కర్నూల్

నేడు సాంకేతిక భారత్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 8 : సరిగ్గా పాతికేళ్ల క్రితం పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నపుడు దేశంలో అక్షరాస్యుల సంఖ్య పెంచడానికి సాక్షర భారత్ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించగా, నేటి ప్రధాని నరేంద్ర మోదీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సాంకేతిక భారత్ కార్యక్రమం రూపొందిస్తున్నారు. ఆనాడు సంతకం చేయని పక్షంలో ప్రభుత్వ పథకాలు రద్దు చేస్తామని ప్రభుత్వం చెప్పినా సాక్షర భారత్ కార్యక్రమం ద్వారా ఆశించిన ఫలితాలను పొందలేకపోయారు. తాజాగా నగదు రహిత సేవలను వినియోగించుకునే ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రతి చెల్లింపులకు ముందు వేలి ముద్రలను సరిపోల్చుకునేలా తీర్చిదిద్దుతున్నందున వేలి ముద్రలకు ప్రాధాన్యత పెరిగింది. నగదు రహిత సేవలను అందిపుచ్చుకోవడానికి ప్రజలు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలన్న ఉద్ధేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు నిమగ్నం కాగా వారికి సహకారం అందించేందుకు రాజకీయ పార్టీలైన బిజెపి, టిడిపి కార్యకర్తలు, అభిమానులు సిద్ధపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానంపై ప్రజల్లో అవగాహన వస్తే నగదు రహిత సేవల ద్వారా తమ ఆర్థికావసరాలు తీర్చుకోవడం సులభతరమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా తమవద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో ప్రభుత్వ బిల్లుల చెల్లింపు, తమకు అవసరమైన వస్తువుల కొనుగోలు, నగదు బదిలీ వంటి అంశాలపై గ్రామీణులకు అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘ఎపి పర్స్’ యాప్ ఒక్కటి డౌన్‌లోడ్ చేసుకుంటే అన్ని రకాల సేవలను అందులోనే నిర్వహించవచ్చని ప్రజలకు వివరిస్తున్నారు. ఇక ప్రతి గ్రామంలో ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు ముమ్మర యత్నాలు జరుగుతున్నాయి. జనవరి 1వ తేదీ నాటికి ఈ పనులు పూర్తి కావాలని ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే అతి తక్కువ ధరకు ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని, ఇంటర్నెట్ వినియోగించుకునే ఆర్థిక సహకారం లేని వారికి ఉచితంగా వైఫై ద్వారా ఇంటర్నెట్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేగాక ఇంటర్నెట్ రంగంలో ఏర్పడిన పోటీ కారణంగా ఇప్పటికే అన్ని ప్రైవేటు కంపెనీలు తక్కువ ధరకు ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నాయి. ప్రభుత్వం గ్రామీణులకు సాంకేతిక పరిజ్ఞానం గురించి వివరించేందుకు వెళ్లినపుడు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. నాడు సాక్షర భారత్‌లో అక్షరాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపని జనం నేడు సాంకేతిక పరిజ్ఞానం కోసం ముందుకు రావడం హర్షనీయమని వారంటున్నారు.
నగదు రహిత సేవల వైపు
ప్రజల అడుగులు!
* గత 15 రోజుల్లో 20 శాతం వృద్ధి..
* నిబంధనలే కారణమని అభిప్రాయం..

కర్నూలు, డిసెంబర్ 8: నగదు రహిత సేవలను అమలులోకి తీసుకురావాలన్న కేంద్ర ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగా ఫలితాలు కనిపిస్తున్నాయని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. గతంతో పోలిస్తే పెద్దనోట్ల రద్దు, బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణ నిబంధనలు అమలులోకి తీసుకువచ్చిన తరువాత నగదు రహిత సేవలు 20 శాతానికి పైగా పెరిగాయని వారంటున్నారు. ప్రధానంగా డెబిట్ కార్డుల వినియోగంలో భారీ వృద్ధి కనిపిస్తోందన్నది బ్యాంకర్లు చెబుతున్న మాట. నగదు బదిలీపై ఇంకా బ్యాంకులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇది కూడా పెరగాల్సి ఉంది. ఈ విషయంలో గతంలో కంటే మూడు నుంచి ఐదు శాతం మాత్రమే వృద్ధి కనిపిస్తోందని చెప్పాలి. ఇక చెక్కుల ద్వారా చెల్లింపులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ విషయంలో వృద్ధి ఎక్కువగా నమోదు కాలేదు. అయితే బ్యాంకుల్లో నగదు ఉప సంహరణకు చెక్కుల వినియోగం ఇటీవలి కాలంలో పెరిగిందనే చెప్పాలి. గతంలో చెక్కు బుక్ ఉన్నా ఒక్క చెక్కు కూడా వాడని వారు ఇప్పుడు వాటిని బ్యాంకులకు తీసుకొచ్చి నగదు తీసుకుంటున్నారు. రెండేళ్ల క్రితం నాటి పాత చెక్కుల స్థానంలో కొత్త వాటిని జారీ చేసినా ఇంకా కొందరు చెక్కులను మార్చుకోలేదు. దీంతో చాలా మంది నగదు ఉప సంహరణకు పాత చెక్కులు తీసుకువస్తున్నారు. అయితే వారికి ఒకసారి మాత్రమే అవకాశం ఇచ్చి తదుపరి కొత్త చెక్కులనే తీసుకురావాలని సూచించడంతో పాటు కొత్త చెక్కులు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా చెల్లింపుల కోసం చెక్కులు ఇస్తే ప్రజలు ఇంకా వాటిని అంగీకరించడంలో సంశయిస్తున్నారనే చెప్పాలి. దీనికి కారణంగా ఖాతాలో సరిపడ నగదు లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయన్న ఆందోళన ఉండడమే. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో డెబిట్, క్రెడిట్ కార్డులు ఉపయోగించి పెట్రోలు కొనుగోలు, నిత్యావసర వస్తువులు, పెద్ద హోటళ్లలో బిల్లుల చెల్లింపు వంటి వాటిలో వృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. జనవరి 1వ తేదీ తరువాత ఈ వృద్ధి మరింత పెరిగి 50 శాతానికి చేరుకునే అవకాశం ఉందని బ్యాంకర్లు అంటున్నారు. ఇక కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ ద్వారా నగదు బదిలీ చేయడానికి సైబర్ నేరగాళ్ల భయం కారణంగా వృద్ధి కనిపించడం లేదన్న అభిప్రాయం ఉంది. అయితే కొద్ది రోజుల్లోనే నెట్ బ్యాంకింగ్‌లో రక్షణ చర్యలు మరింత ఎక్కువ చేస్తూ వేలిముద్రకు ప్రాధాన్యం పెంచే అంశం కార్యరూపంలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు అవసరమైన కసరత్తు జరుగుతోంది. సెల్‌ఫోన్ ద్వారా వచ్చే ఓటిపి, ఎటిఎం కార్డు నెంబరు, ఆధార్ నెంబరు, వేలిముద్ర వంటి నాలుగంచెల భద్రత కల్పిస్తే ప్రజల్లో విశ్వాసం పెరిగి నెట్ బ్యాంకింగ్ విధానంలో నగదు బదిలీ చేయడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధానంలో ఎంతైనా నగదు బదిలీ చేసుకునే సదుపాయం ఉండటంతో ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉందని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. స్వైపింగ్ యంత్రాలు అందుబాటులో ఉన్నా అనేక వ్యాపార సంస్థలు వాటిని వినియోగించకుండా ఇంకా నగదు స్వీకరిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. అలాంటి వారిపై వాణిజ్య పన్నులశాఖ అధికారులు దాడులకు సిద్ధమవుతున్నారు. స్వైపింగ్ యంత్రాలు ఉన్నా వినియోగించకుండా నగదు స్వీకరిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇక చిన్న వ్యాపారులు సైతం స్వైపింగ్ యంత్రాలు కావాలని బ్యాంకర్లను కోరుతున్నారు. వారందరికీ జనవరి 1వ తేదీ నాటికి అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో బ్యాంకు ఖాతా లేని సుమారు 2 లక్షల మందికి గాను ఇప్పటి వరకు 85 వేల మందికి ఖాతాలు తెరిచారు. మరో 15 వేల మందికి ఒకటి, రెండు రోజుల్లో ఖాతాలు తెరిపిస్తామని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. ఇక వృద్ధులు, మానసిక వికలాంగులు, నడవడానికి వీలులేని వికలాంగుల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడిస్తున్నారు. మానసిక వికలాంగులు, వృద్ధాప్యంతో బాధపడుతున్న వారికి బ్యాంకు ఖాతాలు, సాంకేతిక పరిజ్ఞానం అందిచడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందనతో ప్రభుత్వం మరింత వేగంగా నగదు రహిత సేవలపై ముందుకు వెళ్తోందనే చెప్పాలి.
స్వర్ణపల్లకిలో ఊరేగిన రాఘవరాయలు
మంత్రాలయం, డిసెంబర్ 8: పవిత్ర పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీ రాఘవ రాయల బృందావన ప్రతిమను భక్తులు స్వర్ణపల్లకిలో ఘనంగా ఊరేగించారు. గురువారం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి తులసి అర్చన, ఉత్సవరాయల పాదపూజ, విసర్జన సేవ, సర్వ సమర్పణ సేవ, సంస్తాన పూజలు చేసి మహామంగళ హారతి ఇచ్చారు. గురువారం స్వామి వారం కావడంతో భక్తులు అనేక రాష్ట్రాల నుండి అదిక సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. రాత్రి ఉత్సవ మూర్తి శ్రీ ప్రహ్లాదరాయలను వెండి గజవాహనోత్సవం, కొయ్యా, వెండి, బంగారు రథోత్సవాలపై అధిష్ఠించి ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. అనంతరం మఠం ప్రాకారంలో అశేష భక్తుల మధ్య మేళతాళాలతో వైభవంగా ఊరేగించారు.
25లోగా డిజిటల్ లిటరసీ
గ్రామాలుగా తీర్చిదిద్దాలి
* మండల స్థాయి అధికారులకు కలెక్టర్ ఆదేశం
కర్నూలు, డిసెంబర్ 8:ఈ నెల 25వ తేదీలోగా జిల్లాలోని ప్రతి గ్రామాన్ని వందకు వంద శాతం డిజిటల్ లిటరసీ గ్రామంగా తీర్చిదిద్దాలని, అందుకోసం మండల స్థాయి అధికారులు విశేష కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని కలెక్టర్ విజయమోహన్ సూచించారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో గురువారం బ్యాంక్ అధికారులతో సమావేశం, నగదు రహిత లావాదేవీలపై వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దుతో ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి ప్రతిఒక్కరూ నగదు రహిత లావాదేవీలను చేపట్టాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకుని అందుకు అనుగుణంగా విప్లవాత్మక మార్పులను ప్రజల్లో తీసుకురావాల్సిన బాధ్యత మండల స్థాయి అధికారులదే అన్నారు. బ్యాంకు ఉన్న ప్రతి గ్రామంలో ఒక బ్యాంక్ అధికారి, ఒక మండల స్థాయి అధికారిని అనుసంధానం చేస్తున్నామని వారిద్దరూ సమన్వయంతో ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. ప్రతి ఒక్కరినీ ఫిజికల్ లావాదేవీల నుంచి డిజిటల్ లావాదేవీలపై మళ్లించి ఉద్యమస్ఫూర్తితో పని చేయాలన్నారు. ప్రతి కుటుంబానికి ఒక ఖాతా, డెబిట్ కార్డు లేదా రూపే కార్డు, ప్రతి దుకాణానికి ఈ పాస్ మిషన్ ఉండేలా విధులు నిర్వర్తించాలన్నారు. ఒక కుటుంబంలో ఒకరికైనా జనధన్ ఖాతా, రూపే కార్డు ఇప్పించాలని, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంక్ వినియోగించేలా చూడాలని, ఏపి పర్సు, వ్యాలెట్‌ను ఉపయోగించేలా చూడాలన్నారు. ప్రతి పంచాయతీలో ఎఫ్‌పి షాపు డీలర్‌ను బ్యాంక్ కరస్పాండెంట్‌గా మార్చటానికి మండల స్థాయి అధికారులు కృషి చేయాలన్నారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ నరసింహారావు, సిపిఓ ఆనందనాయక్, ఏపిజిబి ఆర్‌ఎం ప్రసాద్, ఎస్‌బిఐ ఆర్‌ఎం రమేష్‌కుమార్, డ్వామా పిడి పుల్లారెడ్డి, తహశీల్దార్లు, ఎంపిడిఓలు, బ్యాంక్ మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు.
నకిలీ నోట్ల చెలామణియత్నం..
* ముగ్గురు వ్యక్తుల అరెస్టు
గోనెగండ్ల, డిసెంబర్ 8: నకిలీ రూ. 2 వేల నోట్లను చలామణికి ప్రయత్నించిన మండల పరిధిలోని పెద్దనెలటూరు గ్రామానికి చెందిన షేక్‌సుబాన్, ఖాజన్న, గొల్లగోవిందలను గురువారం అరెస్టు చేసినట్లు కర్నూలు డిఎస్‌పి రమణమూర్తి తెలిపారు. డిఎస్‌పి తెలిసిన మేరకు నిందితుడు శేక్‌సుబాన్ రూ.2వేల నోట్లును కలర్ జీరాక్స్ చేసి మారుస్తున్నారని టివిలో వచ్చిన సమాచారం చూసి తన అనుచరులకు చెప్పినట్లు తెలిపారు. దీంతో పై ముగ్గురు కలిసి రూ.2వేల నోట్లను కలర్ జిరాక్స్ చేసి చలామణి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈనెల 4వ తేదీ ఆదివారం సుబాన్ బంధువైన రుక్మాన్ ఫొటో స్టూడియోకు వెళ్లి రూ.2వేల నోట్లను కలర్ జిరాక్స్ తీసుకున్నట్లు తెలిపారు. అదేగ్రామంలో మద్యం దుకాణాల్లో వీటిని చలామని చేయాలని చూడగా ఇది గుర్తించిన దుకాణ యజమానులు మందలించినట్లు తెలిపారు. దీంతో జిరాక్స్ నోట్లు చింపి వేసినట్లు తెలిపారు. గ్రామస్థుల సమాచారంతో ఎస్‌ఐ కృష్ణమూర్తి విచారించి కేసు నమోదు చేసి, ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కోడుమూరు సిఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.
కానిస్టేబుళ్ల నియామకాలకు
దేహదారుఢ్య పరీక్షలు
* తొలి రోజు 736 మంది హాజరు:ఎస్పీ
కర్నూలు, డిసెంబర్ 8:కానిస్టేబుల్ నియామకాల్లో భాగంగా గురువారం నగరంలోని 2వ బెటాలియన్ మైదానంలో అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజున 736 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారికి 100 మీటర్లు, 1600 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, ఎత్తు, ఛాతీ కొలతల అనంతరం శారీరక సామర్థ్య పరుగు పరీక్షలు నిర్వహించారు. శారీరక సామర్థ్య పరీక్షలను ఎస్పీ ఆకే రవికృష్ణ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు కానిస్టేబుళ్ల నియామకానికి ఆధునిక పద్ధతిలోని కంప్యూటరీకరణ యంత్రాల ద్వారా శారీరక దారుఢ్య, పరుగు పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 100 మీటర్లు, 1600 మీటర్ల పరుగులో ఆర్‌ఎఫ్‌ఐడి ద్వారా ట్రాక్‌వెంట అభ్యర్థులు రన్నింగ్ చేసేటప్పుడు ఎంత సమయంలలో ఎన్ని రౌండ్లు పూర్తి చేశారనేది బార్ కోడింగ్ ద్వారా అభ్యర్థుల సమయాన్ని లెక్కిస్తున్నారని తెలిపారు. కాగా ఒరిజినల్ సర్ట్ఫికెట్లు తీసుకురాని 220 మంది అభ్యర్థులను క్రీడా మైదానంలోకి అనుమతించకుండా వెనక్కి పంపాని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఓఎస్‌డి రవిప్రకాష్, ఏఆర్ ఏఎస్పీ వెంకటేష్, డీఎస్పీలు బాబుప్రసాద్, వెంకటాద్రి, లైజనింగ్ ఆఫీసర్ డీఎస్పీ షరీఫ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
రాష్టస్థ్రాయి బాక్సింగ్ పోటీలకు
పల్లె విద్యార్థుల ఎంపిక
బనగానపల్లె, డిసెంబర్ 8:పట్టణంలోని నెహ్రూ ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్టస్థ్రాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికైనట్లు కరస్పాండెంట్ కోడూరు హరినాథరెడ్డి గురువారం తెలిపారు. కృష్ణా జిల్లాలో జరిగిన పోటీల్లో అండర్-14 30 కిలోల విభాగంలో సుమంత్, 38కిలోల విభాగంలో ఎం.మధుసూధనరెడ్డి బంగారు పతకాలు, 28కిలోల విభాగంలో డి.సతోష్‌నాయక్, 34 కిలోల విభాగంలో గణేశ్, 36కిలోల విభాగంలో జె.వికాస్, 40కిలోల విభాగంలో డి.బషీర్‌బాబు, 44కిలోల విభాగంలో ఎన్.రవికిరణ్ క్యాంస పతకాలు సాధించారన్నారు. అండర్-17 54కిలోల విభాగంలో ఎం.చైతన్యరెడ్డి, 63కిలోల విభాగంలో జి.శ్రీ్ధర్, 80కిలోల విభాగంలో ఎ.చరణ్ బంగారు పతకాలు, 52కిలోల విభాగంలో బి.నాగార్జున, 70కిలోల విభాగంలో ఎస్.మస్తాన్, 75కిలోల విభాగంలో ఎన్.రాజ్‌కుమార్ రజత పతకాలు, 60కిలోల విభాగంలో ఎస్.సత్యసింహారెడ్డి, 69కిలోల విభాగంలో ఎం.పవన్‌కళ్యాణ్ క్యాంస పతకాలు సాధించినట్లు తెలిపారు. వీరు జిల్లా జట్టు తరఫున రాష్టస్థ్రాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. వారిని హెచ్‌ఎం కమల్‌తేజారెడ్డి, డైరెక్టర్ రవితేజారెడ్డి, ఏఓ లక్ష్మి, బాక్సింగ్ కోచ్ ఫయాజ్, భాస్కర్, వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.
విజిలెన్స్ అధికారుల దాడులు
* 99 బస్తాల చౌక బియ్యం స్వాధీనం
ఆదోనిటౌన్, డిసెంబర్ 8: ప్రభు త్వం సబ్సిడీ బియ్యం చౌక దుకాణ డీలర్లకు సరఫరా చేసే ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచే అక్రమంగా సబ్సిడీ పక్కదారి పట్టిస్తున్న ముఠాను విజిలెన్స్ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. గురువారం ఆదోనిలోని ఖాజీపురలో విజిలెన్స్ సిఐ శ్రీనివాసరెడ్డి, తహశీల్దార్ రామకృష్ణ, ఎస్‌ఐ సుబ్బరాయుడులు దాడులు చేసి 99 బస్తాల సబ్సిడీ బియ్యం స్వాధీనం చేసుకుని మూడు ఆటోలను సీజ్ చేశారు. ఈ సంఘటన వివరాలు. సబ్సిడీ బియ్యం అక్రమంగా బ్లాక్ మార్కెట్‌కు నేరుగా ప్రభుత్వ ఎంఎల్‌ఎస్ గోదాం నుంచి నేరుగా సబ్సిడీ నిలువ ఉంచే అమ్ముకునే ముఠాకు తరలించే విషయంపై వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులోభాగంగా సబ్సిడీ బియ్యం ప్రభుత్వ ఎంఎల్‌ఎస్ గోదాం నుంచి మూడు ఆట్లో తరలిస్తుండగా అక్కడ నుంచే వాటిని వెంబడించి బియ్యం నిలువ ఉంచే ఖాజీపుర ప్రాంతం నుంచి అస్లంబాషా ఇంటి వద్ద దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో ఒక్కొక్క ఆటోలో ఉన్న 20 బస్తాల చొప్పున బియ్యంను మొత్తం 60 బస్తాలతోపాటు అప్పటికే నిలువ ఉంచిన మరో 39 బస్తాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే మూడు ఆటోలను సీజ్ చేసి చర్యనిమిత్తం రెవెన్యూ అధికారులకు స్వాధీ నం చేసినట్లు వారు వివరించారు. ఈదాడుల్లో పోలీసు సిబ్బంది ఈశ్వర్, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
పోలీసులు, మీడియా
సమన్వయంతో పనిచేయాలి
* స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్‌లో ఎస్పీ రవికృష్ణ
కర్నూలు, డిసెంబర్ 8:పోలీసులు, మీడియా సమన్వయంతో సమాజానికి మరిన్ని సేవలు అందించాలని ఎస్పీ ఆకే రవికృష్ణ ఆకాంక్షించారు. నిత్యం ఒత్తిడితో విధులు నిర్వహిస్తున్న పోలీసులు, మీడియా ప్రతినిధుల మధ్య గురువారం నగరంలోని ఔట్ డోర్ స్టేడియంలో స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ జరిగింది. అందులో భాగంగా ఎస్పీ రవికృష్ణ సారథ్యంలో పోలీసు జట్టు చక్కటి బౌలింగ్, బ్యాటింగ్ చేసి క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారు. అలాగే మీడియా టీం మేనేజర్ ముధుసుధాకర్ నేతృత్వంలో ఆ జట్టు సభ్యులు అదేస్థాయిలో ఆడారు. టాస్ గెలిచిన పోలీసు జట్టు మొదట బ్యాటింగ్‌ను ఎంచుకోగా ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఎస్పీ 2 ఫోర్లతో మొత్తం 13 పరుగులు చేసి అలరించారు. 6 వికెట్ల నష్టానికి పోలీసు జట్టు 98 రన్స్ సాధించింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన మీడియా జట్టు కూడా 7 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ పోలీసులకు, మీడియా ప్రతినిధులకు మంచి వాతావరణలో స్నేహపూర్వక మ్యాచ్ జరిగిందన్నారు. రాష్టస్థ్రాయిలో జరగనున్న జర్నలిస్టు క్రికెట్ పోటీల్లో జిల్లా జర్నలిస్టుల జట్టు విజయం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఓఎస్‌డి రవిప్రకాష్, డీఎస్పీ రమణమూర్తి, రామచంద్ర, టీం కోచ్ రామంజనేయులు, సిఐలు డేగల ప్రభాకర్, నాగరాజారావు, నాగరాజుయాదవ్, మహేశ్వరరెడ్డి, మధుసూదనరావు, క్రిష్ణయ్య, ఎస్‌ఐలు వెంకటేశ్వరరావు, మోహన్‌కిషోర్, తదితరులు పాల్గొన్నారు.
ఉచితంగా ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనం
* దివ్యదర్శనానికి దరఖాస్తులు ఆహ్వానం
బేతంచెర్ల, డిసెంబర్ 8:నిరుపేదలైన భక్తులు రాష్ట్రంలో ఆలయాల సందర్శనం కోసం దివ్య దర్శనానికి దరఖాస్తు చేసుకోవచ్చని తహశీల్దార్ అంజనాదేవి, శ్రీమద్దిలేటిస్వామి ఆలయ ఇఓ తిమ్మనాయుడు తెలిపారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో దివ్యదర్శనం కోసం వారు బాక్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శనార్ధం దివ్యదర్శనం అనే పథకాన్ని రూపొందించామన్నారు. ఇందులో భాగంగా నెలకు 4 నుంచి 5 రోజుల పాటు వివిధ దేవాలయాలను సందర్శించడానికి ప్రభుత్వం అన్ని ఉచిత సౌకర్యాలతో దివ్యదర్శన కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. అందుకుగానూ అర్హులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాల వారికి అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. 18-70 ఏళ్ల లోపు ఆరోగ్యవంతులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తుల కోసం తహశీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. సమావేశంలో మద్దిలేటిస్వామి ఆలయ చైర్మన్ యల్ల నాగయ్య, రెవెన్యూ, దేవాదాయ శాఖ సిబ్బంది ఉన్నారు.
నంద్యాలలో అగ్ని ప్రమాదం..
* 20 గుడిసెలు దగ్ధం.. రూ. 20 లక్షల ఆస్తి నష్టం
నంద్యాల, డిసెంబర్ 8 : పట్టణంలోని రాణి మహారాణి థియేటర్ వద్ద నివాసం ఉంటున్న పేదల పూరిగుడిసెలకు అర్ధరాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంతో 20 గుడిసెలు అగ్నికి ఆహుతి కావడంతో రూ. 20 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు తహశీల్దార్ శివరామిరెడ్డి తెలిపారు. బుధవారం అర్ధరాత్రి విద్యుత్ తీగల షార్ట్ సర్క్యూట్‌తో నిప్పంటుకుని గుడిసెలపై పడడంతో అవి అగ్నిమాపక వాహనం వచ్చే లోపే కాలిబూడిదయ్యాయని బాధితులు రోదించారు. చివరకు కట్టుబట్టలతో బయటపడ్డామని, దాచుకున్న నిత్యావసర సరుకులు, బట్టలు, నగదు అగ్నికి ఆహుతయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న వైకాపా నంద్యాల ఇన్‌చార్జి రాజగోపాల్‌రెడ్డి ఉదయానే్న ప్రమాద స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడి ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 20 కుటుంబాల వారికి రూ.లక్ష నగదును ఆర్థిక సహాయం కింద అందజేశారు.
బాధితులకు ఎమ్మెల్యే భూమా పరామర్శ
అగ్ని ప్రమాద బాధితులను గురువారం ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పరామర్శించి ప్రభుత్వం నుంచి అందే ఆర్థిక సహాయం ఒక్కో కుటుంబానికి రూ. 5వేలు, నిత్యావసర సరుకులు అందజేశారు. అలాగే లయన్స్ సేవా ప్రగతి ఆధ్వర్యంలో డాక్టర్ రవికృష్ణ, లయన్స్‌క్లబ్ అధ్యక్షులు నాగమహేశ్, లయన్స్ క్లబ్ సభ్యులు బాధిత కుటుంబాల వారికి 10 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు ఒకొక్కరికి రెండు దుప్పట్లు అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు శివశంకర్, కృపాకర్, మామిడి ఉషారాణి, టిడిపి నాయకులు ఎవిఆర్ ప్రసాద్, కొట్టాల శివనాగిరెడ్డి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.