లోకాభిరామం

మరోసారి మలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలుపు వచ్చిందా చెప్పండి. మీరు వచ్చిందంటే నేనూ సరే అంటాను. అరవయి ఆరు సంవత్సరాలు గడిచినాయి. అందులో కొంతకాలం మలుపుల గురించి తెలియనే లేదు. తెలిసిన తరువాత తేడా తెలియలేదు. గోళ్లు గిల్లుకుంటూ కూచున్నా సరే, రోజూ గడిచిపోతుంది. చూస్తుండగానే వయసు పెరిగిపోతుంది. నిన్నటిరోజు మళ్లా రాదు. కన్నుమూసి తెరిచేలోగా ఆ క్షణం గడిచిపోతుంది. అందుకనే చేయవలసినదేదో సకాలంలో చేయాలి. లేకుంటే దానికి అర్థమే ఉండకపోవచ్చు. కనుకనే ఓపిక లేకున్నా రాస్తున్నాను. తప్పదు కదా..
ఎందుకు తప్పదు అని ఎవరైనా అడగండి. మీరు ఒక చోట, నేను మరొక చోట. అడిగినా వినిపించదు. ప్రశ్న పుట్టాలే గానీ దాని ప్రభావం ఉండి తీరుతుంది. అమెజాన్ అడవులలో సీతాకోకచిలుక రెక్కలు అల్లల్లాడిస్తే ఇటు ప్రక్కన ప్రపంచంలో తుఫాను వస్తుందట తెలుసా.. పక్కకు వచ్చేశాం అప్పుడే. అది నా జన్మ లక్షణం లాగుంది. ఏది.. శాఖా చంక్రమణము అను కెమ్మలు దూకుడు..
ఇంతకూ మన విషయం ఏమిటి ఇవాళ.. కాలం గురించి కదూ..
ప్రశ్న గురించి మరోసారి తలచుకుంటే, మరో ప్రశ్న పుడుతుంది. ఇంతకూ ఈ కాలం ఎందుకని తన మానాన తాను గడిచిపోతుంది? కాలం కొలతలకు నిలవదంటున్నారు. అంతా భ్రమ అంటున్నారు. సమయం ఇక్కడ ఉండి మరోచోటికి కదలదు కదూ. అని ఈ సంగతి గురించి ఆలోచిస్తూ గంటలు గడపొచ్చు! ఇంతకూ కాలం ఎట్లా కదులుతుంది. ఎక్కడికి పోతుంది? కదిలే ప్రతి అంశానికి గమ్యం ఉండాలి గదా? కాలానికి గమ్యం ఏది?
ఈ ప్రశ్న అడిగామంటే కాలం కదులుతుందని మనం నమ్మినట్లేకదా? అది కదిలితే దానికొక వేగం ఉంటుంది. గడియారం సంగతేమిటని అడుగుతారు కదూ? అది మనం చెప్పిన లెక్క ప్రకారం కాలాన్ని కొలత వేయడానికి ప్రయత్నం మాత్రం చేస్తుంది. ఏ రెండు గడియారాలూ ఒకే సమయం చెప్పవు. అన్నీ తప్పుడు సమయం చూపించేవే అన్నా తప్పులేదు. టైమ్ చెప్పేలోగా ఆ క్షణం దాటిపోతుంది మరి.
గడియారం వేసే లెక్క మనకు తెలిసిన కొన్ని సంగతుల గురించి మాత్రమే. ఇప్పుడు చూస్తే ఒక టైము. నాలుగు క్షణాల తరువాత మరొక టైము. ఆ మధ్యకాలం గురించి మాత్రమే చెప్పగలదు గడియారం. ఆ రెండు క్షణాల మధ్యకాలంలో ఈ ప్రపంచంలోని సంగతుల వేగం మారిందనుకోండి. కనీసం మన ఆలోచనల వేగం మారవచ్చు కదా. మారిపోక తప్పదు. ఎందుకని మనం గడియారాన్ని తిరిగి తిరిగి చూస్తున్నామని ఒక కారణం ఉంటుంది. దాన్నిబట్టి ఆ క్షణాల పరిధి పెరగవచ్చు. తరగనూవచ్చు. ఈ ప్రపంచంలో ఉదయాస్తమానాలూ, మనిషికీ, మిగతా జీవులకూ, శరీరానికి వయసు పెరిగే లక్షణం మొదలయినవి లేవనుకుంటే కాలం ప్రభావం తెలుస్తుందా?
ప్రపంచంలో మరెన్నో విషయాలు మనకు కాలం గురించి చెపుతాయి. అది కదిలిందన్న భావాన్ని కలిగిస్తాయి. రుతువులు, వాటి ప్రభావాలు అందులో ముఖ్యమైనవి. ఇవేవీ లేకుంటే కాలం కదలిక తెలుస్తుందా, ఏమో ఆ అనుభవం గురించి ఆలోచనే రాలేదు. ఇప్పటివరకూ అంటే చేయగలిగింది లేదు. విశ్వంలో ఏమీ లేదనుకుందాం. ఇక కదలిక ఎక్కడిది. ప్రపంచమంతా ఈ కదలిక మీదనే ఆధారపడిందంటే ఆశ్చర్యం కదూ?
భౌతికశాస్తమ్రంతా కదలిక గురించేనని ఎప్పుడైనా అనిపించిందా? ఆలోచించండి!
కదలికే బ్రతుకు. కదలికే దానికి అంతం.. మొదలూ కూడా. అందుకే అంతా సంతోషంగా ఉంటే కాలం పరుగెట్టిపోతుంది. నిజంగా కాలం దాని కదలిక లేదంటే, బతుకు ఎంత సంతోషంగా గడిచినా తేడా తెలియదేమో?
ఒక సముద్రం ఉంది. అందులో ఒక చేప ఉంది. అక్కడ చేపలు, మిగతా జంతువులు చాలా ఉన్నాయి. వాటి సంగతి మనకు అవసరం లేదు. కథ ఈ చేప గురించి. అది కనిపించిన జంతువులన్నింటినీ ‘పెద్ద సముద్రం ఏదో ఉందట. అది ఎక్కడుంది?’ అని అడుగుతూ ఉంటుంది. మిగతా జంతువులు నవ్వగలుగుతాయేమో తెలియదు గానీ, పక్కకు తప్పుకుని వెళ్లిపోయేవట. కథ చిన్నదే. కానీ గొప్పది. ఇందులో ఆలోచించడానికి బోలెడు వ్యవహారం ఉంది. మనమందరమూ ఆ చేపలాగే బతుకుతున్నామేమో?
పసిపాపను చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది గదూ? ఎంత ఆశ్చర్యమంటే అంత ఆశ్చర్యం! కానీ మనం మనలను చూచి, కనీసం పక్క మనిషిని చూసి ఎప్పుడయినా ఆశ్చర్యపడ్డామా? లేదు కదూ? ఎందుకని ఆలోచించగలరా? ప్రతి మనిషి ఒకప్పుడు పసిబిడ్డే గదా? పసిబిడ్డ ఆశ్చర్యమయితే పెరిగిన మనిషి ఎందుకు వింతగా కనిపించడంలేదు? ఒకటే కారణం. మనకు కొన్ని సంగతులు అలవాటయిపోతాయి. వాటిని గురించి ఆలోచన అవసరం లేదనుకుంటాము. మనుషులను చూడడం అలవాటయిపోయింది. మనిషిలో వింత లేదనిపిస్తుంది.
ఇలాంటివి ఇంకా ఎన్నో సంగతులు ఉంటాయి. ఒక వస్తువును కింద పడేస్తాము. కంచం పడిందనుకుంటాము. అది కింద పడుతుంది. ఎందుకనో ఆలోచించామా ఎప్పుడయినా? కంచం గాలిలోనే ఎందుకు నిలవలేదు? పైకి ఎందుకు ఎగిరిపోలేదు? అట్లా జరిగి ఉండవచ్చు గదా? ఎందుకని కంచం కింద పడింది? భూమికి ఆకర్షణ ఉందని ఎవరో అనగా విన్నట్టున్నాము కదూ? ఏమిటా ఆకర్షణ? కంచం నుంచి నేలకు తాళ్లేవీ లేవు గదా? సంబంధం లేని వస్తువులను భూమి ఎట్లా తన వేపు లాక్కుంటుంది? ఈ రకం ప్రశ్న ప్రతిసారీ అడగము మనం. ఎందుకంటే వస్తువులు కిందపడడం మనకి అలవాటయిపోయింది గనుక. అందులో ఆశ్చర్యం మనకు కనిపించదు. ప్రశ్నలు అడగడం చేతనయితే ఎన్ని అడిగినా అంతుండదు. మా ఇంట్లో ఒక మాటా మళ్లా మళ్లా వినిబడుతుంటుంది. ఆశ్చర్యపడదలుచుకుంటే ఈ ప్రపంచంలో ఎన్నయినా విషయాలున్నాయని!
ప్రతి మామూలు విషయంలోనూ ప్రశ్నలు దాగి ఉన్నాయి. అడగడం చేతగావాలి. అంతే. పిల్లలకు ప్రశ్నలడగడంలో అనుమానాలుండవు. ఉండగూడదు కూడా. అనుమానం రావడమే గొప్ప. దాన్ని గురించి తరచి అడగకుండా సమాధానం ఎందుకు ఎక్కడనుంచి వస్తుంది? ప్రశ్నకు జవాబు అందితే అందులోనుంచి మరెన్నో ప్రశ్నలు పుట్టుకువస్తాయి. ఎందుకు అన్న ప్రశ్నకు జవాబు కష్టమని మరో అనుభవం.
మనమంతా ఒకప్పుడు పిల్లలమే అన్న సంగతి మరిచి అంతా తెలుసన్న భావంతో, ప్రశ్నలడగడం మరిచిపోయాము గదూ? మనలో ఇంకా ఆ పసిబిడ్డ ఉండి ప్రశ్నలగడగలగాలి. మనం అలవాటయిపోయిన ప్రపంచంలోనుంచి తప్పించుకుని కొంచెం సేపు పిల్లలుగా బతకగలగాలి. సముద్రంలో చేప సముద్రాన్ని గమనించలేకపోయింది. మనం కనీసం మన ప్రపంచాన్ని గమనించగలగాలి.
కాలం కదిలితే సంవత్సరాలు మారతాయి. మరి మనం కదలకుండా ఉన్నా సరే సంవత్సరాలు మారతాయి. మనం కదిలితే ప్రయాణం. మనసు కదిలితే ప్రయాణం. ఉందో లేదో తెలియని చోటికి ప్రయాణం- అంతులేని ప్రయాణం. బతుకే ఒక ప్రయాణం. యాత్రా చరిత్రలున్నాయి. మనసు నడిచిన మార్గాల కథలున్నాయి. కారులో షికారు కథలున్నాయి.
ప్రయాణం అంటే నిజానికి ఆ తతంగమే. బయలుదేరడమూ, గమ్యం చేరడమూ ఉంటాయి గానీ, నిజానికి ప్రయాణమనే తతంగం మధ్యలో జరుగుతుంది. ఈ తతంగం లేని ప్రయాణం ఎందుకు? అసలు దాన్ని ప్రయాణం అనవచ్చా, గమ్యంకన్నా అటువేపు కదలిక ముఖ్యం. అది అనుకున్నట్టు జరుగుతుంటే, గమ్యం వచ్చినా గుర్తించలేనంత బాగుంటుంది. గుర్తించక అదేపనిగా ముందుకు నడిచిన బాటసారులెందరో ఉన్నారు. ఇంటికని బయలుదేరి, ఇల్లు దాటి, పల్లెదాటి ముందుకు పోయిన ప్రయాణం నిజంగా బాగున్నట్టు లెక్క గదా!
మనకు ప్రయాణం భావన అలవాటయింది. ఆలోచించకుండా, ఆ పనేదో మరెవరో చేసి పెడుతుంటే బతుకు వెళ్లమార్చడం అలవాటయింది. ఇంతకూ ప్రయాణం అంటే ఏమిటి చెప్పండి చూద్దాం! ఇందాకటినుంచీ చదువుతూనే ఉన్నారు గదా! ఏం చదువుతున్నారు? కాలం కదిలిందా? ఇంతసేపూ మీరు కదిలారా? మనసు కదిలిందా? ఏ రకం ప్రయాణం జరిగింది? ఏది బాగుంది? ఆలోచించారా? లేదు కదూ!!
అంతా బుద్ధిమంతులయిన బాలలు! ప్రయాణం ముఖ్యం కాదు. తతంగం ముఖ్యమంటే అవునంటారు. మరి గమ్యం సంగతేమిటి? అది అవసరమా కాదా? చదువుకోవాలి! సంపాయించాలి! పిల్లలను కనాలి! వాళ్లను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి! మరో లెవెల్లో ఆలోచిస్తే, వంట చేసుకోవాలి. అన్నం తినాలి. నిద్రపోవాలి మళ్లా లేవాలి
ఇవన్నీ ప్రయాణాలా? గమ్యాలా? లేక ప్రయాణమన్నదాని తతంగమా? బతుకు ప్రయాణమయితే అందులో గమ్యమేది? తతంగమేమిటి?
తతంగం లేకుండా బతుకు గడిచేట్టుంటే బాగుండునని ఎప్పుడయినా అనిపించిందా? తెల్లవారేకల్లా పిల్లలు పెద్దవాళ్లయి ఎదురయితే ఎంత బాగుంటుంది? బాగుంటుందా? లేక వారిని తీర్చిదిద్దలేదన్న లోటు తోస్తుందా? మీకు ప్రయాణం, గమ్యం రెండూ కావాలా? లేక గమ్యం ఒకటీ అందితే చాలా?
నిజానికి అనుకున్నది ఒక్కటయితే అయ్యింది ఒక్కటన్న బతుకులే ఎక్కువ. ఎక్కడని బయలుదేరిందీ గుర్తుండదు. ఎక్కడికి చేరిందీ అర్థం కాదు. మన చేతుల్లో ఏ నిర్ణయమూ ఉండదు. గమ్యం చేరినవారి సంగతి మరొక రకంగా ఉంటుంది. అక్కడికి చేరిన తరువాత అర్థమవుతుంది. చేరదలుచుకున్నది ఆ గమ్యం కాదనీ. కానీ ప్రయాణం పేరున జరిగిన తతంగం మాత్రం భలే అనుభవంగా నిలిచిపోతుంది. పోనీ, మళ్లా బయలుదేరి కొత్తదారి పడితే పోయింది గదా అన్న ఆలోచన కలిగితే అంతకన్నా కావలసింది మరొకటి ఉందా?
తతంగం సాగుతుంటే మనకు చేతనయిన సంగతులూ, చేతగానివీ అర్థమవుతాయి. కొత్త అనుభవాలు కొత్త గమ్యాలగురించి చెపుతాయి. చివరికి గమ్యం కాదు ప్రాణమే ముఖ్యమనే చోటికి చేరుకుంటాం. అదీ ఒక గమ్యమేనా?
ఆలోచించండి! ఏం కావాలి? ప్రయాణమా? గమ్యమా? తతంగమా? తికమక అవసరం లేదు. ఆలోచిస్తే అంతా తెలుస్తుంది.
మళ్లీ ఒకసారి ప్రశ్న. మలుపు వచ్చిందా? వచ్చిందని అనుకుందాం. లేకుంటే మిగతా ప్రపంచం మనల్ని వింతగా చూస్తుందేమో? ఈ ప్రపంచంలో ఎవరికీ ఎప్పుడూ మలుపు వస్తుందో చెప్పడం చాలా కష్టంగా ఉండేటట్లు ఉంది. నాకు బతుకులో పెద్ద మలుపులు కనిపించడం మానేశాయి. బహుశా నేను వాటిని చూడడం మానేశాను. చాలా పనులు గానుగెద్దులాగా చేసుకుపోతున్నాను. ఆ భావనం నాకే కలుగుతున్నది. కనుక ఏదో మార్పు కావాలి. కనుక మలుపు కావాలి. మలుపు దారిలో ఉంటే సరిపోదు. మలుపు అంటే మార్పు. ఆ మార్పు నాలో ఉండాలి. మారిన దారిలో నడుస్తున్న అనుభవాలు మాత్రం పాతగానే ఉంటే అందులో గొప్ప ఏమీ లేదు. నేరుగా నడుస్తున్నా సరే నా అడుగులలో తేడా ఉండాలి. ఆలోచనలలో తేడా ఉండాలి. అవగాహనలో తేడా ఉండాలి. అందరితో కలిసి బతకడంలో కూడా ఎక్కడో తేడా ఉండాలి. అప్పుడు నిజంగా మలుపు వచ్చినా రాకున్నా కొత్తదనం కనిపిస్తుంది. మనిషి పుట్టిననాటినుంచి ఇవాళ్టివరకు కొత్తదనం వెతుకుతూ ముందుకు సాగుతున్నాడు. మనిషి పుట్టాడా? ఒక మనిషి ఒక రోజు పుట్టినందుకు మనిషి జాతి పుట్టిందా? నేను గత సంవత్సరం అంతా మనిషి గురించి ఆలోచనలతోనే గడుపుతున్నాను. మనిషి గురించి, పరిణామం గురించి కొత్త దృష్టితో పుస్తకాలు వస్తున్నాయి. వాటిని చదువుతున్నాను. నా ఆలోచనలు నాకు ఉన్నాయి. అన్నీ కలిపి రాసే ప్రయత్నంలో ఉన్నాను. కనుక మలుపు వచ్చింది అనుకుంటాను. కొత్త పని మొదలుపెడతాను. అందరూ ఆశీర్వదిస్తే కొంతకాలానికి ఆ విషయాలు మీతో పంచుకుంటాను.

-కె.బి.గోపాలం