మెదక్

బిజెపి మహిళా మోర్చా .. మెదక్ జిల్లా అధ్యక్షురాలిగా లక్ష్మీ శైలజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, ఫిబ్రవరి 25: భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా మెదక్ జిల్లా అధ్యక్షురాలిగా లక్ష్మీ శైలజ నియామకమయ్యారు. ఈ మేరకు శనివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు చోళ రాంచరణ్ యాదవ్ ఉత్తర్వులు జారీచేశారు. లక్ష్మీ శైలజ ఈ సందర్భంగా మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిగా నియమించిన జిల్లా అధ్యక్షుని నమ్మకం వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ప్రకటించారు. మండల, బూత్ స్థాయి నుంచి కమిటీలను ముందుగా ఏర్పాటు చేస్తానని ఆమె తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పర్యటించి మహిళలను చైతన్యవంతం చేసి పటిష్టమైన పార్టీగా తీర్చిదిద్దుతానని లక్ష్మీ శైలజ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చోళ రాంచరణ్ యాదవ్ మాట్లాడుతూ ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
మొక్కులకే పరిమితమైన సిఎం
* సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నేరేడుచర్ల, ఫిబ్రవరి 25: రాష్ట్ర ముఖ్యమంత్రి దేవుళ్ల మొక్కులకు ప్రాధాన్యతినిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. శనివారం నేరేడుచర్లలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ లౌకిక రాజ్యాంగంలో చట్టబద్ధంగా ఏ దేవుళ్లకు మొక్కరని, ఏ ప్రభుత్వం కూడా దేవుళ్లకు మొక్కదని, వ్యక్తిగతంగా మొక్కితే వ్యక్తిగతంగానే మొక్కులను తీర్చుకోవాలని హితవు పలికారు. కెసిఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొక్కులు మొక్కలేదని, ముఖ్యమంత్రి అయితే మొక్కులు చెల్లిస్తానని మొక్కి తీర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సిపిఎం సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి కోసం చేపట్టిన మహాజన పాదయాత్ర గురించి ముఖ్యమంత్రి అడ్డుకోవాలని, రాళ్లు వేయాలని, తెలంగాణాకు మద్దతు తెలపనందున ముక్కును నేలకు రాయాలని వ్యాఖ్యానించారని, మాట తప్పిన వారు మాత్రమే ముక్కును నేలకు రాయాలని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చనందున మాటతప్పిన ముఖ్యమంత్రి 150సార్లు ముక్కును నేలకు రాయాల్సి వస్తుందని, అందుకే దేవుడు ఆయనకు పెద్దముక్కు ఇచ్చారని విమర్శించారు. ప్రజలకు రెండు పడకల ఇండ్లు నిర్మించలేదుకాని ఆయన మాత్రం 150గదులతో రూ.50కోట్లతో భవనం నిర్మించుకోని దొరదర్పనం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. తమ యాత్రపై రాళ్లు ఎవరూ వేయడంలేదని, పూలమాలలతో స్వాగతం పలుకుతున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి అంటే రోడ్లు, వంతెనలు, భవనాలు కాదని ప్రజలకు కావాల్సిన వౌలిక సదుపాయాలు కల్పించడమేనన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా నూటికి నూరుశాతం హామీలను నెరవేర్చని ప్రభుత్వం కెసిఆర్‌దేనని, సామాజిక న్యాయం కోసం, ఉద్యమానికి అన్ని ఎర్రజెండా పార్టీలు, సామాజిక పార్టీలు మద్దతు తెలపాలని కోరారు. పాదయాత్ర ముగింపు బహిరంగ సమావేశం

ఏడుపాయలకు పోటెత్తిన భక్తజనం

పాపన్నపేట, ఫిబ్రవరి 25: ఏడుపాయలకు భక్తజనం వెల్లువెత్తింది. చెట్లు, రాళ్లగుట్టలతో ఉండే అటవి ప్రాంతమంతా జనసంద్రంగా మారింది...జానపదుల జాతర జనరంజకంగా సాగింది...డప్పువాయిద్యాల మోతలు, బోనాల ఉరేగింపులు, శివసత్తుల శిగాలు, పోతరాజుల నృత్యాలతో ఏడుపాయల జాతర ప్రాంగణమంతా హోరెత్తింది. అడుగడుగున తెలంగాణ జానపదుల సంస్కృతి ఆవిష్కృతమైంది. జాతరలో ప్రధానమైన బోనాల ఉత్సవం, బండ్ల ఉరేగింపు ఉండటంతో శనివారం రోజు రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, హైదరాబాద్ జంట నగరాలు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల నుండి భక్తులు వెల్లువలా తరలివచ్చారు. బస్సులు, లారీలు, టెంపోలు, కార్లు, జీపులు తదితర వాహనాలలో రాకపోకలతో హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, నారాయణఖేడ్ వైపు నుండి ఏడుపాయలకు వచ్చే దారులన్ని పూర్తిగా కిటకిటలాడాయి. వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో నాగ్సాన్‌పల్లి నుంచి ఏడుపాయల వరకు, పోతన్‌శెట్టిపల్లి చౌరస్తా నుండి ఘణపురం ఆనకట్ట వరకు గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది. భారీగా భక్తులు తరలిరావడంతో విశాలమైన ఏడుపాయల ప్రాంగణంలో ఎటు చూసినా జనసంద్రమే కనిపించింది. భక్తుల రద్దీ విపరీతంగా ఉండటం, బోనాల ఉరేగింపు నిర్వహించడంతో వనదుర్గామాత ఆలయానికి వెళ్లె దారి ఉదయం నుండి రాత్రి వరకు కిటకిటలాడింది. మహిళా భక్తులు కాలికి గజ్జెలు కట్టి, జుట్టు విరబోసుకొని నెత్తిపై బోనం ఆపై గండదీపం పెట్టుకొని ముఖం నిండా పసుపు రాసుకొని, వేపకోమ్మలు చేతబూని, మెడలో గవ్వలహారాలు, పూలదండలు వేసుకొని, చేతిలో కొరడాపట్టుకొని డప్పుల దరువులకు అనుగుణంగా లయబద్దంగా నృత్యాలు చేస్తూ ఉరేగింపుగా దుర్గామాత ఆలయం వైపు సాగిపోతున్న దృశ్యాలు, పోతరాజుల విన్యాసాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింభించాయి. శనివారం రోజు తెలంగాణ శాసనసభ ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి వనదుర్గామాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఈ సాంప్రదాయం పాటించడం ఆనవాయితీ. భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉండటంతో వనదుర్గామాత దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. మొక్కుబడులలో భాగంగా అనేక మంది భక్తులు దుర్గామాతకు చీర, రవిక, గాజులు, ఓడిబియ్యం, తలనీలాలు, కొబ్బరికాయలను సమర్పించారు. అమ్మవారి కృపతో సంతానం కలగాలని సంతాన గుండంలో దంపతులు స్నానాలు ఆచరించి అమ్మవారి ఆలయంలో కొబ్బరికాయలు, తొట్టెలును కట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్డీఓ నగేష్, ఆలయ ఈఓ వెంకటకిషన్‌రావులు భక్తులకు అందుబాటులో ఉండి వివిధ శాఖలు అందిస్తున్న సేవలను సమీక్షిస్తున్నారు.

మరో 20 ఏళ్లు టిఆర్‌ఎస్ పాలన
మంత్రి జూపల్లి కృష్ణారావు
ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, ఫిబ్రవరి 25: అవినీతి, అక్రమాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజల తిరస్కరణ మరో 20 ఏళ్ల వరకు ఉంటుందని, అప్పటి వరకు రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పాలన కొనసాగడం ఖాయమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు జోస్యం చెప్పారు. శనివారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా ఖేడ్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి ఆధరణ లభిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. పార్టీ ఉనికి కాపాడుకోవడానికి జన ఆవేదన సదస్సులు నిర్వహిస్తున్నారని, వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆవేదన సదస్సు అధికారం కోల్పోయామనే ఆవేదనతో కూడుకున్నదని ఎద్దేవా చేసారు. కల్యాణ లక్ష్మీ, షాదీముభారక్, ఇతర పథకాలను ప్రజలు పూర్తిస్థాయిలో విశ్వసిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన ఉద్యమంలో రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని మద్దతు తెలిపారని, అధికారం కోసం, ఉనికి కోసం చేపట్టే ఆవేదన సదస్సులకు జనం రారని తేలిపోయిందన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని, నిజాలను తెలుసుకున్న ప్రజలు టిఆర్‌ఎస్ పార్టీకే పూర్తి మద్దతు తెలుపుతారని భరోసా వ్యక్తం చేసారు. గ్రామీణాభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి కనిపిస్తుందని, ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్యాం ప్రకాష్ ముఖర్జి జాతీయ రూర్బన్ మిషన్ ద్వారా గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. పట్టణాల్లో ఎలాంటి వౌలిక వసతులు ఉంటాయో అదే స్థాయిలో గ్రామాల్లో కూడా వసతులు కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నాలుగు క్లస్టర్లు మంజూరైతే పూర్తిగా వెనుకబడిన నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ర్యాకల్ క్లస్టర్ ఎంపిక కావడం శుభపరిణామన్నారు. ఈ క్లస్టర్‌లో మొత్తం 27 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుందని సంతృప్తిని వ్యక్తం చేసారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అన్ని పథకాలను గ్రామీణులు సద్వినియోగపర్చుకోవాలన్నారు. ర్యాకల్ క్లస్టర్‌కు క్రింద ఉన్న 27 గ్రామాలను అభివృద్ధి చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసారని, రూ.182 కోట్ల నిధులు అవసరం కానున్నాయని తెలిపారు. మొదటి విడతగా రూ.30 కోట్ల నిధులు విడుదలకాగా కేంద్రం వాటా రూ.18 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.12 కోట్లు భరించాల్సి ఉంటుందని వివరించారు. ఈ విలేఖరుల సమావేశంలో ఎంపి బిబి పాటిల్, ఎమ్మెల్సీ రాములు నాయక్, ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి పనుల నిర్వహణలో నిర్లక్ష్యంపై
మంత్రి జూపల్లి కొరడా
ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్‌కు ఆదేశాలు
నారాయణఖేడ్ ఫిబ్రవరి 25: వేసవి కాలం వస్తుందని, వెంటనే కూలీలకు పనులు కల్పించాలని అదేశాలున్నా ర్యాకల్ గ్రామంలో కూలీలకు ఇంకా పనులు ప్రారంభించడం లేదని శనివారంనాడు గ్రామానికి వచ్చిన ఉపాధి హామీ శాఖ మంత్రి జూపల్లికృష్ణరావుకు గ్రామస్థులు, కూలీలు ఫిర్యాదు చేశారు. గ్రామంలో 13మంది కూలీలకు జాబ్‌కార్డులున్నాయని అయినా పనులు చేపడటం లేదని వారు తెలిపారు. దీంతో స్పందించిన మంత్రి ఎపివో సంతోషను, ఎంపిడివో బాలయ్యను పిలిచి ఎందుకు కూలీలకు పనులు కల్పించడం లేదని ప్రశ్నించారు. పనులు ప్రారంభించాలని అందరికీ అదేశాలు ఇచ్చి గ్రామాలను తిరిగినట్లు ఎంపిడివో బాలయ్య సమాధానం చెప్పారు. ఫీల్డ్ అసిస్టెంట్‌ను పిలిచి ఉపాధి పనులు ఎందుకు ప్రారంభించ లేదని అడిగితే సరైన సమాధానం చెప్పలేదు. దీంతో వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ సిద్ధయ్యను సస్పెండ్ చేస్తున్న మంత్రి సభలో ప్రకటించారు. ర్యాకల్ గ్రామానికి రూ.24లక్షలు మంజూరున్నా అందులో రూ.19లక్షలు పనులు చేశారని, తకువ పనులు ఎందుకు చేయించారని ఫిల్డ్‌అసిస్టెంట్‌ను సస్పెండ్ చేశారని ఎపివో సంతోష్ తెలిపారు.

పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు

హాజరుకానున్న 27, 894 విద్యార్థులు సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో 42 కేంద్రాలు ఏర్పాటు
ఫలితాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి అధికారులతో డిఐఈఓ నాగముణి కుమార్ సమీక్ష
సిద్దిపేట, ఫిబ్రవరి 25 : మార్చి 1 నుంచి 19 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించి జిల్లాకు మంచి పేరు తేవాలని సిద్దిపేట, మెదక్ జిల్లాల ఇంటర్మీడియట్ విద్యాధికారి డాక్టర్ ఎల్. నాగముణి కుమార్ అన్నారు. శనివారం సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ బాధ్యత నిర్వహించే చీఫ్ సూపరింటెండెట్లు, డిపార్టుమెంట్ అధికారులు, కాస్టోడియన్లు, స్క్వాడ్ మెంబర్లకు పునశ్చరణ తరగతులు నిర్వహించారు. ఈసందర్భంగా డిఐఇఓ నాగముణి కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 27,894 మంది విద్యార్థులు పరీక్షలకు రాస్తున్నారన్నారు. ప్రథమ సంవత్సరం జనరల్ 9690, వృత్తివిద్యా కోర్సులకు 2985, మొత్తం 12,684 మంది ఉన్నారన్నరు. ద్వితీయ సంవత్సరంలో రెగ్యులర్‌గా 9719, ప్రైవైటు 2226, వృత్తి విద్యా కోర్సులకు 2842, ప్రైవేటుగా 323 మంది మొత్తం 15,110 విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. వీరి కోసం మొత్తం 42 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిలో 17 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 18 ప్రైవేటు జూనియర్ కళాశాలలను పరీక్ష కేంద్రాలను పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈసారి కొత్తగా టిఎస్ మోడల్ స్కూళ్లు 5, సోషల్ వేల్పేర్ రెసిడెన్సియల్ -2 పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా సిద్దిపేట అన్ని రంగాల్లో ప్రగతిని సాధిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్శించించిన విధంగానే ఇంటర్మీడియట్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఇంటర్ ఫలితాల్లో సైతంను సిద్దిపేట జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషిచేయాలన్నారు. పరీక్షల కోసం 42 సిఎస్‌లు, 42 డిపార్టు మెంట్ అధికారులు, 18 మంది ఎసిఎస్‌లు, రెండు ఫ్లయిండ్ స్కాడ్ బృందాలు, మూడు సిట్టింగ్ స్కాడ్ బృందాలు పనిచేస్తుంటాయన్నారు. ఫ్లయింగ్ స్కాడ్ బృందంలో డిప్యూటీ తహశీల్దార్, ఎఎస్‌ఐతో పాటు జూనియర్ లెక్చరర్ ఉంటారన్నారు. పరీక్ష నిర్వహాణల సందర్భంగా ఆయా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంట్ ఆఫిసర్లు వైద్య శిబిరాలు ఏర్పాటు, విద్యార్థులకు తాగనీటి వసతి కల్పనతో పాటు, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేటు జూనియర్ కళాశాలల కేంద్రాలకు అసిస్టేంట్ చీఫ్ సూపరింటెండెంట్లను నియమించినట్లు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహాణ సందర్భంగా నిర్వాహాకులకు ఏ సమస్య తలెత్తిన తక్షణమే డిఇసి ( జిల్లా పరీక్షల కమిటీ) దృష్టికి తేవాలన్నారు.
నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదు
పరీక్ష రాసే విద్యార్థులు ఉదయం 8-15 కల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని డిఐఈఓ నాగముణి కుమార్ అన్నారు. ఉదయం 8-30 తర్వాత విద్యార్థి పరీక్ష కేంద్రానికి వస్తే ఆలస్యానికి గల కారణాలు రిజిస్టర్‌లో నమోదు చేసి డిఇసి సమాచారం చేరవేయాలన్నారు. 9 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రానికి లోనికి అనుమతించేది లేదన్నారు. జిల్లా కలెక్టర్ చైర్మన్ ఉన్న డిఇసి ఎప్పటి కప్పుడు పరీక్షల తీరును పర్యవేక్షిస్తుందన్నారు. పరీక్షల హైపవర్ కమిటీ సభ్యురాలు అరుణ కుమారి, డిఈసి సభ్యురాలు కె.రామేశ్వర్, జగమోహన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి పరీక్షల నిర్వహణ సంబంధించిన నియమాలను వివరించారు. పరీక్షలను ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం గంటల వరకు జరుగుతాయన్నారు. మార్చి 9న ఎమ్మెల్సీ ఎన్నికలున్నందున ఆ రోజు జరిగే పరీక్షలన్ని మార్చి 19న జరుగుతాయన్నారు. ఈ వియాయాన్ని గమనించాని సూచించారు. ఇంటర్మీడియట్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు అందరు పూర్తి సహకారం అందించాలన్నారు. సమావేశంలో జెజెఎల్‌ఎ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సత్యనారాయణరెడ్డి, గన్న బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.

క్రీడల్లో నైపుణ్యం పెరగాలి

* డిప్యూటీ స్పీకర్ పద్మ
మెదక్ రూరల్, ఫిబ్రవరి 25: యువత క్రీడల్లో నైపుణ్యం సాధించాలని డిప్యూటీ స్పీకర్ ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని కోంటూరు యువసేన యువజన సంఘం సభ్యులకు వాలీబాల్ కిట్‌లను అందజేశారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక ధృడత్వం, వ్యాయామంతో ఆరోగ్యంగా ఉండగలుగుతామన్నారు.
పోలీస్ కానిస్టేబుల్, ఆర్టీ, నేవిలాంటి రక్షణశాఖ పోస్టులకు రన్నింగ్, జంపింగ్‌లో మంచి ప్రతిభ కనబర్చి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తుందన్నారు. రోజురోజుకూ వస్తున్న సాంకేతిక విప్లవం యువత ఆలోచన విధానాన్ని మార్చేస్తుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం మన అవసరానికి మాత్రమే వాడుకోవాలని సూచించారు. వాలీబాల్ కిట్‌లను అందజేసిన పద్మాదేవేందర్‌రెడ్డి సర్వీస్‌చేసి యువకులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో మండల తెరాస అధ్యక్షులు అంజాగౌడ్, మాజీ ఎంపిటిసి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

మల్లుపల్లి సర్పంచ్‌గా పోగాకు కవిత
మిరుదొడ్డి, పిబ్రవరి 25: మండల పరిధిలోని మల్లుపల్లి గ్రామ సర్పంచ్‌గా పొగాకు కవిత ఏకగ్రీవంగా ఎన్నికైనారు. అనారోగ్యంతో పొగాకు లక్ష్మిమృతి చెందడంతో ఎన్నిక అనివార్యమైంది. లక్ష్మీ మృతి చెందడంతో గ్రామస్థులు ఏకగ్రీవంగా ఆ కుటుంబ సభ్యురాలైన కవిత నామినేషన్ వేయించారు. ఒకే నామినేషన్ దాఖలు కావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.

గజ్వేల్ 10వ వార్డు నుంచి
టిఆర్‌ఎస్ అభ్యర్థి ఏకగ్రీవ ఎంపిక

గజ్వేల్, ఫిబ్రవరి 25: గజ్వేల్ 10వ వార్డు నుంచి టిఆర్‌ఎస్ అభ్యిర్థి తోట స్వర్ణలత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం నామినేషన్‌ల పర్వం ముగిసేవరకు ఎవరూ నామినేషన్‌లు వేయకపోగా, టిడిపి, కాంగ్రెస్, బిజెపి స్వర్ణలతకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. 10వ వార్డు నుంచి ప్రాతినిత్యం వహించిన తోట నరేందర్‌రావు మృతితో ఈ ఎన్నిక జరుగుతుండగా, అతని భార్య తోట స్వర్ణలతను రంగంలో ఉంచి ఏకగ్రీవానికి పావులు కదిపారు.
కాగా మున్సిపల్ చైర్మెన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మెన్ అరుణ బూపాల్‌రెడ్డి, జెఎసి కోఆర్డినేటర్ కళ్యాన్‌కర్ నర్సింగరావులు ప్రత్యేక దృష్టి సారించడంతో స్వర్ణలత ఏకగ్రీవంగా ఎన్నికవగా, అధికారికంగా 27న ప్రకటిస్తామని ఎన్నికల అధికారి శంకర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
నాగరాజుపల్లి, వెల్కటూర్ వార్డు సభ్యుల ఏకగ్రీవం
నంగునూరు : మండలంలో ఖాళీగా ఉన్న నాగరాజుపల్లి, వెల్కటూర్ వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి దేశిరెడ్డి తెలిపారు. వెల్కటూర్ 5వార్డు అభ్యర్థి ప ఎయ్యల ఎల్లయ్య, నాగరాజుపల్లి 2వార్డు అభ్యర్థి ఇప్పల లక్ష్మి మృతి చెందడంతో ఉప ఎన్నికలు అనివార్యమైనాయి. శనివారం నామినేషన్ చివరిరోజు కావడంతో వెల్కటూర్ నుంచి మల్లమారి ఎల్లయ్య, నాగరాజుపల్లి నుంచి చేర్యాల రాజవ్వలు ఒక్కో నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. ఎన్నికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించారు.

వేతనాల పెంపుపై విఆర్‌ఎల సంబురాలు
* కెసిఆర్, హరీష్‌రావు ప్లెక్సీలకు క్షీరాభిషేకం
సిద్దిపేట, ఫిబ్రవరి 25 : వారసత్వంగా విలెజ్ రెవెన్యూ అసిస్టేంట్లుగా పనిచేస్తున్న వేతనాలను 64 శాతం పెంచటంపై సిద్దిపేట విఆర్‌ఎ సంఘం నేతలు హర్షం వ్యక్తం చేసి, సంబురాలు నిర్వహించారు. విఆర్‌ఎల సుంఘం జిల్లా అధ్యక్షుడు కమలాకర్ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని పాత బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి హరీష్‌రావు ఫ్లెక్సిలకు పాలాభిషేకం చేశారు. ఈసందర్భంగా జిల్లా అధ్యక్షుడు కమలాకర్ మాట్లాడారు. ఈకార్యక్రమంలో విఆర్‌ఎ సంఘం ప్రతినిధులు శ్రీనివాస్, కలీం, చంద్రశేఖర్, కృష్ణ, రాజయ్య, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డిలో..
సంగారెడ్డి టౌన్ : గ్రామ రెవెన్యూ సహాయకుల వేతనాలు పెంచడాన్ని హర్షిస్తూ శనివారం సంగారెడ్డిలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. రూ.5500 నుండి 10500లకు పెంచడంతో పాటు డబుల్ బెడ్‌రూం ఇళ్లు ప్రకటించడం అభినందనీయమన్నారు. వేతనాల పెంపుతో తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు. కార్యక్రమంలో విఆర్‌ఎలు మురళీధర్, అరవింద్‌కుమార్, లక్ష్మణ్, చంద్రప్రకాష్, రేణుకాదేవి, సంధ్యరాణి, నాగమణి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

మిషన్ భగీరథ పనుల్లో
ఆశించిన పురోగతి ఏదీ?
* కలెక్టర్ మాణిక్యరాజ్ అసంతృప్తి
సంగారెడ్డి టౌన్, ఫిబ్రవరి 25: మిషన్ భగీరథ పనుల్లో ఆశించిన పురోగతి కనిపించడం లేదని, నిర్లక్ష్యం వీడి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ మాణిక్యరాజ్ కణ్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సింగూర్ ప్రాంతంలోని భగీరథ పనులను కలెక్టర్ పరిశీలించారు. వెంకటాపూర్ గ్రామంలో నిర్మాణమవుతున్న 100 కిలో లీటర్ల బ్యాలెన్సింగ్ రిజర్యాయర్ పనులను కలెక్టర్ పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు ప్రారంభించి చాల రోజులు గడుస్తున్న జాప్యం ఎందుకు జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూరారం గ్రామంలోని 60 కిలో లీటర్లు, బుధేరా గ్రామ పరిధిలో 1500 కిలో లీటర్ల కెపాసిటిలతో నిర్మాణమవుతున్న ఓవర్‌హెడ్ బాలెన్సింగ్ రిజార్వాయర్‌లను కలెక్టర్ పరిశీలించారు. గత ఆరు మాసాల నుండి పనుల్లో పురోగతి లేదని అధికారులు దృష్టి సారించి పనులు పూర్తి చేయాలన్నారు. సింగూర్ , బూసారెడ్డిపల్లి ఇంటెక్‌వెల్, ఫిల్టర్‌బెడ్, పంప్‌రూం, సంప్‌లను పరిశీలించి వెంటనే పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ పనులపై సమగ్రంగా సమీక్షించేందుకు ఈ నెల 27న సంగారెడ్డిలో ఏర్పాటు చేయనున్న సమావేశానికి పూర్తి సమాచారంతో రావాలని సూచించారు. పరిశీలనలో మిషన్ భగీరథ ఈఈ రఘువీర్, డిఈ హరీష్, ప్రసన్నకుమార్, ఎల్ అండ్ టి ప్రాజెక్టు మేనేజర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

ఏడుపాయల జాతరను పర్యవేక్షించిన ఉపసభాపతి

పాపన్నపేట, ఫిబ్రవరి 25: శ్రీ ఏడుపాయల వనదుర్గాదేవి పుణ్యక్షేత్రంలో జరుగుతున్న మహాజాతర ఉత్సవాల్లో రెండవ రోజైన శనివారం తెలంగాణ శాసనసభ ఉపసభాపతి యం.పద్మాదేవేందర్‌రెడ్డి వనదుర్గామాతను దర్శించుకొని జాతరలో భక్తులకు జరుగుతున్న ఏర్పాట్లను, అందుతున్న సేవలను పర్యవేక్షించారు. భక్తుల క్యూలైన్లు, స్నాన ఘట్టాలు, ఝల్లుల స్నానాలు, షవర్‌బాత్‌లు పరిశీలించారు. అలాగే అధికారులు అందిస్తున్న సేవలను శానిటేషన్ సిబ్బంది పనితీరును ఆమె పర్యవేక్షించారు. అనంతరం ఏడుపాయల్లోని రెవెన్యూ గెస్ట్‌హౌస్‌లో ఆర్‌డబ్ల్యూయస్, ఇరిగేషన్, డిపిఓ విద్యుత్ శాఖ, ఆలయ సిబ్బందితో పాటు వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకొని జాతర ప్రశాంతంగా జరిగేలా చూడాలని అధికారులకు ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో మెదక్ ఆర్డీఓ నగేష్, డిఎస్‌పి నాగరాజు, తెరాస రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, ఆలయ ఈఓ వెంకటకిషన్‌రావు, డిపిఓ హనూక్, ఆర్‌డబ్ల్యూయస్, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

నేత్రవైద్య కేంద్రం ఏర్పాటుకు
ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి బృందం పరిశీలన
నంగునూరు, ఫిబ్రవరి 25: నంగునూరులో ద్వితీయ శ్రేణి నేత్రవైద్య కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఇందుకోసం డిఎంఅండ్‌హెచ్‌ఓ, ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్స్ ప్రతినిధి బృందం శనివారం పిహెచ్‌సి గదులను పరిశీలించింది. నంగునూరులో 30 పడకల దవాఖాన స్థాయి ని 50 పడకల సిహెచ్‌సిగా మార్చారు. సిహెచ్‌సి భవన నిర్మాణపనులను పరిశీలించారు. అలాగే నేత్రవైద్య కేంద్రం ఏర్పాటుకు మంత్రి హరీష్‌రావు ఆదేశాల మేరకు ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ సౌజన్యంతో కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. హాస్పిటల్ ప్రతినిధులకు వైద్యాధికారులు రామకృష్ణ, శివానందం, కాశీనాథ్‌లు అనువైన గదులను చూపించారు. ఈ కార్యక్రమంలో డైకర్టన్ జోజిప్రసాద్, జాకిన్‌విలియం,జిపిఆర్, నిరంజన్‌కుమార్ పాల్గొన్నారు.

అన్ని మతాలకూ సమ ప్రాధాన్యం
* ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి
తూప్రాన్, ఫిబ్రవరి 25: టిఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణలోని హిందూ, ముస్లిం, క్రైస్తవ దేవాలయాలను సమానంగా గౌరవిస్తుందని ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చెట్లగౌరారం, హిమాంపూర్, లింగరెడ్డిపల్లి, ఆబోతుపల్లి, హైదరగూడలలో గల మల్లికార్జునస్వామి, ఎల్లమ్మ దేవాలయాలను సందర్శించిన సందర్భంగా విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి రూ.8కోట్లు కేటాయించిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని చల్లగా చూడాలని, సుఖశాంతులతో ఉండాలని దేవున్ని వేడుకున్నానని చెప్పారు. ఎంఎంటిఎస్ రైలును మనోహరాబాద్ నుంచి బ్రాహ్మనపల్లి వరకు తొలగించాలని బ్రాహ్మనపల్లి సర్పంచ్ వెంకటేశ్, గ్రామస్తులు విజ్ఞప్తి చేయగా కేంద్ర మంత్రితో మాట్లాడుతానని చెప్పారు. టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఎలక్షన్‌రెడ్డి, ఎంపిపి శ్రీనివాస్, నాయకులు సుధాకర్‌రెడ్డి, వెంకటేశ్, పెంటాగౌడ్, శివమ్మ, శ్రీనివాస్, సత్యనారాయణ, వెంకటేశ్ పాల్గొన్నారు.