కర్నూల్

మాకొద్దీ రేషన్ డీలర్‌షిప్‌లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, నవంబర్ 22: నిన్నా మొన్నటి వరకు రేషన్ దుకాణం దక్కించుకోవడానికి వేల రూపాయల ఖర్చుకూ వెనుకాడకుండా నాయకులు, అధికారుల చుట్టూ తిరిగిన వ్యక్తులు నేడు అదే రేషన్ దుకాణ డీలర్‌షిప్పు ఇస్తామంటే వద్దనే పరిస్థితికి వచ్చింది. గతంలో ఉన్నట్లుగా రేషన్ దుకాణాల్లో అవినీతికి దాదాపుగా అడ్డుకట్ట పడటంతో దుకాణాల నిర్వహణకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఖాలీగా ఉన్న ప్రాంతాల్లో డీలర్ల నియామకానికి అధికారులు సిద్ధపడినా దరఖాస్తులు రాకపోవడంతో సమీప డీలర్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. ఈ-పాస్ విధానంతో అవినీతికి అవకాశాలు తగ్గడంతో పాటు కొత్తగా నిత్యావసర వస్తువుల పంపిణీకి ఆన్‌లైన్ విధానం అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధపడటంతో డీలర్లు దుకాణాలు వదులుకోవడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రేషన్ దుకాణాల్లో నిత్యావసర వస్తు పంపిణీకి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఆదాయం గణనీయంగా తగ్గిందని, దీనికి తోడు వచ్చే నెల 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ విధానం అమలైతే వెట్టిచాకిరీ చేయాల్సిందేనని రేషన్ దుకాణడీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం లేకుండా వెట్టిచాకిరీ చేయడమెందుకంటూ డీలర్‌షిప్పుకు రాజీనామాలు చేయడానికి నిర్వాహకులు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 2014 ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో అవినీతిని అరికట్టేందుకు అనేక చర్యలు చేపట్టింది. అన్ని రేషన్‌కార్డులకు ఆధార్ నెంబరు అనుసంధానం చేయడంతో భారీ ఎత్తున బోగస్ రేషన్‌కార్డులు వెలుగులోకి వచ్చాయి. ఇక ఆధార్ అనుసంధానం అనంతరం అనర్హులకు తెల్ల రేషన్‌కార్డు జారీ కావడంతో వాటిని కూడా క్రమేణా రద్దు చేశారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో 90 శాతానికి పైగా అర్హమైనవే ఉన్నాయని మిగిలిన 10 శాతం కార్డులను క్షేత్రస్థాయి పరిశీలన తరువాత తొలగిస్తామని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇటీవలికాలంలో కొంతమంది డీలర్లు ఈ-పాస్‌ను తమకు అనుకూలంగా మార్చుకుని అక్రమాలకు పాల్పడ్డారు. ఏకంగా కంప్యూటర్‌లో మార్పులు చేర్పులు చేసి ఈ-పాస్ విధానంతో సంబంధం లేకుండా నిత్యావసర వస్తువులు పంపిణీ అయినట్లు చూపి అవినీతికి పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం విచారణ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 250 మంది రేషన్ దుకాణ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఇందులో కర్నూలు జిల్లా నుంచి సుమారు 536 మంది డీలర్లు ఉన్నారని ప్రచారం జరుగుతుండగా ఇప్పటి వరకు 150 మందిపై చర్యలు తీసుకుని కేసులు నమోదు చేశారు. అంతేగాకుండా ఈ-పాస్ విధానం దుర్వినియోగం కాకుండా కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌ను మరింత కట్టుదిట్టం చేశారు. మొత్తం వ్యవహారం కఠినతరం కావడంతో ఇక నిత్యావసర వస్తువుల పంపిణీలో అవినీతికి తావులేదని తేలడంతో డీలర్లు దుకాణాలను వదులుకోవడానికి సిద్ధపడుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. నిత్యావసర వస్తువుల పంపిణీకి డీలర్లు ముందుకు రావడం లేదన్న సమాచారంతో ప్రభుత్వం అప్రమత్తమైనట్లు సమాచారం. డీలర్లకు ప్రతి నెలా గౌరవ వేతనం ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిపై నివేదిక ఇవ్వాలని పౌర సరఫరాలశాఖ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. త్వరలో ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రస్తుతం ఉన్న డీలర్లు, కొత్తగా ఎంపిక చేసే డీలర్లకు గౌరవ వేతనం ఇచ్చే అంశంపై స్పష్టత వస్తుందని అభిప్రాయపడుతున్నారు. రేషన్ దుకాణం కోసం నేతల చుట్టూ తిరిగిన డీలర్లు ఇపుడు రాజీనామా చేస్తామని ఆమోదించాలంటూ అధికారులు, నేతల చుట్టూ తిరుతున్నారు. దీన్ని గమనించిన ప్రజలు ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ అంటూ చర్చించుకుంటున్నారు.