మెదక్

మండుతున్న ఎండలు ..ఎండుతున్న గొంతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, మార్చి 24: ఉగాదికి ముందే శృతి మించిపోయిన ఎండలతో అన్ని వర్గాల వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. మరో రెండున్నర మాసాల పాటు ఎండల తీవ్రతను భరించాల్సి ఉండటంతో దిక్కుతోచని పరిస్థితులు నెలకొంటున్నాయి. పగటి ఊష్ణోగ్రతల్లో రోజు రోజుకు మార్పులు చోటు చేసుకుంటుండటంతో ఏ మేరకు పెరుగుతాయో తెలియని అయోమయ పరిస్థితులకు గురి చేస్తోంది. శుక్రవారం నాటి పగటి ఊష్ణోగ్రతలు దాదాపు 40 డిగ్రీలకు చేరుకోవడంతో ఉదయం 8 గంటలకే బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. వర్షాకాలంలో పుష్కళంగా వానలు కురియడంతో వేసవి తాపం తగ్గుతుందని భావించినా పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. గ్రీష్మతాపం నుంచి గట్టెక్కడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. జలాశయాల వద్దకు వెళ్లి సేద తీరుతున్నారు. వర్షాలు పడటం, జలాశయాలన్ని నిండుకోవడంతో సుమారు 8, 9 మీటర్ల మేరకు భూగర్భ జలమట్టం పెరిగిందన్న సంతృప్తి అదిలోనే ఆవిరైపోయింది. భూగర్భ జలమట్టం రోజు రోజుకు పడిపోతుండటంతో చేతి పంపులు, వ్యవసాయ బోరుబావులు వట్టిపోతున్నాయి. ప్రతి వేసవి మాదిరిగానే నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ సారి కూడా తాగునీటి తిప్పలు ఆరంభమయ్యాయి. ఒక కుటుంబానికి కేవలం నాలుగంటే నాలుగు బిందెల నీరు మాత్రమే సరఫరా అవుతుండటంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒక కుటుంబంలో సగటున ఐదుగురు వ్యక్తులుంటే సరఫరా అయ్యే నాలుగు బిందెల నీటితో ఏలా కాలం వెళ్లదీస్తామన్న దిగులును వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలతో పోల్చుకుంటే గిరిజన తండాల పరిస్థితి మరీ దయనీయంగా కనిపిస్తోంది. కిలోమీటర్ల దూరం వెళ్లి మంచినీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా మనిషికి సరిపోయేంత నీటిని సరఫరా చేస్తామని చెబుతున్నా అది కార్యరూపం దాల్చే వరకు కటకట తప్పదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎండ తీవ్రత పెరగడంతో మిట్టమధ్యాహ్నం పట్టణాల్లోని ప్రధాన రోడ్లన్ని బోసిపోతున్నాయి. వేసవి సెలవులు ఇంకా ప్రారంభం కాకపోగా విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడానికి జంకుతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఇంటికి వెళ్లే విద్యార్థినీ విద్యార్థులు తలలపై టోపీలు ధరించాల్సి వస్తోంది. వ్యవసాయ పొలాల్లో పని చేసే కూలీలతో పాటు ఉపాధి కూలీ పనులను సైతం ఎండ తీవ్రత పెరగకముందే ముగించుకుని జాగ్రతలు పడుతున్నారు. గత్యంతరం లేక బయటకు వెళ్లే వారు వడగాల్పుల భారీన పడి వడదెబ్బకు గురవుతున్నారు. వడదెబ్బ బాధితుల సంఖ్య ఆసుపత్రుల్లో పెరుగుతున్నట్లు వైద్యులు పెర్కొంటున్నారు. ఎండలో తిరగడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు ప్రబలుకునే ప్రమాదం ఉంటుందని, తగిన జాగ్రతలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో నీటి కష్టాలు లేకుండా ముందస్తు జాగ్రతలు తీసుకోవాలని ప్రభుత్వం చేసిన సూచనల మేరకు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు వెంకట్రాంరెడ్డి, భారతి హోళికేరి, మానిక్కరాజ్ కణ్ణన్‌లు అధికారులతో ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ప్రధానంగా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు గ్రామాల వారిగా నీటి ఇబ్బందులపై నివేధికలు సిద్దం చేసి తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు కొనసాగిస్తున్నారు. జహీరాబాద్, సదాశివపేట, మెదక మున్సిపల్ పట్టణాల్లో తాగునీటి ఇబ్బందులు ఇప్పుడిప్పుడే ఆరంభమయ్యాయి. సంగారెడ్డి మున్సిపాలిటీలో గత యేడాదితో పోల్చుకుంటే సింగూర్ ప్రాజెక్టు, మంజీర రిజర్వాయర్‌లో నీటి నిల్వ ఉండటంతో కొంత మేరకు నీటి కష్టాలను అధిగమిస్తోంది. గజ్వేల్ నియోజకవర్గంలో మిషన్ భగరీథ పనులు పూర్తి కావడంతో నీటి సరఫరా కొంత మేరకు కొనసాగుతుండటంతో ప్రభుత్వానికి ఉపషమనం కల్పిస్తోంది. భానుడు ప్రతాపం పెరుగుతున్న నేపథ్యంలో ఎండలో తిరగకుండా ఉంటేనే అన్ని విధాలుగా మంచిదని ఆరోగ్య నిపుణలు సూచిస్తున్నారు. వేసవి తాపం నుంచి సేద తీరడానికి కరెంటు సరఫరాలో అంతరాయం లేకపోవడంతో అన్ని వర్గాల వారికి కొంత మేరకు ఊరటనిస్తోందని చెప్పడంలో సందేహం లేదు.
వైభవంగా లక్ష్మీనృసింహుని
శేష వాహనోత్సవం
* ఘనంగా బ్రహ్మోత్సవాలు
గజ్వేల్, మార్చి 24: నాచగిరి శ్రీ లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శేష వాహనోత్సవ సేవ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తజనుల జయజయ ధ్వానాల మధ్య సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన శేష వాహనంపై సతీసమేతులైన శ్రీ స్వామి వారిని అధిష్టింపజేశారు. అనంతరం ఆధ్యాత్మిక, భజన, కోలాటాల మధ్య స్వామివారిని నాచగిరి పురవీధుల్లో ఊరేగించారు. కాగా మొదటగా మూలవర్యులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో దేవాదాయశాఖ సహాయ కమిషనర్ సుధాకర్ రెడ్డి, వేద పండితులు చంద్రకాంత శర్మ, కృష్ణమాచార్యులు, జగన్నాధాచార్యులు, శ్రీనివాస రాఘవన్, గోపాలకృష్ణ శర్మ, సిబ్బంది రంగాచారి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.