మెదక్

సాగునీరు అందించడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, డిసెంబర్ 8: వ్యవసాయ రంగానికి సాగు నీటిని పూర్తిస్థాయిలో అందించి కోటి ఎకరాల మాగాణిని పచ్చగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. 40 వేల ఎకరాలకు సాగునీటిని అందించడానికి సింగూర్ ప్రాజెక్టు వద్ద నిర్మించిన ఎం.బాగారెడ్డి సింగూర్ కాలువలు, సిలారపు రాజనర్సింహా ఎత్తిపోతల పథకానికి నీటిని విడుదల చేసి గురువారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని బాగు చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంటే కాంగ్రెస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. సింగూర్ నీటిని సాగుకు అందించాలని డిమాండ్ చేస్తూ కెసిఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు సోనియా వద్ద పంచాయతీ పెట్టారని, దీంతో అప్పటి సిఎం వైఎస్‌ఆర్‌ను ఢిల్లీకి పిలిపించి ఎఐసిసి ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ సమక్షంలో సింగూర్ ఎత్తిపోతల పథకాన్ని 2006లో మంజూరు చేసారని గుర్తు చేసారు. పథకం మంజూరై ఎనిమిది నెలలు గడచినా ఏ మాత్రం ముందుకు సాగలేదన్నారు. ఎనిమిదేళ్లలో 56 కోట్లు ఖర్చు చేస్తే తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో 50 కోట్లు ఖర్చు చేసామన్నారు. అప్పట్లో 83 కిలోమీటర్ల కాలువలు మాత్రమే తవ్వితే తాము 87 కిలోమీటర్లు తవ్వించామని, వారి హయాంలో 202 కల్వర్టులు నిర్మిస్తే తాము 264 నిర్మింపజేసామన్నారు. పనుల వ్యత్యాసాన్ని గమనిస్తే ఎవరి చిత్తశుద్ధి ఎంతో తెలుస్తుందన్నారు. రబీ సీజన్‌లో 40 వేల ఎకరాల్లో చివరి పొలం వరకు సాగునీటిని అందించడానికి ఇరిగేషన్ అధికారులు రేయింబవళ్లు కష్టపడ్డారని అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక టిఎంసి నీటితో 6 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని చెప్పిన నాటి పాలకులు తెలంగాణాలో మాత్రం 2 టిఎంసిలతో 40 వేలు సాగు చేసుకోవాలని నిర్దేశించడం దురదృష్టకరమన్నారు. 40 వేల ఎకరాల మాగాణి సాగుకు 4 టిఎంసిల నీటిని సమకూరుస్తామని రైతులు ఉత్సాహాంగా పంటలను సాగు చేయాలని సూచించారు. సాగు నీరు లేక, ప్రకృతి సహకరించక వలసలు వెళ్లిన రైతులంతా తిరిగి వచ్చి పొలాల్లో నడియాడలన్నారు. తెలంగాణాకు సాగునీటిని అందించడానికి తాను నీరడి పాత్రను పోషిస్తే ఇంజనీర్లు మేస్ర్తి పాత్ర పోషిస్తున్నారని అన్నారు. రెండు పంటలను పండించి రైతులు గర్వంగా బతికేలా వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. సింగూర్ జల దోపిడిని గమనించిన తమ అధినేత 2001లోనే సింగూర్ సింహగర్జన నిర్వహించి అప్పటి పాలకులకు హెచ్చరికలు పంపించారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసారు. ఓట్లను దండుకోవడానికి అవాక్కులు చవాక్కులు విసిరారని, ధర్నాలు, రాస్తారోకోలు చేయడం మొత్తం రైతులను తప్పుదారి పట్టించడానికేనని విమర్శించారు. అందోల్, పుల్‌కల్, సదాశివపేట, మునిపల్లి మండలాలకు పూర్తిస్థాయిలో సాగునీటిని అందించి తీరుతామన్నారు. అందోల్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే బాబుమోహన్ ఎత్తిపోతల పథకం పూర్తి కావడంలో అమితమైన పాత్రను పోషించారన్నారు. గతంలో కాంగ్రెస్, టిడిపిల పాలనను చూసారని రైతులపై వారికున్న ప్రేమ ఏమిటో, వ్యవసాయ అభివృద్ధికి నాటి పాలకుల పని తీరు, రెండేళ్ల టిఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరును పరిశీలించాలన్నారు. మొట్టమొదటి సారిగా సింగూర్ కాలువల ద్వారా రైతాంగానికి సాగునీరు అందుతుందని, ఈ విషయంలో వ్యవసాయ శాఖ కూడా ఉత్సాహంగా పని చేయాలన్నారు. రైతులకు కావల్సిన విత్తనాలు, ఎరువులు, ఆధునిక సాగు విధానంపై అవగాహన కల్పించాలన్నారు. ప్రజాప్రతినిధులు, రైతులు, అధికారులు సమన్వయంతో ఉంటే వ్యవసాయం లాభసాటిగా మారుతుందన్నారు. పట్టణాలు, పల్లెసీమలు అనే తేడాలేకుండా 24 గంటల పాటు కరెంటు సరఫరా అవుతండగా వ్యవసాయానికి పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మన ఊరిలో మనం గర్వంగా బతుకుతామనే భరోసా తెలంగాణ ప్రజల్లో వచ్చే వరకు సిఎం కెసిఆర్ విశ్రమించబోరన్నారు. ఎత్తిపోతల పథకం ప్రారంభించిన అనంతరం సిబ్బంది కోసం నిర్మించిన క్వార్టర్లను ఎమ్మెల్యే బాబుమోహన్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. రెండేళ్లలో పనులు పూర్తయ్యేందుకు శ్రమించిన ఇరిగేషన్ అధికారులందరిని మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మానిక్యరాజ్ కణ్ణన్, ఎమ్మెల్యే బాబుమోహన్, డిసిఎంఎస్ చైర్మన్ సిద్దన్న పాటిల్, మాజీ ఎంపి మానిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, ఎస్‌ఈ పద్మారావు, ఈఈ రాములు, జడ్పీటిసిలు, ఎంపిపిలు, సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
టెన్త్‌లో వంద శాతం
ఉత్తీర్ణత సాధించాలి
* ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి: కలెక్టర్
సంగారెడ్డి టౌన్, డిసెంబర్ 8: పదవ తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకరావాలని కలెక్టర్ మాణిక్యరాజ్ ప్రధానోపాధ్యాయులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కలెక్టర్ ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్దం చేయడం, వివిధ సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. విద్యార్థులందరికీ ఒకే విధమైన అవగాహాన శక్తి ఉండదని, ఉపాధ్యాయులే బాధ్యతగా తీసుకొని అర్థమయ్యేలా బోధించాలన్నారు. ఫైనల్ పరీక్షలకు ఎక్కువ ఒత్తిడి లేకుండా ఇప్పటి నుండే నమూన పరీక్షలు నిర్వహించాలన్నారు. ఎలాంటి మాస్ కాపీంగ్‌కు తావులేకుండా అధిక ఉత్తీర్ణత శాతం సాధించేలా చొరవ చూపాలన్నారు. సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విద్యావ్యవస్థపై
ప్రజల్లో నమ్మకం పెంచాలి
డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి
సిద్దిపేట, డిసెంబర్ 8: ప్రభుత్వ విద్యావ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా జిల్లాలో చర్యలు తీసుకోవాలని డిప్యూటి సిఎం, విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి అన్నారు. గురువారం రాత్రి కలెక్టర్, డిఇఓతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఈనెల 14న జరిగే కలెక్టర్ల సమావేశానికి జిల్లా విద్యాప్రణాళిక రూపొందించుకొని పూర్తి సమాచారంతో రావాలన్నారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థలు, విద్యార్థులు, ఉన్న వసతి సమాచారం ఉండాలని, పాఠశాలల ఎన్‌రోల్‌మెంట్, డిటెన్షన్, అకాడమిక్ ప్రమాణాలు, టెన్త్ ఫలితాలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యల పై నివేదికఇవ్వాలని సూచించారు. వచ్చే 5ఏండ్లలో విద్యాప్రణాళిక తయారు చేసుకోవాలని, ఇందుకు విద్యాశాఖ సర్వశిక్ష అభియాన్ అధికారులతో సమావేశాలు నిర్వహించి తుదిరూపు ఇవ్వాలన్నారు. మార్చి 2017లో టెన్త్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, మరో 3నెలలు ఉన్నందున ఇప్పటి నుంచే ఫలితాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో 381కెజిబివిల్లో 73వేల మంది విద్యనభ్యసిస్తున్నారని, 192మోడల్ స్కూళ్లు ఉన్నాయన్నారు.
జిల్లా అధికారులంతా కెజిబివి, మోడల్‌స్కూళ్లకు కేటాయించిన వారు దత్తత తీసుకునేలా సరైన పర్యవేక్షణకు కృషి చేయాలన్నారు. వచ్చే యేడు అన్ని పాఠశాలల్లో డిజిటల్ తరగతులు అమలు చేస్తామని, కలెక్టర్లు ఫ్రత్యేక దృష్టి పెట్టి తీర్చిదిద్దాలన్నారు. రాష్ట్రంలో 17జిల్లాలకు ఉలెన్ బ్లాంకెట్లు అందిస్తారన్నారు. కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ విద్యావ్యవస్థ సరిగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈకార్యక్రమంలో డిఆర్డీఓ సత్యనారాయణరెడ్డి, డిపిఓ సురేష్‌బాబు, డిఇఓ కిష్టారెడ్డి, ఆర్డీఓ ముత్యంరెడ్డి పాల్గొన్నారు.

అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు
మెదక్ జిల్లా ఎస్పీ చందనాదీప్తి
కొల్చారం, డిసెంబర్ 8: మంజీర నుండి, అడవుల నుండి అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని మెదక్ జిల్లా ఎస్పీ చందనాదీప్తి అన్నారు. గురువారం కొల్చారం పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. స్టేషన్‌లో ఉన్న రికార్డులను, పోలీస్ క్వార్టర్లను, మంచినీటిని పరిశీలించిన అనంతరం విలేఖరులతో మాట్లాడారు. ఇసుక అక్రమంగా తరలిస్తే ట్రాక్టర్లను సీజ్ చేసి కేసులు పెట్టి జైలులో పెడతామన్నారు. అలాగే వాహనదారులు హెల్మెట్, ఆర్‌సి, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే లైసెన్స్ రద్దుతో పాటు కఠినమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. గ్రామాల్లో అక్రమంగా బెల్ట్ షాపులు నడుపుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, వెంటనే షాపులపై దాడి చేసి చర్యలు చేపడతామని ఎస్పీ హెచ్చరించారు. రాత్రి పూట పోలీసులు తప్పనిసరి గ్రామాల్లో గస్తీ చేపట్టాలని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు. చిల్లర దొంగతనాలు చేసినట్లయితే వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఎస్పీ వెంట డిఎస్పీ నాగరాజు, సిఐ రామకృష్ణ, ఎస్సై విద్యాసాగర్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
ఆర్‌అండ్‌బి కార్యాలయానికి 3.65కోట్లు
మంత్రి హరీష్‌రావు
సిద్దిపేట, డిసెంబర్ 8: సిద్దిపేట జిల్లా, సబ్‌డివిజనల్ ఆర్‌అండ్‌బి కార్యాలయం భవన నిర్మాణానికి 3.65కోట్లు మంజూరైనట్లు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఈమేరకు జిఓ 740 ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. గురువారం ఆయన స్థానిక విలేకర్లతో ఫోన్‌లో మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాగా ఏర్పడినందున ఆర్‌అండ్‌బి భవనం ఇరుకుగా ఉండి పార్కింగ్‌కు ఇబ్బందిగా ఉందన్నారు. ఇందుకోసం ఆర్‌అండ్‌బి జిల్లా, సబ్‌డివిజనల్ కార్యాలయాలు అన్ని హంగులతో నిర్మిస్తామన్నారు. ఈ భవనాల కోసం గతంలోనే స్థలం కేటాయించారని, ఇప్పుడు పరిపాలన అనుమతులు లభించి నిధులు మంజూరైనందున టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనుల ప్రారంభానికి చర్యలు తీసుకుంటామన్నారు.
భగవన్నామ జపం అన్నింటికంటే శ్రేష్ఠం
* ఫలితం ఆశించకుండా సేవ చేయాలి
* కోహీర్ ఓంకారేశ్వరాలయ పీఠాధిపతి
సద్గురు దక్షిణామూర్తి దీక్షితులు
సంగారెడ్డి టౌన్, డిసెంబర్ 8: భగవన్నామ జపం అన్నింటికంటే శ్రేష్ఠమైందని, వేదాలలో సర్వ విజ్ఞానం దాగి ఉందని, ఫలితం ఆశించకుండా చేస్తే పరమాత్మ కృప లభిస్తుందని కోహీర్ ఓంకారేశ్వరాలయ పీఠాధిపతి శ్రీ సద్గురు దక్షిణామూర్తి దీక్షితులు అన్నారు. గురువారం సంగారెడ్డి పట్టణంలోని శ్రీనగర్ కాలనీలోని శ్రీ విఠలేశ్వరాలయంలో సద్గురు దక్షిణామూర్తి దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో నిర్వహించిన వేద విజ్ఞాన ప్రాముఖ్యతపై సత్సాంగంలో ప్రసంగించారు. దయకు మించిన ధర్మం, హింసకు మించిన పాపం, బ్రహ్మచార్యానికి మించిన వ్రతం, శాంతికి మించిన సుఖం, జ్ఞానానికి మించిన పవిత్రత, సత్యానికి మించిన తపస్సు, పరమాత్మను మించిన జ్యోతి విశ్వంలో లేవని సమస్త వేదాల సారం తెలుపుతుందన్నారు. కృషి చేయడం వల్ల దరిద్రం, జపం చేయడం వల్ల పాపం, వౌనం వహిస్తే కలహాలు, అప్రమత్తంగా ఉంటే భయాలు దరి చేరవని సామవేదం పేర్కొంటుందన్నారు. యజుర్వేదం మహాత్ములతో సంబంధం, మోక్షాపేక్ష కలిగి ఉండాలని సూచిస్తుందన్నారు. రుగ్వేదం కీర్తి, జ్ఞానం వస్తే పోవని, యవ్వనం, కాలం, పరువు పోతే తిరిగి రావని, పేదరికం, వ్యాధి, ధనం వచ్చిపోతాయని, పాపం, పుణ్యం వెంటే వస్తాయని వివరిస్తుందన్నారు. భక్తుల తమ శక్తిమేర సమాజహిత కార్యాలు చేపట్టి మానవ జన్మను సార్ధకం చేసుకోవాలని సూచించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో భక్తులు, సుహృద్భావ సంస్థ సభ్యులు పాల్గొన్నారు.
10నుండి విఠలేశ్వరాలయంలో గీతా జయంతి ఉత్సవాలు
ఈ నెల 10వ తేదీ నుండి విఠలేశ్వరాలయంలో సద్గురు దక్షిణామూర్తి దీక్షితుల ఆధ్వర్యంలో గీతా జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. 10న ఉదయం పవమానసూక్త అభిషేకం, పూజ, అర్చన, సంకీర్తలు, 11న గోపాలకాల, పల్లకిసేవ, అన్నదానం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విఠలేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఉద్యోగులకు త్వరలోనే పిఆర్సీ
* టిఎన్జీఓ గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్
సిద్దిపేట, డిసెంబర్ 8: తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ దీక్ష , అమరుల త్యాగం , ఉద్యోగుల పోరాటంతోనే సాధ్యమైందని టిఎన్జీఓ గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. గురువారం టిఎన్జీఓ భవన్‌లో దీక్ష దివస్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు ప్రత్యేక గుర్తింపు ఉందని, మలిదశ ఉద్యమం ఇక్కడి నుంచే ప్రారంభమైందన్నారు. ఫ్రీజోన్ సమస్య పరిష్కారానికి సిద్దిపేటలో నిర్వహించిన ఉద్యోగ గర్జన రాష్టస్రాధనకు ఊతమిచ్చిందన్నారు. ఉద్యోగులు మొదటిసారి పెన్‌డౌన్ ఇక్కడే చేశారన్నారు. రాష్ట్రం సాధించే వరకు ఉద్యమానికి ఉద్యోగులు అండగా నిలిచారన్నారు. రాష్టస్రాధనలో పెన్‌డౌన్, సకలజనుల సమ్మె, సహాయ నిరాకరణ చరిత్రలో నిలుస్తాయన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు చేయూతనిచ్చి స్నేహపూర్వకంగా నిలుస్తుందన్నారు. ఇంక్రిమెంట్, వేతనం పెంపు తదితరమైనవి చేపట్టిందన్నారు. 9నెలల పిఆర్సీ, హెల్త్‌కార్డులు మాత్రమే రావాలన్నారు. హెల్త్‌కార్డుల కోసం కార్పొరేట్ హాస్పిటల్స్‌తో చర్చలు జరుపుతుందని, త్వరలోనే మంజూరైతాయన్నారు. పిఆర్సీ 9నెలలు చెల్లించేందుకు 450కోట్లు అవసరమైతాయని, ఈ యేడు 50, వచ్చేయేడు 50శాతం ఇచ్చేందుకు సానుకూలంగా ఉందన్నారు. దీక్ష దివస్‌ను యేటా ఉత్సవంగా జరుపుకోవాలన్నారు.
రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో టిఎన్జీఓలు ముఖ్యపాత్ర నిర్వహించాలన్నారు. 14ఎఫ్, 610జిఓ ఎన్నో ఉద్యమాలు చేపట్టారన్నారు. కొత్తజిల్లాలతో 2200రెవెన్యూ పోస్టులు మంజూరైనాయని, మిగతా పోస్టుల కోసం ప్రతిపాదనలు సిద్దమైనాయన్నారు. విఆర్‌ఓలకు గ్రామాల్లో కార్యదర్శిగా నియమించాలని కోరగా సానుకూలంగా స్పందించిందన్నారు. కేంద్రం నోట్లరద్దు వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. భావితరాలకు ఉద్యమ చరిత్ర అందించాలన్నారు. గాయకుడు దేశపతి శ్రీనివాస్‌మాట్లాడుతూ ఉద్యమ చరిత్ర, ముఖ్యఘట్టాలను కాపాడుకోవాలన్నారు. విజయాన్ని చేకూర్చిన దీక్షదివస్‌ను గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు రాజేందర్, జగదీశ్వర్, భీంరావు, పాపయ్య, పరమేశ్వర్, శ్రీహరి పాల్గొన్నారు.
కొనసాగుతున్న నగదు బదిలీ సర్వే
-అకౌంట్లు లేనివారికి అకౌంట్లు, కార్డులు
-కమిషనర్ రమణాచారి
సిద్దిపేట, డిసెంబర్ 8: పెద్దనోట్వ రద్దుతో సామాన్య ప్రజల ఇక్కట్లు తొలగించేందుకు నగదు రహితమే ప్రత్యామ్నాయమని మున్సిపల్ కమిషనర్ రమణాచారి అన్నారు. ఇందులో భాగంగా పట్టణంలో నగదు రహితంపై ప్రత్యేక బృందాలు ఇంటింటా తిరుగుతూ సర్వే చేపట్టారు. పట్టణంలోని నగదు రహితంగా మార్చేందుకు సర్వేకోసం 38బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 150మందికి ఇద్దరు అధికారులు, బ్యాంకు అధికారి చొప్పున సర్వే చేపట్టి వారికి అకౌంట్లు ఉన్నాయా, ఏటిఎం, డెబిట్,క్రెడిట్, రూపే కార్డులు ఉన్నాయా, అకౌంట్లు లేనివారికి అకౌంట్, కార్డులు ఇచ్చేందుకు కృషి చేస్తున్నారు. అలాగే వ్యాపారులకు స్వైప్ మిషన్లపై అవగాహన కల్పిస్తున్నారన్నారు. గురువారం పట్టణంలో 5,32,1,6,2,10వార్డుల్లో నగదురహితంపై సర్వే చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ప్రభాకర్, మల్లిఖార్జున్, వేణుగోపాల్‌రెడ్డి, లలిత, నేతలు రామన్న, చెన్నప్ప, బ్రహ్మం పాల్గొన్నారు.
అక్రమ నిర్మాణాల కూల్చివేత
పటన్‌చెరు, డిసెంబర్ 8: పటన్‌చెరు నియోజకవర్గంలోని అమీన్‌పూర్ గ్రామ పరిధిలోని లేవుట్లపై హెచ్‌ఎండిఏ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా జరిపిన నిర్మాణాలను నేలమట్టం చేసారు. స్థానిక పంచాయతి అధికారులతో కలిసి హుడా అధికారులు పలు వెంచర్లపై విరుచుకుపడ్డారు. లేవుట్‌కు హుడా అనుమతి లేకపోవడమే కాకుండా అందులో ఇండ్ల నిర్మాణం సైతం చేపట్టడంతో అధికారులు ఆగ్రహించారు. గ్రామ పంచాయతి నుండి తీసుకున్న అనుమతులు ఎట్టి పరిస్థితులోను చెల్లవని స్పష్టంచేసారు. జెసిబిలతో కూల్చివేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు కూల్చివేతలు కొనసాగాయి. అమీన్‌పూర్ గ్రామ పంచాయతి భవనానికి అతి దగ్గరలో గల సుప్రజ లేవుట్‌లో నిర్మించిన ఇండ్లను ముందుగా కూల్చిన అధికారులు అక్కడి నుండి ఆక్సిస్ పాప పేరిట ఉన్న లేఅవుట్‌కు చేరుకున్నారు. అందులో నిర్మాణంలో ఉన్న ఐదు ఇండ్లను కూల్చారు. ఇంతేకాకుండా అందులోనే గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇంటిని పాక్షికంగా ధ్వంసం చేసారు. ఆ తర్వాత ఆక్సిస్ పాప లేఅవుట్ ప్రక్కన గల శంకర్ హోం పేరిట నిర్మించిన ఇండిపెండెంట్ ఇండ్ల వద్దకు వెళ్లాలని ప్రయత్నించగా సదరు యజమానుల నుండి నిరసన వ్యక్తమైంది. ఎల్‌ఆర్‌ఎస్ పధకం క్రింద హుడాకు అనుమతులకు కోసం ధరఖాస్తు చేసుకున్నామని వారు తెలిపారు. కేవలం వారం రోజుల లోపల తమకు అవసరమైన అన్ని అనుమతులు అందుతాయని ఆశాభావం వెలుబుచ్చారు. అప్పటి వరకు సమయం ఇవ్వాలని హెచ్‌ఎండిఏ అధికారులను కోరారు. ముందుగా తమకు తెలియక హుడా అనుమతులు తీసుకోలేదని, ఎంత ఫీజైనా కట్టడానికి ప్రస్తుతం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసారు. వారి విజ్ఞప్తిని మన్నించిన హెచ్‌ఎండిఏ అధికారులు అక్కడి నుండి వెనుదిరిగారు. మధ్యాహ్న భోజన అనంతరము సైతం కూల్చివేతలు కొనసాగించారు. గ్రామ శివారులలో గల సమ్మక్క సారక్క దేవాలయం ఆవరణలో నూతనంగా వెలసిన వెంచరును అడ్డుకున్నారు. అందులో నిర్మాణంలో ఉన్న ఫిల్లర్లను కూల్చివేసారు. హెచ్‌ఎండిఏ అనుమతి లేనిదే లేఅవుట్ చేయడానికి వీలులేదని తెలియచేస్తూ దానికి అడ్డంగా కందకం మాదిరిగా గొయ్యి తీసి వదిలేసారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.