కర్నూల్

నంద్యాల పార్లమెంటులో వైకాపా డీలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఏప్రిల్ 28: నంద్యాల పార్లమెంటు పరిధిలో వైకాపా చుక్కాని లేని నావలా డీలా పడింది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వారానికే నంద్యాల ఎంపి ఎస్పీవై రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరి బోణీ చేయగా, కొంత విరామం అనంతరం వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలోకి క్యూ కట్టారు. రెండు నెలల క్రితం నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఒకేసారి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో పచ్చ కండువా కప్పుకోగా గురువారం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి కూడా అదే బాటలో నడిచారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు స్థానాలు వైకాపా దక్కించుకోగా, కేవలం బనగానపల్లె నియోజకవర్గంలో మాత్రమే టిడిపి అభ్యర్థి బిసి జనార్థన్‌రెడ్డి గెలుపొందారు. ప్రస్తుతం ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేలు టిడిపి తీర్థం పుచ్చుకోవడంతో ఆ పార్టీ బలం నాలుగుకు చేరింది. డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య వైకాపాలోనే కొనసాగుతున్నారు. వైకాపా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన భూమా నాగిరెడ్డి, భూమా అఖిల ప్రియ, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి టిడిపిలో చేరడంతో నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం నియోజకవర్గాల్లో వైకాపా పగ్గాలు చేపట్టే సత్తా ఉన్న రాజకీయ నాయకుడు ఎవరూ పైకి రావలేదు. దీనికి తోడు వైకాపా అధిష్ఠానం కూడా ఆ మూడు నియోజకవర్గాల్లో ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో రాజకీయ ప్రత్యర్థులందరూ ప్రస్తుతం టిడిపిలోనే ఉండడంతో ఈ రెండు నియోజకవర్గాల్లో టిడిపిని ఎదుర్కొనే సత్తా గల నాయకులు లేకపోవడంతో వైకాపా చోటా నాయకులు, కార్యకర్తలు దిశా నిర్ధేశం లేక వౌనం పాటిస్తున్నారు. చోటా నాయకులను, కార్యకర్తలను కూడగట్టుకుని 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం సిద్ధపడే ఆర్థిక సత్తా, రాజకీయ నేపథ్యం ఉన్న రాజకీయ నాయకులు ఎవరూ లేకపోవడంతో ఈ రెండు నియోజకవర్గాల్లో అనిశ్చిత పరిస్థితి నెలకొంది. అలాగే శ్రీశైలం నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి టిడిపిలో చేరడంతో వైకాపా పగ్గాలు ఎవరి చేతికి ఇస్తారోనని కార్యకర్తలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకూ అయితే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి సోదరుడు బుడ్డా శేషారెడ్డి వైకాపాలోనే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో పార్లమెంటు స్థానంతో పాటు 4 అసెంబ్లీ స్థానాలు టిడిపి చేతిలో ఉండగా, డోన్, పాణ్యం, నందికొట్కూరు స్థానాలు మాత్రం ఇప్పటి వరకూ వైకాపా చేతిలో ఉన్నాయి. వీరిలో ఎంత మంది టిడిపిలోకి వెళ్తారోనన్న విషయం ఆయా నియోజకవర్గాల కార్యకర్తలకు అర్థం కావడం లేదు. వైకాపా అధిష్టానం మాత్రం నంద్యాల పార్లమెంటు పరిధిలో ఆర్థిక సత్తా, రాజకీయ నేపథ్యం కలిగిన రెండు కుటుంబాల నాయకులతో రహస్యంగా చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మొదటి నుండి భూమా నాగిరెడ్డికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న కుటుంబం, నంద్యాలలో కొంత కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగి నేడు టిడిపిలో ఉంటున్న రాజకీయ కుటుంబంతో వైకాపా అధినేత మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద ఈ మూడు నియోజకవర్గాలతో పాటు నంద్యాల పార్లమెంటు ఇన్‌చార్జి బాధ్యతలు ఎవరికి ఇవ్వాలన్న విషయంపై వైకాపా అధిష్ఠానం ఇప్పుడిప్పుడే తేల్చే పరిస్థితి కనపడడం లేదు. రాజకీయ వ్యతిరేకత ఉన్న వారైనప్పటికీ వైకాపా బాధ్యతలు స్వీకరిస్తే ఇప్పటి నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల వరకూ వైకాపా కార్యక్రమాలు చేపట్టడం, చోటా, మోటా నాయకులను, కార్యకర్తలను చేరదీసి ఉద్యమాలు చేపట్టగల ఆర్థిక సత్తా, రాజకీయ నేపథ్యం ఉన్న నాయకులు కూడా సుముఖత వ్యక్తం చేయలేదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో పరిస్థితిని బట్టి ఏ పార్టీ నుంచి పోటీ చేయాలో ఆరు నెలల ముందు నిర్ణయించుకుంటే సరిపోతుందన్న ఆలోచనలతో ప్రత్యర్థులు వౌనం పాటిస్తున్నారు. మొత్తం మీద నంద్యాల పార్లమెంటు పరిధిలో వైకాపాకు గట్టి ఎదురుదెబ్బ పడిందనడంలో ఎలాంటి సందేహం లేదు.