మెయిన్ ఫీచర్
కర్మఫలముతోనే దేహపతనము
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
454. వ్యాఘ్రబుద్ధ్యా వినిర్ముక్తో బాణః పశ్చాత్తు గోమతౌ
న తిష్ఠతి చ్ఛినత్త్యేవ లక్ష్యం వేగేన నిర్భరమ్॥
పులిని చంపే ఉద్దేశముతో బాణము విడచిన పిదప, అది పవిత్ర గోమాతను చేదిస్తున్నదని తెలిసికొనినా ప్రయోజనము శూన్యము. విడచిన బాణము తిరిగి రాదు; లక్ష్యమును తప్పక ఛేదించును. అటులనే, ప్రారబ్ధకర్మ ఫలశేషము అనుభవించుటకు మిగిలి ఉండగా, ఆత్మసాక్షాత్కారము సిద్ధించినప్పుడు, ఆత్మవేత్తకు కర్మఫలము అనుభవించిన అనంతరమే దేహపతనము అగును. ‘‘్భగేన త్వితరే క్షపపయిత్వా సంపద్యతే’’ అను బ్రహ్మ సూత్రములో ఈ విషయము స్పష్టము చేయబడినది (ఆత్మజ్ఞాని దేహపతనమును, అనారబ్ధకర్మఫలశేషము ఉన్నచో దాని అనుభవమైన పిదపనే పొందును- బ్ర.సూ.4-1-19).
455. ప్రారబ్ధం బలవత్తరం కలు విదాం భోగేన తస్య క్షయః
సమ్యగ్ జ్ఞానహుతాశనేన విలయః ప్రాక్సంజితాగామినామ్
బ్రహ్మాత్మైక్య మవేక్ష్య తన్మయతయా యే సర్వదా సంస్థితాః
తేషాం తత్త్రితయం న హి క్వచిదపి బ్రహ్మైవ తే నిర్గుణమ్॥
ప్రారబ్ధము బలవత్తరము కావున అది బ్రహ్మవేత్తలకు సహితము భోగముతోనే నశించును. జ్ఞానోదయమునకు పూర్వము సమకూడిన సంచిత కర్మఫలము, పరిపూర్ణ జ్ఞానము(సమ్యక్ జ్ఞానము) ప్రాప్తించిన పిదప ఆగామికర్మల ఫలము, జ్ఞానాగ్నిలో నశించిపోవును. ఎవరు బ్రహ్మైక్యత సిద్ధించగా, పరబ్రహ్మమందే తన్మయత్వము చెంది బ్రహ్మీభూతులై నిరంతరము ఉందురో, వారికి త్రివిధకర్మలు అనగా ప్రారబ్ధ, సంచిత, ఆగామికర్మల ఉపభోగము ఉండదు. వారు, త్రివిధ శరీరావస్థలను (జాగ్రత్స్వప్నసుషుప్త్యవస్థలను) అధిగమించి, నాల్గవదైన తురీయావస్థను చేరుకొని, నిర్గుణ బ్రహ్మస్వరూపులై ఉందురు. నిత్యానంద భరితులై ఉన్న అట్టివారే సద్యోముక్తిని పొందినవారు.
456. ఉపాధి తాదాత్మ్య విహీన కేవల
బ్రహ్మాత్మనైవాత్మని తిష్ఠతో మునేః
ప్రారబ్ధసద్భావకథా న యుక్తా
స్వప్నార్థ సమ్బన్ధకథేవ జాగ్రతః
ఏ మునివర్యుడు (ముముక్షువు), దేహేంద్రియాది ఉపాధులతో తాదాత్మ్యము చెందక, ఆత్మసాక్షాత్కారము లభించగా పరబ్రహ్మ స్వరూపమైన తన ఆత్మయందే బ్రహ్మనిష్ఠతో స్థిరుడై అహర్నిశలు ఉండునో, అతనికి ప్రారబ్ధము ఉండుననుట యుక్తముకాదు. మేల్కొని ఉండగా స్వప్నలోకములో ఉన్నాడనే కథనము ఎంత అనుచితమో, అంత నిరాధారమైనదే.
457. న హి ప్రబుద్ధః ప్రతిభాసదేహే
దేహోపయోగిన్యపి చ ప్రపంచే
కరో త్యహన్తాం మమతా మిదన్తాం
కింతు స్వయం తిష్ఠతి జాగరేణ॥
458. న తస్య మిథ్యార్థసమర్థనేచ్ఛా
న సంగ్రహస్త జ్ఞగతో పి దృష్టః
తత్రానువృత్తి ర్యదిచే స్మృషార్థే
న నిద్రయా ముక్త ఇతీష్యతే ధ్రువమ్॥
పై రెండుశ్లోకములను కలిపి చదివినప్పుడే సంపూర్ణంగా వాటి భావము బోధపడును. అందువలన, తాత్పర్యము కలిపి వ్రాయబడినది.
జాగ్రదవస్థలో సావధానముగా ఉన్న ఏ పురుషుడూ, స్వప్నసమయంలో ఉండే దేహస్థితిలోగాని, స్వప్నములు చూచుటకు అనువైన దేహస్థితిని కాని కలిగి ఉండడు. అంతేకాదు, కేవలుడై మననాదులలో నిమగ్నమై, బ్రహ్మతత్పరతతో వౌనముగా ఉండే మునికి, ప్రపంచముతో నిమిత్తము ఉండదు. ప్రాజ్ఞుడైన తత్త్వవేత్త అహంకారము, మమకారము మరియు ఇతరము అనే బుద్ధి కలిగి ఉండదు. ఆ స్థితిలో అవాస్తవిక స్వప్న దృశ్యాలను నెమరువేసుకొని, జాగ్రదవస్థలో అనుకరించటమూ అసంభవము.
తత్త్వవేత్త ఎన్నడూ స్వప్నదృశ్యములు వాస్తవికము, మిథ్యకాదు అని సమర్థించడు. స్వప్న సమయములో భాసించే జగత్తు సత్యమని కూడ విశ్వసించడు. మెలుకువగా ఉన్న సమయములో, స్వప్నావస్థలోనుండే దేహ స్థితి, మనఃప్రవృత్తి కలిగి ఉన్న వ్యక్తి, నిద్రావస్థనుండి ఇంకనూ బయటపడలేదని, స్వప్నజగత్తులో విహరిస్తున్నాడని భావించవచ్చు. కాని, తత్త్వజ్ఞాన పరాయణుడు, జీవన్ముక్తుడు, సావధానముగా ఉన్న సమయములో స్వప్నలోకములో ఉన్నట్లు భావించటము సమంజసము కాదు.
459. తత్వత్పరే బ్రహ్మణి వర్తమానః
సదాత్మనా తిష్ఠతి నాన్యదీక్షతే
స్మృతిర్యథా స్వప్నవిలోకితార్థే
తథా విదః ప్రాశసనమోచనాదౌ॥
స్వప్న జగత్తును వీడి, జాగ్రదవస్థకు చేరుకున్న వానివలె పరబ్రహ్మమందే లగ్నమైన మనస్సుగలవాడు, సద్రూపమైన ఆత్మలో లీనమై ఉండును. అనగా స్వస్వరూపమైన ప్రత్యగాత్మయందే బుద్ధి నివేశము కలవాడై ఉండును. అందవలన, బ్రహ్మపదార్థమును తప్ప మరి దేనిని ఆతడు గమనించడు. నలుదిశలా అద్వితీయమైన సత్యస్వరూపమే (బ్రహ్మమే) వానికి గోచరించును.
జీవన్ముక్తుడైననూ ఉదరపోషణార్థము అన్నపానీయములను స్వీకరించే మనస్తత్త్వము కలిగి ఉండుననే సందేహనివృత్తి కూడ చేయబడినది. ఆత్మవేత్త స్వప్నదృశ్యములు మిథ్య అనే ఎట్లు నిశ్చిత బుద్ధి కలిగి ఉండునో, అట్లే ప్రకాశిస్తున్న ప్రపంచమంతా అసత్, మిథ్య అనే నిశ్చతబుద్ధితో ఉండును. లౌకిక కార్యకలాపములపైకి అతని దృష్టి ఎన్నడూ మరలదు. అట్లే, భోజన విసర్జనాదులందునూ అత్యంత ఉదాసీనత చూపును..
460. కర్మణా నిర్మితో దేహః ప్రారబ్ధం తస్య కల్ప్యతామ్
నానాదేరాత్మనో యుక్తం నైవాత్మా కర్మనిర్మితః॥
దేహము కర్మఫలమును అనుసరించి నిర్మితవౌతున్నది. గత జన్మలలో చేసిన పుణ్యకర్మల వలన మానవజన్మ, పాపకర్మల ఫలితముగా శునకాది జన్మ, హీనకర్మలవలన క్రిమికీటకాది జన్మ, నిషిద్ధ కర్మలవలన స్థాణువాది జన్మ, ప్రాణులు పొందుతున్నవని శాస్త్ర పరిచయమున్నవారందరికీ విదితమే. ప్రారబ్ధకర్మ ఫలితముగానే, ప్రస్తుత జన్మలో ప్రాప్తమైన ఈ దేహమునకు సుఖ దుఃఖములు ఉపభోగవౌతున్నవి. దేహప్రాప్తితో ముడిపడి ఉన్నదే ప్రారబ్ధము. దేహము ఎంతవరకు ఉండునో, అంతవరకు ప్రారబ్ధకర్మ ఫలము అనుభవించవలసి ఉండునని తొలుత స్పష్టము చేయబడినది.
ఇంకా ఉంది