కర్నూల్

శిల్పాకు లైన్ క్లియర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఏప్రిల్ 2 : భూమా దంపతుల కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియకు మంత్రి పదవి దక్కడంతో నంద్యాల శాసనసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో పోటీ చేయడానికి మాజీ మంత్రి శిల్పా మోహనరెడ్డికి అవకాశాలు పెరిగాయని టిడిపి వర్గాల ద్వారా తెలుస్తోంది. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి వచ్చే జూన్‌లో ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ స్థానం నుంచి భూమా కుటుంబీకులే టిడిపి తరఫున పోటీ చేస్తారని ఇంతకాలం ప్రచారంలో ఉంది. భూమా దంపతుల రెండవ కుమార్తె నాగవౌనిక, భూమా నాగిరెడ్డి సోదరుడు మాజీ ఎమ్మెల్యే శేఖరరెడ్డి కుమారుడు బ్రహ్మానందరెడ్డిలలో ఎవరో ఒకరు బరిలో ఉంటారని టిడిని నేతలు వెల్లడించారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరిని పోటీలో పెట్టాలన్న విషయంలో ఏకాభిప్రాయం సాధ్యం కాకపోవడం, వైకాపా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత జగన్ ప్రకటించిన నేపథ్యంలో విజయమే లక్ష్యంగా అభ్యర్థిని ఎంపిక చేయాలని టిడిపి సీనియర్ నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. పోటీ తప్పని పరిస్థితుల్లో నంద్యాల నుంచి మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహనరెడ్డిని బరిలో దింపడమే మంచిదని పార్టీ అధినేత చంద్రబాబుకు సూచించినట్లు తెలుస్తోంది. సీనియర్ల సూచన మేరకు నంద్యాల అభ్యర్థి ఎంపికపై చంద్రబాబు స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణ పూర్తయిన నేపథ్యంలో రానున్న వారం, పది రోజుల్లో నంద్యాల అభ్యర్థి ఎంపికపై డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి, మంత్రి అఖిలప్రియ, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహనరెడ్డి, జిల్లాలో ఇతర సీనియర్ నాయకులతో చర్చిస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నంద్యాల శాసనసభా స్థానం నుంచి ఎన్నికైన భూమా నాగిరెడ్డి తనకున్న అనుభవంతో నియోజకవర్గంలో పట్టు సాధించారని, తాజా పరిస్థితుల నేపథ్యంలో భూమా కుటుంబంలో అభ్యర్థిని ఎంపిక చేస్తే పట్టు నిలుపుకోవడం ఏ మేరకు సాధ్యమని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. అంతేగాకుండా 2019 ఎన్నికల నాటికి పార్టీ బలపడాలంటే నియోజకవర్గంలోని పార్టీ నాయకులందరినీ కలుపుకొని పోవాల్సి ఉంటుందని వారంటున్నారు. రాజకీయ అనుభవలేమి, చిన్న వయసు కారణంగా ఇబ్బందులు పడటం కంటే భూమా కుమార్తెలు, కుమారుడు పూర్తిగా ఆళ్లగడ్డపై దృష్టి సారించి మరింత బలోపేతం కావాలని సూచిస్తున్నారు. మంత్రి పదవి వచ్చింది కాబట్టి నంద్యాల పట్టణంలో భూమా నాగిరెడ్డి ఇచ్చిన హామీ మేరకు రహదారుల విస్తరణ, 10వేల పక్కా గృహాల నిర్మాణం, అర్హులైన వారందరికీ పింఛన్ల పంపిణీ వంటివి ప్రజలకు అందజేయవచ్చని వెల్లడిస్తున్నారు. తద్వారా నంద్యాల శాసనసభ చరిత్రలో భూమా నాగిరెడ్డి సుస్థిరంగా నిల్చిపోతారని పేర్కొంటున్నారు. ఇక ఆళ్లగడ్డలో సైతం తన తల్లిదండ్రులు, తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తే ఆళ్లగడ్డలో భూమా కుటుంబాన్ని కాదని మరొకరికి విజయం దక్కే అవకాశం ఉండదని వెల్లడిస్తున్నారు. ఆయా కారణాల రీత్యా మంత్రి అఖిలప్రియ, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహనరెడ్డి కూడా సీనియర్ల ప్రతిపాదనకు అంగీకరిస్తారనే ఆశాభావంతో ఉన్నారు. ఇదే జరిగితే నంద్యాల ఉప ఎన్నికలో మాజీ మంత్రి శిల్పా మోహనరెడ్డికి లైన్ క్లియర్ అయినట్లేనని వారంటున్నారు. ఒకవేళ భూమా కుటుంబం తమకే టికెట్ కావాలని పట్టుబడితే శాసనమండలి చైర్మన్ పదవిని ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డికి ఇచ్చే విషయం పరిశీలించి తుది నిర్ణయానికి వస్తారని భావిస్తున్నారు.
మంత్రిగా అఖిలప్రియ
ప్రమాణ స్వీకారం
నంద్యాల, ఏప్రిల్ 2: ఆళ్ళగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదివారం ఉదయం అమరావతిలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో అతిపిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. భూమా అఖిలప్రియ అమెరికాలో బిబిఎం డిగ్రీ పూర్తిచేసి రాష్ట్రానికి చేరుకున్న కొద్ది రోజులకే తల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో విధిలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా నామినేషన్ వేసింది. భూమా అఖిలప్రియ ఆళ్ళగడ్డ ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా వైకాపా నుంచి శాసనసభకు ఎన్నికైనప్పటి నుంచి అన్ని ప్రత్యేకతలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లా నుంచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఘనత భూమా అఖిలప్రియకే దక్కుతుంది. ఇంతవరకు జిల్లా నుంచి మహిళా మంత్రిగా ఎవరు పనిచేయకపోవడం విశేషం. ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం కూడా విశేషమే. భూమా అఖిలప్రియ తల్లి భూమా శోభా నాగిరెడ్డి 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార సమయంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఖాళీ అయిన ఆళ్ళగడ్డ సీటుకు జరిగిన ఉప ఎన్నికలో సాంప్రదాయాన్ని పాటించి తెలుగుదేశం పార్టీ ఎవరిని పోటీగా నిలకపోవడంతో అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎమ్మెల్యే అయ్యారు. జిల్లా నుంచి తొలిసారిగా మంత్రి పదవి అలంకరించిన భూమా అఖిలప్రియ వయస్సు 25సంవత్సరాలు. మంత్రివర్గంలో అందరికంటే పిన్నవయస్సు ఆమెదే. మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకుని ప్రమాణ స్వీకారం చేసిన ఏప్రిల్ 2వ తేదీ ఆమె జన్మదినం కావడం కూడా విశేషం. ఆళ్ళగడ్డ అసెంబ్లీ నుంచి పలుమార్లు తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా గెలుపొందిన అఖిలప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి, తల్లి శోభా నాగిరెడ్డిలకు దక్కని మంత్రి పదవి అఖిలప్రియకు దక్కింది. అఖిలప్రియ తాత ఎస్వీ సుబ్బారెడ్డి పత్తికొండ ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి దక్కించుకున్నారు. కాగా భూమా కుటుంబంలో తాత, మనువరాలు మంత్రులుగా ఉండడం విశేషంగా చెప్పుకుంటున్నారు. అఖిలప్రియ తండ్రి భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి వస్తుందని గత 6నెలలుగా ప్రచారంలో ఉన్నప్పటికి పలు కారణాలతో వాయిదాపడుతున్న మంత్రివర్గ విస్తరణకు ముందే గుండెపోటుతో భూమా నాగిరెడ్డి మృతి చెందిన నెల రోజుల లోపే ఆయన కుమార్తె భూమా అఖిలప్రియకు మంత్రి పదవి దక్కడం ఈప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూమా అఖిలప్రియ ఆళ్ళగడ్డ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మలుచుకోవడంతో పాటు తనతండ్రి ప్రాతినిథ్యం వహించిన నంద్యాల నియోజకవర్గంలో కూడా తండ్రి ప్రధాన ఆశయాలు అయిన రోడ్ల విస్తరణ, పదివేల పక్కా గృహాల నిర్మాణం పూర్తిచేసి నంద్యాలకు, తెలుగుదేశం పార్టీకి భూమా అఖిలప్రియ పూర్వ వైభవం తీసుకు వస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశాభావంతో ఉన్నారు. నంద్యాలకు ప్రాతినిథ్యం లేకపోయినా ఓఎస్‌డిని నియమించి తండ్రి ఆశయాలకు మంత్రిగా తనవంతు కృషి చేసి రోడ్ల విస్తరణ, పందుల నిర్మూలన, పదివేల పక్కా గృహాల నిర్మాణం పూర్తి చేసి నంద్యాలలో కూడా తమ కుటుంబ సభ్యులు పాగా వేసేందుకు మంత్రిగా అఖిలప్రియ అన్ని విధాలుగా కృషి చేస్తుందని నంద్యాల, ఆళ్ళగడ్డ నియోజకవర్గ ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు.
ఆపరేషన్ 2019..!
* ఇక అధికారుల ప్రక్షాళన..
* 5,6 తేదీల్లో భారీగా బదిలీలు

కర్నూలు, ఏప్రిల్ 2:మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇక అధికారుల బదిలీలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్డీఓలతో పాటు ఇతర సీనియర్ అధికారుల బదిలీలకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి పెద్దఎత్తున బదిలీలకు రంగం సిద్ధం చేసినట్లు అధికారులు సైతం పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఒకేసారి కాకుండా దఫ దఫాలుగా బదిలీలు చేస్తూ వచ్చిన ముఖ్యమంత్రి ప్రతి అధికారి కనీసం రెండేళ్లు ఆయా అధికార బాధ్యతలు నిర్వహించేలా అవకాశం కల్పించారు. ఈక్రమంలో ఎవరిపైనైనా పెద్దఎత్తున ఆరోపణలు వస్తే తప్ప బదిలీలకు సిద్ధపడలేదు. తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు సైతం వత్తిడి చేసినా అనవసర బదిలీలకు ముఖ్యమంత్రి అంగీకరించలేదని ఆ పార్టీ నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే తన మార్కు పాలనలో అధికారులకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి వత్తిళ్లకు లొంగకుండా అధికారుల పనితీరు ఆధారంగా చర్యలు తీసుకున్నారని చర్చించుకుంటున్నారు. తాజాగా చేపట్టిన మంత్రివర్గ విస్తరణ 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారన్న వార్తలతో సమీప భవిష్యత్తులో మంత్రివర్గ విస్తరణ ఉండదని అవసరమైతే శాఖలు, ఒకరిద్దరు మంత్రుల మార్పులు, చేర్పులు ఉంటాయే కానీ విస్తరణ ఉండకపోవచ్చని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. అదే తరహాలో రానున్న 2019 ఎన్నికల దృష్ట్యా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్డీఓలు, సచివాలయంలో ఇతర సీనియర్ అధికారుల బదిలీలు పూర్తి చేసి రెండేళ్లు పూర్తిస్థాయిలో సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. అధికారుల బదిలీల నేపథ్యంలో ఇప్పటికే ఆయా జిల్లాల పార్టీ సీనియర్ల అభిప్రాయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్లు, ఎస్పీ, ఆర్డీఓల పేర్లను ఒక్కరి పేరు కాకుండా రెండు, మూడు పేర్లను ముఖ్యమంత్రి కార్యాలయంలో అందజేస్తే వాటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. తద్వారా ఇటు పార్టీ నేతలు, అటు తన ఆలోచనలను అమలు చేసే అధికార యంత్రాంగం జిల్లాల్లో ఉంటుందని ముఖ్యమంత్రి అభిప్రాయంగా తెలుస్తోంది. అధికారులపై ఆధారాలు లేకుండా ఫిర్యాదులు చేస్తే సిఎం పట్టించుకోకపోవడం వల్ల అనవసరపు బదిలీలకు ఆస్కారం లేకుండా పోయిందని అధికారులు పేర్కొంటున్నారు. పాలనలో ప్రక్షాళన పూర్తి చేసిన ముఖ్యమంత్రి అధికారుల బదిలీలతో మరో ప్రక్షాళనతో రానున్న రెండేళ్లు పూర్తిస్థాయిలో పాలనపై దృష్టి పెట్టి 2019లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్తారని పార్టీ నాయకులతో పాటు అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఏసిబి వలలో సర్వేయర్
* రూ. 4 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఉపేంద్ర
చాగలమర్రి, ఏప్రిల్ 2:కర్నూలు జిల్లా చాగలమర్రి తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న బి.ఉపేంద్ర ఓ రైతు నుంచి భూమి కొలతలు వేయడానికి రూ.4వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. స్థానిక కోటాగడ్డ వీధికి చెందిన రైతు జిగ్గిగారి షరీఫ్ నుంచి స్థానిక ప్రొద్దుటూరు బస్టాండ్‌లో లంచం తీసుకుంటుండగా కర్నూలు ఎసిబి డిఎస్పీ జయరామరాజు ఆధ్వర్యంలో ఎసిబి అధికారుల బృందం వలపన్ని దాడిచేసి పట్టుకున్నారు. లంచం కింద తీసుకున్న రూ.4వేలు నగదును స్వాధీనం చేసుకుని సర్వేయర్ ఉపేంద్రను వారు అదుపులో తీసుకున్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి అతనిని తీసుకుని వెళ్లి విచారిస్తున్నారు. లంచం తీసుకుంటూ దొరికిన నోట్లను ఎసిబి అధికారులు పరిశీలించి నిర్ధారించారు. డిఎస్పీ జయరామరాజు మాట్లాడుతూ చాగలమర్రికి చెందిన జిగ్గిగారి షరీఫ్‌కు సంబంధించిన సర్వే నెం.163లో ఒక ఎకరా 52సెంట్ల పొలం తగాదా ఉందన్నారు. తనకు న్యాయం చేయాలని గత ఏడాది డిసెంబర్ నెలలో షరీఫ్ ప్రజాదర్బార్‌లో కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారని చెప్పారు. కలెక్టర్ రైతు షరీఫ్‌కు తగు న్యాయం చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారని చెప్పారు. పొలం కొలతలు వేయడానికి రూ.4వేలు ఇస్తేనే వేస్తానని డిప్యూటేషన్‌పై ఇక్కడ పనిచేస్తున్న సర్వేయర్ ఉపేంద్ర డిమాండ్ చేశారన్నారు. రైతు లంచం ఇవ్వడానికి అంగీకరించడంతో గతనెల 15వ తేదీ కొలతలు వేస్తానని సర్వేయర్ ఒప్పుకున్నారని, కాని షరీఫ్ అందుబాటులో లేడన్నారు. తిరిగి గతనెల 31వ తేదీ కొలతలు వేయాలని రైతు కోరగా ఈనెల 2వ తేదీ కొలతలు వేస్తానని సర్వేయర్ అన్నారన్నారు. రైతు తమను ఆశ్రయించారన్నారు. రైతు షరీఫ్ చాగలమర్రిలోని ప్రొద్దుటూరు బస్టాండ్‌లో రూ.4వేలు లంచం ఇస్తుండగా దాడిచేసి పట్టుకుని సర్వేయర్‌ను అరెస్టు చేశామన్నారు. విచారణ జరిపి ఆళ్ళగడ్డలోని అతని ఇంట్లో కూడా అక్రమ సంపాదనపై తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎసిబి డిఎస్పీ తెలిపారు. ఈదాడిలో ఎసిబి సిఐలు సీతారామరావు, కృష్ణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. చాగలమర్రిలో ఎసిబి అధికారుల దాడిలో లంచం తీసుకుంటూ అధికారిని పట్టుకోవడం ఇదే ప్రథమం. ఏది ఏమైనా సర్వేయర్ ఉపేంద్ర ఎసిబి అధికారులకు చిక్కడంతో అవినీతి అధికారులకు ఇది ఒక హెచ్చరికగా భావించాలి.
గ్రామాల్లో తాగునీటి ఎద్దడి!
* ప్రజలకు తప్పని పాట్లు..
* పట్టించుకోని అధికారులు..
ఆదోనిటౌన్, ఏప్రిల్ 2 : ఆదోని మండలంలోని అనేక గ్రామాల్లో రోజు రోజుకు తాగునీటి సమస్య తీవ్రమవుతోంది. ఒకవైపు మండుతున్న ఎండల్లో తాగునీటి కోసం ప్రజలు పడరానిపాట్లు పడుతున్నారు. ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజలు మాత్రం నీటి దప్పిక తీర్చుకోవడానికి అనేక కిలోమీటర్ల దూరంలో వెళ్లి పొలాల్లో, ఎస్‌ఎస్ ట్యాంకు వద్దనుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. మండలంలోని గణేకల్ గ్రామంలో గత మూడు నెలలుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న పట్టించుకోవడం లేదు. ఈగ్రామంలోని 8 బోర్లకుగాను రెండు బోర్లు పని చేస్తున్నాయి. తాగునీటి గుమ్మికి మూడు రోజులకు ఒక్కసారి కేవలం ఆరగంట సేపు మాత్రమే నీరు వదులుతున్నారు. దీంతో ప్రతి రోజు తాగునీటి అవసరాల కోసం గ్రామస్థులు కుప్పగల్ ఎస్‌ఎస్ ట్యాంకు వద్దకు ఆట్లోను, ట్రాక్ట్లలోను, ద్విచక్ర వాహనాల్లోను వెళ్ళి తాగునీటిని తెచ్చుకుంటన్నారు. మరి కొందరు పొలాల్లోని బోరు బావులను అశ్రాయిస్తున్నారు.
ఆటోలకు ఒక్కసారి తాగునీరు తెచ్చకుంటే రూ.100 నుంచి రూ.200లు ఖర్చు అవుతోందని గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామానికి చెందిన విరుపాక్షి, ఈరన్న, మహానంది పేర్కొన్నారు. ఆదేవిధంగా దిబ్బనకల్లు, సాంబగల్లు, చిన్న పెండేకల్, బైచిగేరి, కపటి, సుల్తాన పురం, పెద్దహరివాణం, సంతెకూడ్లూరు, పాండవగల్లు, జాలీమంచి గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. పెద్దహరివాణంలో గ్రామంలో సుమారు 10వేలు జనాభా ఉన్న తాగునీటి కోసం ఎలాంటి వనరులు లేకపోవడంతోగ్రామ శివారులో ఉన్న ఎస్‌ఎస్ ట్యాంకు వద్దకు వెళ్ళి ఫిల్టర్ బెడ్లను, తాగునీరు నిలువ చేసే బావి నుంచి పగ్గాల ద్వారానీటిని తోడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆదేవిధంగా బైచిగేరి, దిబ్బనల్లు గ్రామాల్లో సైతం తాగునీటి సమస్య తీవ్రంగా ఉండంతో ఆ గ్రామాల ప్రజలు పిల్టర్ నీటి క్యాన్లను రూ.50 చెల్లించి కోనుగోలు చేస్తున్నారు. మరి కొంత మంది పొలాల్లోని బోరు బావులను ఆశ్రయించి నీటిని ఇండ్లను తీసుకోని వెళ్ళుతున్నారు. గ్రామాల్లో తాగునీటి కోసమే కాకుండా కనీస అవసరాలకు, పశువులకు తాగునీరు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రజా సంఘాల నాయకులు స్పష్టం చేశారు..
నత్తనడకన భూసారపరీక్షలు!
* గడువు లోపు లక్ష్యం పూర్తయ్యేనా..
* రైతులకు రాయితీ అందేనా..
కర్నూలుటౌన్, ఏప్రిల్ 2:రైతులు పంట సాగు చేయని సమయంలో ఆ భూమిలో మట్టి నమూనాలు సేకరించి, ప్రయోగశాలలో పరీక్షలు జరిపి భూసార ఫలితాలను రైతులకు సకాలంలో అందజేయాల్సి ఉండగా ఈ పక్రియ జిల్లాలో నత్తనడకన కొనసాగుతోంది. భూసార పరీక్షలకు గడువు ఇక పది రోజులే ఉండడంతో అప్పటి లోగా ఏమేరకు లక్ష్యం చేరుకుంటారో అనే సందేసాలు తలెత్తుతున్నాయి. పంట మార్పిడి చేయకపోవడం, మోతాదుకు మించి ఎరువుల వాడకం, తదితర కారణాలతో రైతులు పంట దిగుబడులు పూర్తిగా కోల్పోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూసార పరీక్షలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 14వ తేదీ లోపు భూసార పరీక్షలు పూర్తి చేయాలని ఆ శాఖ కమిషనర్ జెడిఏలకు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 68,221 మట్టి నమూనాలకు గానూ ఇప్పటి వరకూ 59,110 నమూనాలు సేకరించగా ఇంకా 9 వేల నమూనాలు సేకరించాల్సి ఉంది. సేకరించిన వాటిలో ఇప్పటి వరకు 38,995 నమూనాలను పరీక్షించారు. 51,648 నమూనాలను ప్రయోగశాలకు పంపారు. జిల్లాలో 4 ప్రాంతాల్లో భూసార పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎమ్మిగనూరు, కర్నూలు రెవెన్యూ డివిజన్ పరిధిలో కర్నూలు, నంద్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలో నంద్యాలలో భూసార పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో ఒక ఏఓ, ఏఇఓ ఉంటారు. భూసార పరీక్షలు వేగవంతంగా పూర్తిచేసుందుకు అదనంగా ఒక్కో ప్రయోగశాలకు ముగ్గురు ఏఇఓలను నియమించారు. ఈ ఫలితాలను బట్టి సూక్ష్మపోషకాలైన జింకు, జిప్సం, బోరాన్ ఎరువులను ప్రభుత్వం 50శాతం రాయితీపై రైతులకు అందజేస్తుంది. అయితే సకాలంలో భూసార పరీక్షలు నిర్వహించకుంటే రైతులకు రాయితీ దక్కదు. కావున ఇకనైనా వ్యవసాయ అధికారులు భూసార పరీక్షలపై ప్రత్యేక దృష్టిపెట్టి లక్ష్యాన్ని పూర్తి చేయాలని రైతులు, వ్యవసాయ కార్మిక, అనుబంధ సంఘాల నాయకులు కోరుతున్నారు.
వైభవంగా చౌడేశ్వరీమాత
జ్యోతి ఉత్సవం
బనగానపల్లె, ఏఫ్రిల్ 2 : మండల పరిధిలోని నందవరం గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరీమాత తిరుణాలలో భాగంగా ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో అమ్మవారి జ్యోతి మహోత్సవ ఘట్టాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ పివి కుమార్‌రెడ్డి, ఇఓ రామానుజన్, వహీకర్త రాజేశ్వరరావు ఆధ్వర్యంలో భక్తుల కోలాహలం మధ్య మహోత్సవం ప్రారంభమైంది. ఈ ఏడాది గరిష్ఠంగా భక్తులు 530 జ్యోతులు కట్టారు. జ్యోతి ఉత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నుంచే కాకుండా కడప, గుంటూరు, తదితర జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. జ్యోతి ఉత్సవం రాత్రి 1.30 గంట నుంచి ఉదయం 7 గంటల వరకూ కొనసాగింది. ఇక సాయంకాలం ఆలయం వద్ద ఇఓ, చైర్మన్ సమక్షంలో అమ్మవారికి రథోత్సవం నిర్వహించారు. రథోత్సవంలో భక్తులు పాల్గొని రథాన్ని ముందుకు లాగారు. కాగా అమ్మవారి ఉత్సవాలు పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రాతిదూలం లాగుడు పోటీలను సాయంత్రం ఎమ్మెల్యే బిసి జనార్ధనరెడ్డి ప్రారంభించారు. చూసేందుకు ఔత్సాహికులు అధికసంఖ్యలో తరలివచ్చారు.
హత్యకేసులో నిందితుల అరెస్టు
* పరారీలో సూత్రధారులు:డీఎస్పీ
కర్నూలు, ఏప్రిల్ 2:నగరంలోని విద్యాసంస్థ అధినేత రజినీకుమార్ హత్యకేసులో నిందితులను అరెస్టు చేసినట్లు కర్నూలు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. అందుకు సంబంధించిన వివరాలను ఆదివారం డీఎస్పీ కర్నూలు తాలూకా పోలీస్‌స్టేషన్‌లో విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. నగరంలోని బుధవారపేటకు చెందిన మాజీ కార్పొరేటర్ శ్రీరాములు, మద్దిలేటి యాదవ్ కలిసి రజినీకుమార్‌ను హత్యచేసేందుకు కుట్రపన్ని, ఆ మేరకు బుధవారపేటకు చెందిన వెంకటరాముడికి రూ. 3 లక్షలకు కాంట్రాక్టు ఇచ్చారన్నారు. దీంతో వెంకటరాముడు అల్లుడు వీకర్ సెక్షన్ కాలనీలో వుంటున్న శివప్రసాద్‌తో పాటు అతడి స్నేహితులు సాయికృష్ణ, ఖాదర్‌బాషా, మినె్నల హుసేన్, నితీష్ అందరూ కలిసి గత నెల 17వ తేదీ రజినీకుమార్‌ను తీసుకెళ్లి అతడి చేత బాగా మద్యం తాపించారు. అదే రోజు రాత్రి 9 గంటల సయమంలో కోడుమూరు నుంచి కర్నూలుకు వెళ్లే రహదారిలో మోడల్ స్కూల్ దగ్గర వెంకటాముడు రజినీకుమార్ గొంతును గట్టిగా నొక్కి పట్టుకుని బీర్ బాటిల్‌తో పొడువగా మిగతా వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు. అనంతరం రజినీకుమార్ శవాన్ని ఆయన కారులోనే తీసుకెళ్లి పెద్దటేకూరు గ్రామ సమీపంలోని రైలు పట్టాలపై పడేసి కారును నగరంలోని ఓ హోటల్ దగ్గర వదిలేసి వెళ్లారు. దీంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆ కేసును ఉలిందకొండ పోలీసులకు అప్పగించారు. దీంతో విచారణ చేపట్టిన ఉలిందకొండ పోలీసులు ఆదివారం నిందితులను అరెస్టు చేశారు. అయితే హత్యకు సూత్రధారులైన శ్రీరాములు, మద్దిలేటి యాదవ్ పరారీలో ఉన్నారన్నారు. సమావేశంలో సిఐ నాగరాజుయాదవ్, ఉలిండకొండ ఎస్‌ఐ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
భానుడి ప్రతాపానికి జనం విలవిల!
* ఇప్పటికే వడదెబ్బతో 10 మంది మృతి
కర్నూలు సిటీ, ఏప్రిల్ 2 : జిల్లాలో భానుడి ప్రతాపానికి జనం విలవిల్లాడిపోతున్నారు. గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం ఏకంగా 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా వడదెబ్బతో 10 మంది మృత్యువాత పడ్డారు. అందులో వ్యవసాయ, ఉపాధి పనుల కోసం వెళ్లిన కూలీలతో పాటు వృద్ధులు కూడా ఉన్నారు. శనివారం ఒక్క రోజే వడదెబ్బకు గురై ఐదుగురు మృతిచెందారు. వారిలో సి.బెళగల్ మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన బోయ కిష్టమ్మ(65), పాణ్యం మండలం బలపనూరు గ్రామానికి చెందిన చాకలి వెంకటేశ్వర్లు(50), కోడుమూరు మండలం లద్దగిరి గ్రామానికి చెందిన లక్ష్మమ్మ(69), దేవనకొండ మండలం తెర్నేకల్లు గ్రామానికి చెందిన వెంకటేశ్వరమ్మ(45), కౌతాళం మండలం హాల్వి గ్రామానికి చెందిన సిద్దయ్య(31) ఉన్నారు. ఇదిలా ఉండగా రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో చాలా వరకూ ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లోనే ఇంటి నుంచి బయట అడుగు పెడుతున్నారు.
అయితే రెక్కాడితే కానీ డొక్కాడని గ్రామీణ ప్రాంత ఉపాధి కూలీలు, రైతు కూలీలు పూట గడవక పస్తులుండలేక తప్పనిసరిగా పనులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకూ మృత్యువాత పడిన వారందరూ వ్యవసాయ, ఉపాధి పనుల కోసం వెళ్లిన కూలీలే కావడం గమనార్హం. గత నాలుగు రోజులుగా భానుడి ప్రతాపానికి జిల్లా ప్రజలు ఎండ వేడి, ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పగటి ఉషోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి.
శ్రీశైలంలోఅన్నదానానికి విరాళం
శ్రీశైలం, ఏప్రిల్ 2:శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల నిత్య అన్నదాన నిధికి పలువురు భక్తులు విరాళాలను అందజేశారు. వీరిలో అనంతపురం జిల్లాకు చెందిన ఆర్‌వి జయపాల్‌రెడ్డి రూ. లక్ష, హైదరాబాదుకు చెందిన జె రమేష్‌రెడ్డి రూ. 1,00,116 విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని ఆలయ అన్నదాన ఎఇఓ రాజశేఖర్‌కు భక్తులు అందజేశారు. విరాళానికి సంబందించిన బాండు, రసీదును ఆలయ అధికారులు భక్తులకు ఇచ్చి స్వామి అమ్మవార్ల లడ్డూ ప్రసాదాలను కూడా ఇచ్చి ప్రోత్సహించారు.
వృద్ధుడి దారుణ హత్య
* సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డాగ్ స్క్వాడ్
ఆత్మకూరు, ఏఫ్రిల్ 2:కొత్తపల్లెలో ఆదివారం పెద్ద చిన్నయ్య(65)ను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. చిన్నయ్య కుమారుడు లింగస్వామి తెలిపిన వివరాలు.. పెద్ద చిన్నయ్య ఉదయం 7 గంటలకు పొలంలో ఉన్న గడ్డిని కాల్చడానికి వెళ్లాడన్నారు. అయితే 9 గంటల సమయంలో గ్రామానికి చెందిన తిక్కయ్యస్వామి తమ ఇంటికి వచ్చి నరసింహారెడ్డి పొలం వద్ద మీ నాన్న దెబ్బలు తగిలి కింద పడి ఉన్నాడని తెలిపాడన్నారు. దీంతో తాము హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన మా నాన్నను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తుండగా బావాపురం గ్రామం వద్దకు వచ్చేసరికి మృతిచెందినట్లు కుమారుడు బోరున విలపించాడు. తమకు ఎవరూ శుత్రువులు లేరని ఎవరు దాడి చేశారో అర్థం కావడం లేదని వాపోయాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాల కోసం గాలించారు. ఈ విషయంపై ఆత్మకూరు సిఐ మాట్లాడుతూ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పాముకాటుకు మహిళ మృతి
సి.బెళగల్, ఏప్రిల్ 2:మండల పరిధిలోని గుండ్రేవుల గ్రామంలో శనివారం రాత్రి గొల్ల పుష్పావతి(22) పాముకాటుకు గురై మృతిచెందింది. ఆమె రాత్రి ఇంట్లో పనులు చేసుకుంటుండగా ఇంటి మూల చివరలో పాము ఉన్న విషయం గమనించకుండా పాముపై తొక్కడంతో వెంటనే పాము కాటు వేసింది. ఇది గమనించిన భర్త ఆంజనేయులు వెంటనే ఆమెకు ఆనటు వైద్యం అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆదివారం తెల్లవారుజామున ఆమె మృతిచెందింది.