కర్నూల్

తుంగభద్ర డ్యాంలో నీటి కొరత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, డిసెంబర్ 26 : తుంగభద్ర డ్యాంలో నీటి కరవు ఏర్పడడంతో తుంగభద్ర దిగువ కాలువ కింద రబీ సీజన్‌లో నీటి సరఫరా నిలిచిపోయి లక్ష ఎకరాలు పంట భూములు బీడు పడిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు డ్యాంలో ఎల్లెల్సీ కెనాల్ వాటా కింద మూడు టిఎంసిల నీళ్ళు మిగిలి ఉన్నాయని, ఆ నీటిని సరఫరా చేసి ఖరీఫ్ సీజన్‌లో వేసిన మిగిలి ఉన్న పంటలను రక్షించాలని రైతులు హైకోర్టులో కేసువేశారు. అయితే అధికారులు మాత్రం తుంగభద్ర డ్యాంలో ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్‌కు కేటాయించిన 8 టిఎంసిల్లో 7 టిఎంసిల నీరు వినియోగించుకున్నామని, ఒక టిఎంసి నీరు మాత్రమే మిగిలి ఉందని ప్రకటిస్తున్నారు. రబీ సీజన్‌లో కూడా లక్ష నాలుగువేల ఎకరాల ఆరుతడి పంటలకు నీటిని సరఫరా చేయాల్సి ఉంది. అయితే తుంగభద్ర డ్యాం క్యాచ్‌మెంట్ ఏరియాలైన ఆగుంబే, మలనాడు, శివమొగ్గ, తీర్థనహళ్ళి, హగరిబొమ్మన హళ్ళి మొదలగు ప్రాంతాల్లో వర్షభావం ఏర్పడింది. ఈ సంవత్సరం తుంగభద్ర డ్యాంకు 60 టిఎంసిల నీళ్లు కూడా రాలేదు. ఉన్న నీటిని కర్నాటక, ఆంధ్ర రాష్ట్రాలకు నీటి పంపకం జరిగింది. రబీ సీజన్‌కు నీరు లేదని అధికారులు ప్రకటించారు. మిగిలిన 1 టిఎంసి నీటిని తాగునీటికి వినియోగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో తుంగభద్ర దిగువ కాలువ కింద ఈ ఏడాది కూడా ఆరుతడి పంటకు నీరు లేక లక్ష నాలుగువేల ఎకరాలు బీడు పడిపోయాయి. గత సంవత్సరం కూడా వర్షాభావంతో డ్యాంలో నీరు లేకపోవడం వల్ల ఆరుతడి పంటలు వేసుకోలేదు. ఇప్పటికి రెండు సంవత్సరాల నుంచి ఆయకట్టు భూములకు నీరు లేక లక్ష ఎకరాలు బీడు భూములుగా మారాయి. ఆరుతడి భూముల రైతులు కళ్ళ ముందే పంటలు పండే భూములు బీడు భూములుగా మారడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. కనీసం వర్షాభావ పంటలు వేసుకుందామంటే కూడా నవంబర్, డిసెంబర్ నెలల్లో రావాల్సినంత వర్షం రాకపోవడం వల్ల వర్షాధార పంటలను కూడా వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుంగభద్ర దిగువ కాలువ కింద ఉన్న ఆయకట్టు రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. లక్ష ఎకరాల్లో ఉన్న ఆయకట్టు రైతులు రెండు సంవత్సరాల నుంచి పంటలు వేసుకోలేని పరిస్థితి ఏర్పడి నష్టాలకు గురయ్యారు. నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. లేని పక్షంలో ఆరుతడి పంట రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని అంటున్నారు. కాగా రెండు సంవత్సరాల నుంచి ఆరుతడి భూములు బీడు భూములుగా మారి పోయి ఉపాధి లేక రైతులు బెంగళూరు, ముంబాయి, హైదరాబాద్, కడప, గుంటూరు, విజయవాడ, మొదలగు ప్రాంతాలకు పొట్ట చేత పట్టుకుని వలస వెళ్తున్నారు. వర్షాభావంతో నీరులేక లక్ష ఎకరాలకు సంబంధించిన రైతులు నష్టాల పాలవుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహాయక చర్యలు చేపట్టేలా ఆరుతడి భూముల రైతుల కష్టాలను ఆయన దృష్టికి తీసుకెళ్లడంలో ఆదోని, మంత్రాలయం, ఆలూరు నియోజకవర్గం టిడిపి నాయకులు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర్‌రెడ్డి పూర్తిగా విఫలం చెందారని రైతులు నాయకుల చర్యలను తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా నాయకులు ముఖ్యమంత్రి దృష్టికి ఆరుతడి భూముల రైతుల సమస్యలను తీసుకెళ్లి వారికి నష్ట పరిహారం అందించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.