లోకాభిరామం

లెక్కల తిక్క.. మరింత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లెక్కలు ఎక్కడికి పోయినయో తెలియదు. జీవితంలోకి సాహిత్యం, కవిత్వం ప్రవేశించాయి. సౌందర్య పిపాస అంతకన్నా ఎక్కువ ప్రవేశించింది. పెయింటింగులు, నిర్మాణాలను పరిశీలించడం ఒక లక్షణంగా నిలబడింది. అందమైన ఫొటోలు తీయడం హాబీగా నిలబడింది.
లెక్కలు బయటికి కనిపించకుండా అని ఒక క్రమం ఉంటుంది. సౌందర్యంలో కూడా ఒక లెక్క ఉంటుంది. అది తిక్క కాదు. అసలు సిసలైన అంకెల మీద ఆధారపడిన లెక్క.
రేడియోలో ఉండగా ఉద్యోగం ప్రకారం నా విభాగం సైన్స్ ప్రసారాలు. కానీ ఊరికే ఉండే మనిషిని కాను కనుక సంగీత విభాగంలో కలుగజేసుకునే వాడిని. అప్పట్లో ఆకాశవాణి వారు అప్పుడప్పుడు సంగీత సాహిత్య కార్యక్రమాలను బయట ఏర్పాటు చేసేవారు. దేశంలోని గొప్ప వారిని పిలిపించి కచేరీలు, కవి సమ్మేళనాలు, సాహిత్య సభలు జరిపించేవారు. ఆ క్రమంలో భాగంగా ప్రసిద్ధ కర్ణాటక వయొలిన్ విద్వాంసులు ప్రొఫెసర్ టి.ఎన్.కృష్ణన్ గారిని గెలిపించాలని ప్రతిపాదించాను. ఆయనగారి చెల్లెలు శ్రీమతి ఎం.రాజంగారు, అంతే ప్రసిద్ధి చెందిన హిందుస్తానీ వయొలిన్ విద్వాంసురాలు. అన్నయ్య చెన్నైలో ఉంటారు. చెల్లెలు వారణాసిలో ఉంటుంది. వారితో సహకారంగా కర్ణాటకానికి మృదంగం, హిందుస్థానీకి తబలా కళాకారులను తగిన వారిని పిలిపించాము. కచేరీ జరగడానికి ముందు ఆ కళాకారులు ఐదు నిమిషాల కన్నా ఎక్కువ కలిసింది లేదు. రేడియో కచేరీలు గంటకన్నా ఎక్కువ ఉండవు. కానీ ఆ రోజు గంటన్నర కచేరీ జరిగింది. కార్యక్రమం ముగిసింది అని చెప్పినా సరే హాలులో ఎవరూ కదలలేదు. అంటే సంగీతం అంత పండింది అని అర్థం. అసలు విషయం ఇప్పుడు చెప్పాలి. సంగీతంతో అంతగా పరిచయం లేని ఒక వ్యక్తి నన్ను ఒక ప్రశ్న అడిగాడు. ఆ కళాకారులు అంతకు ముందు కలిసి రిహార్సల్స్ చేయకపోతే అంత బాగా సమన్వయంతో ఎట్లా వాయించగలిగారు, అని అతని ప్రశ్న. నేను సూటిగా ఒకే మాటతో జవాబిచ్చాను. లెక్కలు అని నేను జవాబిచ్చాను. వివరంగా చెప్పాలంటే మన శాస్ర్తియ సంగీతంలో చక్కని లెక్కలు ఉంటాయి. అవి తెలిసిన వాళ్లకు అవతలి వాళ్ల సంగీతాన్ని అర్థం చేసుకుని సమన్వయంతో వాయించడం ఏ మాత్రం సమస్య కాదు. సౌందర్యం వెనుక లెక్కలు అన్న అంశాన్ని ఇంతకన్నా చక్కని ఉదాహరణ దొరకదు. స్వర పురస్కారాలకు లెక్క ఉంది. లయ నడకలకు లెక్క ఉంది. వేదం చదవడంలోని వర్ణ క్రమం, జట, ఘన అన్న పద్ధతులలో కూడా లెక్కలు ఉన్నాయి. వాటి ఆధారంగానే కాగితాల మీద రాయనవసరం లేకుండా వేద విద్య ఇవ్వాళ్టి వరకు కేవలం వౌఖిక విద్యగా కొనసాగుతున్నది.
సాహిత్యంలోని వివిధ అంశాలను గురించి నిర్వహిస్తూ నండూరి రామకృష్ణమాచార్యుల వారు ఒకప్పుడు ఒక పద్ధతిని వర్ణించారు. పద్యం రాయడం అంటే రైలు నడపడం లాంటిది. వచన కవిత రోడ్డు మీద కారు నడిపించడం లాంటిది. ఇక కథ నవల అన్నది ఆకాశంలో విమానం నడిపించడం లాంటివి, అన్నారు ఆయన. ఇది అందరినీ ఆలోచనలో పడవేసింది. పద్యానికి ఒక నిర్మాణం ఉంటుంది. దాని ప్రకారం మాటలను అనగలిగితే అవసరమైన అందం దానంతట అదే చేకూరుతుంది. కనుక పద్యం రాయడం సులభం అంటారాయన. రాసిన పద్యాన్ని ఆయన మెచ్చుకోవడం గురించి ఇది వరకే ఎక్కడో చెప్పినట్టు ఉన్నాను. ఇప్పుడు అది సందర్భం కాదు. ఇక వచన కవిత రాయడం అంటే దానికి నిర్మాణం ఉంది. లేదనుకుంటే లేదు. కానీ శైలి, శిల్పం పరంగా దానికి ఒక దారి ఉంది. ఆ దారిని వదలకుండా ముందుకు వెళితే కవిత పండుతుంది అని ఆచార్యుల వారి అభిప్రాయం. ఇక వచన రచన అన్న దానికి ఆకాశంలో విమానం లాగా దారి ఉంది అనుకుంటే ఉంది లేదు అనుకుంటే లేదు. కవిత నేల మీద ఉంటుంది. కవిత నేలవిడిచి సాము చేస్తుంది. ఈ పద్ధతిని, నిర్వచనాలను గురించి కవిగారు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చెప్పిన మాటలు నా మనసులో ఇంకా తిరుగుతున్నాయి కానీ, వాటిని నిజంగా ఎంతమంది పట్టించుకునేది నాకు తెలియదు. ఈ సిద్ధాంతం గురించి నిజంగానే చర్చ జరగాలి. వేదంలో ఉండేవి వాక్యాలు. వాటిలోని అక్షర క్రమాన్ని గుర్తుంచుకునేది వర్ణక్రమం. ఆ క్రమం పొల్లు పోవడానికి వీలు లేదు కనుక, రకరకాల పద్ధతులను, గణితాన్ని వాడి గది గట్టిగా గుర్తు ఉండే ప్రయత్నం చేశారు. కనుకనే వేదం యథాతథంగా నిలబడి ఉంది.
సృజనాత్మకంగా మాటలు చెప్పదలచుకున్న వారు కవిత్వాన్ని ఆశ్రయించారు. నిర్మాణం గల మాటలను జ్ఞాపకం పెట్టుకోవడం చాలా సులభం. శ్లోకాలను, పద్యాలను నోటికి నేర్చుకోవడం తెలిసిన విషయమే. అందులోని కిటుకు మాత్రం అందరికీ అర్థం కాలేదు. తమిళంలో అంతాది అని ఒక పద్ధతి ఉంది. మొదటి పద్యం ముగిసిన మాటతో దాని తర్వాతి పద్యం మొదలవుతుంది. పద్యంలో మాటలు గుర్తు ఉన్నట్టే ఈ పద్ధతి వలన పద్యాలు వరుస కూడా గుర్తుంటుంది. ఆ రకంగా మొత్తం కావ్యాలను అప్పజెప్పడం ఎంతో సులభంగా వీలవుతుంది. అదే ఒక చరిత్ర పుస్తకం, లేదా సైన్సు పుస్తకంలోని అంశాలను గుర్తుంచుకుని తిరిగి చెప్పడం అనుకున్నంత సులభం కాదు. కవిత్వానికి నిర్మాణం అంటే అందులో మళ్లీ లెక్కలు ఉంటాయి. సంస్కృతం, తెలుగులోనే కవిత్వం ఛందస్సు ఉంటుంది. య మా తా రా జ భా న స అక్షరాలను గుర్తుంచుకుంటే ఆయా అక్షరాలు పేరుతో వచ్చే గణాల నిర్మాణం కూడా గుర్తుంటుంది. యమాతా అంటే యగణం. అందులో ఒక పొట్టి అక్షరం, తరువాత రెండు పొడిగా అక్షరాలు ఉంటాయి. మిగతా అన్ని గణాలు అదే పద్ధతిలో సాగుతాయి. అంటే మరి మన కవిత్వం నిండా తిక్కలేని లెక్క ఉన్నట్టే కదా.
శార్దూలం, ఉత్పలమాల వంటి వృత్తాలతోబాటు ఆటవెలది, తేటగీతి, కందం లాంటి నిర్మాణాలు కూడా ఛందస్సులో ఉన్నాయి. ఇవి కాక మాత్రా ఛందస్సు అని మరొకటి ఉంది. అందులో గణాలు ఉండవు. కానీ మొత్తం విరుసలో ఒక లయ ఉంటుంది. ఆ లయ వల్ల రచన సులభంగా ఉంటుంది. పాటలలో కూడా ఇదే పద్ధతి కారణంగా లిరిక్స్ అనే మాటలు గుర్తుంటాయి. అంటే వీటన్నింటిలో కూడా సంగీతంలో లాగే తిస్రం, చతురస్రం, ఖండం, మిశ్రం లాంటి నిర్మాణాలు ఉంటాయి. అప్పుడే పాట ఒక వరుసకు ఒగ్గుతుంది. లెక్క ఒక్క చుక్క తప్పినా అందరికీ అర్థం అవుతుంది. అంటే పద్యమే కాదు పాట కూడా తిక్కలేని లెక్కలకు ఉదాహరణ అని ఘంటాపథంగా చెప్పవచ్చు.
లయ అంటే లెక్కలు. ఈ ప్రపంచంలోని ప్రతి పనిలోనూ లయ ఉంటుంది. కనుక ప్రతి పనిలోనూ లెక్కలు ఉంటాయి. ఫ్యాన్ తిరుగుతుంది. నిజానికి అది యంత్రం. గడియారం తిరుగుతుంది. అది కూడా ఒక యంత్రం. గడియారం తిరగడంలో కావాలని లయ ఏర్పాటు చేస్తారు. అది కాలాన్ని లెక్కించడానికి సాయం చేస్తుంది. ఫ్యాన్ గుండ్రంగా తిరుగుతున్నప్పుడు అందులో లయ అవసరం లేదు. అది వరుసబెట్టి ఒకే రకంగా రొద చేస్తూ తిరిగితే చాలు. ఫ్యాన్‌కు మూడు రెక్కలు ఉంటాయి. చాలా పరీక్షించి వాటిని ఒక పద్ధతిగా మ్యాచ్ చేసాము అని రాస్తారు. కానీ నిజానికి వాటిలో తేడాలు ఉంటాయి. కనుకనే ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు రొదగా రావలసిన చప్పుడు లయగా వస్తుంది. కొన్ని గడియారాలు టిక్‌టిక్ మనకుండా ఆగడం అన్న పద్ధతి లేకుండా వరుసబెట్టి తిరుగుతాయి. ఇటువంటి అంశాలను మామూలుగా ఎవరూ గమనించరు.
లెక్క, తిక్క తలకెక్కిన నాలాంటి వాళ్లకు ఇటువంటి సంగతులు తప్ప మామూలు విషయాలు మనసుకు ఎక్కవు. వచన కవిత్వంలో ఒకప్పుడు సర్రియలిజం అని ఒక పద్ధతి వచ్చింది. అధివాస్తవికత అంటే వాస్తవానికి కొంచెం అటు లేదా ఇటు ఉంటుందని అర్థం. జలసూత్రం రుక్మిణీనాథ శాస్ర్తీ అని ఒక పెద్దాయన ఉండేవారు. అయన తన పేరును జరుక్ శాస్ర్తీ అని రాసుకునేవారు. అది సర్రియలిజం. తెలుగులో దాన్ని స్వగోలజం అన్నారు. జరుక్ శాస్ర్తీ జంభక్, మిణీ శాస్ర్తీ హంబక్, లతాంతార్ద్ర రాగంబు లంబాడి లంగా, అని ఒక కవిత చదివినట్టు గుర్తు. ఇది అధివాస్తవికత. కొంత తిక్క ఉంది గానీ, దాని వెనుక లెక్క కూడా ఉంది కదా. కవితలో చక్కని లయ ఉంది కదా. అదన్నమాట లెక్కలు గొప్పతనం. ఇప్పుడు నేను మళ్లీ వెళ్లి ఆహరోనీ పుస్తకాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఇటువంటి విషయం మరొకటి చెప్పుకునే దాకా మీరు తిక్కను లాగే మీరు కూడా వాటిని పది మంది తల మీద రుద్దడానికి ప్రయత్నించండి. నాకు ఎప్పటికప్పుడు ఒక ఆలోచన వస్తుంది. నేను చేసిన ప్రతి రచన మొదట్లో లేదా చివరలో ఒక క్షమాపణ రాయాలని ఉంటుంది. లేదంటే మీకంతా ఎందుకొచ్చిన గొడవ. నేను రాసిన ఈ అక్షరాలను ఎందుకని చదువుతున్నారు? బహుశా నా తిక్కకు ఒక లెక్క ఉంది కనుక చదువుతున్నారేమో? ఎక్కడన్నా ఆపాలి కదా? కనుక ఇక్కడ ఆపితే సరి...

-కె.బి.గోపాలం