మెయిన్ ఫీచర్

గుర్తుచేసుకుందాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ కాలంలోనైనా-
కథ ఒకెత్తు. కథను పదికాలాలు మనసులో గుర్తుంచేలాంటి పాట మరొకెత్తు. ఒకప్పుడు -సినిమాకు ఈ రెండే ప్రాణంగా ఉండేవి. ఇప్పుడొస్తున్న చాలా సినిమాల్లో ఈ రెండూ కరవవుతున్నాయి. అప్పుడప్పుడూ -ఈ రెంటికీ ప్రాధాన్యతనిస్తూ వస్తోన్న చిత్రాలు.. ఆడియన్స్‌ని సంతృప్తిపరుస్తోన్న విషయాన్ని గమనించొచ్చు.

ఒకప్పుడు పాటే ప్రాణమన్నట్టుండేది. ఇప్పుడు -పాటన్నది లేకుండానే సినిమాలొస్తున్నాయి. పాట ఉండాలి అన్నది సినిమాకు రూలేమీ కాదు. కాకపోతే -పాటతో ప్రేక్షకుడి మదిలో సినిమాకు సుస్థిరస్థానం కల్పించొచ్చన్నది ఓ నమ్మకం. కాదనలేని నిజం.
సినిమా పాట, దాని పూర్వాపరాలకు వెళ్తే అదో పెద్ద గ్రంథమవుతుంది. ఈ కథనం ఉద్దేశం అదికాదు కనుక -సినిమా నుంచి పాటలెందుకు దూరమైపోతున్నాయి అన్న విషయాన్ని క్లుప్తంగా చెప్పుకుని.. సరైన పాట ఉంటే ఎలాంటి మధురానుభూతి కలుగుతుందన్న విషయాన్ని గుర్తు చేసుకుందాం.
పాత చిత్రాల్లో -పాటలోని సాహిత్యం, సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది కనుక.. పాటను చిత్రీకరించటానికి పెద్ద ఖర్చు భరించాల్సి వచ్చేది కాదు. ఎప్పుడైతే -సంగీత సాహిత్యేతర అంశాలకు ప్రాధాన్యత పెరిగిందో.. పాట చిత్రీకరించటం కష్టమవుతూ వచ్చింది. కమర్షియల్ చిత్రాలైతే.. సినిమా బడ్జెట్‌లో 30శాతం పాటలకు పెట్టాల్సిన పరిస్థితి రావడాన్ని గమనిస్తున్నాం. దీంతో.. సినిమాకు పాట అవసరమా? అని ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చేసింది.
ఇప్పటి సినిమాలు, వాటిలోని పాటలు అన్న చర్చను కాసేపు పక్కనపెట్టి -స్వర్ణయుగం కాలంలోని పాటల్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే హృదయం ఎంత ఉరకలేస్తుందో చూడండి. తెలుగు సినిమా స్వర్ణయుగ కాలంలో -పియానో పాటలు, వీణ పాటలు, తొలిరేయి పాటలు, చందమామ పాటలు, గోదావరి పాటలు, కథను సమగ్రంగా వివరించే టైటిల్ సాంగ్స్, పాత్రధారుల ఎదలోని భావాలనో, సమాజ తత్వాన్నో తెలియజెప్పే బ్యాక్‌గ్రౌండ్ సాంగ్స్.. ఇలా ఎన్నోరకాల పాటలు మనసును రంజింపచేసేవి. అందుకే ‘అలనాటి మధుర గీతాలు’ అంటామేతప్ప, మధుర గీతమన్న ఉదాత్త పదాన్ని ఇప్పటి పాటలకు ఇవ్వలేకపోతున్నాం. చక్కటి సాహిత్యం.. సొంపైన సంగీతం.. సుమధుర గాత్రం.. కనువిందైన దృశ్యం.. ఇలా పాట పోహళింపు నేటికీ ప్రేక్షకుల మదిలో తీయని జ్ఞాపకమై ఉంది. ఉంటుంది.
పియానో పాటలనగానే -నా హృదయంలో నిదురించె చెలి/ కలలలోనె కవ్వించే సఖి’ అన్న ఆరాధన చిత్రంలోని అక్కినేని పాట గుర్తుకురాకపోదు. జరిగిన కథ చిత్రంలో -భలే మంచిరోజు పసందైన రోజు, మంచి మనిషి చిత్రంలో -ఓహో గులాబి బాల/ అందాల ప్రేమ మాల, పూజాఫలం చిత్రంలో -పగలే వెనె్నల/ జగమే ఊయల, ఆత్మబలం చిత్రంలోని -ఎక్కడికిపోతావు చిన్నవాడ లాంటివి గుర్తుకురాకపోవు. వీణ పాటలను గుర్తు చేసుకుంటే.. పునర్జన్మలోని -ఎవరివో నీ వెవరివో, ప్రేమనగర్‌లోని -ఎవరో రావాలి/ ఈ వీణను సవరించాలి, డాక్టర్ చక్రవర్తి చిత్రంలోని -పాడమని నన్నడగ వలెనా/ పరవశించి పాడనా.. -మనసున మనసై/ బ్రతుకున బ్రతుకై, ఇద్దరు మిత్రులు చిత్రంలోని -పాడవేల రాధిక/ ప్రణయ సుధా గీతిక.. లాంటి గీతాలు ఠక్కున మస్తిష్కంపై కదలాడతాయి. తేనెలూరే వీణాగీతాలు ఎప్పటికీ మధురాతి మధురమే.
ఇక తొలిరేయి పాటకొస్తే.. చిట్టి చెల్లెలు చిత్రంలోని -ఈ రేయి తీయనిది/ ఈ హాయి మరువనిది, ఆత్మబలం చిత్రంలోని -తెల్లవారనీకు ఈ రేయిని అనే గీతాలు.. తెల్లచీర మల్లెమాల అందాలలో హద్దుమీరని శృంగారంలో ప్రేక్షకులను మైమరపించాయి. ఇక అలనాటి తెలుగు సినిమాల్లో చందమామ/ వెనె్నల గీతాలు లెక్కలేనన్ని. చందమామ సాక్షిగా రాసుకున్న అందమైన ప్రణయ గీతాలు ఎన్నో చెప్పలేం కూడా. ముఖ్యంగా ఆత్మగౌరవం చిత్రంలో -అందెను నేడే అందని జాబిల్లి, సంబరాల రాంబాబు చిత్రంలోని -మామా చందమామ/ వినరావా నా కథ/ వింటె మనసువుంటే, సిరివెనె్నల చిత్రంలోని -చందమామ రావె/ జాబిల్లిరావె/ కొండెక్కిరావె/ గోగుపూలు తేవే, మిస్సమ్మ చిత్రంలోని -రావోయి చందమామ/ మా వింతగాథ వినుమా, ఇలవేల్పు చిత్రంలోని -చల్లనిరాజ ఓ చందమామ/ నీ కథలన్ని తెలిశాయి ఓ చందమామ.. నా చందమామ లాంటి అనేక గీతాలు వెండితెరపై వెనె్నల వెలుగు నింపాయి. వానపాటలవైపు తొంగిచూస్తే, నేటికీ ఏనాటికీ అగ్ర గీతంగా ఆత్మబలం చిత్రంలోని -చిట పట చినుకులు పడుతూవుంటె/ చెలికాడే సరసన వుంటె గీతాన్ని ప్రస్తావించుకోవాలి. ఎన్ని వానగీతాలొచ్చినా, ఎంతెంత శృంగారమొలకించినా, అంగాంగ ప్రదర్శనకు దిగినా -ఏ గీతం ఆ గీతం దరిదాపులకు రావు, రాలేవు. ఈ పాట ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారీ -ఆత్రేయ, మహదేవన్, ఘంటసాల, సుశీల, అక్కినేని, బి సరోజాదేవి, వి మధుసూధన్‌రావులను గుర్తు చేసుకుని తీరాల్సిందే. దీపావళి గీతాలకు వస్తే.. విచిత్రబంధం చిత్రంలోని -చీకటి వెలుగుల రంగేళి/
జీవితమే ఒక దీపావళి, పెళ్లికానుక చిత్రంలోని -ఆడె పాడె పసివాడ/ ఆడెనోయి నీతోడ/ ఆనందం పొంగిపోయె దీపావళి లాంటి గీతాలు అమృత గుళికలనే అనాలి. నిజంగా మనింట్లో దీపావళి చేసుకుంటున్న భ్రమ కలిగించే పాటలివి. అందుకే అవి నేటికీ చమక్కుచమక్కుమంటూ మెరిసిపోతున్నాయి.
గోదావరి నదీ తీరానికి వెళ్దాం. మూగమనసులు చిత్రంలోని -గోదారి గట్టుంది/ గట్టుమీద చెట్టుంది/ చెట్టుకొమ్మన పిట్టుంది/ పిట్ట మనసులో ఏముంది అన్న పాటకే టాప్ ప్రయారిటీ. ఆ గీతంలో జమున వెండితెరను అదరగొట్టింది. సంగీత సాహిత్యం.. సుశీలమ్మ కోకిల కంఠం.. జమున చలాకి నటన వెరసి ఆ గీతానికి వందేళ్ల జీవం పోసింది. అదే మూగమనసులు చిత్రంలో -ఈనాటి ఈ బంధమేనాటిదో గీతంలో గోదావరి తీరం అందాలను వెండితెరపై చూపించి గొప్ప అనుభూతినిచ్చారు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. ఇలా అనేక చిత్రాల్లో గోదావరి తీరాలు, వనాలు, పచ్చని చేలు, నీటి కాల్వలు, రైతాంగ పనుల దృశ్యాలు మనం చూసి తీరాల్సిందే.
టైటిల్ సాంగ్స్ ప్రస్తావించుకుంటే.. జీవన తరంగాలు చిత్రంలోని -ఈ జీవన తరంగాలలో/ ఆ దేవుని చదరంగంలో/ ఎవరికి ఎవరు సొంతమూ/ ఎంతవరకూ బంధమూ అన్నది గొప్ప పాట. ప్రేమాభిషేకం చిత్రంలో -ప్రేమాభిషేకం ప్రేమకు పట్ట్భాషేకం.. ఇలా కొన్ని టైటిల్స్ సాంగ్స్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెదరని స్థానం సంపాదించాయి. చివరిగా బ్యాక్‌గ్రౌండ్ గీతాలను గుర్తు చేసుకుంటే.. అదృష్టవంతులు చిత్రంలోని -నమ్మరె నేను మారానంటే నమ్మరే, కులదైవం చిత్రంలోని -పయనించే ఓ చిలుకా/ ఎగిరిపో పాడైపోయెను గూడు, పెళ్లికానుక చిత్రంలో -తీరెనుగా నేటితో నీ తీయని గాథ/ మిగిలిపోయె నీ మదిలో తీరని బాధ మనసుకు హత్తుకుంటాయి. శోభన్- శారద- కాంచన నటించిన ‘మనుషులు మారాలి’ చిత్రంలో గొప్ప గీతం -లేరెవరూ నీ కెవరు చీకటిలో కారు చీకటిలో. ఈ గీతం వింటే ఏ ప్రేక్షకుడూ ఆ గీతాన్ని మర్చిపోలేడు.
సినిమాలంటే మనసును కదిలించాలి. మనింట్లో.. పక్కింట్లో జరుగుతున్న కథలా భ్రమ కలిగించాలి. ఆయా పాత్రల ప్రభావం కొన్ని రోజులవరకు వెంటాడాలి. అలాంటి చిత్రాల్లోని గీతాలు ఎప్పుడువిన్నా అలనాటి రోజులు, ఆయా చిత్రాలు గుర్తుకురావాలి. ఇవన్నీ ఉన్నాయి.. ఉంటాయి కనుకే - ఆ సినిమా రోజుల్ని ‘సువర్ణయుగం’ అంటున్నాం. అలాంటి అనుభూతులు మళ్లీ తెలుగు సినిమా నుంచి దొరుకుతాయా? ఎప్పటికి?

-మురహరి ఆనందరావు