మెయిన్ ఫీచర్

సినిమా ఏదైనా.. సీన్ కామన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంచెం కొంచెంగా రోజూ తాగితే
-పాయిజన్ కూడా ఫలరసంగానే తోస్తుంది.
పున్నమినాగు చిత్రంలోని చిరంజీవి పాత్ర గుర్తుకొస్తోంది కదూ.
**
సినిమా సినిమాకూ శృతిమించితే
-శృంగారం కూడా నీలిచిత్రమైపోతుంది.
ఈ అన్వయింపుతో ఇప్పుడొచ్చే సినిమాల్లోని రీళ్లురీళ్లు గుర్తుకొస్తాయి. నిజమే మరి -నీలిచిత్రం అనడానికి కొన్ని పరిధులు అడ్డొచ్చినా, అంతకంటే ఎక్కువ శృంగార భావప్రేరణ కలిగించే సన్నివేశాలు స్క్రీన్‌పై ఎక్కువవుతున్నాయన్నది ఆనాటితరం పెడుతోన్న గగ్గోలు. నిజానికి ఈ వాదన చాలాకాలంగా వినిపించి, చిత్రంగా -ఈమధ్య వినిపించటం లేదు. ఎందుకు? అంటే -దాదాపుగా అలాంటి సన్నివేశాలు చూళ్లేక ముందుతరం వాళ్లు సినిమాలు చూడ్డమే మానేశారు. ఈతరం ఆడియన్స్ పూర్తిగా అలవాటుపడిపోయారు. ఏ సినిమా చూసినా కామన్ సీను ‘అదే’నన్న ధోరణే -ఇందుక్కారణం. పైగా -ఫలానా సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య శృంగారం మోతాదు ఎక్కువైందని వేలెత్తి చూపడానికి ఇదివరకు ఏదోక సినిమాను ఉదహరించే అవకాశం ఉండేది. ఇప్పుడు -అలాంటిదేం లేదని గొంతువిప్పి గట్టిగా చెప్పడానికి ఓ ఒక్క సినిమానో వెతుక్కోవాల్సి వస్తుంది.
అతిశయోక్తి అనిపించినా -ఇది నిజం.
*
అలవాటుపడితే.. అదే అలవాటైపోతుందని -చమత్కరించాడు ఓ హాస్య రచయిత. సరదాకి చెప్పిన ఆ విషయాన్ని -శృంగార కోణానికీ అన్వయించారు కొందరు సినీ రచయితలు. పాటల్లో పల్లవిగానో, సన్నివేశంలో సంభాషణగానో నర్మగర్భంగా చెప్పిన ఆ విషయమే ఇప్పుడు ‘నగ్నగర్భం’ దాలుస్తోంది. అలవాటునే అంతా అనుసరిస్తే సంప్రదాయమై కూర్చుంటుందన్న మరో రచయిత హెచ్చరికను రుజువు చేస్తున్నారు. ఇప్పుడొచ్చే సినిమాల్లో -మోతాదుకు మించిన శృంగారం ఏ సినిమాలో లేదు? అని ఎవరికివాళ్లు ప్రశ్నించుకుంటే, ఆలోచించడానికి అవకాశం లేనంత సమాధానం దొరుకుతుంది.
ఈ చర్చను కొంత విశే్లషించుకుంటే-
విలక్షణ పాత్రలు.. విభిన్న భావోద్వేగాలు.. వెరసి సినిమా. తరాలు మారినా యుగాలు మారినా.. సాంకేతిక విప్లవం ఎంత ఉవ్వెత్తున ఎగిసి ఎనె్నన్ని భావి మార్పులు సంభవించినా.. సామాన్యుడి ఏకైక ప్రథమ వినోద సాధనం ఎప్పటికీ సినిమానే. కాదనడానికి అవకాశం లేని స్టేట్‌మెంట్ ఇది.
ఎందుకంటే ఒక సామాన్యుడి జీవితంలో ఆవిషృతమయ్యే నవరసాల్ని -సినిమా అద్దంలా చూపెడుతుంది. ఆ రసాలతో మమేకం చేస్తుంది. ఏడిపిస్తుంది. నవ్విస్తుంది. ఉద్రేకం తెప్పిస్తుంది. క్రోథాన్నీ జనింపజేస్తుంది. శాంతమూర్తిని చేస్తుంది. భయపెడుతుంది. అలా అన్ని రసాల్ని అలవోకగా ప్రేరేపితం చేస్తుంది. అందుకే అలాంటి సినిమాని సామాన్యుడు అక్కున చేర్చుకున్నాడు.
సినిమా రూపుదిద్దుకుంది. కాలానుగుణంగా మార్పులు చేర్పులకూ గురైంది. మూకీ నుంచి టాకీగా రూపాంతరం చెందింది. అలా రూపాంతరం చెందిన చాన్నాళ్ళకు సైతం -ఒక్క శృంగార రసాన్ని మాత్రం ఏ కోణంలోనూ తడిమే ప్రయత్నం చేయలేదు ఆనాటి తరం. అలాంటి సాహసం కూడా చేయలేదు. ఎందుకంటే -వాళ్లకు తెలుసు. తెరపై కనిపించే శృంగారరసం ప్రభావం వాస్తవ జీవితంలో ఎంత బలంగా ఉంటుందో. అందుకే స్వర్గయుగంనాటి సినిమాతరం -ఆ ఛాయలకు పోలేదు. కనీసం హీరో హీరోయిన్లను ఒకరికొకరు తాకించే సాహసానికీ ఒడిగట్టలేదు. కాలమెప్పుడూ ఒక్కలా ఉండదు. శృంగార రసాన్ని స్క్రీన్‌పై చూపించాలన్న తహతహ మొదలైంది. పాటల్లోనూ.. తర్వాత్తర్వాత హీరోహీరోయిన్లు చేతులు పట్టుకోవడం, చెంపకు చెంప ఆన్చడం మొదలయ్యాయి. పరిధి దాటని శృంగారరస పోషణ చాలాకాలమే కొనసాగింది. దశాబ్దాల కాలాల తర్వాత ఆలింగనాలు ఆరంభమయ్యాయి. అయితే అప్పటి నిర్మాతలు, దర్శకులు, నటులు అక్కడా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆలింగనాలు -ప్రేక్షకులకు అత్యంత సహజంగా తోచేలా చిత్రీకరించేవారు. సాహిత్యంలో శృంగారపరమైన మాటలకి ప్రాధాన్యత పెరుగుతూ వచ్చినా -దృశ్యం మాత్రం మలినంకాకుండా జాగ్రత్తపడ్డారు.
**
రాన్రానూ సినిమా తన పంథా మారింది. ముద్దుల్ని ముద్దుముద్దుగా అక్కున చేర్చుకుంది. శృంగార గ్రంథ పఠనారంభానికి తొలిపలుకైన ముద్దు... భావోద్వేగ సమ్మేళిత ప్రణమోద్దీన సమ్మోహిత సంకేతమైన ముద్దు... హద్దులుదాటి పాటల్లోకి పరకాయ ప్రవేశం చేసింది.
‘ము ము...ముద్దంటే.. చేదా? నీకా ఉద్దేశం లేదా? ఇపుడొద్దన్నావంటే కుర్రవాడా...రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా...’ అంటూ డ్యాన్సర్ -అప్పటి పెద్ద హీరో అక్కినేని నాగేశ్వరరావు వెంటపడి అంటుంది. ఈ ముద్దు పాట ఆనాటి కుర్రాళ్లకి తెగ నచ్చేసింది. అలా చాలా సినిమా పాటల్లో కదిలి మెదిలిన ‘ముద్దు’ పలుకు గిలిగింతలు రేపింది. ఏఎన్నాఆర్ మనుమల తరం వచ్చేసరికి -హద్దులు చెరిపేసుకుని ‘లిప్ లాక్’ సన్నివేశంగా స్థిరపడింది. తెరపైన శృంగారపరమైన సన్నివేశాల్లో ప్రణయాభినయానికి ఆనవాలైపోయింది ఏకంగా! ఏం మాయ చేశావేలో నాగచైతన్య- సమంతల సుదీర్ఘ గాఢ చుంబనాలతో ప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఒకప్పుడు విదేశీ లేదా పరభాషా చిత్రాలకే పరిమితమైన హీరో హీరోయిన్ల ముద్దులు తెలుగుని ఆక్రమించేసి తెలుగు ప్రేక్షక జనాల్ని అలరింప చేస్తున్నాయి.
అయితే, అప్పటికే ‘గ్లామర్’ అన్న అందమైన పదం పరదాకింద ‘ఎక్స్‌పోజింగ్’ ఎప్పుడో విశృంఖలమైపోయింది. ఒకప్పుడు అలాంటి సన్నివేశాల కోసం ప్రత్యేక తారలుండే పరిస్థితి నుంచి హీరోయినే్ల ‘ఎక్స్‌పోజింగ్‌కు నేను దూరం కాదు’ అని స్టేట్‌మెంట్లు ఇచ్చే పరిస్థితికి వచ్చేసింది. తెరపై శృంగారం క్రమంగా ‘నీలిహంగుల్ని’ దాటేస్తున్నా -సెన్సార్ వాళ్లు మాత్రం సర్వసాధారణ విషయంలా ఎలాంటి అభ్యంతరాలూ చెప్పడం మానేశారు. అలాంటి వినోదాన్ని ప్రేక్షకలోకం స్వాగతిస్తున్నపుడు అభ్యంతరం పెట్టాల్సిన అవసరమేముంది? అన్న ప్రశ్నలూ ఉద్భవించాయి. స్క్రీన్‌పై హీరో హీరోయిన్లు రెచ్చిపోతూ -ఆడియన్స్‌ను సంతృప్తిపర్చే వ్యాపార సూత్రంగా మారిపోయాయి.
నాగేశ్వరరావు, రామారావులు నటించిన తొలినాళ్ల సినిమాల్ని పరికిస్తే... పాటల్లో నాయికా నాయకులు కనీనం ఒకరినొకరు తాకే సందర్భాలు దాదాపు కనిపించవు. కళ్ళతో భావాలు పలికించే అభినయానికి పెద్దపీట వేస్తూ, ప్రేక్షకుల్లో ఎలాంటి వెకిలిభావాలుగాని స్పందనలుగాని చెలరేగకుండా ప్రణయ సన్నివేశాల్ని రక్తికట్టించిన చిత్రాలెన్నో. ముందు చెప్పుకున్నట్టు అప్పటికి సాహిత్యమూ ఆ బాట పట్టలేదు. అయితే అది కొంతకాలమే సాగింది. తరువాత అదే ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు -తర్వాతి కాలంలో చేసిన సినిమాల్లో ‘పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లా/ నీ పైటకొంగు జారిందే గడుసుపిల్లా’ అంటూ నాగేశ్వరరావు పాటేసుకుంటే.. ‘ఆకుచాటు పిందె తడిసె/ కొంగు మాటు పిల్ల తడిసె/ ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది’ అంటూ డబుల్ మీనింగ్‌లో రామారావూ పాడేసుకున్నాడు. ఇలాంటి పాటలు కోకొల్లలై హుషారెత్తించి కుర్ర ప్రేక్షకుల్ని వెర్రెక్కించాయి.
ఇక ముద్దులతోనే ఆగిపోకుండా తెలుగు తెరపై నాయికా నాయికల మధ్య వివిధ భంగిమల ఆలింగనాలూ అరంగేట్రం చేశాయి. ఆ భంగిమలే గోడలపై పోస్టర్లై ఆవిర్లు పుట్టించాయి. అలాంటి భంగిమలకు కొన్నాళ్లపాటు కత్తెర పడినా -ఇప్పుడు కామనైపోయింది. ఇది కాస్తా -ఇంకొంచెం ముందడుగువేసి తెలుగు సినిమా రూపురేఖల్ని మార్చుకుంటోంది. కొంగుజార్చిన హీరోయిన్ అందాలు తెరపై ఆవిష్కృతమైతే వెల్లువెత్తిన సందర్భాలు మరుగునపడి, వాత్సాయనుడి కామసూత్రాల భంగిమల్ని తలదనే్న సరికొత్త భంగిమల్ని పోస్టర్ల నిండా నింపేసి ప్రేక్షక లోకాన్ని వెర్రెత్తించేలా చేస్తూ, థియేటర్లకి రప్పించడానికి తెగ ఆరాటపడుతున్నారు. ఒకే సూత్రం అన్నివేళలా పనిచేయదన్నట్టు.. మరి ముద్దు సన్నివేశాలు, హీరో హీరోయిన్ల ఆలింగనపు సీన్లతో సినిమా కంటెంట్ లేకపోయినా ఆడిందా? అంటే ఆడవు? అనే బదులొస్తుంది. ఈ సన్నివేశాల మార్కుదాటి తెలుగు సినిమా కంటెంట్‌లోకి చొరపడింది. కుర్రాడి శృంగార అవస్తలమీద ఫోకస్ పెట్టి తీసిన అర్జున్‌రెడ్డి అనూహ్య విజయాన్ని చవిచూసింది. ఇలాంటి సినిమాలూ తీయొచ్చని దర్శక నిర్మాతలకు, ఎంచక్కా ఇలాంటి సినిమాలు థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేయొచ్చని ప్రేక్షక వర్గానికి భరోసా ఇచ్చినట్టయ్యింది. ఒకప్పటి ‘వల్గారిటీ’ అనే పదం నేడిపుడు ‘వారెవ్వా!’ అని వినిపిస్తోంది.
చుంబనాలు, ఆలింగనాలు, దొర్లడాలు తెరనిండా పరుచుకొని పరాకాష్టకి చేరుతున్నాయని ‘ఆర్ ఎక్స్ 100’ విజయంతో తేట తెల్లమైంది. అదే బాటలో నడిచి, వేడి రాజేసి కాసిన్ని కాసులు వెనకేసుకోవచ్చని ఆశపడిన ‘్భరవగీత’ దురాశ దుఃఖానికి చేటు అన్న చందాన ప్లాప్‌ని మూటగట్టుకొని, సినిమాలో సరుకు కూడా అవసరమేనని మరోమారు బాక్సాఫీసుని గుద్దిమరీ ప్రూవ్ చేసింది.
ఆకాశానికి హరివిల్లు అందం. అలాగే సినిమాకి వినసొంపైన పాటలు, చూడ ముచ్చటైన పాత్రధారుల ఆహార్యం, బిగువైన స్క్రీన్‌ప్లే, విస్మయ పరిచే కథాకథనాలు.. ఇవీ సింగారం. అంతేగాని శృంగార మెప్పటికీ సినిమా సక్సెస్‌కి సులువైన మార్గం కానేకాదు! గుర్తిస్తే పరిశ్రమ గుడ్! అలాగే అనుసరిస్తే బ్యాడ్!!

-ఎనుగంటి వేణుగోపాల్