మెదక్

పారిశ్రామిక కాలుష్యంపై జడ్పీ సమావేశంలో సభ్యుల మండిపాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, ఫిబ్రవరి 7: పరిశ్రమల నుండి వెదజల్లే కాలుష్యాన్ని అరికట్టాలని, ఇలాంటి పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతి సమావేశంలో చర్చిస్తున్నప్పటికీ ఎందుకు స్పందించడం లేదని మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్‌రెడ్డి కాలుష్య నియంత్రణ అధికారి నరేందర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మజాక్‌గా ఉందా.. పరిశ్రమ యాజమాన్యాలు ఇచ్చే మాముళ్లకు ఆశపడి చర్యలు తీసుకోవడం లేదా అంటూ ధ్వజమెత్తారు. మంగళవారం జిల్లా పరిషత్ చైర్మన్ రాజమణి అధ్యక్షతన మూడు జిల్లాలకు సంబంధించి సర్వసభ్య సమావేశాన్ని సంగారెడ్డి జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ మత్సకారులు ఆర్థికంగా అభివృద్ది చెందాలని రూ.5లక్షల విలువ గల చేప పిల్లలను చెరువులో వదిలితే, పరిశ్రమల కాలుష్య నీరాంత చెరువులో చేరడంతో వేసిన చేప పిల్లలన్ని చనిపోయాయని దీనికి ఏవరు బాధ్యులని ప్రశ్నించారు. అమీన్‌పూర్ చెరువులో ట్యాంకర్ల ద్వారా పరిశ్రమ వ్యర్థ జలాలు తెచ్చి డంపింగ్ చేస్తున్న ఎందుకు పట్టించుకోవడం లేదని అధికారిని నిలదీశారు. వెదజల్లే కాలుష్యంతో వైద్యులు గుర్తుపట్టని రోగాలు వస్తున్నాయని, ప్రజల ఆరోగ్యాలతో చేలగాటం ఆడోద్దని సూచించారు.ఈ విషయాన్ని సిరియస్‌గా తీసుకొని పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ మాణిక్యరాజ్ కణ్ణన్ కోరారు. మనూర్ మండలం గట్టులింగంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు యేళ్ల తరబడి నడుస్తున్న ఎందుకు పూర్తి కావడం లేదని నారాయణఖేడ్ కాంగ్రెస్ ఎంపిపి సంజీవరెడ్డి సమావేశం దృష్టికి తీసుకరాగానే మీ హయంలో చేయని పనులు టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సమాధానం ఇవ్వడంతో పార్టీలను మద్యలో ఎందుకు తీసుకొస్తున్నారని సంజీవరెడ్డి వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ చేసిన పనులకే మీరు తుది రూపులు దిద్దుతున్న విషయాన్ని గమనించాలని చెప్పడంతో పలువులు టిఆర్‌ఎస్ నాయకులు లేచి ఆందోళనకు దిగడంతో కాంగ్రెస్ నాయకులు సైతం లేచి వారితో వాగ్వాదానికి దిగారు. మనూర్ జెడ్పిటిసి నిరంజన్ స్పందించి సమాధానం చెప్పే ప్రయత్నం చేయగా కాంగ్రెస్ నుండి గెలుపొంది రూ.5లక్షలకు టిఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయిన నీకు మాట్లాడే అర్హతలేదని, కాంగా కూర్చోమంటూ సంజీవరెడ్డి పేర్కొనడంతో ఒక్క సారిగా సమావేశ మందిరం వేడెక్కింది. దీంతో ఎంపి ప్రభాకర్‌రెడ్డి జోక్యం చేసుకొని ఇరువురిని శాంతింపజేశారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధిపై చర్చించుకుందామని, సమయాన్ని వృధా చేయోద్దని కోరారు. జాబ్ కార్డులు ఉన్నవారందరికీ ఉపాధి హామిలో పని కల్పించాలని సభ్యులు కోరారు. జిన్నారం జెడ్పీటిసి ప్రభాకర్‌రెడ్డి, పటాన్‌చెరు జెడ్పీటిసి శ్రీకాంత్‌గౌడ్, సంగారెడ్డి జెడ్పీటిసి మనోహర్ పలు సమస్యలను సమావేశం ముందుంచి పరిష్కరించాలని కోరారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బి, వ్యవసాయం, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్ తదితర శాఖల అభివృద్ధి పనులు, సమస్యలపై చర్చించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాణిక్యరాజ్ కణ్ణన్, జాయింట్ కలెక్టర్, జెడ్పీ ఇన్‌చార్జ్ సిఈఓ వాసం వెంకటేశ్వర్లు, మెదక్ కలెక్టర్ భారతి హొళ్లికేరి, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, మూడు జిల్లాల జెడ్పీటిసిలు, ఎంపిపిలు పాల్గొన్నారు.

పారదర్శక పాలనకు చర్యలు: కలెక్టర్

సంగారెడ్డి టౌన్, ఫిబ్రవరి 7: జిల్లా ప్రజలకు పారదర్శకతతో కూడిన పరిపాలన అందించే దిశగా అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు కలెక్టర్ మాణిక్యరాజ్ కణ్ణన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో సంగారెడ్డి జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేసేందుకు వచ్చిన నిజామాబాద్ జిల్లాకు చెందిన అధికార బృంధంతో కలెక్టర్ సమావేశమైనారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వారికి వివరించారు. సామాన్య ప్రజల సౌలభ్యానికి రెవెన్యూ పరంగా ఎటువంటి సమస్యలూ లేకుండా చూస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ, స్ర్తి శిశు సంక్షేమ శాఖ, వయోజన విద్య, డిఆర్‌డిఎ శాఖలతో ముందుగా వంద గ్రామ పంచాయతీలను ఎంపిక చేసి గ్రామాల్లోని భూ సమస్యలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, 0-6సంవత్సరాల పిల్లలకు పౌష్టికాహారం సరిగా అందుతుందా లేదా, నగదు రహిత లావాదేవీలు జరిపేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అనంతరం బృందంతో కలిసి కొన్ని గ్రామాలను సందర్శించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

రబీ సాగు ఆశాజనకం
పెరిగిన వరి సాగు విస్తీర్ణం బ్యాంకు రుణాలు మృగ్యం

సంగారెడ్డి, ఫిబ్రవరి 7: రెండేళ్ల క్రితం వరుసగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో చిన్నాభిన్నమైన వ్యవసాయం ఈ యేడాది పుష్కళంగా వానలు పడటంతో అన్నదాతల్లో ఆశలను నింపింది. ఖరీఫ్‌తో పాటుగా రబీ సాగు సైతం ఈ యేడాది ఆశించినదానికంటే ఎక్కువగా కనిపిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు కొత్తగా ఏర్పాటైన సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో రబీ సాగు నిరాటంకంగా కొనసాగుతుంది. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులన్ని పూర్తిస్థాయి నీటిమట్టంతో కనిపిస్తున్నాయి. సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో బోర్లు, చెరువులు, బావులపై రైతులు ఆధారపడగా మెదక్ జిల్లాలో మాత్రం ఘన్‌పూర్ సాగునీటి ప్రాజెక్టు రబీకి బాసటగా నిలుస్తోంది. మెదక్ జిల్లాలోనే ఈ యేడాది రబీ సాగు అధికారుల అంఛనాలకు అధికంగా ఉందంటే అన్నదాతలు ఎంత ఉత్సాహాన్ని కనబరుస్తున్నారో స్పష్టమవుతోంది. పచ్చని పంటలతో కళకళలాడాల్సిన భూములన్ని గత యేడాది ఇదే సమయంలో బీడు భూములుగా కనిపించాయి. బోరు బావుల వద్ద మాత్రమే పంటలు దర్శనమిచ్చాయి. ఈ సారి ఘన్‌పూర్ ఆనకట్టకు ఆయువుపట్టుగా ఉండే సింగూర్ ప్రాజెక్టులో నీటి మట్టం అధికంగా ఉండటంతో ఎలాంటి ఇబ్బందీ లేకుండా రబీ పంటను సాగు చేసుకునే అవకాశం ఉంది. అదే విధంగా చెరువులు, కుంటల్లో కూడా నీరు పుష్కళంగా ఉండటంతో ఆందోళన చెందకుండా వరి నాట్లు వేసుకుంటున్నారు. మెదక్ ప్రాంతంలో ఇప్పటికే 90 శాతం వరినాట్లు పూర్తి కావచ్చాయి. రబీ సీజన్‌లో 14804 హెక్టార్లలో వరి పంటను సాగు చేయాల్సి ఉండగా అందుకు రెట్టింపుగా వరినాట్లు వేసారు. 21452 హెక్టార్లలో వరినాట్లు వేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో ఇంకా వరినాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. నీటిపై ఆధారపడి సాగు చేసే మొక్కజొన్న సాగు విస్తీర్ణం కాస్తంత తగ్గినా ఆశాజనకంగానే ఉంది. మొత్తం 8325 హెక్టార్లలో మొక్కజొన్నను మెదక్ ప్రాంతంలో సాగు చేయాల్సి ఉండగా 7582 హెక్టార్లలో సాగు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొక్కజొన్న సాగు తగ్గినా వరి సాగు పెరగడమే కాకుండా సరాసరి పంటల సాగును పరిశీలిస్తే సాగు విస్తీర్ణం పెరిగినట్లేనని చెప్పుకోవచ్చు. రబీ సాగు ప్రారంభమైనా పెట్టుబడులకు మాత్రం రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పెద్దనోట్ల రద్దుతో పాటుగా బ్యాంకర్లు రైతులను పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ రంగాన్ని ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీజన్ ప్రారంభమైనా ఒక్క బ్యాంకు కూడా రైతులకు పంట రుణాలు ఇచ్చిన దాఖలాలు మచ్చుకైనా కనిపించకపోవడం దురదృష్టకరమని చెప్పవచ్చు. సంగారెడ్డి జిల్లాలో రబీలో ప్రధానంగా తెల్లజొన్నతో పాటుగా శనగ పంటకు అధిక ప్రాధాన్యతను కల్పిస్తారు. జహీరాబాద్ రెవెన్యూ డివిజన్‌లోని కొన్ని మండలాలతో పాటుగా సంగారెడ్డి రెవెన్యూ డివిజన్‌లోని సదాశివపేట, మునిపల్లి మండలాల్లో శనగ పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని అందోల్ నియోజకవర్గంలో కూడా వరి సాగు ఎక్కువ విస్తీర్ణంలోనే కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో ఒకప్పుడు మిరప పంటకు అధిక ప్రాధాన్యతను ఇచ్చే రైతులు పత్తి పైరు మోజులో పడటంతో మిరప, తెల్లజొన్న పంటలు కనుమరుగయ్యాయి. ఈ సారి నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్‌లో కూడా రబీ పంటల సాగు గతంలోకంటే పరవాలేదనిపిస్తోంది. సిద్దిపేట డివిజన్‌లో బోరు బావుల వద్ద మాత్రమే నీటి ఆధారిత పంటలు కనిపించనుండగా గజ్వేల్ సెగ్మెంట్‌లో కూరగాయల సాగు ఎక్కువగా దర్శనమిస్తోంది. మూడు జిల్లాల్లో రబీ పంటల సాగు ఆశించిన స్థాయిలో ఉండటంతో కష్టాల కడలిలో చిక్కి కొట్టుమిట్టాడుతున్న రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. బ్యాంకులు ఇబ్బంది పెట్టకుంటే వ్యవసాయదారుల ఆదాయం మరింతగా పెరిగేదని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు.

కేంద్ర బడ్జెట్ చారిత్రాత్మకం

సిద్దిపేట, ఫిబ్రవరి 7 : దేశంలో పేద, బడుగల వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టిందని, జనరంజక బడ్జెట్ అని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌వి సుభాష్ అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు నాయిని నరోత్తంరెడ్డితో కలసి మాట్లాడారు. కేంద్ర సర్కార్ సాధారణ బడ్జెట్‌లో, రైల్వే బడ్జెట్ కలిపి 2.47 లక్షల కోట్ల చారిత్రాత్మకమైన బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. దేశ రక్షణ రంగానికి అధిక బడ్జెట్ 2.74 లక్షల కోట్లు కేటాయించిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల అన్ని వర్గాల అభ్యున్నతికి సముచితమై నిధులు కేటాయించిందన్నారు. వ్యవసాయ రంగానికి అధిక నిధులు కేటాయించినట్లు తెలిపారు. రైల్వే రంగంలో సైతం ప్రాధాన్యత గల లైన్లకు అధిక నిధులు కేటాయించిందన్నారు.
దశాబ్ధాల నుంచి ఎదురుచూస్తున్న సిద్దిపేట రైల్వే లైన్‌కు రూ.350 కోట్లు కేటాయించి, సిద్దిపేటకు రైలు మార్గం సుగమం చేసిందన్నారు. మెదక్-అక్కన్నపేటకు సైతం 196 కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు. ఎస్సీ వర్గీకరణపై సిఎం కెసిఆర్ అఖిల పక్షం ఢిల్లీకి తీసుకెళ్లటంతో అపాయిమెంట్‌ను యుపి ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసినట్లు తెలిపారు. అపాయిమెంట్ పూర్తిగా రద్దు చేసిందనటంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.
భూమి పట్టాలు వెనక్కి తీసుకోవద్దు
డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో గత ప్రభుత్వాల నుంచి పట్టాలు పొందిన వారికి అధిక ప్రాధాన్యత కల్పించాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు నాయని నరోత్తంరెడ్డి అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల్ల పేరిట గతంలో ఎస్సీ,ఎస్టీలకు ఇచ్చిన పట్టాలు తీసుకోవటం సముచితం కాదన్నారు. జిల్లా పరిధిలోని బెజ్జంకిలో1979, 1980 సర్వే నెంబర్లలో 7.09 ఎకరాలు దళితుకలకు ఇళ్ల నిర్మాణానికి కేటాయించారన్నారు. ఇప్పుడు ఫ్రభుత్వం పట్టాలను వాపస్ తీసుకొని డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తున్నారు. ప్రభుత్వం గతంలో పట్టాలు పొందిన వారికి డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో అధిక ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట పురపాలక సంఘం పరిధిలో సైతం ఇళ్లు నిర్మించిన తర్వాత మున్సిపల్ అధికారులు తొలగించటం తగదన్నారు. నిబంధనలు అందరికీ ఒకే విధంగా ఉండాలని కొందరి ఇళ్లు కూల్చివేసి, మరికొందరి ఇళ్లు చూడనట్లు వ్యవహరించటం తగదన్నారు. మున్సిపల్ అధికారులు పద్ధతి మార్చుకోకుంటే బిజెపి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముట్టడించి పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.
చట్టం దృష్టిలో అందరూ సమానులేనని విషయాన్ని మున్సిపల్ అధికారులు తెలుసుకోవాలన్నారు. ఈసమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు మోహన్‌రెడ్డి, బాలేష్, బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు యాదగిరి, నాయకులు రమేశ్, విభిషన్‌రెడ్డి, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

ఇంట్లో గ్యాస్ లీకై
చెలరేగిన మంటలు
హత్నూర, ఫిబ్రవరి 7: వంటిల్లో గ్యాస్ లీకై మంటలు వ్యాపించిన సంఘటన మండల పరిధిలోని దౌల్తాబాద్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అశోక్ కొంత కాలంగా దౌల్తాబాద్‌లో నివాసం ఉంటూ పౌన్ బ్రోకర్ దుకాణాన్ని నడుపుకుంటున్నాడు. ఇంట్లో వంట చేస్తున్న సమయంలో గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కుటుంబీకులు అరుపులు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు.
ఈ ప్రమాదంలో ఇంట్లోని వస్తువులన్ని కాలిబుడిదైనాయి. అగ్నిమాపక శకటం చేరుకొని మంటలు అర్పారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.
బ్రీత్ అనలైజర్ కిట్లు పంపిణీ
సంగారెడ్డి టౌన్, ఫిబ్రవరి 7: మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించే బ్రీత్ అనలైజర్ కిట్లను మంగళవారం జిల్లా కలెక్టర్ మాణిక్యరాజ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, డిఎస్పీ తిరుపతన్న, రూరల్ సిఐ నరేందర్, ట్రాఫిక్ సిఐ పాల్గొన్నారు.
ఆరోగ్యశాఖ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు

* ఉరుకులు, పరుగులు పెట్టిన
సిద్దిపేట ఏరియా ఆస్పత్రి డాక్టర్లు
సిద్దిపేట, ఫిబ్రవరి 7 : సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కరుణ మంగళవారం అకస్మిక తనిఖీ చేశారు. వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా? లేదా నిశితంగా పరిశీలించారు. రోగులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. ఈ క్రమంలో వైద్యులను ఉరుకులు, పరుగులు పెట్టించారు. ఆస్పత్రిలోని ఒపి సెక్షన్‌తోపాటు, ఆరోగ్యశ్రీ వార్డు, బ్లడ్‌బ్యాంక్, ఎక్స్‌రే, డిజిటల్ ఎక్స్‌రే వార్డు, ఐసియు విభాగాలతోబాటు ఇతర వార్డులనూ కమిషనర్ పరిశీలించారు. ఓ రోగి చీటీ చూసి స్కానింగ్ కోసం చీటీని బయటకు రాసివ్వటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాసిన డాక్టర్ రాధికను ఆస్పత్రి సూపరింటెండెంట్ ద్వారా పిలిపించి స్కానింగ్‌కు బయటకు ఎందుకు రాసావని, ఇక్కడ స్కానింగ్ లేదా ప్రశ్నించారు. లేదని, మాతా శిశుసంక్షేమ కేంద్రంలో ఉందని సమాధానం ఇచ్చారు. సరే అక్కడకు పంపించండని కమిషనర్ ఆదేశించగా అక్కడ గర్భిణులు అధికంగా ఉంటారన్నారు. ఎంసిహెచ్‌లో స్కానింగ్ చేసేలా ఆ రోగికి రాసివ్వాలని ఆదేశించారు. ఈ ఆస్పత్రి కోసం స్కానింగ్ మిషన్ కొనుగోలు చేయాలని సూచించారు. రేడియాలజీ నిపుణులు లేరని చెప్పగా నియమించుకోవాలని ఆదేశించారు. ఆరోగ్య శ్రీ వార్డులో డాక్టర్ శివరాం ఒంటరిగా ఉండగా, ఓపిని చూడవచ్చుగా అని సూచించారు. అన్ని వార్డుల్లో పరిశీలనలో భాగంగా వచ్చిన వృద్ధులను పరిశీలించి వైద్యులు సేవలు అందుతున్నాయా అని ప్రశ్నించారు. గ్లూకోజ్‌లు ఎక్కిస్తున్నారని చెప్పారు. డబ్బులు అడుగుతున్నారా అని కమిషనర్ కరుణ ప్రశ్నించగా లేదని వారు సమాధానం ఇచ్చారు. వార్డుల పరిశీలనలో పాత కర్టెన్లు, బెడ్‌షీట్స్ ఉండటంపై ఆసహనం వ్యక్తం చేసి, కొత్తవి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆనంతరం ఐసియు సెంటర్‌ను పరిశీలించారు. అన్ని వార్డుల్లో వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. త్వరలోనే కొత్తగా కంప్యూటర్లు పంపించనున్నట్లు వెల్లడించారు. సిద్దిపేట ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. జెసి హన్మంత్‌రావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ నరసింహాం, డిఎంహెచ్‌ఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.