మెదక్

ముగిసిన ఖేడ్ ఉప ఎన్నిక ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఫిబ్రవరి 11: పట్టుకోసం ఒకరు..సత్తా మరొకరు..బెట్టుతో ఇంకొకరు తమ శ్రేణులను వెంటేసుకుని ఓటర్లను ఆకట్టుకుని విజయం సాధించాలనే లక్ష్యంతో నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో పక్షం రోజులుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రం ప్రశాంతంగా ముగిసింది. మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్న ఈ నియోజకవర్గంలో ఓటర్లు ఎవరికి మద్దతు ఇస్తారోనని రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మూడు రాష్ట్రాల సరిహద్దు, ఐదు భాషలు మాట్లాడే ఈ నియోజకవర్గం మాత్రం అభివృద్ధిలో మాత్రం ఆమడదూరంలో ఉంది. తాగడానికి నీరు లేక, ప్రయాణించడానికి రోడ్లు లేక, సాగుకు యోగ్యం కానీ భూములపై నమ్మకం లేక వేలాది మంది ప్రతి యేటా వలసలు వెళ్లే దౌర్భాగ్యపు పరిస్థితులు నెలకొన్న ఈ నియోజకవర్గంలో ఓటర్ల మద్దతు కూడగట్టుకోవడానికి పార్టీలు ఇవ్వని హామి అంటూ లేదు. గత యేడాది ఆగస్టు వరకు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన కాంగ్రెస్ నేత పి.కిష్టారెడ్డి మృతి చెందడటంతో ఉప ఎన్నికకు తెరలేచింది. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కాంగ్రెస్, ఇండిపెండెంట్, టిడిపి అభ్యర్థులే ఎమ్మెల్యేగా ఎన్నికైన చరిత్ర ఉంది. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిఆర్‌ఎస్ గెలుపొందినా నారాయణఖేడ్‌లో మాత్రం కాంగ్రెస్ పార్టీ తన కంచుకోటను జాగ్రత పర్చుకుంది. ఈ నియోజకవర్గం ఓటర్లను ఆకర్షించాలనే తపనతో టిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మరణించిన నెల రోజుల నుంచి ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించింది. అనేక నిధులు మంజూరు చేసి రోడ్లు, వీది దీపాలు, మార్కెట్ యార్డులు, మురికి కాలువలు, అంతర్గతంగా సిసి రోడ్లు, తాగునీటి సదుపాయం తదితర వసతులు కల్పించి ఓటర్లలో కొత్త ఆలోచనలు రేకెత్తించేలా పావులు కదిపింది. కాంగ్రెస్ పార్టీ సైతం ఓటర్లు తమకే మద్దతు పలుకుతారన్న ధీమాతో పాటు సానుభూతికి సానబెట్టే ప్రయత్నం చేసింది. టిడిపి పార్టీ శ్రేణులు ఆ పార్టీ అభ్యర్థి మంచితనాన్ని చూపించి ఓట్లు కూడగట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. చివరి రోజున మూడు పార్టీలు ఇంటింట ప్రచారం నిర్వహించాయి. ఖేడ్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బైక్ ర్యాలీ నిర్వహించింది. ఉప ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రి హాజరైన బహిరంగ సభ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి వేలాదిగా జనం తరలి రావడంతో టిఆర్‌ఎస్ శ్రేణుల్లో గెలుస్తామన్న బరోసా వ్యక్తమవుతోంది. ఓటర్లు వచ్చినంత మాత్రాన గెలుపు సాధ్యం కాదని, కనీసం పార్టీ గుర్తు ఏమిటో తెలియని ఓటర్లు ఉన్నారని వారిలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని సిఎం పార్టీ శ్రేణులకు వేధిక సాక్షిగా ఉద్బోదించారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆలవాలమైన ఖేడ్ నియోజకవర్గంలో ఉప ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్, సిసి కెమెరాలను ఏర్పాటు చేసి నిశితంగా పర్యవేక్షించనుంది. ఎస్పీ సుమతి ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పాత నేరస్తులను ఇప్పటికే బైండోవర్ చేసారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి పెద్ద సంఖ్యలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ప్రచారం నిర్వహించిన నాయకులు ఇంటి దారి పట్టారు. నియోజకవర్గంలో ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఉండకూడదన్న నిబంధనల మేరకు పక్షం రోజులుగా గ్రామాల్లో తిష్ట వేసిన టిఆర్‌ఎస్ నాయకులంతా వెనుదిరిగిపోయారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఐదు మండలాలు ఉండగా 1,88,839 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 95,772, మహిళా ఓటర్లు 93,040, ఇతరులు 27 మంది ఉన్నారు. వలసలు వెళ్లిన ఓటర్లు దండి యాత్రకు వెళ్లిన భక్తులను పోలింగ్ రోజు హాజరయ్యేలా అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రచారం ప్రశాంతంగా ముగిసినా ఉన్న సమయంలోనే ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి పార్టీలు చాపకింద నీరులా ప్రయత్నాలు సాగించే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున డబ్బు, మద్యం వెదజల్లడానికి గ్రామాల్లో ప్రయత్నాలు చేయనున్న నేపథ్యంలో ఇలాంటి ఎత్తులను చిత్తు చేయడానికి గ్రామాల్లో పార్టీ శ్రేణులు కాపుకాచుకుని కూర్చుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంటుందన్న సమాచారంతో పోలీసులు గస్తీని పెంచాయి. ఈ నెల 13వ తేదీన పోలింగ్ పూర్తికానుండగా 16వ తేదీన ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలను వెల్లడించనున్నారు. అప్పటి వరకు నారాయణఖేడ్ నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనే ప్రధాన చర్చగా మారనుంది.

మామ స్వాతిముత్యం! అల్లుడు ఆణిముత్యమా?
పెద్దశంకరంపేట, ఫిబ్రవరి 11: మామా అల్లుల్లు ఒకరిని ఒకరు పొగుడుకుంటూ ఖేడ్ ప్రజలను మోసం చేస్తూ ఎన్నికల్లో లబ్ధ్దిపొందాలని చుస్తున్నారని శాసనసభ టిడిపినేత రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం టిడిపి తరపున ఎన్నికల ప్రచారం అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. మాటలు చెప్పడమే కానీ చేతలు ఉండవని నాడు ప్రొఫెసర్ జయశంకర్ స్వంత గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధ్ది చేస్తానన్న కెసిఆర్ నేటికి ఏమైనా అభివృద్ది చేశాడా అని ప్రశ్నించారు. మామ బాటలోనే అల్లుడు హరిష్‌రావు ఖేడ్‌ను దత్తత తీసుకొని అభివృద్ధ్ది చేస్తానంటే ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. నారాయణఖేడ్‌లో సత్తాగల నాయకులు లేరా, ఖేడ్ ప్రజల ఆమాయకత్వాన్ని చూసి మంత్రి నోటికి వచ్చినట్లు మాట్లాడటం ఎంత వరకు సమంజసమన్నారు. మంత్రి దత్తత తీసుకొని అభివృద్ధ్ది చేస్తానని, మామ పాంహౌస్‌లో పండిన క్యాబేజి పూలను ఖేడ్ ప్రజల చెవ్వుల్లో మంత్రి హరీష్‌రావు పెడుతున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. తెరాస ప్రభుత్వం ఏర్పడగానే 600 కోట్లు వెనుకబడిన ఖేడ్ నియోజకవర్గానికే మంజూరు చేయించానని చెబుతున్న మంత్రి హరీష్‌రావు దాంట్లో 10 శాతం కమీషన్ తీసుకొని ఆ డబ్బులు నేడు ఖేడ్ ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారన్నారు.
సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఖేడ్‌లో ఏకగ్రీవం కావాల్సిన ఎన్నికలను ఎన్నికలు నిర్వహిస్తూ తెరాస నుండి భూపాల్‌రెడ్డికి టికెట్ ఇచ్చి అన్నదమ్ముల మధ్య చిచ్చురేపుతున్న కెసిఆర్‌కు సరైన గుణపాఠం నేర్పాలన్నారు. టిడిపి నుండి నాయకులు పోయినంత మాత్రాన టిడిపి ఖాళీ కాదని, నేటికి టిడిపిలో 10 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని, టిడిపి నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ అని ఆయన పేర్కొన్నారు. కెసిఆర్‌ను శాసనసభలో ధీటుగా ఎదుర్కొవడానికి తనకు సపోర్ట్‌గా విజయపాల్‌రెడ్డిని గెలిపించి శాసనసభకు పంపించాలని ఆయన ఖేడ్ ప్రజలను విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మాజీ మంత్రి బోడ జనార్దన్, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ బట్టి జగపతి, అభ్యర్థి విజయపాల్‌రెడ్డి, మాజీ కార్పోరేటర్, సత్యనారాయణ, సుభాష్ తదితరులు ఉన్నారు.

ప్రశాంత వాతవరణంలో
ఎన్నికలు నిర్వహించాలి
* వీడియో కాన్ఫరెన్స్‌లో భన్వర్‌లాల్
సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 11: నారాయణఖేడ్ ఉప ఎన్నికను ఈ నెల 13న ప్రశాంత వాతవరణంలో ముగిసేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేయాలని చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారి భన్వర్‌లాల్ కోరారు. గురువారం హైదరాబాద్ నుండి నారాయణఖేడ్ ఉప ఎన్నిక ఏర్పాట్లపై అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సున్నిత, అతి సున్నితమైన ప్రాంతాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. 13న ఉదయం 7నుండి సాయంత్రం 5గంటల వరకు మాత్రమే పోలింగ్ కొనసాగుతుందని, ప్రతి పోలింగ్ కేంద్రంలోను పోలింగ్ ప్రారంభానికి ముందు మాక్ పోలింగ్‌ను పోలింగ్ ఎజెంట్ల సమక్షంలో నిర్వహించాలన్నారు. ఎన్నికల సంఘం అనుమతించిన డాక్యుమెంట్లు గుర్తింపు కొరకు ఓటర్లు తెచ్చేలా, వారిని ఓటింగ్‌కు అనుమతించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వీడియో గ్రాఫర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు వెబ్‌కాస్టింగ్ జరిగేలా చూడాలన్నారు. గురువారంతో ప్రచారం ముగిసిన నేపధ్యంలో ఓటర్లు కాని వారిని ఆ ప్రాంతంలో అనుమతించవద్దని స్పష్టం చేశారు. కలెక్టర్ రొనాల్డ్ రాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలో 286 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి 1374 పోలింగ్ సిబ్బందిని నియమించామన్నారు. నియోజకవర్గాన్ని 33 రూట్లుగా విభజించి అధికారులను, 128మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామన్నారు. నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న 144 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ చేస్తున్నామన్నారు. మిగిలిన కేంద్రాల్లో వెబ్ రికార్డింగ్ చేస్తున్నామన్నారు. నారాయణఖేడ్ నుండి కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఎస్పీ సుమతి మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశామన్నారు. కాన్ఫరెన్స్‌లో డిఆర్వో దయానంద్, నారాయణఖేడ్ రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు, ఎఎస్పీ వెంకన్న ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఎసిబికి చిక్కిన కోర్టు సూపరింటెండెంట్
మెదక్, ఫిబ్రవరి 11: మెదక్ కోర్టులోని 3వ అదనపు జిల్లా కోర్టు సూపరిండెంట్ వెంకటరమణారెడ్డి లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు గురువారం రెడ్‌హ్యాండ్‌గా పట్టుకొని అరెస్ట్ చేశారు. లంచంగా తీసుకున్న 5 వేల రుపాయలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మెదక్ జిల్లా ఎసిబి డిఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఎసిబి సర్కిల్ ఇన్స్‌పెక్టర్లు నవీన్‌కుమార్, ప్రతాప్‌కుమార్‌లో ఈ దాడిలో పాల్గొన్నారు. 2009లో లాల్‌సింగ్ సివిల్ కేసులో కోర్టులో కేసు వేశాడు. జిన్నారం మండలం గడ్డపోతారంలో లాల్‌సింగ్‌కు 105 ఎకరాల పట్ట్భామి ఉంది. ఈ భూమిలో 42 మంది ఎంక్రోచ్‌మెంట్ అయ్యారు. ఈ విషయంలో లాల్‌సింగ్ మెదక్ కోర్టులో 2009లో ఫైల్ చేశాడు. పదే పదే సూపరిండెంట్ వెంకటరమణారెడ్డి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చాడని లాల్‌సింగ్ వెల్లడించాడు. తన భూమిని ఎంక్రోచ్‌మెంచ్ చేసిన వారు 50 వేల రుపాయలు ఇచ్చారు. మీరు ఎందుకు ఇవ్వడం లేదని లాల్‌సింగ్‌ను వెంకటరమణారెడ్డి పదేపదే డిమండ్ చేస్తూ వచ్చాడని లాల్‌సింగ్ తెలిపారు. చివరకు 5 వేల రుపాయలు ఇవ్వడానికి లాల్‌సింగ్ అంగీకరించి ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వెంకటరమణారెడ్డి కోరిన 5 వేల రుపాయలను గురువారం ఉదయం 12 గంటల సమయంలో లాల్‌సింగ్ వెంకటరమణారెడ్డికి అందజేశాడు. ఆ వెంటనే డిఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఎసిబి అధికారులు దాడి చేసి లంచం తీసుకున్న డబ్బులను స్వాధీనం చేసుకొని వెంకటరమణారెడ్డిని అరెస్ట్ చేశారు.

భారీ మెజార్టీతో గెలిపించండి
ఖేడ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ద్ధి చేసి చూపిస్తా
*మంత్రి హరీష్‌రావు పిలుపు
నారాయణఖేడ్, ఫిబ్రవరి 11: నారాయణఖేడ్‌ను అభివృద్ది చేసే బాధ్యత ముఖ్యమంత్రి కెసిఅర్ తనకు ఇచ్చారు, భూపాల్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత ఓటర్లదే నని అది మీ చేతిలో ఉందని, కారు గుర్తుకు ఓటు వేసి నారాయణఖేడ్ అభివృద్ధికి సహకరించాలని మంత్రి హరీస్‌రావు ఓటర్లకు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం కల్హేర్ మండలం పత్తేపూర్, ఖాజాపూర్ గ్రామాల్లో మంత్రి హరీష్‌రావు, ఎంపి బిబిపాటిల్, హన్మంతులు భూపాల్‌రెడ్డి తరుపున ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం జరిగిన రోడ్డుషో సభలో మాట్లాడుతూ ఖేడ్‌ను అభివృద్ది చేసేందుకు అవసరమగు నిధులు ఇచ్చేందుకు సీ ఎం కెసీ అర్ అంగికరం తెలిపారని అది మీరే సభలో కళ్ల ముందు చూశారు గెలిపించే బాధ్యతను ప్రజలు ఓటర్లు తీసుకుని ఖేడ్‌లో చరిత్రను సృష్టించాలని కోరారు. బంగారు ఖేడ్‌గాను తీర్చి దిదే బాధ్యతను తీసుకుని మూడు సంవత్సరల్లో మరోసిద్దిపేటను చేసి చూపిస్తానని అన్నారు. తాగునీరు సాగునీరు, ఆసుపత్రిలు, రోడ్డులు, మార్కెట్ యార్డులు, విద్యుత్తు సబ్‌స్టేషన్లు, గోదాములు, గిరిజన తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడం విద్యరంగంలో పిజీకాలేజి ఏర్పాటు అన్ని చర్యలు తీసుకుంటానని తెలిపారు. వెనుకబడేసిన కాంగ్రెస్ పాలకులకు తగిన బుద్ది చెప్పి డిపాజిట్ రాకుండా చేయాలని ఓటర్లకు మరోసారి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే భూపాల్‌రెడ్డిని గెలిపించారని నాకు కావలసిన మేజార్టీ అవసరమని ఓటర్లకు అనందోత్సవాలకుగురి చేసి ప్రతి ఓటరు టిఅర్ ఎస్ వైపు మలి చూసే విధంగా ప్రసంగం కొనసాగించారు. ఇందలో ఎంపి బిబిపాటిల్, ఇంచార్జి భూంరెడ్డి, హన్మంతు కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

పోలీసులు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలి
మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ
నారాయణఖేడ్ ఫిబ్రవరి 11: నారాయణఖేడ్ శాసన సభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి, సంజివరెడ్డి భారీ మేజార్టీతో గెలుస్తారని యంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇంట్లో అర్థ రాత్రి పూట పోలీసులచే సోదాలు నిర్వహించి ఇంట్లో దాచి ఉంచుకున్న డబ్బులను ఎన్నికలో పంచుతున్నారని ఆరోపించి తీసుకెళ్లడం వెనుక టిఅర్‌ఎస్ నాయకుల హస్తం ఉందని అనుమానం వస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి దమెదర్ రాజనర్సింహ అరోపించారు. గురువారంనాడు ఖేడ్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంజీవరెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ రాష్ట్ర నేతలు భారీ బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ వెంకటాపూర్ చౌరస్తా నుండి ప్రారంభమై రాజీవ్ చౌరస్తావరకు కొనసాగింది. రాజీవ్‌చౌక్ వద్ద దమోదర్‌రాజ నర్సింహ మాట్లాడుతూ టి అర్ ఎస్ నాయకులకు పోలీసులకు ఎందుకు లొంగుతున్నారని ప్రశ్నించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం వీధులను నిర్వ హించుకోవాలని ఏదో ఒక పార్టీకి తోత్తులుగా మారితే సమాజంలో పోలీసులకు చెడ్డ పేరు వస్తుందన్నారు. టిఆర్‌ఎస్ ఎంతకాలం అధికారంలో ఉంటుందని ఆయన పోలీసు అధికారులను ప్రశ్నించారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిపించేందుకు జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలని అనవసరంగా ఎవరో చెప్పారని ఇంట్లో చోరబడి దాడులు చేయడం మానుకోవాలని సూచించారు. టి అర్ ఎస్ నాయకులు ఓటమి భయంతో కాంగ్రెస్ ఓటర్లను భయభ్రంతులకు గురి చేసే ప్రయత్నలు చేస్తే ప్రజలే తగిన బుద్ధ్ది చెబుతారని అన్నారు. తప్ప కుండా సంజీవరెడ్డి గెలుపును ఎవరు అపలేరని తెలిపారు. అభివృద్ధ్ది పేరుతో ముందుకు వస్తున్నామని బోగస్ మాటలు చెబుతున్నారని వారి మాటాలు నమ్మేందుకు ఖేడ్‌లో ప్రజలు పచ్చి వారు కాదని గుర్తు చేసుకోవాలని తెలిపారు. మంత్రి హరీష్‌రావు ఎన్ని జిమ్మిక్కులు చేసిన ఖేడ్ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటనే ఖేడ్‌గా గుర్తు చేసుకోవాలని టిఅర్ ఎస్ నాయకులకు సలహా ఇచ్చారు. ఇందులో మాజీ ఎంపి సురేష్‌శెట్కార్, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, జైపాల్‌రెడ్డి, అభ్యర్థి సంజీవరెడ్డి, శంకరయ్యస్వామి,బాల్‌కిషన్, తా హెర్ అల్లీ,రషిద్, శంకర్, పండరిరెడ్డి, అశోక్,సంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఆనాడు చేయని అభివృద్ద్ధి
నేడెలా చేస్తారు?
మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ
పెద్దశంకరంపేట, ఫిబ్రవరి 11: ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి హరీష్‌రావు నారాయణఖేడ్ ప్రజలను తప్పుడు హామీలతో మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్య మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆరోపించారు. 1998లో అందోల్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో రావాణ శాఖ మంత్రిగా పాల్గొని జోగిపేటను అన్ని హంగులు మార్చి అభివృద్ధి పరుస్తానని చెప్పిన అయనా అప్పుడు ఏమి చేయలేదని, నేడు నారాయణఖేడ్‌ను కూడా అభివృద్ది చేస్తామంటున్న మంత్రి హరీష్‌రావు కూడా ఏమి చేయడని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ విమర్శించారు. గురువారం ఎన్నికల ప్రచారం ముగిస్తున్న సమయంలో పెద్దశంకరంపేటలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం అంబేద్కర్ చౌక్ వద్ద ఆయన ప్రసంగించారు. కెసిఆర్, మంత్రి హరీష్‌రావు మాటల గారడితో మాయ చేస్తూ పబ్బం గడుపుకుంటారన్నారు. అప్పుడు రవాణ శాఖ మంత్రిగా ఉన్న కెసిఆర్ జోగిపేటలో ప్రచారం నిర్వహిస్తూ అందోల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా మార్చుతానని ప్రకటించి తరువాత ఈ ప్రాంతానికి కూడా రాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 20 మాసాలు అవుతున్నా ఖేడ్ నియోజకవర్గంకు ఒక్కసారైనా రాని కెసిఆర్ నేడు వచ్చి అభివృద్ద్ధి చేస్తాననడం హాస్యాస్పదమన్నారు. 60 మసాల తెలంగాణ ఉద్యమం కోసం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు ఉద్యమించారని, మన ఉద్యమం వల్ల రాష్ట్రం ఏర్పడగా ఫలితాలు మాత్రం మోసగాళ్లు అనుభవిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉందని, గత యుపిఎ ప్రభుత్వంలో దేశవ్యాప్తంగా రైతుల కోసం 72 వేల కోట్ల రుపాయల రుణాలను మాఫీ చేసిందన్నారు. కానీ రైతు పేరు చెప్పి, రుణమాఫి చేస్తానని అధికారంలోకి వచ్చిన కెసిఆర్ రుణమాఫీ కోసం 18 వేల 500 కోట్లు అవసరం ఉండగా అంత డబ్బు లేదని, విడతల వారీగా రుణమాఫి చేస్తుండటం ఆయన సంకుచితానికి నిదర్శనమన్నారు. రైతుల కోసం చేయని కెసిఆర్ నేడు ఖేడ్‌ను అభివృద్ధ్ది చేస్తాననడం నమ్మవచ్చా అని ప్రశ్నించారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 120 వాగ్ధ్దానాలు ప్రజలకు చేసి అధికారంలోకి వచ్చిన తెరాస ఎన్ని వాగ్ధ్దానాలు నెరవేర్చిందని ఆయన ప్రశ్నించారు. మామ అల్లుళ్ల మాటలకు మోసపోకుండా ఇంత కాలం ఖేడ్‌ను అభివృద్ధ్ది చేసిన దివంగత ఎమ్మెల్యే కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రాంనారాయణరెడ్డి, జహిరాబాద్ మాజీ ఎంపి సురేష్ షేట్కార్, అభ్యర్థి సంజీవరెడ్డి, ఎంపిపి సంగమేశ్వర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సురేందర్‌రెడ్డితో పాటు పెద్దయేత్తున నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

నారాయణఖేడ్ సమగ్రాభివృద్ధే లక్ష్యం
* మంత్రి హరీష్‌రావు
పెద్దశంకరంపేట, ఫిబ్రవరి 11: నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అన్ని రంగాల్లో అభివృద్దికి కృషి చేస్తానని మాట ఇస్తే తప్పనని మంత్రి హరీష్‌రావు అన్నారు. గురువారం పెద్దశంకరంపేటలో తెరాస నిర్వహించిన భారీ ర్యాలీ అనంతరం బస్టాండ్ సమీపంలో తెరాస శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. వెనుకబాటుకు గురైన నారాయణఖేడ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ద్ధి పరిచేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కృషితో నిధుల మంజూరు చేయించానని మంత్రి హరీష్‌రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గత పాలకుల వల్ల వెనుకబడిన ఖేడ్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధ్దిపరిచేందుకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. గత నాలుగు మాసాలుగా ఖేడ్ నియోజవకర్గంలోని 5 మండలాలను అభివృద్థ్ది పరిచే దిశగా ప్రణాళికలు సిద్ధ్దం చేసి వాటిని అమలుపరిచామన్నారు. నారాయణఖేడ్‌లో 150 పడకల ఆసుపత్రి, మనూర్‌లో 30 పడకల ఆసుప త్రిని మంజూరు చేయడం జరిగిందని, అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయన్నారు. గత 60 సంవత్సరాలుగా ఖేడ్ నియోజకవర్గంలో 20 సబ్‌స్టేషన్లు ఉంటే ఈ 3 నెలల్లో 11 సబ్‌స్టేషన్లను మంజూరు చేసి పనులు కూడా ప్రారంభించినట్లు, అందులో రెండు సబ్‌స్టేషన్లు పనులు పూర్తి అయ్యి ప్రజలకు విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. మురికి కూపంగా ఉన్న నారాయణఖేడ్‌ను తారురోడ్లు వేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది నిజం కాదా అని ఆయన అన్నారు. దీంతో పాటుగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కింద తాగు, సాగు నీరు కోసం పనులు చేపట్టామన్నారు. దాంతో పాటుగా రహదారుల అభివృద్ద్ధి పెద్దఎత్తున చేపట్టడం జరిగిందని, నేడు నియోజకవర్గం మొత్తంమీద ఎక్కడ చూసినా కొత్త రోడ్లు వేస్తున్నారా లేదా అని ప్రశ్నించారు. ఏది ఏమైనా మాట ఇస్తే మడమ తిప్పమని, రేపు జరగనున్న ఎన్నికల్లో తెరాస అభ్యర్థి భూపాల్‌రెడ్డికి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి హరీష్‌రావు ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ మంత్రి, అందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జహిరాబాద్ ఎంపీ బిబి.పాటిల్, రాష్ట్ర గీగ పారిశ్రామిక సంస్థ మాజీ చైర్మన్ విగ్రం రామాగౌడ్, మాజీ ఎంపిపి శ్రీనివాస్‌గౌడ్, పట్టణ సర్పంచ్ జంగం శ్రీనివాస్, ఎంపిటిసి సభ్యులు వేణుగోపాల్‌గౌడ్, సుభాష్‌గౌడ్, సుశీలతో పాటు వివిధ గ్రామాల నుండి వచ్చిన తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.