లోకాభిరామం

వైద్యం - విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-రాతి మీద కాలి గుర్తులా? ఎంత బాగుంది! ఎంత వింతగ ఉంది! అన్నాడట ఎడ్వర్డ్ హిచ్‌కాక్. ఈయన సినిమాల మనిషి కాడు. అతను వేరు. పేరు ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్.
* * *
తిరుపతి నుంచి మనుమరాలు వచ్చింది. ఆమె మా అన్నయ్యగారి మనమరాలు. వాళ్ల అమ్మగారి పెళ్లి నేను పక్కనే ఉండి చేయించాను. అంటే అన్నయ్యకు సాయంగా అన్నమాట. కవలలలో ఒకరైన ఈ పాప పుట్టినప్పుడు ఊయల పండుగ నేనే పక్కనే ఉండి చేయించాను. అన్నయ్య ఉద్యోగం కారణంగా ఆ పండుగకు రాలేక పోయి నాకు బాధ్యత అప్పగించాడు. ఇప్పుడు ఆ పాప ఎంబిబిఎస్ పరీక్షలు పూర్తి చేసుకుని తరువాత చదువుల ప్రయత్నంలో భాగంగా పట్నం వచ్చింది. మా ఆవిడగారు డాక్టర్. నా కూతురు డాక్టర్. ఇప్పుడు నా మనమరాలు డాక్టర్. బంధువులలో మరి కొందరు కూడా వైద్యులు ఉన్నారు. మొన్న ఒకసారి పాలమూరు వెళ్లే ప్రయత్నంగా దారిలో ఉంటే చాదర్‌ఘాట్ ప్రాంతం నుంచి చూస్తే అటు వేపు తెల్లని గుంబద్‌లు అంటే గోపురాలు కనిపించాయి. క్షణం పాటు అవి ఏమిటో అర్థం కాలేదు. ఆ తరువాత దారిలో ఉస్మానియా ఆసుపత్రి కనిపించింది. పట్నంలో వైద్యం చదువు గురించి ఒకచోట చదివిన అంశాలను కళ్ల ముందు సినిమా లాగా తిరుగసాగాయి. హైదరాబాద్‌లో ఉన్న ఉస్మానియా మెడికల్ కాలేజీ, అలాగే గాంధీ మెడికల్ కాలేజీ చాలా పేరున్న సంస్థలు. నా కూతురు ఉస్మానియా, మా ఆవిడ గాంధీలో చదువుకున్నారు. ఈ సంస్థల చరిత్రను ఒకసారి చూద్దాం అనుకుంటే ఉస్మానియా గురించి ఎన్నో విచిత్రమైన విషయాలు ముందు కనపడ్డాయి. నిజానికి తరాలుగా హైదరాబాద్‌లో రకరకాల వైద్య విద్య కొనసాగింది. చాదర్‌ఘాట్ నుంచి అఫ్జల్‌గంజ్ వైపు వెళుతూ వుంటే, ఎడమ పక్కన దారుల్‌షిఫా అనే ఒక ప్రాంతం వస్తుంది. అది వైద్య సంస్థ అన్న సంగతి ఎవరికీ గుర్తు రాదు. అది ఒకనాటి ఆసుపత్రి. అక్కడ నిజాం బంధువర్గం వారంతా వైద్యం చేయించుకునేవారు. ఈ సంగతి మొదట్లో నాకు కూడా తెలియదు. దార్ అన్న మాటకు ఒక ఇల్లు ఒక స్థలం అని అర్థం అని తెలుసు. షిఫా అన్న మాటకు చికిత్స అని అర్థమట. ఈ సంగతి తరువాత ఎప్పుడో తెలిసింది.
1842 ప్రాంతంలో హైదరాబాద్‌లో ఆధునిక వైద్య విద్య మొదలైంది. గన్‌ఫౌండ్రీ అనే చోట మొదటి వైద్య బోధనాలయం ఏర్పడింది. అప్పటికే అది ఉస్మానియా కాలేజీ కాదు. ఆ కాలేజీలో పట్టుమని పది మంది కూడా విద్యార్థులు ఉండేవారు కాదు. వారికి చదువు ఉరుదూ భాషలో జరిగేది. ఈ కాలంలో పై చదువులు మొత్తం ఇంగ్లీషులోనే సాగాలి అన్న వాదన వింటుంటే నాకు ఇటువంటి విషయాలు గుర్తొస్తాయి. ఉస్మానియా యూనివర్సిటీ మొదలైనప్పుడు కూడా అక్కడ చదువులు ఉరుదూలో సాగినవి అంటే ఇప్పటి వారికి ఆశ్చర్యం కలుగుతుంది ఏమో?
మెడికల్ కాలేజీ ప్రారంభం వెనుక ఒక విచిత్రమైన కథ ఉంది. ఆసఫ్ జాహీ వంశంలో నాలుగవ నిజాం నవాబ్ నజీర్ ఉద్దౌలా గారికి అర్థంకాని ఒక అనారోగ్యం మొదలైంది. హకీములు అనే సంప్రదాయ వైద్యులు చాలామంది ఉండేవారు. వారంతా ప్రభువులకు వైద్యం చేయాలని ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. బ్రిటిష్ రెసిడెంట్‌గా అప్పటికి ఫ్రేజర్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ప్రభువుకు చాలా సన్నిహితుడు. ఆయన నిజామ్ గారిని చూడడానికి ఒక వైద్యుడిని పంపడానికి అనుమతి కావాలని అడిగాడు. నిజాంకు అది ఇష్టం లేదు. మైత్రి కొద్ది ఒప్పుకున్నాడు కానీ, వచ్చిన పెద్ద మనిషి తనకు ఎటువంటి మందు ఇవ్వకూడదని ముందే నిర్ణయించాడు. ఇంగ్లీష్ మందులు తినడం ఆచారానికి వ్యతిరేకం. మొత్తానికి ఒక వైద్యుడు వచ్చాడు. ఎన్నో ప్రశ్నలు అడిగాడు. కొన్ని పరీక్షలు కూడా చేశాడు. మందు ఇవ్వడానికి మాత్రం లేదు. కనుక ప్రభువుల వారి తిండి విషయంగా ఆ వైద్యుడు కొన్ని మార్పులు సూచించాడు.
జీవన విధానంలో కూడా ఏవో కొన్ని మార్పులు చెప్పినట్టు ఉన్నాడు. మందులు ఇవ్వనందుకు నిజాం ప్రభువు పద్ధతులను సులభంగానే పాటించాడు. మూడు మాసాలు గడిచాయి. ఆయన ఆరోగ్యం ఎంతో బాగుపడింది. బహుశా ఆ పెద్ద మనిషి షుగర్ వ్యాధితో బాధపడి ఉంటాడని చాలామందికి అర్థమై ఉంటుంది. వైద్యుడు కేవలం తిండిలో మార్పులు సూచించాడు. దాన్ని పడమటి వైద్యంగా స్వీకరించి ప్రభువు ఎంతో సంతోషించి ఆ చదువును ఇక్కడి వారికి కూడా చెప్పించాలి అనుకున్నాడు. ఫర్మాన్ అనే రాజశాసనం విడుదల చేశాడు. గన్‌ఫౌండ్రీలో హైదరాబాద్‌లోని మొదటి వైద్య బోధన సంస్థ ప్రారంభమైంది. నిజానికి అదే తరువాత ఉస్మానియా మెడికల్ కాలేజీగా మారింది. ఆ విద్యాసంస్థ మరొక చోటికి మారింది. గన్‌ఫౌండ్రీకి పక్కనే తరువాతి కాలంలో గాంధీ మెడికల్ కాలేజీ నడిచింది. కానీ ఆ మార్పులు జరిగేలోగా ఎన్నో చిత్రవిచిత్రాలు జరిగాయి.
మెక్లీన్ అనే వైద్యుడు నిజాంగారి డయాబెటిస్ తగ్గించాడు. కనుక కొత్త మెడికల్ స్కూల్‌కి ఆయనే అధిపతి. వెంటనే అతను నెలకు 30 రూపాయల బాడుగతో వసతి తీసుకున్నాడు. ఒకరిద్దరు సహాయకులను కూడా నియమించుకున్నాడు. ప్రభువుల భాష తనకు రాదు కనుక ఒక దుబాసీని కూడా పెట్టుకున్నాడు. అంతా బాగానే ఉంది. కానీ ఆ సంస్థలో చదువుకోవడానికి ఎవరు రావాలి? అది ప్రశ్న! అష్టకష్టాలు పడ్డ మీదట ఒక నలుగురు వచ్చి చేరారు. కానీ ఆ నలుగురితో కోర్సు నడిపిచడం కష్టం అని తెలిసింది. ఇప్పట్లో అటు ఇంజనీరింగ్‌లోను ఇటు వైద్యంలోనూ చేరడానికి ముందు నుంచే బడి పిల్లలంతా పథకాలు వేసుకుని ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్లందరికీ లోకాభిరామంలో నేను రాస్తున్న ఈ నాలుగు సంగతులు ఎవరైనా చదివి వినిపిస్తే బాగుంటుంది. మొదటి వైద్య బోధన సంస్థలో విద్యార్థుల కోసం ఏకంగా ప్రభువు ప్రయత్నించాల్సి వచ్చింది. మరేదో చదువుకుంటున్న తెలివిగల పిల్లలలో నుంచి నిజాం ప్రభువు ఒక పది మందిని ఎంపిక చేశాడు. వారందరినీ వైద్యం చదవాలని పంపించాడు. మరి వారికి ఉండవలసిన అర్హతలు ఏమిటి? 25కన్నా తక్కువ వయసు ఉంటే చాలు. మర్యాద తెలిసిన కుటుంబం వారై ఉండాలి. చదివినంత కాలం ఖర్చులు భరించగలిగే ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఏమీ అడగలేదు. సరే అని పిల్లలు అంగీకరించారు. ప్రభువు సంతోషించి వారికి తలకొక కత్తి, రాసుకోవడానికి కలము, కాగితాలు మొదలైనవి కానుకలుగా ఇచ్చి వైద్య విద్యార్థులు అన్న గుర్తింపును కూడా ఇచ్చాడు. చిత్రంగా మొదటి జట్టులో నుంచే ముగ్గురు పిల్లలు జారిపోయారు. అస్తిపంజరం తెచ్చి ఎదురుగా నిలబెడితే భయపడి వాళ్లు మూర్ఛపోయారు. మరునాడు రమ్మంటే రాము పొమ్మన్నారు. చదువుల పరిస్థితి అట్లా ఉండేది అప్పట్లో. డాక్టర్ మెక్లీన్ ఆసుపత్రికి కూడా ఉన్నతాధికారి. అన్ని రకాల తగిన అర్హతలుగల మనిషి. ఎడింబరోలో ఎం.డి. చదువుకుని వచ్చాడు. మద్రాసులో వైద్య విభాగానికి అధిపతిగా పని చేశాడు. కలరా గురించి ఎంతో పరిశోధించాడు. చివరకు హైదరాబాద్ రెసిడెన్సీలో వచ్చి చేరాడు. ఆయనకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి బాగానే ఉంది. కానీ అనుకున్న పని అంత సులభంగా జరుగుతుందా? స్థానిక విద్యార్థులకు ఇంగ్లీష్ రాదు. అసలే పాఠ్య పుస్తకాలు కరువు. కనుక దుబాసీ పాఠాలను ఉర్దూలోకి తర్జుమా చేసి ఎప్పటికప్పుడు అందించాడట. చదువు కొనసాగింది. ఏడు సంవత్సరాల తర్వాత పది మంది విద్యార్థులు బయటికి వచ్చారు. వాళ్లకు హకీం అన్న పట్టా దొరికింది. 1854లో మరింత మందికి కూడా ఈ గౌరవం దొరికింది. మొత్తానికి పడమటి వైద్యం తెలిసిన వాళ్లు ప్రభుత్వం అందుబాటులోకి వచ్చారు. సర్ సాలార్‌జంగ్ లాంటి వారు ఈ కొత్త వైద్యులను రకరకాల చోట్ల పనిలో పెట్టారు. చిత్రంగా అప్పట్లోనే ఇద్దరు ముగ్గురు ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా పెట్టుకున్నారు.
డాక్టర్ మెక్లీన్ తరువాత డాక్టర్ స్మిత్ వైద్యాధికారిగా వచ్చాడు. విద్యార్థులకు అనాటమీ, ఫిజియాలజీ, సర్జరీ మొదలైనవి కూడా వివరంగా చెప్పాలనే అతను నిర్ణయించాడు. క్లాసులు మాత్రం ఉర్దూ భాషలోనే కొనసాగాయి. ఆశ్చర్యంగా అప్పట్లోనే ఒక వైద్య పత్రిక కూడా మొదలైంది. 300 కాపీలు అచ్చు చేసి కలకత్తా, మద్రాసు లాంటి చోట్లకు కూడా పంపేవారట. పత్రిక చేయడానికి కావలసిన ఖర్చును కూడా సాలార్జంగ్‌తో పాటు ప్రధానమంత్రి హోదాలో ఉన్న ముక్తార్ వంటి వారు ఇచ్చేవారట. డాక్టర్ స్మిత్ ఒక ఆసుపత్రిని కూడా ప్రారంభించాడు. అది మూసీ నది పక్కన వెలిసింది. అప్పటి ప్రభువు అఫ్జల్ ఉద్దౌలా పేరున దానికి అఫ్జల్‌గంజ్ ఆసుపత్రి అని పేరు పెట్టారు అదే ప్రస్తుతపు ఉస్మానియా ఆసుపత్రి అని అందరికీ అర్థం అయి ఉంటుంది. ఇనే్నళ్ల తరువాత ఆసుపత్రిని మెరుగుపరచాలని కొన్ని ప్రతిపాదనలు వచ్చినట్టు విన్నాము. కానీ ఆ పని జరగలేదని కూడా తెలిసింది. అది చరిత్ర గల ఆసుపత్రి. ఎనె్నన్నో సంఘటనలను చూచింది. నగరంలో వరద వచ్చినప్పుడు చాలామంది ఆసుపత్రి ఆవరణలోని చెట్టు మీద ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారట. చెట్టు ఇంకా ఉందట. వందేళ్లో మరెంతో అయ్యిందని మిత్రులు కొంత మంది మళ్లా ఆ చెట్టు కిందకు వెళ్లి జ్ఞాపకాలు నెమరు వేసుకుని వచ్చినట్టు తెలుసు. అవి తమ జ్ఞాపకాలు రావు. గతం గుర్తులు. ఆసుపత్రిని మరమ్మతు మరొకటి చేయాలంటే ఇటువంటి చరిత్ర చెదిరిపోతుంది. అందుకేనేమో కొందరు మార్పు వద్దంటారు. కానీ నగరం పెరిగింది. ఆబాది అంటే జనాభా కూడా పెరిగింది. వైద్య సమస్యలు పెరిగాయి. కానీ అలనాటి ఆసుపత్రి మాత్రం అట్లాగే ఉండిపోవడం ఆశ్చర్యకరం. అంతకన్నా ఆశ్చర్యకరమైన మరొక విషయం చెబుతాను. నాకు 66 సంవత్సరాలు వచ్చాయి. కానీ నేను ఆ ఆసుపత్రిలోకి ఇప్పటికీ ఒకే ఒక్కసారి ప్రవేశించాను.
పట్నంలో వైద్య విద్య గురించిన విశేషాలు నిజానికి ఒక పుస్తకానికి సరిపడా వున్నాయి. అన్ని కాకున్నా మరికొన్ని అంశాలు మరోసారి చెప్పుకుందాము.

-కె.బి.గోపాలం