మెదక్

మధ్యాహ్న భోజన కార్మికుల బకాయిలు చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, ఫిబ్రవరి 8: మధ్యాహ్న భోజన పథకంలో పని చేస్తున్న కార్మికుల ఐదు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సాయిలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2019 మద్యంతర బడ్జేట్‌లో నిధులు పెంచుకుండా అన్యాయం చేసిందన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు చెల్లించే వెయ్యి రూపాయల గౌరవ వేతనాన్ని సైతం నెలల తరబడి చెల్లించకుండ ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ప్రతి రోజు 8గంటలు పని చేస్తున్న వారికి వెయ్యి రూపాయల గౌరవ వేతనం ఇవ్వడం అన్యాయమని, కనీస వేతనం రూ.18వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు జయరాజ్, నర్సింహారెడ్డి, రమేష్‌గౌడ్, కార్మికులు గోవింద్, లక్ష్మి, బాగ్యమ్మ, శాంతమ్మ, రత్నమ్మ, మంజుల, విజయ, యశోద, రాణి, అనసూయ తదితరులు పాల్గొన్నారు.
* బడ్జెట్‌ను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
గత 20యేళ్లుగా పని చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా హక్కులను కాలరాస్తున్న కేంద్రానికి తగిన గుణపాఠం చెప్పాలని ఎఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బీంరావుపాటిల్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మధ్యాహ్న భోజనానికి ఎలాంటి కేటాయింపులు చేయకపోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం సంగారెడ్డి కొత్త బస్టాండ్ ముందు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అక్షయ పాత్ర ద్వారా మధ్యాహ్న భోజన పథకం నిర్వహించడం సమంజసం కాదన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన ప్రసాద్, హరిశంకర్, సిద్దమ్మ, లక్ష్మి, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

మెదక్, ఫిబ్రవరి 8: ఇంటర్మీడియేట్ పరీక్షల నిర్వాహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేట్లు పకడ్భందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నగేష్ అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో జేసీ అధ్యక్షతన ఇంటర్ పరీక్షల నిర్వాహణకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ నగేష్ మాట్లాడుతూ ఇంటర్మీడియేట్ పరీక్షలను నెల 27 నుండి మార్చి 13 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్ష ఉదయం పూట నిర్వహించడం జరుగుతుందని, అందువల్ల విద్యార్థులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రం సమీపంలో జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా వైద్యాధికారికి సూచించారు. అలాగే పరీక్షలు జరుగుతున్న ప్రతి కేంద్రానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రానికి సంబంధించిన ప్రశ్నపత్రాలు సమీప పోలీస్ స్టేషన్‌లో మూడు సెట్‌లు అందుబాటులో ఉంటాయన్నారు. పరీక్ష ఉదయం 9 నుండి 12 గంటల వరకు జరుగుతుందని, విద్యార్థులు తప్పనిసరిగా 8:30 గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని జేసీ విద్యార్థులకు సూచించారు. 9 గంటల తరువాత విద్యార్థులను ఎట్టి పరిస్థితిలో పరీక్షా కేంద్రానికి అనుమతించరాదని అందువల్ల విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. జిల్లాలో మొత్తం 29 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా పరీక్షల కమిటి కన్వీనర్ సూర్యప్రకాశ్ తెలిపారు. జిల్లాలో మొదటి సంవత్సరం జనరల్, ఓకేషనల్ పరీక్షలకు 764 మంది, రెండవ సంవత్సరం 6720 మందితో కలిపి మొత్తం 17273 మంది విద్యార్థులకు ఈ పరీక్షలకు హాజరు అవుతున్నారని జేసీ నగేష్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సీతారామరావు, డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్‌రావు, డీఎస్పీ కృష్ణమూర్తి, డీపీఆర్‌ఓ శైలేశ్వర్‌రెడ్డి, ఏఓ యాదగిరితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలకు 15 డెస్కులు బహూకరణ

గజ్వేల్, ఫిబ్రవరి 8: విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకెల్లాలని ఆకాంక్షిస్తూ గజ్వేల్ మున్సిపల్ పరిదిలోని ప్రజ్ఞాపూర్ రాణె బ్రేక్‌లైనింగ్స్ సంస్థ యాజమాన్యం తిమ్మకపల్లి ప్రభుత్వ పాఠశాలకు శుక్రవారం 15 స్కూల్ డెస్కులను బహూకరించింది. ఈ సందర్బంగా ఎంఈఓ సునిత మాట్లాడుతూ సామాజిక బాద్యతగా గుర్తించి ముందుకు వచ్చిన రాణె బ్రేక్ లైనింగ్స్ లిమిటెడ్ సంస్థ నిర్వాహకులను ప్రశంసించారు. రాణె కంపనీ ప్లాంట్ హెడ్ రాజేందర్ మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులు చక్కటి విద్యను పొంది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా లక్ష్యాలను నిర్ధేశించుకొని ముందుకెల్తే సాదించనిదంటూ ఏమీ ఉండదని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంకు తమ వంతు సహకారం అందించాలనే లక్ష్యంతో ఫర్నీచర్‌ను అందజేసినట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్‌మాస్టర్ ప్రభాకర్, మదునాల శ్రీనివాస్, యూనియన్ వర్కింగ్ ప్రసిడెంట్ భిక్షపతి, హెచ్‌ఆర్ అసిస్టెంట్ మేనేజర్ మహేశ్, సురేందర్ రెడ్డి, దామోదర్, జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సిద్దిపేట, ఫిబ్రవరి 8 : ట్రాఫిక్ నిబంధనలు విద్యార్థి దశనుండి అలవర్చుకోవటం వల్ల రోడ్డు ప్రమాదాలు అరికట్టవచ్చని సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రతిభ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థిని, విద్యార్థులకు రోడ్డ్భుద్రత, ట్రాఫిక్ నిబంధనల గూర్చి అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఏసీపీ బాలాజీ మాట్లాడుతూ రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. విద్యార్థులు రోడ్డుపై జరిగే ప్రమాదాల గురించి తల్లిదండ్రులు, చుట్టుప్రక్కల వారికి తెలియజేసి వారిలో చైతన్యం కల్పించాలన్నారు. ప్రతి వ్యక్తి వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీటుబెల్టు తప్పకుండ ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపటం వల్ల రోడ్డు ప్రమాదంలో చాల మంది మృతిచెందారని, వారిపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. మానవ తప్పిదాల వల్లనే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తే చాల వరకు రోడ్డు ప్రమాదాలు అరికట్టవచ్చన్నారు. సిద్పిటలో ఈ-చాలన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. త్రిబుల్ రైడింగ్, రాంగ్ పార్కింగ్, ర్యాష్ డ్రైవింగ్, లైసెన్స్, డాక్యుమెంట్లు లేకుండా వాహనాలు నడిపే వారికి కాగితం, ఈ- చాలన్ ద్వారా జరిమానాలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ సిబ్బందికి డిజిటల్ కెమెరాలు అందచేయటం జరిగిందన్నారు. ట్రాపిక్‌లో వాహనదారులు నిబంధనలు పాటించకుంటే డిజిటల్ కెమెరాల ఫోటో ద్వారా ఈ-చాలన్ కేసులు వేయటం జరుగుతుందన్నారు. విద్యార్థి దశ నుండి క్రమశిక్షణ నేర్చుకొని ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తు అందరికి ఆదర్శంగా నిలువాలన్నారు. ఆనంతరం విద్యార్థులచే మేము ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడుపుతామని, నల్గురికి ట్రాఫిక్ నిబంధనల గురించి తెలిపి అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈకార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్‌ఐ షకిల్ ఆహ్మద్, కాలేజీ ప్రిన్సిపాల్ సూర్యప్రకాశ్, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

గజ్వేల్, ఫిబ్రవరి 8: అభివృద్దిని స్వాగతిస్తూనే ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తామని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీల అమలుకు సర్కార్‌పై వత్తడి తేవడంతోపాటు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలను చైతన్యం చేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా జిల్లాలో సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషించనుండగా, కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన బాద్యతల నుండి తప్పించుకునే సమస్యే లేదని తెలిపారు. గజ్వేల్‌లో కాంగ్రెస్ మెరుగ్గా ఉండగా, దుబ్బాక, సిద్దిపేటలపై దృష్టి సారించాల్సి ఉందని, అయితే వచ్చే ఎంపీటీసీ, సహకార, ఎంపీ ఎన్నికల వరకు బలోపేతం అవుతామని చెప్పారు. యువనేత రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు శ్రమించాల్సి ఉండగా, ఇంత కష్టకాలంలో సైతం కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్‌తోనే ఉండడం అదృష్టంగా భావిస్తున్నట్లు అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాదించ గా, జరగబోయే ప్రతి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని వివరించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రచార కమిటీ కార్యదర్శి రామరాజశర్మ, మాజీ జెడ్‌పీటీసీ గుంటుకు మల్లేషం, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు గాలెంక నర్సింలు, ఎంపీటీసీ బందారెడ్డి, నేతలు గుంటుకు శ్రీను, అజ్గర్, సుదర్శన్, శ్రీకాంత్, యాదయ్యలు పాల్గొన్నారు.
రైల్వే పనుల అడ్డగింత

మెదక్ రూరల్, ఫిబ్రవరి 8: పరిహారం అందుకోని రైతు రైల్వే పనులను అడ్డుకొని దంపతులు దీక్షకు దిగారు. విషయం తెలిసిన మెదక్ రూరల్ సిఐ, హవేళీఘణాపూర్ ఎస్‌ఐలు పోలీసులతో అక్కడికి చేరుకుని రైతు దంపతులతో మాట్లాడారు. సోమవారం వరకు కలెక్టర్‌తో మాట్లాడి సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సంఘటన శుక్రవారం హవేళీఘణాపూర్ మండలం షమ్నాపూర్ శివారులో చోటుచేసుకుంది. అక్కన్నపేట-మెదక్ రైల్వే పనులు కొనసాగుతున్నాయి. ఇందుకోసం రైతుల నుండి సేకరించిన భూములు, బోర్లు, చెట్లకు డబ్బులు చెల్లించారు. షమ్నాపూర్‌కు చెందిన బద్దం మల్లారెడ్డి, బాలమణి దంపతులకు చెందిన 2.05 ఎకరాల భూమి రైల్వే లైన్‌కోసం సేకరించేందుకు పలుమార్లు నోటీసులిచ్చినా స్వీకరించలేదు. దీంతో ఆర్‌డిఓ భూమి, ఇతర బోరుబావులకు డబ్బులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుని రెవెన్యు నుండి రైల్వేశాఖకు భూమిని అప్పగించారు. గత మూడు, నాలుగు రోజులుగా రైల్వేకట్ట నిర్మాణ పనులు చేపట్టారు. బాధిత రైతు మల్లారెడ్డి, బాలమణి దంపతులు కట్టపోస్తున్న చోటుకు వచ్చి జెసిబి అడ్డంగా కూర్చుండి దీక్షకు దిగారు. భూమి కోల్పోతున్నందున రైల్వే ఉద్యోగంతోపాటు సంతృప్తి చెందేలా పరిహారం చెల్లించి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎంతకు జెసిబి నుండి అడ్డుతొలగకపోవడంతో సమాచారం అందుకున్న మెదక్ రూరల్ సిఐ రాజశేఖర్, హవేళీఘణాపూర్ ఎస్‌ఐ శ్రీకాంత్, పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకుని రైతు దంపతులతో మాట్లాడారు. తహశీల్దార్ వెంకటేశం కూడా అక్కడికి చేరుకుని రైతుతో మాట్లాడారు. సోమవారం వరకు కలెక్టర్‌తో మాట్లాడి సమస్య పరిష్కరించుకోవాలని సిఐ సూచించారు. సోమవారం నుండి పనులు అడ్డుకోవడానికి వీల్లేదని కొనసాగుతాయన్నారు.

రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్థవ్యస్తంగా ఉంది
గత ఐదు సంవత్సరాలుగా విద్యా వ్యవస్థలో రిక్రూట్‌మెంట్ లేదు
భారతదేశంలోనే రిక్రూట్‌మెంట్ లేని మొదటి రాష్ట్రం తెలంగాణ

మెదక్, ఫిబ్రవరి 8: రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్థంగా మారిందని ఎస్టీయూ రాష్ట్ర నాయకులు శిరిగ ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రభుత్వ పాఠశాలలకుగానీ, జిల్లా పరిషత్ స్కూల్స్‌కుగానీ నియామకాలు చేయలేదన్నారు. భారతదేశ చరిత్రలో తెలంగాణ ప్రభుత్వం మొదటి దశ పూర్తి చేసుకొని రెండవ దశలో ప్రభుత్వం ఏర్పడినప్పటికీ దేశంలోనే టీచర్స్ రిక్రూట్‌మెంట్‌లో తెలంగాణ ప్రభుత్వం ఒక్కటేనని ఆయన తెలిపారు. రాష్ట్రంలో టీచర్స్ పోస్టులు 50 వేలు ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. అర్హత కలిగిన నిరుద్యోగులు మూడు లక్షల మంది ఉన్నారన్నారు. 21 సంవత్సరాలుగా ఉమ్మడి సర్వీస్ రూల్స్ లేకపోవడం వలన పర్యవేక్షణ పూర్తిగా విద్యా వ్యవస్థపై కొరవడిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఎంఈఓలు 95 శాతానికిపైగా ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా కంగ్టి మండలంలో రెగ్యులర్ ఎంఈఓ మల్లేశం మాత్రమే కొనసాగుతున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 60 మండలాలు ఉన్నాయి. 59 మండలాల్లో ఎంఈఓలు రెగ్యులర్ లేరని, ఇంచార్జీలుగా కొనసాగిస్తున్న విషయాన్ని ఆయన తెలిపారు. మెదక్ జిల్లాలో 20 మండలాల్లో ఎంఈఓల ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వంద శాతం డీఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. 31 జిల్లాలు ఉండగా అందులో 10 పాతవి, 21 జిల్లాలు కొత్తగా ఏర్పడినవి ఉన్నట్లు ఆయన తెలిపారు. పాత జిల్లాల్లో 10 మంది రెగ్యులర్ డీఈఓలు ఉన్నట్లు తెలిపారు. మిగిలిన 21 జిల్లాల్లో డీఈఓ పోస్టులు మంజూరు కాలేదని ఆయన తెలిపారు. ఇంచార్జీలుగా కొనసాగుతున్న డీఈఓలు ఉప విద్యాధికారి స్థానంలో వేతనాలు పొందుతున్నారని తెలిపారు. మెదక్ జిల్లా విద్యాధికారి కార్యాలయంలో నూతనంగా సిబ్బంది పోస్టులు మంజూరు కాకపోవడం వలన ఉన్న సిబ్బందిపై పనిభారం పెరిగిందన్నారు. కొత్తగా జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, సూపరిండెంట్ పోస్టులు మంజూరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ మధ్యనే ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించి ఇంగ్లీష్ బోధనకు కావాల్సిన ఉపాధ్యాయులు నియామకం కాకపోవడంతో ఇటు ఇంగ్లీష్ రాక, అటు తెలుగు రాక రెండింటిక చెడ్డ రేవడిలా మారాయని ఆయన తెలిపారు. బాష పండితులను, పీఈటీలను అప్‌గ్రేడ్ చేసినందున వారికి వెంటనే పోస్టు ఉన్నతీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే అర్హతగల ఎస్‌జీటీలకు కూడా పదోన్నతులు కల్పంచే విషయంలో ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. మెదక్ జిల్లా కేంద్రంలో గోల్కొండ స్కూల్ 1 నుండి 5వ తరగతి వరకు 94 మంది విద్యార్థులు చదువుకుంటారు. ఇక్కడ ఒక్క రెగ్యులర్ టీచర్ లేరు. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతున్నాయి. పైగా 10వ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల కొరత లేకుండా బోధన కార్యక్రమాన్ని సక్రమంగా నడిపించిననాడే విద్యార్థులు ఫలితాలు సాధిస్తారని ఆయన సూచించారు.

మార్చి 16 నుండి ఎస్‌ఎస్‌సీ పరీక్షలు
* జిల్లాలో 67 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

మెదక్, ఫిబ్రవరి 8: మెదక్ జిల్లాలో ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు 66 రెగ్యులర్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డీఈఓ రవికాంతరావు శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ తెలిపారు. ఇందులో 11361 మంది ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు వ్రాస్తారని తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు, బాలికల హైస్కూల్‌లో 272 మంది పరీక్షలు వ్రాస్తారని తెలిపారు. ఈ పరీక్షలు మార్చి 16 నుండి ఏప్రిల్ 2 వరకు కొనసాగుతాయని తెలిపారు. కొత్తగా రెడ్డిపల్లిలో ఎస్‌ఎస్‌సీ పరీక్షల కేంద్రం ఏర్పాటైనట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలకు జిల్లా కలెక్టర్ క్రూషియల్ బ్యాలెన్స్ నిధుల నుండి డ్యుయల్ డెస్క్‌లు రెండు వేల వరకు సమకూర్చినట్లు డీఈఓ తెలిపారు. కాగా ఫర్నిచర్ కొరత లేదన్నారు. మంచినీటి వసతులు, విద్యుత్ అన్ని కేంద్రాల్లో సమకూర్చుతున్నట్లు తెలిపారు. మెదక్ జిల్లాలో 66 రెగ్యులర్, ఒకటి ఫెయిల్ అయిన విద్యార్థులకు పరీక్షా కేంద్రాలకు కొనసాగుతాయని తెలిపారు. ఇందులో 11 ప్రైవేట్ స్కూల్స్, ఇనిస్టూషన్లు ఉన్నట్లు తెలిపారు. రామాయంపేట, మెదక్, తూప్రాన్, నర్సాపూర్‌లు ఉన్నాయని తెలిపారు.
* 18 నుండి 21 వరకు టీటీసీ పరీక్షలు
మెదక్ జిల్లాలో టెక్నికల్ సర్ట్ఫికెట్ కోర్సు పరీక్షలు ఈ నెల 18 నుండి 21 వరకు ప్రభుత్వ బాలికల హైస్కూల్‌లో నిర్వహించనున్నట్లు డీఈఓ రవికాంతరావు తెలిపారు. ఇందులో డ్రాయింగ్, టైలరింగ్‌లో లోయర్, హైయ్యర్ పరీక్షలు ఉంటాయన్నారు. టైలరింగ్‌లో పరీక్షకు హాజరయ్యే వారు హాల్‌టికెట్‌తో పాటు కుట్టుమిషన్, కత్తెర తెచ్చుకోవాలని ఆయన సూచించారు. హాల్‌టికెట్ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 10 నుండి 12:30 గంటల వరకు, మద్యాహ్నాం 2 నుండి 4:30 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు. టైలరింగ్ శిక్షణార్ధులకు ప్రభుత్వం నుండి బట్ట సరఫరా చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏసీజీఈ భాస్కర్ ఉన్నారు.

రోడ్డు నిబందనలు పాటిస్తే ప్రమాదాలు దూరం
ట్రాఫిక్ రూల్స్‌పై విద్యార్థుల్లో చైతన్యం అవసరం

గజ్వేల్, ఫిబ్రవరి 8: రోడ్డు నిబందనలు పాటిస్తే ప్రమాదాలు నివారించ వచ్చని గజ్వేల్ ఏసీపీ నారాయణ, సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ బాలాజినాయక్‌లు పేర్కొన్నారు. శుక్రవారం గజ్వేల్‌లోని విద్యాసౌదంలో విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించిన సందర్బంగా వారు మాట్లాడారు. విద్యార్థి దశ నుండే రోడ్డు భద్రతా, ట్రాఫిక్ నిబందనల పట్ల అవగాహన పెంచుకోవడంతోపాటు తల్లిదండ్రులు, ప్రజలను చైతన్యం చేయాలని వారు కోరారు. ముఖ్యంగా ప్రయాణం చేసే సందర్బంలో హెల్మెట్ దరించాలని, సీటుబెల్టు పెట్టుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, డ్రైవింగ్, ఆర్‌సీ, పొల్యూషన్ తదితర సర్ట్ఫికెట్లు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని స్పష్టం చేశారు. అలాగే వాహనాలు అతి వేగంగా నడపడం తో ప్రమాదాలు చోటుచేసుకొని కుటుంబాలు రోడ్డున పడుతుండగా, మానవ తప్పిదాల ఫలితంగానే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటిస్తే ప్రమాదాలు పూర్తి స్థాయిలో అరికట్టవచ్చని, త్రిబుల్ రైడింగ్, రాంగ్ పార్కింగ్, ర్యాష్ డ్రైవింగ్‌లు నిషేదమని చెప్పారు. ఈచాలన్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందని, వాహనాల డ్రైవర్‌లు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా కష్టాలు కొనితెచ్చుకోవాల్సి ఉంటుందని అన్నారు. ట్రాఫిక్ సిబ్బందికి డిజిటల్ కెమరాలు అందజేయగా, నిబందనలు ఉల్లంగిస్తే జరిమానా, జైలు జీవితం తప్పవని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించగా, ప్రజ్ఞాపూర్ చౌరస్తా నుండి ఆర్డీఓ ఆఫీస్, గజ్వేల్ మినీ స్టేడియం వరకు హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి, తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ చెప్పెల హరినాథశర్మ, అద్యాపకులు డాక్టర్ అయోద్యారెడ్డి, డాక్టర్ రమేశ బాబు, డాక్టర్ అడవి రాజు, డాక్టర్ ప్రనీతలు పాల్గొన్నారు.