కర్నూల్

ముగిసిన పుష్కరోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, ఆగస్టు 23: శ్రీశైలం మహాక్షేత్రంలో ఈ నెల 12వ తేదీన వైభవంగా ప్రారంభమైన కృష్ణమ్మ పుష్కరాలు 12 రోజుల పాటు భక్తుల పుణ్యస్నానాలు, మొక్కులు, వాయనాలు, పసుపుకుంకుమ, చీరె, సారె సమర్పణతో మంగళవారంతో భక్తుల వీడ్కోల మధ్య ఘనంగా ముగిశాయి. ఈ 12 రోజుల పాటు జరిగిన పుష్కరాల్లో సుమారు 12 లక్షల మంది భక్తులు శ్రీశైలం క్షేత్రంలో పుష్కర స్నానాలు ఆచరించి శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారని కలెక్టర్ విజయమోహన్ తెలిపారు. పుష్కరాల ముగింపు మంగళవారం చివరి రోజు కావడంతో శ్రీశైలం క్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం నుంచే భక్తుల రద్దీ కొనసాగుతూ వచ్చింది. లక్షలాదిగా భక్తులు దేశ నలుమూలల నుంచి శ్రీశైలం చేరుకుని పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. పాతాళగంగ, లింగాలగట్టు స్నానఘాట్లలో వేకువజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. చివరి రోజు కావడంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు, అన్ని విభాగాల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భక్తుల రద్దీ అనుగుణంగా ట్రాఫిక్ మళ్లించి అంచెలంచెలుగా భక్తులను స్నానఘట్టాల వద్దకు అనుమతించారు. స్నానఘట్టాల వద్ద ఎటువంటి అలజడి లేకుండా ప్రశాంతంగా గత 11 రోజుల వలె చివరి రోజు కూడా పుణ్యస్నానాలు చేసి భక్తులు త్వరగా తమ పూజలు ముగించుకుని గమ్యస్థానాలు చేరుకొనేలాగా అధికారులు తమ సిబ్బందితో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అలాగే ఆలయ అధికారులు ఆలయ వేళల్లో మార్పులు చేసి రాత్రి 12 గంటల వరకు స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించారు. స్వామిమి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పట్టింది. స్నానఘట్టాల వద్ద ప్రత్యేక నిఘాతో పాటు భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను అధికారులు సమకూర్చారు. మంచినీటి ప్యాకెట్లను, మజ్జిగ ప్యాకెట్లను అన్నదానం ద్వారా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. లింగాలగట్టు నుంచి శ్రీశైలం చేరుకొనే భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. శ్రీశైలం చేరుకున్న భక్తులు యజ్ఞ వాటికలో బస్సులు పార్కింగ్ చేసి అక్కడి నుంచి వారు తమ స్వగ్రామానికి వెళ్లేందుకు బస్సులు ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు.
ఏర్పాట్ల పరిశీలన..
భక్తుల రద్దీ దృష్ట్యా కలెక్టర్ విజయమోహన్, ఎస్పీ రవికృష్ణ, ఆలయ ఇఓ నారాయణ భరత్‌గుప్త స్నాన ఘాట్లవద్ద ఏర్పాట్లను సిసి ఫుటేజిలను పరిశీలిస్తు అటు అధికారులకు, సిబ్బందికి సూచనలు ఇస్తు ఇట్టు భక్తుల సౌకర్యాలపై ఆరా తీశారు. భక్తులతో ముఖాముఖి మాట్లాడి పలువురు చిన్నారులను పలకరించారు. భక్తులకు అందుతున్న ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ దగ్గర ఉండి పర్యవేక్షించారు. ఈ 12రోజుల పాటు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో శ్రీశైలం వచ్చిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడంతో అటు అధికారులు, ఆలయ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు. పుష్కర ఏర్పాట్లలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉందని, అందుకు సహకరించిన అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. పుష్కరాలు విజయవంతగా ముగియడంతో 26వ తేదీన కర్నూలులో విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు, ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు.
మల్లన్న సేవలో డిప్యూటీ సిఎం కెఇ, ఎమ్మెల్యే రోజా
శ్రీశైలం మహాక్షేత్రంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను డిప్యూటీ సిఎం కెయి కృష్ణమూర్తి మంగళవారం దర్శించుకుని పూజలు చేశారు. వీరికి ఆలయ ఇఓ నారాయణ భరత్‌గుప్త సాదర స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లను దర్శనం అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో డిప్యూటీ సిఎంను ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు. అలాగే శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను నగరి ఎమ్మెల్యే రోజా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లింగాలగట్టులో పుష్కర స్నానాలు ఆచరించి కృష్ణవేణి నదికి పూజలు చేశారు.
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి..
శ్రీశైలం క్షేత్రంలో పుష్కర విధులకు వచ్చిన కానిస్టేబుల్ గోపాలకృష్ణ(39) మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. గోపాలకృష్ణ కర్నూలు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నట్లు కలెక్టర్ విజయమోహన్ తెలిపారు. ఉదయం బాత్‌రూంకు వెళ్లి హఠాత్తుగా పడిపోవడంతో సహ ఉద్యోగులు దేవస్థానం ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే గోపాలకృష్ణ మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్పీ రవికృష్ణ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి వివరాలను తెలుసుకుని వారి బంధువులకు తెలియజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పుష్కర విధులకు వచ్చి చివరి రోజు గోపాలకృష్ణ మృతి చెందడం చాలా బాధాకరమని, మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సంఘటనపై సిఎంతో మాట్లాడడం జరిగిందని, రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా మృతుడు కుటుంబానికి అందించనున్నట్లు తెలిపారు. డిప్యూటీ సిఎం కెయి కృష్ణమూర్తి కానిస్టేబుల్ మృతిని తెలుసుకుని ఆసుపత్రి వద్దకు చేరుకుని కలెక్టర్, ఎస్పీని వివరాలు తెలుసుకుని గోపాలకృష్ణ మృతికి సంతాపం వ్యక్తం చేశారు.