మెయిన్ ఫీచర్

ఓవర్’సీజ్...!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమా
-అట్టుకీ ముక్కకీ చెడుతోందా?
ఓవ’రాక్షన్
-వ్యాపార వెన్నుముకను విరిచేస్తుందా?
ఏమో..! విదేశీ బయ్యర్ల స్మార్ట్‌నెస్ చూస్తుంటే పరిస్థితి అంతవరకూ వచ్చేలాగే కనిపిస్తోందంటున్నారు బిజినెస్ ఎక్స్‌పర్ట్స్.
ఒకప్పుడు-
పొరబాటున సినిమా బాల్చీ తనే్నస్తే -కాణీయో అర్థణానో శాటిలైట్ నుంచి వస్తుందిలేనన్న ధైర్యముండేది నిర్మాతకి. ఆ ధైర్యానే్న వ్యాపారం చేసుకుందామన్న ఆలోచనలు పుట్టుకొచ్చాక -శాటిలైట్ నుంచి వచ్చే దమ్మిడీ కోసమే సినిమాలు తీయడం మొదలైంది. ఆ బిజినెస్ కోసమే మేకోవర్ మేకర్లు ఇండస్ట్రీకి రావటంతో -శాటిలైట్ బిజినెస్ వెన్నుపూసలు కదిలిపోయాయి. శాటిలైట్ బిజినెస్ కోట్ల నుంచి లక్షలకి.. పనికిరాని చెత్త సినిమాల విషయంలో వేలకీ వచ్చేయటంతో -ఆ వ్యాపారం దైవాదీనమైపోయింది.
ఇప్పుడు-
హాయిగా సాగుతోన్న ఓవర్సీస్ బిజినెస్‌లోనూ అలాంటి గ్రాఫే కనిపిస్తోంది. యూఎస్ స్క్రీన్‌మీద తెలుగు బొమ్మ పడటమనేది ఒకప్పుడు ఊహ. టెక్నాలజీ విస్తృతి.. వ్యాపారం మేడ్ ఈజీ తరువాత -తీసిన బొమ్మను విదేశాల్లో చూపించి సొమ్ము చేసుకోవచ్చన్న ధీమా పెరిగింది. క్రమంగా అదో సరికొత్త వ్యాపారాత్మక కోణమై -విదేశీ స్క్రీన్స్‌మీద తెలుగు బొమ్మ బాగానే డబ్బు సంపాదించటం మొదలెట్టింది. ఓవర్సీస్ బిజినెస్ కోసమేనన్నట్టు -స్టార్ హీరోల చిత్రాలు భారీ బడ్జెట్‌తో తెరకెక్కడం మొదలెట్టాయి. లోకల్ మార్కెట్లో స్టార్ హీరోల సినిమాలు వంద కోట్ల క్లబ్‌కు చేరడంలాంటి ఫీట్లూ -సునాయాసమయ్యాయి. అంటే, సినిమా రేంజ్ పెంచుతూ.. ఓవర్సీస్ మార్కెట్ పెంచడానికీ బాటలేస్తూ -నిర్మాతలు మొదట నిజాయితీనే చూపించారు. అలవాటుపడిన తరువాతే -ఆశలు జడలువిప్పాయి. సాధ్యమైనంతమేర ఓవర్సీస్ మార్కెట్‌నుంచి నొల్లేద్దామన్న అత్యాత బలపడుతుండటం చూస్తుంటే -ముగిసిన శాటిలైట్ బిజినెస్ చరిత్ర ఓవర్సీస్‌లో పునరావృతమవుతుందా? అన్న సందేహాలు ముసురుతున్నాయి. ఎందుకంటే -హాయిగా సాగిపోతున్న వ్యాపారాన్ని హఠాత్తుగా కొండెక్కించేస్తుండటమే ఇందుక్కారణం. ఓవర్సీస్‌లో బొమ్మపడితే -ఊపిరి తీసుకునే అవకాశామైనా ఉంటుందిలేనన్న పరిస్థితి నుంచి.. పెట్టుబడిలో పరకో పాతికో ఓవర్సీస్ నుంచే సంపాదించేయొచ్చన్న భావన కలిగింది బాహుబలి ముగింపు కథనుంచి.
బాహుబలి: ద బిగినింగ్‌తో ఓవర్సీస్‌లో ఆసక్తి పెంచి -మార్కెట్ డిమాండ్‌ను కంట్రోల్‌లోకి తీసుకున్న రాజవౌళి టీం.. బాహుబలి: ది కంక్లూజన్‌తో మార్కెట్‌ను పూర్తిగా కాప్చర్ చేసేసింది. ముగింపు కథలోనూ బలం ఉండటంతో -ఓవర్సీస్‌లో వసూళ్ల సునామీ సృష్టించిందన్నది జగద్విధితం. లోకల్ మార్కెటేతర వసూళ్ల మార్క్ 140 కోట్లకు టచ్ కావడం ఆ సినిమాతోనే సెనే్సషనైంది. నిజానికి -పరాయి దేశంలో తెలుగు సినిమా స్టామినా గురించి రొమ్ము విరుచుకుని చెప్పుకోగలిగే సందర్భమే అది. అయితే -తెలుగునుంచి మళ్లీ బాహుబలిని తలదనే్న సినిమాలైతే రాలేదుగానీ, అంతమేరా ఓవర్సీస్ నుంచి కొల్లగొట్టేయాలన్న ఆశలు మాత్రం బలోపేతమైపోయాయి. ఓవర్సీస్‌లో తెలుగు సినిమాకు అమాంతం డిమాండ్ పెరిగటంతో, ఆ రేంజ్ సినిమాగా ప్రచారం చేసుకుంటే డాలర్లు కురిస్తాయన్న ఆశల దగ్గరే ఆలోచనలు ఆగిపోయాయి. సినిమా సత్తా నేలమీదన్నా -డిమాండ్‌ను ఆకాశంలో చూపిస్తూ.. ఇబ్బడిముబ్బడిగా రేట్లు పెంచే ప్రక్రియ మొదలైంది ఇక్కడ్నుంచే. కొంతకాలంగా బాహుబలి మైకంలోనే ఉండిపోయిన ఓవర్సీస్ బయ్యర్లు -కంటెంట్ లేని సరుకునూ భారీ ధరకే కొన్నారు. స్టార్ హీరోల సినిమాలు కనుక -మనకూ ఎంతోకొంత మిగులుతుందిలేనన్న ధైర్యానే్న చూపించారు. నాలుగైదు సినిమాలు ఢమాల్‌మనడంతో -తెలుగు సినిమా స్టామినాపై అనుమానాలు మొదలయ్యాయి. అన్ని సినిమాలు బాహుబలి కావులేనన్న అనుభవానికొచ్చాక -నాణ్యమైన సరుకుకూ తక్కువ ధరకే తెచ్చుకునే సిండికేట్ బిజినెస్‌కు తెరలేపారన్న విషయం అర్థమవుతోంది. సో, అత్యాశనుంచి పుట్టుకొచ్చిన ఇన్‌బ్యాలెన్సింగ్ ఈక్వెషనే్స -ఓవర్సీస్ బిజినెస్‌లో తెలుగు సినిమా అట్టుకీ ముక్కకీ చెడేలా చేస్తుందన్నది ఎక్స్‌పర్ట్స్ మాట. ఒక్కముక్కలో చెప్పాలంటే ఇప్పుడు -అమెరికాలో తెలుగు సినిమాల బిజినెస్ జూదమైంది. కంటెంట్‌వున్న సినిమాలను సైతం -నిలబెట్టి కొంటుండటం చూస్తుంటే ఆదరణ ఏస్థాయికి దిగిందో అర్థం చేసుకోవచ్చు. మన నిర్మాతలు బెట్టుచేసినా -దెబ్బకొట్టిన పెద్ద సినిమాలను వాళ్లు ప్రస్తావిస్తుండటంతో.. ఏదోక రేటుకు తెగ్గొట్టుకోడవమే బెటరన్న పరిస్థితికి వచ్చేస్తున్నారు.
నిజానికి బయ్యర్లు చెప్తున్నదాంట్లోనూ వాస్తవాలు లేకపోలేదు. పెద్ద సినిమాలు చాలానే బయ్యర్లను నిలువునా ముంచేశాయి. దీంతో రేట్లు ఒక్కసారిగా పడిపోయాయి. చిరంజీవి 151వ ప్రాజెక్టుగా వచ్చిన ‘సైరా నరసింహారెడ్డి’కి మొదట ఫిక్స్‌చేసిన ఓవర్సీస్ రేటు 18 కోట్లని వినిపించింది. బయ్యర్ల నుంచి సౌండ్ లేదు. రేటును 15 కోట్లకు దించారు. రెస్పాన్స్ లేదు. చివరకు 10 కోట్లకు తెగ్గొట్టారన్నది తాజా సమాచారం. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు -ఓవర్సీస్‌లో
తెలుగు సినిమా ఎక్కడినుంచి ఎక్కడికి దిగిందో.
***
ఈ పరిస్థితికి కారణాన్ని కొంచెం వెనక్కెళ్లి చూద్దాం.
ఓవర్సీస్ మార్కెట్ బావున్న టైంలో -పవన్‌కల్యాణ్, మహేష్‌బాబులాంటి హీరోల సినిమాలకు 12 నుంచి 15 కోట్ల రేటు పలికేది. స్పైడర్, అజ్ఞాతవాసి, భరత్ అను నేను సినిమాలు అలా అమ్ముడుపోయినవే. హై ఎక్స్‌పెక్టేషనే్స బయ్యర్ల కొంపముంచింది. ఏ సినిమాకూ పెట్టుబడులు వెనక్కి రాకపోవడంతో -హిట్‌టాక్ సినిమాలనూ యూఎస్ బయ్యర్లు తక్కువ చేసి చూస్తున్నారు. అందుకు మహర్షిని ఉదహరించాలి. తెలుగు రాష్ట్రాల్లో మంచి లాభాలను తెచ్చిన మహర్షి -ఓవర్సీస్‌లో డిజాస్టరయ్యాడు. ఇది అక్కడి బయ్యర్లు ఊహించిందే. అందుకే -ఓవర్సీస్ మార్కెట్ బలోపేతం కావడంలో కీలక పాత్ర పోషించిన మహేష్‌కే ఇప్పుడక్కడ మార్కెట్ లేకుండా పోయిందన్నది నిజం. ఇక రంగస్థలంతో ఇంతెత్తున లేచిన రామ్‌చరణ్ -వినయ విధేయ రామతో పూర్తిగా డౌనయ్యాడు. ఓవర్సీస్ బయ్యర్లకు ఈ సినిమాతో చుక్కలు కనిపించాయి. మిగతా హీరోల పరిస్థితీ ఇందుకు అతీతం కాదు.
***
తెలుగు సినిమా మార్కెట్‌కు కాంబినేషన్ అనేది ఓ సక్సెస్ ప్రాతిపదిక. హిట్టు హిస్టరీవున్న కాంబినేషన్ సెట్టయితే -్ఫ్యచర్ రేటుకీ అదే ఊపు కనిపిస్తుంది. అల్లు అర్జున్- తివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌కు మంచి మార్కెట్ ఉంది. హ్యాట్రిక్ హిట్ లక్ష్యంగా ఈ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న తాజా ప్రాజెక్టు -అల వైకుంఠపురములో. ఈ హిస్టరీ కూడా ఓవర్సీస్ మార్కెట్‌ను ముందుకు తీసుకెళ్లలేదు. పదిహేను కోట్ల దగ్గర మొదలైన బిజినెస్ -అటుతిరిగి ఇటుతిరిగి 8 కోట్లకు తెగిందంటున్నారు. నిజానికి ఈ కాంబినెషన్‌కు తగిన రేటైతే ఇది కాదు. టాలీవుడ్‌లో సిద్ధమవుతున్న స్టార్ హీరోల కొత్త ప్రాజెక్టులకూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మహేష్‌బాబు సోల్జర్‌గా కనిపించనున్న ‘సరిలేరు నీకెవ్వరు’కూ ఆశించిన రేటు రాలేదన్నది ట్రెండ్‌ను బట్టి తెలుస్తోంది. ఓవర్సీస్‌లో మంచి ఇమేజ్‌వున్న స్టార్ హీరో మహేష్‌బాబు. అయితే, అతని గత చిత్రాలు ఓవర్సీస్ బయ్యర్లను భారీగా ముంచేయటంతో -కంటెంట్‌తో సంబంధం లేకుండా ఈ సినిమానూ తక్కువ రేటుకే అడుగుతున్నారన్న టాక్ లేకపోలేదు.
బాహుబలి తరువాత -ఏ తెలుగు సినిమా కూడా యుఎస్ బయ్యర్లను స్థిమితంగా ఉండనివ్వలేదన్నది నిజం. ఎక్కువ సినిమాలకైతే భారీగానే మునిగిపోయారు. మొన్నటి ‘సాహో’ కొట్టిన దెబ్బకు బయ్యర్ల వెన్నుపూసలు కదిలిపోయాయన్నది నిజం. సగానికి సగం మునిగిపోవడంతో -ఇప్పట్లో కోలుకునే పరిస్థితే కనిపించట్లేదట.
**
సో, ఈ పరిణామాలు గత రెండేళ్లలో ఓవర్సీస్ బిజినెస్ రూపురేఖల్నే మార్చేశాయి. ఓపెనింగ్ ఊపు కొలాప్స్ కావడానికి మేకర్ల అత్యాశే కారణమన్న వాదన లేకపోలేదు. బాహుబలి సినిమా మంచి వసూళ్లను ఇచ్చిందంటే దాని రేంజ్ వేరు. యుఎస్ ఆడియన్స్‌కి అదిచ్చిన కిక్ వేరు. దాని మార్కెట్ స్ట్రాటజీ వేరు. అన్ని సినిమాలూ అంతే ఇంపాక్ట్ చూపిస్తాయనుకోవడం పొరబాటు. కాని, నిర్మాతలు మాత్రం సినిమా సినిమాకు ధర పెంచుకుంటూ వెళ్తున్నారు. తప్పక తీసుకుంటున్న ఓవర్సీస్ బయ్యర్లు, పెట్టుబడి రికవరీకి టికెట్ రేట్లు పెంచుతున్నారు. ఇంత జరిగినా పన్నులు, పబ్లిసిటీ ఖర్చుల తరువాత నష్టాలే మిగుల్తున్నాయి. ఇటీవలి కాలంలో ఇలాంటి దృశ్యాలెన్నో.
పైగా -యూఎస్ ఆడియన్స్ గతంలోలా తెలుగు సినిమాను వేలంవెర్రిగా చూస్తోన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ఓ చిన్న తెలుగు కుటుంబం సినిమా చూడాలంటే -సగటున 80 డాలర్ల ఖర్చు. అదే ప్రీమియర్ షో అంటే -డబుల్. ఇంతపెట్టినా సినిమా సంతృప్తినివ్వలేదన్న లెక్కలూ అక్కడా మొదలయ్యాయి. పైగా, తెలుగు సినిమా చూపించటమే మహద్భాగ్యమన్నట్టు స్టార్ హీరోల సినిమా ప్రీమియర్ షోలకు భారీ రేటు ఫిక్స్ చేస్తున్నారు బయ్యర్లు. అందుకే సమీక్షలు చూసి.. టాక్ ఎంక్వయిరీ చేసి.. నమ్మకం కుదిరితే థియేటర్‌వైపు చూస్తున్నారు ఆడియన్స్. ఈ పరిణామాలే ఓవర్సీస్ బిజినెస్‌ను -ఓవర్’సీజ్ చేసేస్తోంది.

-విజయప్రసాద్