మెదక్

పుల్లూరు బండ జాతర పోస్టర్ ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జనవరి 19 : ఈనెల 26 నుండి 30వ తేదీ వరకు ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగునున్న సిద్దిపేట మండలం పుల్లూరు స్వయంభూ లక్ష్మి నరసింహస్వామి బండ జాతర పోస్టర్లు, కరపత్రాలను నారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రామలింగారెడ్డి, రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్ రసమయి బాలకిషన్, జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి ఆవిష్కరించారు. ఆలయ అర్చకులు కలకుంట్ల రంగచార్యులు, వెంకట నరసింహాచార్యులు, కృష్ణమాచార్యులు, శేషుకుమార్, వీణాచారిలు, సర్పంచ్ సరోజన ఆంజనేయులు మంత్రి హరీష్‌రావు, ఎంపి రామలింగారెడ్డి, ఎమ్మెల్యేలకు రామలింగారెడ్డి, రసమయి బాలకిషన్‌లకు ఆహ్వాన పత్రికలు అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ పుల్లూరు బండ జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. జాతరకు వచ్చె భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. జాతర ఉత్సవాలకు హాజరుకానున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ తిరుపతిరెడ్డి, నాయకులు ఉడుత మల్లేశం, కోడూరి శ్రీనివాస్, సుధాకర్, ఐత నాగరాజు, గంట శేఖర్, వైజయంత్ తదితరులు పాల్గొన్నారు.

సిద్దిపేట వేంకటేశ్వరాలయం హుండీ లెక్కింపు
23 రోజులకు రూ. 4,96,582

సిద్దిపేట, జనవరి 19 : సిద్దిపేట మోహినిపురా వేంకటేశ్వరాలయం హుండీ ఆదాయం 23 రోజులకు 4.96,582 రూపాయలు వచ్చినట్లు ఆలయ ఈఓ శ్రీనివాసశర్మ తెలిపారు. గురువారం ఆలయ ప్రాంగణంలో దేవదాయ, ధర్మదాయశాఖాధికారుల సమక్షంలో హుండి లెక్కింపు నిర్వహించారు. 23రోజులకు 4,96, 582 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం ఉన్నందున అధికంగా ఆదాయం వచ్చినట్లు దేవదాయ శాఖాధికారులు తెలిపారు. సహాయ కమిషనర్ శ్రీనివాస్, జిల్లా ఇన్స్‌పెక్టర్ శివరాజ్, చైర్మన్ అమరేష్ విష్టు, ఆలయ అర్చకులు రఘనాథచార్యులు, కృష్ణమాచార్యులు, వెంకటరమణాచార్యులు, సిబ్బంది మైసాగౌడ్, అమర్, శంకర్, బిక్షపతి, శ్రీనివాస్, వికాస తరంగణి భక్తులు తదితరులు పాల్గొన్నారు.

రూ. 2.80 లక్షల పెన్షన్ స్వాహాపై విచారణ
రికవరీకి కమిషనర్‌కు ఆదేశాలు
డిఆర్‌డిఓ సీతారామరావు వెల్లడి
మెదక్, జనవరి 19: జిల్లాలో ఆసరా పెన్షన్ల కింద రూ.14 కోట్ల 86 లక్షల 71 వేలు చెల్లిస్తున్నామని డిఆర్‌డిఓ సీతారామరావు గురువారం ఇక్కడ మాట్లాడుతూ తెలిపారు. జిల్లాలో అన్ని రకాల పెన్షన్‌దారులు 94 వేల 452 మంది ఉన్నట్లు తెలిపారు. మున్సిపాలిటీలో అవుట్‌సోర్సింగ్ వర్కర్ నవీన్ స్వాహా చేసిన 2 లక్షల 80 వేలకు కమిషనర్ బాధ్యత వహించాల్సి ఉందన్నారు. రికవరీకి కమిషనర్‌కు లేఖ రాసినట్టు ఆయన తెలిపారు. ప్రజావాణి కార్యక్రమాల్లో వచ్చిన పెన్షన్ల దరఖాస్తులను ఎంపిడిఓలతో విచారణ జరపాలని ఆదేశాల జారీ చేశామన్నారు. పెన్షన్లకు అర్హుల జాబితాలు వచ్చిన వెంటనే సిఆర్‌డికి పెన్షన్ మంజూరుకు నివేదిక సమర్పిస్తామని తెలిపారు. ఈ విధంగా అర్హులైన పెన్షన్‌దారులందరినీ ఆదుకుంటామని ఆయనవెల్లడించారు.

యాసంగి పంటలకు రెండు విడతలుగా సింగూర్ నీరు
నీటి పారుదల శాఖ ఘణపురం ప్రాజెక్ట్ ఇఇ శివనాగరాజు
మెదక్, జనవరి 19: యాసంగి పంటలకు సింగూర్ నుండి 2.5 టిఎంసిల నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రకటించిందని నీటి పారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శివనాగరాజు గురువారం ఇక్కడ మాట్లాడుతూ తెలిపారు. ఈ నీటిని ఎనిమిది విడతలుగా విడుదల చేస్తారని తెలిపారు. ఇప్పటికే రెండు విడతలుగా నీటిని విడుదల చేశారని ఆయన తెలిపారు. 2.5 టిఎంసి నీళ్లలో 0.45 టిఎంసిల నీటిని ఘణపురం ఆయకట్టుకు విడుదల చేశారని ఆయన తెలిపారు. ఎంఎన్ కెనాల్ నక్కవాగు వరకు నీళ్లు పారుతాయన్నారు. ఇక్కడ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ప్రకారం 7 వేల ఎకరాలకు నీరందిస్తున్నట్లు తెలిపారు. యాసంగి రెండవ పంటకు ఎఫ్‌ఎన్ కెనాల్‌కు 8 వేల ఎకరాలకు నీరు అందిస్తున్నట్లు తెలిపారు. కానీ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ లెక్కల ప్రకారం 15 వేల ఎకరాలు చూపిస్తున్నప్పటికీ రైతులు మాత్రం అదనంగా మరో 20 వేల ఎకరాలు వరి సాగు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అంటే ఎంఎన్, ఎఫ్‌ఎన్ కెనాల్ క్రింద మొత్తం 32 వేల ఎకరాల వరిసాగు చేస్తున్నట్లు తెలిపారు. ఎఫ్‌ఎన్ కెనాల్ ఘణపురం నుండి ఎల్లాపూర్ వరకు నీళ్ల పారకం జరుగుతుందన్నారు. ఎఫ్‌ఎన్ కెనాల్ కిందనే అత్యధికంగా వరిసాగు జరుగుతోందని తెలిపారు. ఏప్రిల్ మొదటి వారం వరకు సింగూర్ నీళ్లను విడుదల చేసుకోడానికి ప్లానింగ్ చేసుకున్నట్లు శివనాగరాజు తెలిపారు. ఎంఎన్ కెనాల్ నక్కవాగు వరకు నీళ్ల పారకం జరిగినప్పటికీ అక్కడి నుండి చివరి ఆయకట్టు వరకు నీళ్లు చేరేందుకు 1.5 కిలోమీటర్లు సింగిల్ గైడ్‌వాల్ కూడా నిర్మించామన్నారు. ఘణపురం ఆనకట్ట పెచేందుకు 43.6 కోట్లు ప్రభుత్వం మంజూరు ఇచ్చిందన్నారు. ఎంఎన్, ఎఫ్‌ఎన్ కెనాల్‌కు 21.6 కోట్లు మంజూరు చేయగా అందులో టెండర్‌లో 16 కోట్లకుగాను 12 కోట్లు కెనాల్స్ నిర్మాణానికి వ్యయపరిచినట్లు తెలిపారు. మిగిలిన నాలుగు కోట్ల పనులు ఏప్రిల్ తరువాత కాంట్రాక్టర్ చేపట్టారని తెలిపారు. ప్రస్తుతం యాసంగి పంటలకు నీటిని వదలడం లే దని, పనులు పెండింగ్‌లో పడ్డాయని తెలిపారు. ఎంఎన్, ఎఫ్‌ఎన్ కాలువలకు మొత్తం 140 స్లూయస్ పనులు పూర్తయ్యాయని, ఇందుకు 70 లక్షలు వ్యయపరిచినట్లు తెలిపారు.

గొర్రెల మందపై కుక్కల దాడి
40 గొర్రెలు మృతి
ములుగు, జనవరి 19: నిద్రిస్తున్న గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో 40 గొర్రెలు మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి 10 గంటలకు కొక్కొండలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గేద చిన్నయాదయ్య రోజులాగే గొర్రెలను దొడ్డిలోకి తోలి భోజనం చేసి వచ్చేలోగా గొర్రెలపై గ్రామంలోని కుక్కలు దాడి చేశాయని, అక్కడికక్కడే 40 గొర్రెలు మృత్యువాత పడ్డాయని రోదించాడు. సుమారు వీటి విలువ 2 లక్షలు ఉంటుందని, ఈ సంఘటనతో తన కుటుంబం వీధిన పడిందని, కనుక ప్రభుత్వం ఆదుకోవాలని యాదయ్య వేడుకుంటున్నాడు.

చెరువులో పడి ఒకరి మృతి

గజ్వేల్, జనవరి 19: గజ్వేల్ నియోజకపరిధిలోని పాములపర్తిలో గురువారం ఒకరు చెరువులో పడి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి బాధితులు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పోతరాజు కనకయ్య (30) బతుకుదెరువు నిమిత్తం రంగారెడ్డి జిల్లా కౌకూరులోని ఓ డెయిరీఫాంలో పనిచేస్తున్నాడు. అయితే పాములపర్తిలో ఆయన బందువులొకరు మృతి చెందగా, అంత్యక్రియల కోసం వచ్చాడు. కాగా గ్రామ శివారులోని కర్రోనికుంటలో స్నానం చేస్తుండగా నీట మునిగి మృతి చెందాడు. బాదితుల ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుండగా, మృతుడు కనకయ్యకు బార్య కవిత, ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు.

ఆసరా పింఛన్ల పంపిణీలో అక్రమాలు!?
చనిపోయిన వ్యక్తి పింఛన్ స్వాహా చేసిన సిబ్బంది!

నర్సాపూర్, జనవరి 19: వ్యక్తి చనిపోయి 19 నెలలైనా పింఛన్ మాత్రం యథాతథంగా నెలనెల డ్రా అవుతున్న సంఘటన గురువారం వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన మృతుని కుమారుడు ఉస్మాన్ అందించిన వివరాలిలా ఉన్నాయి. నర్సాపూర్‌కు చెందిన మహమ్మద్ ఇస్మాయిల్ వృద్ధాప్య పింఛన్ పొందుతూ 2015 జూన్ 1వ తేదీన చనిపోయాడు. తదనంతరం మృతుని భార్య జాహెదాబేగంకు అదే సంవత్సరం నవంబర్ నెల నుంచి వితంతు పింఛన్ ప్రారంభమైంది. జాహెదాబేగం పింఛన్ అప్లికేషన్ సమయంలో ఇస్మాయిల్ చనిపోయిన డెత్ సర్ట్ఫికెట్ సైతం జోడించాడు. అయనా అధికారులు చనిపోయిన ఇస్మాయిల్‌కు సంబంధించిన పింఛన్‌ను ఆన్‌లైన్‌లో తొలగించకపోవడంతో యధావిధిగా చనిపోయిన ఇస్మాయిల్ పింఛన్‌ను పోస్టల్‌శాఖలో పనిచేస్తున్న సిబ్బంది ఒకరు బయోమెట్రిక్ ద్వారా పంచాయతీ ఈఓ వేలిముద్రలతో స్వాహా చేస్తున్నట్లు బయటపడింది. చనిపోయిన వ్యక్తులను గుర్తించాల్సిన ఈఓ పోస్టల్ సిబ్బంది మాటలు నమ్మి వేలిముద్రలు వేయడం గమనార్హం. ఈ విషయమై చనిపోయిన ఇస్మాయిల్ కుమారుడు సంబంధిత పోస్టల్ సిబ్బందిని ప్రశ్నించగా పింఛన్‌ను తీసుకుంటున్నది నిజమేనని ఒప్పుకున్నట్లు తెలిసింది.

కార్మిక, కర్షక సమస్యలపై ఉద్యమిస్తాం
* రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి
* సిఐటియు రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున్

సంగారెడ్డి టౌన్, జనవరి 19: రైతాంగం పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించడం లేదని, కార్మిక, కర్షకుల సమస్యలపై ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జె.మల్లికార్జున్ హెచ్చరించారు. గురువారం స్థానిక కేవల్ కిషన్ భవన్‌లో సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక, కర్షక జిల్లా సదస్సును నిర్వహించారు. మల్లికార్జున్ మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా ఎక్కడా కూడా కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకుండా యాజమాన్యాలు శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయన్నారు. కార్మికులకు సంబంధించిన జీవోల కాలపరిమితి ముగిసి యేళ్లు గడుసున్నా పునరుద్ధ్దరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంతల చంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బలవంతపు భూసేకరణకు కేసిఆర్ ప్రభుత్వం పాల్పడుతోందని విమర్శించారు. పండించిన పంటలకు కనీస మద్దతు ధరను నిర్ణయించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ.20వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులందరికీ ఎరువులు, విత్తనాలు ఉచితంగా అందించాలని, నకిలి విత్తనాలు సరఫరా చేసిన కంపెనీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సదస్సులో సిఐటియు జిల్లా అధ్యక్షుడు బీరం మల్లేశం, ప్రధాన కార్యదర్శి కె.రాజయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నర్సింహారెడ్డి, జయరాజ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు, పిఎసిఎస్ రాష్ట్ర అధ్యక్షులు సర్దార్, నాయకులు నర్సింలు, అశోక్, బాగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆర్‌డబ్ల్యుఎస్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
* బకాయి వేతనాలు చెల్లించాలి
* జెడ్పీ ముందు కార్మికుల ధర్నా

సంగారెడ్డి టౌన్, జనవరి 19: ఆర్‌డబ్ల్యుఎస్ కార్మికుల సమస్యలు పరిష్కరించి బకాయి వేతనాలు చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజయ్య డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లపై స్పందించాలని కోరుతూ గురువారం జిల్లా పరిషత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ గత పది నెలలుగా వేతనాలు రాక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇఎస్‌ఐ, పిఎఫ్, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మికులు గంగారం, శ్రీనివాస్, అక్బర్, పాండు, రాజు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.