మెదక్

ఫలించిన ఎమ్మెల్యే దౌత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సదాశివపేట, జనవరి 22: రెండువర్గాలుగా చీలిపోయి రాజీనామాల వరకు దారితీసిన సదాశివపేట మున్సిపల్ పాలకుల మధ్య కొనసాగుతున్న అంతర్యుద్ధానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సయోధ్య కుదిర్చి తెరదించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పట్నం విజయలక్ష్మిఒంటెద్దు పోకడను వ్యతిరేకిస్తూ వైస్ చైర్మన్‌తోపాటు మరికొంత మంది సభ్యులు తిరుగుబాటుకు దిగిన విషయం తెలిసిందే. అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ఆధిపత్య పోరుతో సతమవుతూ తమను బేఖాతర్ చేస్తున్నారంటూ ప్రజలకు జవాబుదారి తనం లోపించడానికి నైతిక బాధ్యత వహిస్తూ చైర్ పర్సన్ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని శనివారంనాడు వైస్‌చైర్మన్ వర్గం డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. చైర్‌పర్సన్ రాజీనామా చేయని పక్షంలో తామే రాజీనామా చేసి పాలకవర్గాన్ని పడగొడుతామని శపథం చేసారు. వివాదం ముదిరి పాకానపడటమే కాకుండా అధికార టిఆర్‌ఎస్ పార్టీని సంకటంలోకి నెట్టింది. దీంతో స్పందించిన సంగారెడ్డి ఎమ్మెల్యే, స్థానికుడైన చింతా ప్రభాకర్ రెండు వర్గాలను తన నివాసానికి పిలిపించుకుని మంతనాలు కొనసాగించి ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చారు. ఈ క్రమంలో పాలకవర్గాన్ని నిర్వీర్యం చేయాలనే యోచనతో జతకట్టిన కాంగ్రెస్ పార్టీ డీలాపడిపోయినట్లైంది. గత యేడాది సదాశివపేట మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా కావల్సిన సభ్యులను జతకట్టుకుని సుమారు నెల రోజులకుపైగా దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రాజకీయ శిబిరాలు నిర్వహించి అధికార పార్టీ కుర్చీని కైవసం చేసుకున్న విషయం విధితమే. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో పాటు టిఆర్‌ఎస్ నాయకులు రంగ ప్రవేశం చేసి రెండు వర్గాల మధ్య రాజీకుదిర్చడంలో సఫలీకృతులయ్యారు. మొత్తంమీద వివాదం ముందుకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నా నెలకొన్న సయోధ్య ఎన్నాళ్లు నిలదొక్కుకుంటుందోనన్న అనుమానాలు లేకపోలేదు. త్వరలోనే నిర్వహించే మున్సిపల్ సర్వసభ్య సాధారణ సమావేశంలో సభ్యులు ఎలా వ్యవహరిస్తారు? సభ్యులు అడిగే ప్రశ్నలకు చైర్‌పర్సన్ ఇచ్చే సమాధానాలపై ఆధారపడి ఉంటుందని అధికార పార్టికి చెందిన సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి వ్యక్తికీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందని, అభ్యర్థుల వ్యక్తిత్వతంతో పాటు ప్రజాసేవ లక్షణాలున్న వారిని గుర్తించి పట్టం కడతారని అన్నారు. గెలిపించిన ప్రజల్లో విశ్వాసం కల్పించేలా ఐదేళ్లు సేవలందించాలన్నారు. వ్యక్తిగత పంతాలకు దిగి రాజీనామాలు చేస్తామంటే ప్రజల తీర్పును వ్యతిరేకించినట్లు అవుతుందన్నారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని హితవుపలికారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలుంటాయని, ఎన్నికల అనంతరం ప్రజాసేవకై పోటీ పడాలని సూచించారు. వివాదాలకు దిగడం ద్వారా సమయం వృథా కావడంతోపాటు అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని చెప్పారు. అధికారంలో ఉన్న మనకు సిఎం కెసిఆర్‌తో పాటు అన్ని శాఖల మంత్రుల అండదండలున్నాయని, అలాంటి అవకాశాన్ని సద్వినియోగపర్చుకుని పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుని ముందుకు వెళ్లాలని ఉద్బోధించారు. గతంలో కరపత్రాల్లో మాత్రమే కోట్ల నిధులు మంజూరైనట్లు చూసాని, అభివృద్ధి మాత్రం శూన్యమనే విషయం మీకందరికీ తెలుసని, ఇటీవలే పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సదాశివపేట, సంగారెడ్డి మున్సిపాలిటీల్లో మురుగు కాలువలను నిర్మించడానికి రూ.5 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేసారని తెలిపారు. మరో నెల రోజుల్లో మరో రూ.5 కోట్ల నిధులు మంజూరు కానున్నాయని, నిధులు, విధుల కోసం పోటీపడాలని హితవుపలికారు. ఆయా వార్డులకు ప్రాతినిథ్యం వహిస్తున్న కౌన్సిలర్లు సమస్యలపై దృష్టి సారించాలని, అవసరమైన నిధులు తాను సమకూరుస్తానని ఎమ్మెల్యే చింతా భరోసా కల్పించారు. ఎమ్మెల్యేగా తామంతా గౌరవిస్తామని, చైర్‌పర్సన్ మాత్రమే తమను ఖాతరు చేయడంలేదని, మీమాటగా ఇప్పుడు సయోధ్యకు సిద్ధమయ్యామని, తీరు మార్చుకోకపోతే తాము తిరుగుబాటు చేస్తామని కూడా పలువురు సభ్యులు చైర్ పర్సన్‌ను ఉద్దేశించి హెచ్చరించినట్లు తెలిసింది. చైర్ పర్సన్ భర్తగా తాను మున్సిపాలిటీలో కల్పించుకోనని, పట్టణ అభివృద్ధిపై మీరంతా కలిసికట్టుగా ముందుకు వెళ్లవచ్చని పట్నం సుభాష్ సభ్యులకు హామీ ఇవ్వడంతో వివాదానికి తెరపడినట్లు తెలుస్తోంది.

అంబేద్కర్ ఆలోచన విధానాలతోనే తెలంగాణ
సిద్దిపేట రూరల్, జనవరి 22: అంబేద్కర్ ఆలోచన విధానాలతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట మండలం పుల్లూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన విధంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిదని, మన హైదరాబాద్ మనకు దక్కిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దళితుల సంక్షేమాని కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సంవత్సరంలోనే 103 సాంఘీక సంక్షేమ పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే 30మహిళ రెసిడెన్షియల్ కళాశాలలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణలో 300మంది దళిత విద్యార్థులకు ప్రభుత్వం 20లక్షల రూపాయల చొప్పున వెచ్చించి అమెరికాలో పైచదువుల నిమిత్తం పంపించడం జరిగిందన్నారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ, ఆనంద్‌లకు 25లక్షల రూపాయల చొప్పున తెలంగాణ ప్రభుత్వం కేటాయించిందని తెలియజేశారు. అంతకుముందు పాఠశాల ప్రహారీగోడతో పాటు మండలంలోని తోర్నాల గ్రామంలో నిర్మించనున్న తోర్నాల-రాఘవాపూర్ రోడ్డుకు శంకుస్థాపన, అదనపుతరగతి గదుల ప్రారంభోత్సవం, రాంపూర్‌లో గ్రామ కమ్యూనిటీ భవనంకు శంకుస్థాపన చేశారు.