కర్నూల్

అవసరమైన విత్తనాలను రైతులే ఉత్పత్తి చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, జూన్ 17: రైతులు ప్రతి యేడాది పంటల సాగు కోసం నాణ్యమైన విత్తనాన్ని బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలు పెట్టి కొనడం, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ విత్తనాల కోసం క్యూ లైన్లలో నిల్చొని తీసుకోవడం కంటె తమకు కావాల్సిన విత్తనాలను తామే ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా ఆ గ్రామానికి సరిపడా విత్తనాలను ఉత్పత్తి చేయగలిగే స్థాయికి మన రైతులు ఎదగాలని ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎన్‌వి నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో రైతులకు విత్తనోత్పత్తిపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు విడిపోయిన అనంతరం ప్రధాన విత్తన కంపెనీలు తెలంగాణ రాష్ట్రానికి తరలిపోయాయన్నారు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాను సీడ్‌హబ్‌గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాలో విత్తనోత్పత్తికి అనుకూలమైన వాతావరణం, వివిధ రకాల నేలలు, సాగునీటి వసతులు పుష్కలంగా ఉన్నాయని, దీనికి తోడు విత్తనోత్పత్తి చేయగల అనుభవం ఉన్న రైతులు కూడా పుష్కలంగా ఉన్నారన్నారు. రైతులకు కావాల్సింది శాస్తవ్రేత్తలు బ్రీడర్ సీడ్‌ను పరిశోధనా స్థానాల్లో అభివృద్ధి చేసి ఫౌండేషన్ సీడ్‌ను రైతులకు అందజేస్తారని, ఫౌండేషన్ సీడ్ ద్వారా రైతులు తమకు కావాల్సిన విత్తనాన్ని ఉత్పత్తి చేసుకోవడమే కాక తమ గ్రామానికి కూడా కావాల్సిన విత్తనాలను ఉత్పత్తి చేసుకొనే విధంగా శిక్షణ ఇవ్వడమే ఈకార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. విత్తనాలను ఉత్పత్తి చేసే రైతులు బృందాలుగా ఏర్పడి, సమాఖ్యగా రిజిస్ట్రర్ చేసుకుని తాము ఉత్పత్తి చేస్తున్న విత్తనాలకు బ్రాండ్‌నేమ్‌ను సృష్టించుకుని మార్కెట్ చేసే విధంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తంగెడంచ ఫారంలో 500 ఎకరాలను సీడ్‌హబ్ కోసం కేటాయించడంతో పాటు పరిశోధనా, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు నిధులను విడుదల చేసిందన్నారు. తంగెడంచ ఫారంలో ఇప్పటికే 300 ఎకరాలు సాగు యోగ్యంగా చేసి ఈ ఏడాది 300 ఎకరాల్లో వివిధ పంటలకు సంబంధించిన బ్రీడర్ సీడ్‌ను ఉత్పత్తి చేసేందుకు అక్కడ ప్రత్యేక అధికారి విష్ణువర్ధన్‌రెడ్డిని నియమించిందన్నారు. తంగెడంచ ఫారంలో విత్తనోత్పత్తిపై పరిశోధనలు నిర్వహించడమే కాక సాంకేతిక పరిజ్ఞానాన్ని విత్తనోత్పత్తిలో మేళవించి నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించిందన్నారు. నంద్యాల, తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాల పరిధిలో ఉన్న పరిశోధనా, విస్తరణ స్థానాలలో ఈ ఏడాది నుంచి విత్తనోత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నంద్యాల ఆర్‌ఎఆర్‌ఎస్ నుంచి గత 15 సంవత్సరాలుగా బిపిటి-5204 విత్తనాన్ని ఉత్పత్తి చేసి రైతులకు అందిస్తున్నామని, అయితే ఈ ఏడాది నుంచి పదివేల క్వింటాళ్ల వరి విత్తనం ఉత్పత్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. అలాగే కదిరి పరిశోధనా స్థానంలో వేరుశనగ విత్తనాన్ని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్‌లో పత్తిసాగు తగ్గిపోయే అవకాశం ఉందని, ఈస్థానాన్ని అపరాల పంటలు కంది, మినుము, పెసర భర్తీ చేస్తాయన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో 24 లక్షల హెక్టార్లలో వరిసాగు, 16లక్షల హెక్టార్లలో వేరుశనగ, 6.5 లక్షల హెక్టార్లలో పత్తి, మొక్కజొన్న, 10లక్షల హెక్టార్లలో కంది, శనగ, మినుము, పెసరపంటలు సాగు చేస్తున్నామని, నైరుతి రుతుపవనాలు మందగించాయని, వర్షాలు విస్తృతంగా పడిన అనంతరమే పత్తి సాగుచేసే రైతులు విత్తనం వేసుకోవాలని సూచించారు. ఎర్రనేలల్లో ఇప్పటి వరకు పడిన వర్షాలకు కంది విత్తనాలు వేశారని, మిశ్రమ పంటలు సాగు చేసుకోవడం వల్ల రైతులకు లాభదాయకంగా ఉంటుందన్నారు. ఈకార్యక్రమంలో నంద్యాల ఆర్‌ఎఆర్‌ఎస్ ఎడిఆర్ బేతి గోపాల్‌రెడ్డి, మాజీ పాలకమండలి సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, తంగెడంచ విత్తనోత్పత్తి అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి, విత్తన ధృవీకరణ అధికారి హేమసుందర్, శాస్తవ్రేత్తలు, విస్తరణ అధికారి, విత్తన పంటలు సాగుచేసే రైతులు పాల్గొన్నారు.