కర్నూల్

రెయిన్‌గన్లపై గంపెడాశలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 29:జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన వివిధ రకాల పంటలు ఎండిపోయే స్థితిలో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 6.21 లక్షల హెక్టార్లకు గానూ 4.73 లక్షల హెక్టార్లలో పంట సాగువుతోంది. ఇందులో 2.27 లక్షల హెక్టార్ల పంట ఎండిపోయే దశకు చేరుకోగా మిగిలిన పంటలు నేడో రేపో అన్నట్లుంది. ఈ పరిస్థితుల్లో పంటలను కాపాడుకోవడానికి జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. పంటను కాపాడుకోవడానికి రెయిన్‌గన్లు వినియోగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా అవసరాల మేరకు 4,472 రెయిన్‌గన్లను సిద్ధం చేశారు. వీటిని రైతులు 60శాతం సబ్సిడీ పోనూ రూ. 10వేలు ప్రభుత్వానికి చెల్లించి వాటిని కొనుగోలు చేసి వినియోగించుకోవాల్సి ఉంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో బోర్లు, నీటి ట్యాంకర్ల సహాయంతో పంటలపై రెయిన్‌గన్ల ద్వారా నీరు చల్లి పంటలను కాపాడాలని కలెక్టర్ ఆదేశించారు. అయితే రెయిన్‌గన్ కొనుగోలు కోసం రైతులు ముందుకు రాని పరిస్థితి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పంటల సాగుకు పెట్టుబడి పెట్టడం, గతంలో తీసుకున్న రుణాలు పూర్తిగా మాఫీ కాకపోవడంతో పాటు బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వకపోవడం వంటి కారణాలతో రైతు చేతిలో చిల్లి గవ్వలేని దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో రెయిన్‌గన్ కొనుగోలుకు రూ. 10వేలు అప్పు చేయాల్సి ఉందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో ప్రధానంగా ప్రస్తుతం కంది 85,300 హెక్టార్లు, వేరుశెనగ 95వేల హెక్టార్లు, పత్తి 1.5 లక్షల హెక్టార్లలో సాగులో ఉంది. ఇక ఆముదం, మిరప, ఉల్లిగడ్డలు, మొక్కజొన్న కలిపి సుమారు లక్ష హెక్టార్లలో సాగులో ఉంది. వాటిలో ఇప్పటికే 2.27 లక్షల హెక్టార్లలో పంట ఎండిపోయే దశకు చేరుకోగా మిగిలిన విస్తీర్ణంలోని పంటలు కూడా దాదాపు ఆ పరిస్థితికి దగ్గర్లో ఉన్నాయని రైతులు వాపోతున్నారు. గత జూన్, జూలై మాసాల్లో కురిసిన వర్షంతో రైతులు సంబర పడగా ఆగస్టులో వరుణుడు ముఖం చాటేయడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. జిల్లాలో 54 మండలాలకు గానూ 43 మండలాల్లో పరిస్థితి బాగాలేదని, వీటిలో పడమర ప్రాంతంలోని ఆదోని, కర్నూలు రెవెన్యూ డివిజన్లలోని 23 మండలాల్లో మరీ దయనీయంగా ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలను కాపాడుకోవడానికి వ్యవసాయ, రెవెన్యూ, ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయతీరాజ్ శాఖలతో పాటు ఏపిఎంఐపి అధికారులు రంగంలోకి దిగారు. కాలువలు, ప్రభుత్వ, ప్రైవేట్ బోర్ల నుంచి నీటిని పంటలపై పిచికారి చేయాలని అవసరమైతే గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారులు నీటి ట్యాంకర్లు ఏర్పాటు చేసి పంటలను కాపాడాలని కలెక్టర్ విజయమోహన్ ఆదేశించారు. జిల్లాలో ఒక్క ఎకరాలో కూడా పంట ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలన్న సిఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా అధికారులు కదిలినా రెయిన్‌గన్ల కొనుగోలుకు రైతులు ముందుకురావడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం ప్రస్తుతం రెయిన్‌గన్లను సరఫరా చేసి భవిష్యత్తులో రైతుల నుంచి వసూలు చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. అవసరమైతే రుణమాఫీ మొత్తం నుంచి రెయిన్‌గన్ సొమ్మును మినహాయించుకునే విధంగా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాకాకుండా రైతులే కొనుగోలు చేసి రెయిన్‌గన్ల ద్వారా పంటలను కాపాడుకోవాలంటే సాధ్యమయ్యే కాదని రైతులు పేర్కొంటున్నారు. కాగా రైతుల గోడు జిల్లా అధికారులకు చేరడంతో వారు ఆలోచనలో పడ్డట్లు సమాచారం. ఉన్నతాధికారుల సహకారంతో అధికారులే రెయిన్‌గన్ల ద్వారా పంటలపై నీటిని చల్లాలన్న ఆలోచన చేసి ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలుస్తోంది. వారి నుంచి వచ్చే స్పందనను బట్టి తదుపరి చర్యలు ఉంటాయని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. రానున్న వారం రోజులు రోజుకు 30వేల ఎకరాల్లో రెయిన్‌గన్ల ద్వారా నీటిని పంటలకు అందించాలన్నది లక్ష్యంగా నిర్ణయించామని వెల్లడిస్తున్నారు.