్ నివాసం లోటస్‌పాండ్‌లో వైకాపా అధినేత జగన్ సమక్షంలో ఆయన, ఆయన వర్గీయులతో కలిసి వైకాపాలో చేరారు. ఈసందర్భంగా వైకాపా అధినేత జగన్ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. గంగుల మా పార్టీలో చేరడం ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. గంగులకు అన్ని విధాలుగా తమ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అనంతరం గంగుల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో వైకాపా బలోపేతానికి కృషి చేస్తామన్నారు. నియోజకవర్గంలో టిడిపి బలోపేతానికి కృషి చేశానని అయినా అధిష్టానం గుర్తించలేదన్నారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే విధంగా పార్టీ నాయకత్వం ప్రవర్తించిందన్నారు. బాబూలాల్, జాఫర్‌రెడ్డి, సింగం భరత్‌రెడ్డి, గోపవరం నరసింహారెడ్డి, ఎంపిపి బండి చంద్రుడు, మాజీ ఎంపిపి ఇందూరి ప్రభాకర్‌రెడ్డి, సలాం, బాచేపల్లె నారాయణ, జడ్పీటీసీ నజీర్, క్రిష్ణారెడ్డి, నర్శిరెడ్డి, నాగేశ్వరరావు, క్రిష్టిపాడు వెంటకరామిరెడ్డి, అరికట్ల క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శ్రీశైలంలో ప్రారంభమైన
జ్యోతిర్ముడి సమర్పణ
శ్రీశైలం, ఫిబ్రవరి 15: శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని శివదీక్ష స్వీకరించిన శివస్వాముల జ్యోతిర్ముడి సమర్పన కార్యక్రమాన్ని బుధవారం ఉదయం ఆలయ అర్చక వేదపండితులు ప్రత్యేక పూజ లు నిర్వహించి ప్రారంభించినట్లు ఇఓ నారాయణ భరత్‌గుప్తా తెలిపారు. జనవరి 17వ తేదీన శివ మండల దీక్షను, ఈ నెల 6న అర్ధమండల దీక్షను స్వీకరించిన భక్తులు ఈ దీక్ష విరమణ సమయంలో జ్యోతిర్ముడి సమర్పిస్తారు. జ్యోతిర్ముడి సమర్పణను పురస్కరించుకొని బుధవారం ఉదయం 7.30 గంటలకు స్వామి వారి ఆలయం వద్ద నుండి స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వెండి పల్లకిలో ప్రత్యేక పూజలు చేసి శివదీక్ష శిబిరాల వద్దకు తీసుకొచ్చి అక్కడ వేంచింపచేయించి మరోమారు శివదీక్ష శిబిరాల వద్ద ఉత్సవ మూర్తులకు పూజలు నిర్వహించి శివదీక్ష జ్యోతిర్ముడి కార్యక్రమాన్ని ఆలయ అర్చక వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈకార్యక్రమంలో దీక్ష విరమణ చేసే భక్తులందరు కూడా స్వామివారికి శివదీక్ష శిబిరాల వద్ద జ్యోతిర్ముడి సమర్పించుకోవాల్సి ఉంటుంది. జ్యోతిర్ముడి కలిగిన భక్తులు స్వామి వారి స్పర్షదర్శనం అనంతరం శివదీక్ష శిబిరాల వద్ద జ్యోతిర్ముడి కార్యక్రమంలో పాల్గొనేందుకు శివస్వాములకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను దేవస్థాన అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. శివదీక్ష శిబిరాల వద్ద నిరంతరంగా విధులు నిర్వహించేందుకు ఆలయ సిబ్బందిని, గురుకుల పాఠశాల సిబ్బందిని, అర్చకులను ప్రత్యేక విధులు కేటాయించడం జరిగింది. జ్యోతిర్ముడి ధరించిన శివభక్తులు 21వ తేదీ సాయంత్రం వరకు స్వామి వారి స్పర్షదర్శనానికి అనుమతించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు జ్యోతిర్ముడితో స్వామి వారిని దర్శించుకొని పునీతులు కావాలని ఇఓ కోరారు. భక్తుల సౌకర్యార్థం ముందునుంచే శివదీక్ష విరమణ కార్యక్రమాన్ని, అందుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరికొంత మంది భక్తులు జ్యోతిర్ముడి శ్రీశైలంలో సమర్పించుకొని మాలాధారణ తమ తమ సొంత ఊర్లలో గల శివాలయాల్లో మహాశివరాత్రి నాడు ప్రత్యేక పూజల అనంతరం మాల విరమణ చేయడం జరుగుతుంది. మహాశివరాత్రి రోజున భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో దీక్ష విరమణ చేసుకోలేని భక్తులు ఇప్పుడు జ్యోతిర్ముడి శ్రీశైలంలో సమర్పించుకొని మహాశివరాత్రి రోజున తమ సొంత గ్రామాల్లో శివాలయాల్లో దీక్ష విరమణ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు.
వైభవంగా శ్రీనిమిషాంబదేవి
చండీహోమం
నంద్యాలటౌన్, ఫిబ్రవరి 15: పట్టణంలోని శ్రీనిమిషాంబ దేవి అమ్మవారి ప్రతిష్ఠ ప్రథమ వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈనెల 13వ తేదీ నుంచి ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా శ్రీ ఆర్యక్షత్రియ చిత్తారి సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాలు ఆలయ పురోహిత్ ఉమాశంకర్ శాస్ర్తి, చండీ ఉపాసకులు వనిపెంట శివశంకర్ శాస్ర్తి ఆచార్యత్వంలో నిర్వహించారు. బుధవారం ఉదయం శ్రీనిమిషాంబ దేవి అమ్మవారు, ఇతర దేవతామూర్తులకు పసుపు, కుంకుమతో అభిషేకం, పుష్పాలంకారం, శ్రీమహాగణపతి హోమం, వాస్తు, రుద్ర నవగ్రహ, మృత్యుంజయ, చండీ హోమాలను వేద మంత్రాల మధ్య శాస్త్రోక్తంగా జరిగాయి. హోమం అనంతరం బలిప్రదానం, పూర్ణాహుతి, మంత్రపుష్పం, కంకణ విమోచనం జరిగింది. సాయంత్రం శ్రీనిమిషాంబదేవి, శ్రీపార్వతీ సమేత శ్రీకాశీవిశే్వశ్వర స్వామి వార్లను పట్టణంలోని పురవీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు శ్రీనిమిషాంబ దేవి అమ్మవారిని, శ్రీపార్వతీ సమేత కాశీవిశే్వశ్వరస్వామి వార్లను దర్శించుకుని కాయకర్పూరం సమర్పించారు. ఈకార్యక్రమంలో సంఘం సభ్యులు అశోక్‌వర్మ, కుమార్‌వర్మ, మాధవవర్మ, విజయ్‌వర్మ, సుధీర్‌కుమార్ వర్మ, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కన్నుల పండువగా ఎల్లమ్మ జాతర
ఆదోని, ఫిబ్రవరి 15: ఆదోని డివిజన్‌లోని కోసిగిలో వెలసిన కోసిగి శ్రీ ఎల్లమ్మ జాతర బుధవారం భక్తుల జన సందోహం మధ్య కన్నుల పండువగా జరిగింది. భక్తులు భక్తిశ్రద్ధలతో జాతరకు తరలి వచ్చి పూజలు చేశారు. శ్రీ ఎల్లమ్మ జాతర కావడంతో కోసిగి, చుట్టు పక్కల గ్రామాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి అమ్మ దర్శనం కోసం భక్తజనం తరలి రావడంతో కోసిగి కిట కిటలాడింది. ఇసుక వేస్తే రాలనంత భక్తులు అమ్మ దర్శనానికి వచ్చారు. ఎల్లమ్మ దర్శనం కోసం క్యూకట్టి దర్శనం చేసుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. మరికొంత మంది భక్తులు దేవాలయం మైదానంలోనే గుడారాలు వేసుకుని నైవేద్యంగా గుగ్గిళ్లు, సజ్జ ముద్దలు, కల్లుసీసాలను నైవేద్యంగా సమర్పించారు. ఎల్లమ్మ తల్లి చల్లంగా చూడమ్మ అంటూ తమ తమ గూడారాల వద్ద పూజలు చేసి అమ్మ మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం బోనాలను ఎల్లమ్మ దేవాలయం వరకు తీసుకెళ్లి అనంతరం మొక్కుబడిగా పొటేళ్ళను నరికి రక్తంతో అమ్మకు పూజలు చేశారు. దాదాపు 20 ఎకరాల మైదానం అంతా భక్తుల గుడారాలతో నిండిపోయింది. జాతర కావడంతో ఎల్లమ్మ అవ్వను ప్రత్యేకంగా పూలతో, నిమ్మకాల దండలతో అలంకరణ చేశారు. జాతర సందర్భంగా కాబాబ్ సెంటర్లు, చిరు వ్యాపార దుకాణాలు పెద్ద సంఖ్యలో వెలిశాయి. ఈ దుకాణాలు దాదాపు15 రోజులపాటు కొనసాగుతాయి. జాతరకు రాని ప్రజలు ఈనెలాంత కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. కొలిచిన వారికి కొంగు బంగారంగా ఉన్న ఎల్లమ్మ జాతర భక్తుల ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
కాపు మహిళల అభివృద్ధికి
ప్రత్యేక చర్యలు
ఆదోనిటౌన్, ఫిబ్రవరి 15: కాపుమహిళల సంక్షేమ అభివృద్ధికి కాపు కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేషన్ డైరెక్టర్ రామచంద్రరావు అన్నారు. బుధవారం పట్టణంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. 30 మంది మహిళలు ఒక గ్రూపు చొప్పొన మూడు నెలలపాటు మూడు గ్రూపులకు ఉచిత శిక్షణ ఇస్తారని, వారికి ఉచితంగా కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేస్తామన్నారు. మహిళలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి ఈపథకం ఉపయోగ పడుతుందని డైరెక్టర్లు నారాయణరెడ్డి, శంకర్ అన్నారు. కార్యక్రమంలో నాయకులు రంగస్వామి, లక్ష్మన్న, మల్లికార్జున, అయ్యప్ప, గోపాల్‌కృష్ణ, నారాయణ, శ్రీన, వెంకటేశ్వర్లు, నాగేంద్రయ్య, ఎస్‌బి సీనలు పాల్గొన్నారు.
మహానందిలో వివాహాల సందడి...
మహానంది, ఫిబ్రవరి 15: మహానంది పుణ్యక్షేత్రంలో బుధవారం భక్తుల వివాహాల సందడి నెలకుంది. దాదాపు 10 వివాహాలకు పైగా అధికారికంగా జరుగగా, అనధికారికంగా మరో నాలుగు వివాహాలు జరిగాయి. ఆలయంలో బండ పరుపు పనులు జరుగుతుండగా వివాహాలు చేసుకొనేందుకు సరైన వసతులు లేక వివాహాలు జరుపుకొనే వారు ఇబ్బందులు పడ్డారు. చెట్ల నీడనే పందిర్లుగా చేసుకొని వివాహాలు జరుపుకున్నారు. అధికారులు వివాహాలు చేసుకొనేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. వేలాది మంది భక్తులు ఆలయంలోని పుష్కరిణిల్లో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.
వైభవంగా శ్రీరేణుక ఎల్లమ్మ రథోత్సవం
కోసిగి, ఫిబ్రవరి 15: కోసిగిలో వెలసిన శ్రీరేణుక ఎల్లమ్మ రథోత్సవాన్ని బుధవారం భక్తులు అంగ రంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మవారికి ఆకుపూజ, బిల్వార్చన, కుంకుమార్చన, తదితర పూజలను ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో నిర్వహించారు. సాయంత్రం దోరల చావిడి నుంచి పూర్ణకుంభాలతో ఎల్లమ్మ దేవాలయం వరకు డప్పులతో వచ్చారు. అనంతరం అమ్మవారి మూలవిరాట్‌ను రథోత్సవంలో కూర్చోబెట్టి రథోత్సవాన్ని డప్పులు, వాయిద్యాల మధ్య భక్తులు ముందుకు లాగారు. ఈ రథోత్సవానికి మండల ప్రజలే కాక రాయచూరు, మాన్వి, బెంగళూరు, తదితర నగరాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడి తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం టిడిపి ఇన్‌ఛార్జి తిక్కారెడ్డి, బిటి.నాయుడు, సర్పంచ్ ముత్తురెడ్డి, రామిరెడ్డి, వక్రాణి వెంకటేశ్వర్లు, ఆదినారాయణశెట్టి, వైకాపా నాయకులు ప్రదీప్‌రెడ్డి, ఎంపిపి భీమక్క, జడ్పీటీసీ మంగమ్మ, సింగిల్ విండో అధ్యక్షులు మంతేష్‌స్వామి, కాంగ్రెస్ నాయకులు మానిక్యరాజు, తిప్పయ్య, ఎర్రన్న, తదితరులు పాల్గొన్నారు. రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ దైవ ప్రసాద్, ఎస్‌ఐ ఇంతియాజ్‌బాషా ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు.
రాష్టస్థ్రాయి పోటీల విజేతలకు బహుమతులు
శ్రీరేణుక ఎల్లమ్మ జాతర సందర్భంగా కోసిగిలో రాష్టస్థ్రాయి కబడ్డీ పోటీ, పరగు పందెం పోటీలు నిర్వహించారు. బుధవారం 15 కిలో మీటర్ల పరుగు పందెంలో మొదటి బహుమతి కోసిగికి చెందిన రాజుకు రూ.10వేల 16 హీరో సోరూం వీరేష్, రెండవ విజేత పెద్దతుంబళంకు చెందిన దొడ్డయ్యకు రూ.7వేల 16నగదును వీరస్వామి, మూడవ బహుమతి కోడుమూరు ప్రాంతానికి చెందిన శివకు రూ.5వేల 16నగదును కాంట్రాక్టర్ నాగరాజు, నాల్గవ స్థానంలో ఉన్న ఈరన్నకు రూ.3వేల 16లు విఆర్‌ఓ శ్రీనివాసులు, ఐదవ స్థానంలో ఉన్న రామాంజినేయులకు రూ.1016 నగదును సర్పంచ్ ముత్తురెడ్డి అందజేశారు. అలాగే రాష్ట్రాస్థాయి కబడ్డీ విజేత స్టాంటన్‌పురంకు చెందిన జట్టుకు రూ.20వేల 16లు మంత్రాలయం టిడిపి ఇన్‌ఛార్జి తిక్కారెడ్డి, రెండవ బహుమతి తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ జట్టుకు రూ.15వేల 16, మూడవ బహుమతి దుర్గాప్రెండ్స్ జట్టుకు రూ.10వేల 16, నాల్గవ బహుమతి బల్లేకల్ జట్టుకు రూ.5వేల 16లను మంత్రాలయం టిడిపి నాయకులు అందజేశారు. ఈకార్యక్రమంలో ఆర్గనైజర్లు నర్సిరెడ్డి, పంపాపతి, తదితరులు పాల్గొన్నారు.
ఇస్రో విజయోత్సవ బైక్ ర్యాలీ
ఆదోని, ఫిబ్రవరి 15: ఒకేసారి 104 ఉపగ్రహాలను షార్‌వేదిక నుంచి అంతరిక్షంలో ప్రవేశ పెట్టి విజయం సాధించినందుకు బిజెవైఎం ఆధ్వర్యంలో విజయోత్సవ బైక్ ర్యాలీని బుధవారం బిజెవైఎం కార్యకర్తలు, నాయకులు నిర్వహించారు. బిజెపి కార్యాలయం నుంచి బయలుదేరిన బైక్ ర్యాలీ శ్రీనివాసభవన్, భీమాస్ సర్కిల్, నిర్మల్ థియేటర్, ఎమ్మిగనూరు మీదుగా ఆర్ట్స్ కాలేజీకి చేరి అటు నుంచి తిరిగి బిజెపి కార్యాలయానికి చేరింది. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు కునిగిరి నాగరాజు, బిజెవైఎం నాయకులు దీపక్ రాథోడ్, మధు, వంశీలు మాట్లాడుతూ అగ్రదేశాలకు సాధ్యపడని అద్భుత విజయాలను ఇస్రో సాధించడం హర్షించ దగ్గ విషయమన్నారు. ఒకేసారి 104 ఉపగ్రహాలు నింగిలోకి చేరుకోవడం 120 కోట్ల మంది భారతీయ విజయమన్నారు. ఈ ఉపగ్రామాల వల్ల కరవు, పంటల అధ్యయనం, కరవు అంచనాలు, భూగర్భజలాల అనే్వషణ, తుఫాన్ హెచ్చరికలు, ఖనిజ అనే్వషణ, విద్యా మొదలగు అంశాలకు ఈ ఉపగ్రహాలు ఉపయోగ పడుతాయన్నారు. ఆసియ ఖండంలో చైనా, జఫాన్లకు భారతదేశం గట్టిపోటీ ఇస్తుందని చెప్పారు. ఉపగ్రహాలను నింగిలోకి చేర్చే అంశంలో భారత్‌కు తిరుగులేదని అన్నారు. ఇస్రో ప్రదర్శించిన విశ్వరూప విన్యాసం భారతీయులకు ఎంతో ఉత్సాహమని అన్నారు. కార్యక్రమంలో బిజెపి నగర ప్రధాన కార్యదర్శి విజయ్‌కృష్ణ, నాయకులుప్రసాద్, సాయి, రవి, నాగేష్, నరేష్, సాకరే రాఘవేంద్ర, పవన్, బిజెపి మహిళ మోర్చా నాయకురాళ్ళు వినీతగుప్తా, అంజుసిగాంధీ, భారతీ, సరస్వతిబాయి పాల్గొని ప్రసంగించారు.
విద్యార్థుల ఊరేగింపు
ఇస్రో సంస్థ ఒకేసారి 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ సెంట్‌ఆంథోని విద్యార్థులు భారీ ఊరేగింపును బుధవారం నిర్వహించారు. ఇస్రోశాస్త్ర వేత్తల కృషి అభినందనీయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్‌కె చిన్నప్ప పేర్కొన్నారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎల్‌కే చిన్న మాట్లాడుతూ అగ్రరాజ్యాల కన్నా మన భారత దేశం అంతరిక్ష విభాగంలో చాలా ముందు ఉండడం హర్షనీయమన్నారు. శాస్తవ్రేత్తల కృషితో భారతదేశం అఖండ కీర్తిని అందుకుందన్నారు.
ఎమ్మిగనూరులో...
ఎమ్మిగనూరు: భారత అంతరిక్ష పరిశోధన కేంద్ర ఇస్రో నుండి ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి సి-5 అనే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలు ఒకే సారి విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయెగించిన్నందుకు ఎబివిపి ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తాలుక కన్వీనర్ నరేష్ మాట్లాడుతూ ఈ కాకెట్ ద్వారా ఒకేసారి అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించి భాతరదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. ఇలాంటి ప్రయోగాలు ముందు ముందు విజయవంతంగా ప్రయోగించాలని వారు ఆకాంక్షించారు. ప్రయోగంతో భారతదేశం అగ్రదేశాలకు పోటీ ఇస్తూ ప్రపంచ దేశానికి ఎదురులేని శక్తిగా నిలించిందన్నారు. ఈ కార్యక్రమంలో తాలుకా నాయకులు నాగిరెడ్డి, సొహేల్, జయశేఖర్, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.
అందరికీ ఆరోగ్యమే ప్రభుత్వ ప్రధాన ఆశయం
ఆదోనిటౌన్, ఫిబ్రవరి 15: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించి వారికి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచడమే ప్రభుత్వ ప్రధాన ఆశయమని మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు స్పష్టం చేశారు. బుధవారం టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉత్తర ప్రదేశ్‌లో పెట్టిన ఆరోగ్య సంరక్షణ పథకం కింద ప్రస్తుతం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలు పొందుతున్న విధంగానే తెల్లరేషన్‌కార్డు లేకపోయిన కూడా ప్రతి కుటుంబానికి వైద్య సేవలు అందిస్తారన్నారు. ఇప్పటికే ఈపథకం అమలుల్లోకి వచ్చిందని, గత ఏడాదిగా ఉద్యోగులు, పాత్రికేయులు ఈపథకం కింద ఆరోగ్య సేవలు పొందుతున్నారని అన్నారు. కుటుంబంలోని పిల్లల నుండి పెద్దల వరకు ఒక్కొక్కరు రూ.1200లు చెల్లించి ఈనెల 28వతేదీలోగా మీసేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఇందులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలు అనుమతి పొందిన ఆసుపత్రుల్లో 1044 వ్యాధులకు సేమి ప్రైవేట్ ఎసి వార్డుల్లో వైద్యం అందించబడుతుందని, హెల్త్‌కార్డు ఉన్న వారికి సంవత్సరానికి రూ.2లక్షల వరకు వైద్యం సేవలు పొందవచ్చన్నారు. అలాగే మందులు, భోజనం వసతితోపాటు 11రోజులు మందులు కూడా ఇస్తారని తెలిపారు. అందువల్ల ఈ వైద్య సేవలు ఉన్నత వర్గాలకు చెందిన వారు సైతం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈనెల 22న ఆదోనిలో పట్ట్భద్రుల నియోజకవర్గ అభ్యిర్థితో ప్రత్యేకంగా ఓటర్లతో ముఖ ముఖి సమావేశం కెజియన్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో పట్ట్భద్రుల ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈసమావేశంలో నాయకులు బుద్దారెడ్డి, నల్లన్న, లక్ష్మీనారాయణ, పీరా, వలమన్న, తదితరులు పాల్గొన్నారు.
మాధవరంలో సిసి కెమెరాల ఏర్పాటు
మంత్రాలయం, ఫిబ్రవరి 15: మండల పరిధిలోని మాధవరం గ్రామంలో బుధవారం సిసి కెమెరాలను ఏర్పాటు చేసినట్లు మాధవరం ఎస్సై రాజారెడ్డి తెలిపారు. సిఐ నాగేశ్వరరావు సమక్షంలో ఈ సిసి కెమెరాలను ఏర్పాటు చేయటం జరిగింని, కర్నాటక సరిహద్దు ప్రాంతమైన మాధవరం కూడలిలో సిసి కెమెరాల అమర్చటం ద్వారా ఇతర ప్రాంతాలనుండి ఎటువంటి అక్రమరవాణా జరిపినా, తదితర సమస్యలను గుర్తించవచ్చునని ఎస్సై తెలిపారు.
జయహో భారత్.. ఇస్రోకు వందనం
ఆళ్లగడ్డ, ఫిబ్రవరి 15: పట్టణంలోని బిబిఆర్ పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులు ఇస్రో అక్షర క్రమంలో కూర్చొని జాతీయ జెండాకు వందనం చేశారు. అలాగే జయహో భారత్ మేరా భారత్ మహాన్ అంటూ శాస్తవ్రేత్తలకు జై కొడుతూ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రైవేటు పాఠశాలల జిల్లా ఉపాధ్యక్షులు అమీర్‌బాషా మాట్లాడుతూ ప్రతి భారతీయుడు గర్వపడే క్షణం నేడు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) స్వదేశ మేథస్సుతో అంతరిక్ష చరిత్రలో మొదటి సారిగా 104 ఉప గ్రహాలను ఒకే రాకెట్ ద్వారా ప్రయోగించి విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టి సంచలనాన్ని సృష్టించిందన్నారు. అనంతరం శాస్తవ్రేత్తలకు సెల్యూట్ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినిలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇస్రో ఆశయాలకు స్ఫూర్తి దివంగత అబ్దుల్ కలాం అని వారి స్ఫూర్తిని చాటి చెప్పేందుకు ఎపిజె అబ్దుల్ కలాం విగ్రహాన్ని స్థానిక స్టేట్ బ్యాంకు ఎదురుగా వున్న డివైడర్‌లో ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి విద్యాసంస్థలు, మిత్రుల, శ్రేయోభిలాషులు, పెద్దలు, ఆళ్లగడ్డ ప్రజలు సహకరించాలని కోరారు.
కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు
ఉయ్యాలవాడ, ఫిబ్రవరి 15: ఎవ్వరైనా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే వారిపై నియమావళి ప్రకారం కఠిన చర్యలు తప్పవని మండల ఎన్నికల అథారిటీ అధికారి మోసేజ్‌ప్రసన్ తెలిపారు. బుధవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో కోడ్ అమల్లో వుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఎన్నికల నియమాళిని తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ ప్రభాకర్, సీనియర్ అసిస్టెంటు ప్రసాద్, నాయకులు, బోరెడ్డి నర్సిరెడ్డి, దేశం సోమశేఖర్‌రెడ్డి, ఖాతా దస్తగిరిరెడ్డి, కూడాలనారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
జెండాలు, ఫ్లెక్సీలు తొలగింపు
ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిపికేషన్ విడుదల కావడంతో బుధవారం మండలంలో వివిధ పార్టీలకు చెందిన జెండాలను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్లెక్సీలు, జెండాలు, రాజకీయ నాయకుల చిత్రపటాలు, విగ్రహాలకు ముసుగులు వేస్తున్నట్లు ఎన్నికల అథారిటీ అధికారి మోసేజ్‌ప్రసన్ స్పష్టం చేశారు.
శాస్తవ్రేత్తలకు అభినందనలు
ఉయ్యాలవాడ, ఫిబ్రవరి 15: పిఎస్‌ఎల్‌వి 37 ప్రయోగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చరిత్ర సృష్టించిందని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోఫాద్యాయుడు చిన్నవీరారెడ్డి అన్నారు. బుధవారం ఉదయం శ్రీహరికోటలో 104 ఉపగ్రహాలను ఒకే సారి అంతరిక్షంలోకి వదిలి విజయం సాధిచడం పట్ల స్థానిక జిల్లా పరిషత్ విద్యార్థులు, ఉపాద్యాయులు ర్యాలీ నిర్వహించి, బస్టాండు ఆవరణలో మానవహారంగా ఏర్పడి శాస్తవ్రేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ శ్రీనాథ్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
తాహెర్‌షా ఖాద్రి ఉరుసు
ఆదోనిటౌన్, ఫిబ్రవరి 15: ఆదోని సమీపంలోని కొండల్లో వెలసిన హజరత్ సయ్యద్ తాహెర్‌షాఖాద్రి 323 ఉరుసు మహోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. స్వామివారి దర్గాలో తెల్లవారు జామున ప్రత్యేక ఫాతేహాలు, ప్రార్థనలు నిర్వహించి ఉరుసు ఉత్సవాలను దర్గా పీఠాధిపతి సయ్యద్ మహమూద్‌ఖాద్రి ఉరుసు ఉత్సవాలను ప్రారంభించారు. ఉరుసు రోజు పెద్ద సంఖ్యలో భక్తులు కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చి ప్రార్థనలు నిర్వహించారు.
యువకుని ఆత్మహత్య
సంజామల, ఫిబ్రవరి 15: మండల పరిధిలోని పేరుసోముల గ్రామానికి చెందిన బీరుసంటి మధు ప్రసాద్ (23) పెళ్లికాలేదని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన మధుప్రసాద్ గత కొంత కాలం నుండి తన స్నేహితులందరికి పెళ్లిళ్లు అయ్యాయని, తనకు మాత్రం పెళ్లి కాలేదని మనస్థాపంతో బుధవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వాహనం
ఢీకొని వ్యక్తి మృతి
మహానంది, ఫిబ్రవరి 15: మండలంలోని గోపవరం సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కురువ బాల లింగన్న (40) మృతి చెందినట్లు ఎస్‌ఐ పెద్దయ్య నాయుడు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ తెల్లవారుజామున ఈ వ్యక్తి రోడ్డుకు పక్కగా వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాలకు తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
చికిత్సపొందుతూ యువకుని మృతి
కొలిమిగుండ్ల, ఫిబ్రవరి 15: కొలిమిగుండ్లకు చెందిన ప్రసాద్ (22) కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. 11వ తేదీ శనివారం ప్రసాద్ కల్వటాల - నందిపాడు గ్రామాల మధ్య మోటారు సైకిల్ ప్రమాదానికి గురయ్యాడు. ప్రసాద్‌ను చికిత్స కోసం కర్నూలుకు తరలించగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ప్రసాద్ కొలిమిగుండ్లలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
మంత్రాలయం, ఫిబ్రవరి 15: కర్నాటక స్కార్పియో వాహనం ఆటోని ఢీకొన్న సంఘటనలో ఒకరికి తీవ్రగాయాలు కాగా మరొకరికి స్వల్ప గాయాలు అయిన సంఘటన బుధవారం మం్ర తాలయం సమీపంలోని కొం డాపురం ఆర్చ్ దగ్గర ప్రమా దం చోటుచేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్ చంద్ర తెలిపిన వివరాల మేరకు ఎమ్మిగనూరుకు చెందిన ఆటోడ్రైవర్ ఉప్పర సత్యానంద్, అంజిని అనేవ్యక్తులు ఎమ్మిగనూరు నుండి తెలంగాణలోని ఐజ పట్టణానికి ఆటోలో కారంపుడి ప్యాకెట్లను తీసుకు వెళ్తుండగా మంత్రాలయం నుండి మాధవరం వెళ్తున్న కర్నాటక వాహనం ఆటోను ఢీకొందన్నారు. గాయపడిన వారిని మఠం ఆంబులెన్స్ ద్వారా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసునమోదు చేసుకుని దర్యాప్తుచేస్తునట్లు ఆయన తెలిపారు.
యుఆర్‌డి గోపాల్ మృతి
ఎమ్మిగనూరు, ఫిబ్రవరి 15: స్థానిక మండల విస్తరణ అధికారి గోపాల్ (45) బుధవారం గెండెపోటుతో మృతి చెందాడు. ఇతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. యుఆర్‌డి గోపాల్ మృతి పట్ల స్థానిక ఎంపిడిఓ రమణమూర్తి, ఎంపిపి శంకరయ్య, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సంజన్న చౌదరి తదితరులు వారి కుటుంబ సభ్యులకు సంతాపం సానుభూతి వ్యక్తం చేశారు.